ప్రజాపాలన అంటే ప్రజల కోసం, ప్రజల చేత నిర్వహించబడే పరిపాలనా వ్యవస్థ. ప్రజా సమస్యలపై చర్చించడం, అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, సబ్బండవర్గాల అభిప్రాయాలు తీసుకోవడం ప్రజా పాలనలో చాలా అవసరం. కానీ, ఒకే ఒక్క ఆర్డినెన్స్‌తో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ ఓఆర్ఆర్కు ఆనుకొని ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని 51 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసింది.
ఒకే ఒక్క కలంపోటుతో పెద్ద అంబర్‌పేట, కుత్బుల్లాపూర్, నాగారం, తూంకుంట, తుకుగూడ, నార్సింగి, శంషాబాద్, మేడ్చల్, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, అమీన్పూర్, తెల్లాపూర్ తదితర మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం కానున్నాయి. తద్వారా గ్రేటర్ పరిధి 2,053.44 చదరపు కిలోమీటర్లకు విస్తరించనున్నది. ఫలితంగా పరిపాలన మరింత జఠిలం కానున్నది. పరిపాలనా వికేంద్రీకరణతో ప్రజలకు సేవలు దగ్గరవుతాయి. అందుకే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి పది జిల్లాలను విభజించి 33 జిల్లాలుగా ఏర్పాటుచేశారు. అనేక మండలాలను సృష్టించి పాలనను ప్రజలకు చేరువ చేశారు. అందుకు అనుగుణంగా కలెక్టరేట్లు, దవాఖానలు వంటి భవనాలు నిర్మించి ప్రభుత్వ యంత్రాంగాన్ని దగ్గర చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌తో గ్రేటర్ పరిధి పెరగడం వల్ల ప్రతి చిన్న పనికి ప్రజలు బల్దియా గడప తొక్కాల్సి ఉంటుంది. దీనివల్ల రోజులు, నెలల తరబడి సమస్య తీరకపోయే ప్రమాదమూ ఉన్నది.
దేశంలో ఏ మహానగరాల పరిధి కూడా ఇంతగా విస్తరించలేదు. దేశ రాజధాని ఢిల్లీ పరిధి 1,483 చదరపు కిలోమీటర్లు. ఆర్థిక రాజధాని నగరమైన ముంబై పరిధి 526 చదరపు కిలోమీటర్లు. చెన్నైది 426 చదరపు కిలోమీటర్లు. ప్రఖ్యాత టోక్యో నగరంలో 22 మున్సిపాలిటీలు ఉన్నాయి. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఎలాంటి చర్చ పెట్టకుండా అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారు. ‘హడావుడిగా ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చారు? ఎవరితో చర్చించారు? అంతా తన నియంత్రణలో ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారా? అందుకే కేంద్రీకృత వ్యవస్థను ప్రవేశపెడుతున్నారా? ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలు అనేకం వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి సాధిస్తే.. ఏకఛత్రం కింద పరిపాలన విజయవంతమవుతుందా? అనాలోచిత, అసమర్థ నిర్ణయాలతో హైదరాబాద్ ప్రతిష్ట ఏమైపోతుంది?’ అని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వేస్తున్న ప్రశ్నలు కొట్టివేయదగినవేమీ కావు.
ఆర్డినెన్స్‌తో మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలు ఇకపై హైదరాబాదీలతో సమానంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ, అక్కడ మౌలిక వసతులు నగర స్థాయిలో అభివృద్ధి కాలేదు. ఇప్పటివరకు గ్రామాలకు అందుతున్న నిధుల ద్వారా సర్పంచ్‌లు పనులు చేపట్టారు. ఇకపై ఎలాంటి పనులు జరగాలన్నా జీహెచ్ఎంసీని సంప్రదించాల్సి ఉంటుంది. ఇందుకోసం అనేక మందిని కలవాల్సి ఉంటుంది. ఏ ఒక్క చిన్న పని కావాలన్నా ఎన్నో వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి, ఎంతో సమయం వెచ్చించాల్సి రావచ్చు. గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుంది. వాటి ఉనికి దెబ్బతింటుంది. వచ్చే జనవరి నాటికి మున్సిపల్ చైర్మన్ల పదవీకాలం ముగియనున్నది. ఆ తర్వాత వచ్చే ఏడాది గ్రేటర్‌లోని కార్పొరేటర్ల పదవీకాలం తీరనున్నది. సకాలంలో ఎన్నికలు నిర్వహించిన చరిత్ర కాంగ్రెస్‌కు లేదు. కాబట్టి మున్సిపాలిటీలు, గ్రేటర్‌ను సీఎం తన ఆధీనంలోకి తీసుకొని పాలన సాగించవచ్చు. ప్రజాపాలనలో అన్ని అధికారాలు ఒక వ్యక్తి లేదా పార్టీ చేతుల్లో ఉండటం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే. ఇది ప్రజల హకులను తుంగలో తొకినట్టవుతుంది.
ప్రజాప్రతినిధుల సూచన లేకుండా, ప్రజలతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకొని ఆర్డినెన్స్ ద్వారా పాలన చేయడం ప్రజా స్వాతంత్య్రాన్ని కించపరచడమే. ప్రజలను దృష్టిలోకి తీసుకోకుండా, వారిపై నిర్ణయాలను రుద్దడం ప్రజాపాలన కానేకాదు. అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రణాళిక లేకుండా వాటిని అమలు చేయడం ప్రజాపాలనలో సరిదిద్దుకోలేని తప్పిదాలుగా మారుతాయి.
-లట్టుపల్లి విక్రమ్
97015 87979