కడుపులో కత్తెర్లు నోట్ల శెక్కరలు అని పెద్దలు ఉత్తగనే అనలేదు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన తీరే అందుకు సజీవ సాక్ష్యం. ఎన్నికలకు ముందు హస్తం నేతలు తియ్యటి మాటలు చెప్పారు. తాము భూమ్మీద కాదు, మాట మీద నిలబడే మనుషులమని అన్నారు. ఆరు గ్యారెంటీలతో పాటు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి మరో గ్యారెంటీ కూడా ఇచ్చారు. అదే ప్రజాపాలనలో ఎవ్వరైనా ప్రశ్నించొచ్చని. కానీ, నేడు అవేవీ అమలు కావడం లేదు. కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనే అందుకు రుజువు.
ప్రజాపాలనలో ప్రశ్నిస్తే కేసులే కేసులు. ‘మాటలు మస్తుగ చెప్తం. కానీ, వాటిని అమలు చేస్తమా? హామీలు అమలు చేయాలని మమ్మల్నే ప్రశ్నిస్తారా? మీరు ప్రశ్నిస్తే మేం ఊరుకుంటమా?’ అన్నట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారశైలి. హస్తం ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపుతూ, ఇదేమిటని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై ఏడాదిలోనే సుమారు 90కి పైగా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి ఉమ్మడి ప్రభుత్వమూ ఇంతలా కేసులు పెట్టలేదు. అంతేకాదు, బీఆర్ఎస్ నాయకులను జైలుకు పంపిస్తామని పాలకులు బాహటంగా చెప్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రితో పోటీపడి మరీ మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ మొన్నటివరకు ప్రజావిజయోత్సవాలు అంటూ హడావుడి చేసింది. కానీ, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గత ప్రభుత్వాన్ని దూషించని రోజు లేదు. సమయం, సందర్భం లేకుండా విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. నాయకుల ఇండ్లలో చిన్న శుభకార్యం జరిగినా కూడా కేసులు పెట్టాలని చూస్తున్నారు. ఏదో సాకుతో ఇరుకునపెట్టి, ఇబ్బందుల పాల్జేయాలనేది ఈ ప్రభుత్వ కుట్రలా అనిపిస్తున్నది. అందులో భాగంగానే రైతుల పక్షాన మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులందరిపై కేసులు నమోదు చేశారు. మొన్నటివరకు హరీశ్‌రావుపై కేసులంటూ లీకులిచ్చారు. ఇప్పుడు కేటీఆర్‌పై విచారణ అంటూ హంగామా చేస్తున్నారు. ఇక జైలుకు వెళ్లడం ఖాయమంటూ కాంగ్రెస్ నేతలు జోస్యం చెప్తున్నారు. వారిట్లా చెప్పడం పోలీసులు కేసులు నమోదు చేయడం వెంటవెంటనే జరిగిపోతున్నాయి.
తమది ప్రజాపాలన అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా రాజ్యాంగస్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నారు. పైగా నిత్యం నీతులు చెప్తున్నారు. ఆర్టికల్ 19 ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛ బహిరంగంగా ఉల్లంఘనలకు గురవుతూనే ఉన్నది. అంతేకాదు, ఆర్టికల్ 14 కూడా దుర్వినియోగం అవుతున్నది. గౌరవంగా, భద్రంగా జీవించే హక్కును మన రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించింది. అయినప్పటికీ, హైడ్రా పేరుతో ప్రజల ఆస్తులను ధ్వంసం చేశారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే ఇలా చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఆర్టికల్ 21 ప్రసాదించిన జీవించే హక్కును కూడా కాలరాశారు. లగచర్ల ఘటనే అందుకు నిదర్శనం. ఓటేసిన పాపానికి తాము ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తోందని, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బతకాల్సి వస్తోందని అక్కడి ప్రజలు మీడియా ముఖంగానే చెప్పిన విషయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉన్నది.
ఇక ఈ ఏడాది పాలనలో ప్రభుత్వ పెద్దలు మాట్లాడిన భాష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దుర్భాషా దుర్గంధాన్ని తెలంగాణ ప్రజలు భరిస్తున్నారనే విషయం తేటతెల్లం అయింది. కండ్లు పీకుత, కడుపుల పేగులు తీస్త, కనుగుడ్లతో గోటీలాడుకుంట.. ఈ తరహా భాష సచివుల నోటి నుంచి వచ్చింది. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కంటే విపక్షంపై దుమ్మెత్తిపోయడమే ప్రధాన ఎజెండాగా ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నది. అందుకే సమయం, సందర్భం లేకుండా గత ప్రభుత్వ పెద్దలపై దుమ్మెత్తిపోస్తున్నారు. వారి వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూస్తున్నారు. మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
ఏడాదిలోనే కాంగ్రెస్ సర్కార్ చేసిన అప్పులు లక్ష కోట్లను మించిపోయాయి. ఇప్పటివరకు ఒక్క కొత్త పథకమూ ప్రకటించలేదు. పాత వాటికి నిధులు కేటాయించడం లేదు. ఉద్యోగ, ఉపాధి కల్పించకుండా వందల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి మీడియాలో ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. తమ డబ్బా తామే కొట్టుకుంటున్నారు. అంతేతప్ప, పేదల గురించి పాలకులకు సోయి లేదు. ఈ పాలనలో తెలంగాణ సోయి లేదు. తెలంగాణ ఆత్మ లేదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఇసుమంత కూడా లేదని ప్రజలు బాహాటంగా చెప్తున్నారు. కరెంటు, నీళ్లు, ఎరువులు, విత్తనాలు, రైతులకు మద్దతు ధర తదితర అంశాల్లో గడిచిన పదేళ్లలో వచ్చిన మార్పును ప్రజలు గమనించారు. ప్రభుత్వం మారగానే మళ్లీ తమకు మునుపటి కష్టాలు వస్తున్నాయని వేదన చెందుతున్నారు. ప్రజాపాలన అని చెప్తున్నారు కానీ, అక్కడ ప్రజలు లేరు, ప్రజల అభీష్టం అసలే లేదు. కేవలం తామే అన్న రీతిలో జరుగుతున్న పాలన ఉందనేది ప్రజల అనుభవం చెప్తున్న విషయం. మొత్తంగా చెప్పాలంటే కాంగ్రెస్ పాలనలో ప్రజల జీవించే హక్కు, వాక్ స్వాతంత్య్రపు హక్కు హరించబడుతున్నాయని మాత్రం చెప్పక తప్పదు.
– వొద్యారపు రవికుమార్ (వ్యాసకర్త: న్యాయవాది)