శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న పార్టీ, అర్ధ శతాబ్దానికి పైగా సువిశాల భారతాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్. గత వైభవాన్ని చూసి మురిసిపోతున్న ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ముంగిట ఉన్నది. గత దశాబ్ద కాలంగా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పరాభవాన్ని మూటగట్టుకుంటూ వస్తున్న హస్తం పార్టీ తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లోనూ ఓటమిపాలైంది. విఫల నాయకుడిగా ముద్రపడ్డ రాహుల్‌గాంధీకి, వైఫల్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రేవంత్‌రెడ్డి తోడవడంతో ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పరిపూర్ణమైంది.
Congress | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ ఎన్నికల బాధ్యతలను మొదటినుంచీ తన భుజాలపై వేసుకున్నారు. తనను చూసి ఓట్లేయాలని ఢిల్లీ ఓటర్లను అభ్యర్థించారు. తెలంగాణ తరహాలో ఢిల్లీలోనూ ప్రకటించిన గ్యారెంటీలకు తాను గ్యారెంటీ అని హామీ ఇచ్చారు. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం తరఫున సాయం చేస్తానని, గ్యారెంటీల అమలు జిమ్మేదారి తనదేనని వాగ్దానం చేశారు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ పాలనకు ఢిల్లీ ఎన్నికలు రెఫరెండంగా మార్చేశారు. విజ్ఞులైన ఢిల్లీ ఓటర్లు రేవంత్ సారథ్యంలోని తెలంగాణ పాలనను నిశితంగా పరిశీలించారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధికి నిదర్శనంగా, సంక్షేమానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ.. నేడు రేవంత్ పాలనలో వైఫల్యానికి కేరాఫ్ అడ్రస్‌గా, మోసానికి మారుపేరుగా మారిపోవడాన్ని వారు తెలుసుకొని ఎన్నికల్లో మార్కులు వేశారు. దీంతో డిపాజిట్ల కోసమే బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ పుణ్యమాని అవి కూడా దక్కలేదు. మొత్తం 70 స్థానాల్లో పోటీ చేసిన హస్తం పార్టీకి 67 చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. 69 చోట్ల ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితమై తెలంగాణలో రేవంత్ పాలన ఎలా ఉందో దేశవ్యాప్తంగా చాటిచెప్పింది.
ఢిల్లీ ఎన్నికల కోసం రేవంత్‌రెడ్డి ప్రచారానికి వెళ్లినప్పుడు అక్కడే ఉండే ఓ జర్నలిస్టు మిత్రుడు నాతో మాట్లాడారు. తెలంగాణలోనే రేవంత్ పాలనపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నదని, హామీల అమల్లో వైఫల్యంపై ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారని, ఇంటి పోరును చక్కదిద్దకుండా ఢిల్లీ కొచ్చి ఏం చేస్తారని, అక్కడ పథకాల అమలుకే నిధులు లేవని ఢిల్లీ ప్రజలకు ఇచ్చేందుకు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. రేవంత్‌ను ఢిల్లీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, రేవంత్ ప్రచారం వల్ల కాంగ్రెస్‌కే నష్టమని ఆయన స్పష్టంగా చెప్పారు. మిత్రుడు చెప్పినట్టే ఫలితాలు వచ్చాయి.
గతంలోనూ మహారాష్ట్ర, హర్యానాల్లో రేవంత్ పాలన విఫల మోడల్‌ను ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ చేతులు కాల్చుకుంది. వాస్తవానికి హర్యానాలో కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకేనని చాలామంది విశ్లేషకులు, సర్వేలు తెలిపాయి. పదేండ్ల బీజేపీ పాలనపై నెలకొన్న ప్రజావ్యతిరేకత కూడా హస్తం పార్టీకి కలిసొస్తుందని అంతా భావించారు. కానీ తెలంగాణలో అమలుకాని గ్యారెంటీలను ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీగా గెలుస్తుందనుకున్న రాష్ర్టాన్ని చేజేతులా పోగొట్టుకున్నది. అయినప్పటికీ ఆ పార్టీకి బుద్ధి రాలేదు. మరోసారి మహారాష్ట్రలో వారంటీ లేని రేవంత్ గ్యారెంటీలనే ప్రచారం చేసింది. ఈసారి రేవంత్‌రెడ్డి స్వయంగా మహారాష్ట్రలో ప్రచారం చేశారు. అనేక నియోజకవర్గాల్లో తిరిగి తన పాలనను చూసి కాంగ్రెస్‌కు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న మహావికాస్ అఘాడీ కూటమికి రేవంత్ వైఫల్యాలు శాపంగా మారి భారీ ఓటమిని మూటగట్టుకున్నది. తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లోనూ ఓ కాంగ్రెస్ నేత తెలంగాణలో 90 లక్షల మంది మహిళలకు నెలకు రూ. 2,500 చొప్పున ఇస్తున్నట్టు అబద్ధపు ప్రచారం చేశారు. ఇది ఆ పార్టీ కొంపముంచింది. హామీల అమలులో విఫలమై, చేయని పనులను కూడా చేసినట్టుగా చెప్పుకొంటున్న రేవంత్‌ను నమ్మి ఓట్లు వేస్తే తమ పరిస్థితి కూడా తెలంగాణ ప్రజల మాదిరిగా అవుతుందని గ్రహించిన ఢిల్లీ ఓటర్లు కాంగ్రెస్‌కు, రేవంత్‌కు కర్రు కాల్చి వాతపెట్టారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి నుంచీ రేవంత్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నది. ఇటీవల సొంత పార్టీ నేతలే గ్రూపులు కట్టి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు కూడా రేవంత్‌కు తలనొప్పిగా మారింది. క్రెడిట్ కొట్టేద్దాం అనుకున్న బీసీ కులగణన కూడా బూమరాంగ్ అయింది. పథకాల అమల్లో వైఫల్యంపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్‌కు పక్కలో బల్లెంలా మారారు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న రేవంత్‌రెడ్డి బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్‌లో ఉంటూనే, ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రత్యక్షంగా ప్రచారం చేస్తూ, పరోక్షంగా బీజేపీ గెలుపునకు బాటలు వేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డిని సీఎం పీఠం నుంచి తప్పిస్తారనే బలమైన సంకేతాలు కనిపిస్తున్నయి. వారు తప్పించేవరకు చూడడం కంటే ఇప్పుడే రేవంత్‌రెడ్డి తట్టాబుట్ట సర్దుకోవడం ఉత్తమం.
(వ్యాసకర్త: శాసనసభ్యులు, హుజూరాబాద్)
-పాడి కౌశిక్‌రెడ్డి