నువ్వు ఏదైతే కాదో, అదే నిరూపించడానికి నువ్వు ప్రయత్నిస్తావు’ అంటాడు ఓషో. పేదవాడు సంపన్నుడిగా కనిపించడానికి ప్రయత్నిస్తే, సంపన్నుడు పేదవాడిగా కనిపించే ప్రయత్నం చేస్తాడు. కార్ల కంపెనీలను కూడా కొనేయగల వారెన్ బఫెట్ సెకండ్ హ్యాండ్ కారులో ప్రయాణిస్తుంటే, చిరుద్యోగి ఈఎంఐలతో యాపిల్ ఫోన్ కొంటాడు. ఓషో మాట అక్షర సత్యం అన్నట్టు.. విలువల గురించి ఎక్కువగా మాట్లాడే మీడియా, తాము మాత్రం ఆ విలువలను పాటించాల్సిన అవసరం లేదని భావిస్తున్నది.
మీడియా వివాదం- దాడి అంశంపై సదరు మీడియా యాజమాన్య ప్రతినిధి ఇటీవల ఓ సదస్సులో మాట్లాడారు. వివాదానికి కారణమైన అభ్యంతరకరమైన, అసహ్యకరమైన థంబ్ నెయిల్స్ గురించి ఆయన ఒక గమ్మత్తైన సంగతి బయటపెట్టారు. ‘ఇలాంటి శీర్షికలు పెడితే పది లక్షల మంది చూశారు. ఇదేదో బాగుందని అలాంటివే పెడుతున్నారు. ఇవి యాజమాన్యం దృష్టికి రావు. ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే తొలగిస్తాం. గతంలో ఇలా తొలగించాం కూడా’.. ఇది ఆ చానల్ యాజమాన్యం ఇచ్చిన వివరణ. నిజాయితీగా తమ మీడియా వ్యాపారం గురించి ఆయన చెప్పుకొచ్చారు. మార్కెట్లో తమ న్యూస్ అమ్ముడుపోయి లాభం వస్తే చాలు ఎలాంటి నిరాధార ప్రసారానికైనా సిద్ధం అన్నమాట. విలువల గురించి ఎక్కువగా మాట్లాడే మీడియా విలువలను పూర్తిగా వదిలేసి వార్తా వ్యాపారం సాగిస్తున్నది.
‘గోపాత్రుడు’ అనే నవలలో మీడియా గురించి పతంజలి వ్యంగ్యంగా అద్భుతమైన మాట చెప్పారు. భూమి గుండ్రంగా ఉంటుం దా? బల్ల పరుపుగా ఉంటుందా? అనే అంశంపై ఓ గ్రామ సర్పంచ్ కోర్టులో కేసు గెలుస్తాడు. ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన ఓ విలేకరి ఫొటోతో అయితే ఎంతనో, ఫొటో లేకుండా అయితే ఎంతో చెబుతాడు. ‘నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావు. నాకు డబ్బు ఇవ్వాలి కానీ, నన్ను అడగడం ఏమిటి?’ అని సర్పంచ్ గడుసుగా ప్రశ్నిస్తాడు. ‘నేను మీ వద్దకు వచ్చినా, మీరు నా వద్దకు వచ్చినా నాకే డబ్బులు ఇవ్వాలి. అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నాను’ అని విలేకరి బదులిస్తాడు. ప్రింట్ మీడియా మాత్రమే ఉన్న రోజుల్లో స్థానిక విలేకరుల చిలక్కొట్టుడు గురించి ప్రముఖ పత్రికలకు సంపాదకునిగా చేసిన పతంజలి ఇలా రాస్తే.. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో మీడి యా మాఫియా గురించి ఏం రాసేవారో.
ప్రతి మీడియాకు ఏదో ఒక రాజకీయ పార్టీతో అవినాభావ సంబంధం ఉంది. కొన్ని మీడియాలకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీతో అనుబంధం. అసలు మన దేశంలో మీడియా పుట్టిందే రాజకీయ పార్టీ కోసం. స్వాతంత్య్రం కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతుగా కాంగ్రెస్ కోసం కాంగ్రెస్ నాయకులు పత్రికలను ప్రారంభించారు.
మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని ప్రకాశం పంతులు వరకు పత్రికలను నడిపినవారే, జర్నలిస్టులుగా పని చేసినవారే. మహాత్ముని చేతుల్లో నుంచి గల్లీ రౌడీలు, హంతకుల చేతుల్లోకి రాజకీయం వచ్చినట్టు.. మీడియా సైతం మహాత్ముని కాలం నుంచి ఇప్పుడు డిజిటల్ యుగంలో బూతును అమ్ముకొనే వారి చేతుల్లోకి వచ్చిచేరింది. మీడియా రాజకీయ పార్టీల కోసం పని చేస్తున్నాయి. కొన్ని చానళ్లు ఏకంగా నాలుగైదు పార్టీల బాధ్యతలు మోస్తూ అఖిలపక్ష నాయకుల్లాగా మారాయి. ప్రధానంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొన్ని చానళ్లు కనీసం నాలుగు పార్టీల బాధ్యతలు మోస్తున్నాయి. ఆంధ్రాలో టీడీపీని ఆకాశానికి ఎత్తుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌ను దూషించాలి. తెలంగాణకు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్, కేటీఆర్‌లపై బురద చల్లుతూ కాంగ్రెస్‌ను భుజాన మోయాలి. టీడీపీ కోసం ఏర్పాటు చేసిన మీడియా తెలంగాణలో కాంగ్రెస్‌కు అండగా నిలవడం రాజకీయ విచిత్రం. అయితే ఇది కాంగ్రెస్ మీద అభిమానంతో కాదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి టీడీపీ నిష్క్రమించింది. దాంతో టీడీపీ అనుకూల మీడియా తెలంగాణలో కాంగ్రెస్ అనుకూల వైఖరిని అవలంబిస్తున్నది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి అనుకూలంగా ఉండటంతో టీడీపీ మీడియా ఇక్కడ కాంగ్రెస్ పట్ల సానుకూల వైఖరిని అవలంబిస్తున్నది. తెలంగాణలో ఒక పార్టీ, ఆంధ్రాలో ఒక పార్టీకి అనుకూలంగా ఉండటంతో పాటు, అదే సమయంలో ఆంధ్రాలో ఒక పార్టీపై, తెలంగాణలో ఒక పార్టీపై బురదజల్లడం ఈ మీడియా బాధ్యత. ఈ బాధ్యత నెరవేర్చినందుకు ఆయా పార్టీల నుంచి ఏదో ఒక రూపంలో సహాయం అందుతుంది.
ప్రారంభంలో టీవీ చానళ్లు సంచలనాలకు ప్రాధాన్యత ఇస్తూ బురద జోలికి వెళ్లలేదు. యూట్యూబ్ చానళ్లు పెరిగాక ఈ సంస్కృతి పూర్తిగా మారిపోయింది. యూట్యూబ్ యం త్రాంగం ఉండదు, సాధన సంపత్తి ఉండదు. దీంతో వీటి ప్రభావం శాటిలైట్ న్యూస్ చానళ్ల మీద కూడా బాగా పడింది. నిజానికి ఈ రోజుల్లో ప్రధాన మీడియా ప్రకటనల ఆదాయంతో బతికే పరిస్థితి లేదు. తొలి రెండు స్థానాల్లో ఉన్న ప్రధాన మీడియాకే ప్రైవేట్ నుంచి ప్రకటనలు వస్తాయి. అందుకే రాజకీయ పార్టీల సాయంతోనే ఇతర చానళ్లు మనుగడ సాగిస్తున్నాయి.
ఒక రాజకీయ పార్టీ నాయకుడు మీడియాను స్థాపిస్తే చివరకు ఓ స్థానిక విలేకరి ఆ చానల్‌ను సొంతం చేసుకొనే పరిస్థితి వచ్చింది. పార్టీలో గుర్తింపు, టికెట్, పదవి కోసం చానల్ స్థాపించాక, లక్ష్యం నెరవేరిన తర్వాత అనేక వ్యాపారాలు ఉన్న నాయకులు పెద్దగా లాభసాటి కానటువంటి చానల్‌ను వదులుకొంటున్నారు. వాటికి స్థానిక విలేకరి స్థాయి నుంచి వచ్చినవారు ఓనర్లు అవుతున్నారు.
ఆశ పెరగడం లేదా తమను నమ్ముకొన్న పార్టీకి మరింత ప్రయోజనం చేకుర్చాలనే అత్యుత్సాహంతో ఇతరులపై బురద చల్లడాన్ని ఇలా యజమానులైన వారు నమ్ముకుంటున్నారు. సంచలన వార్తల కారణంగా న్యూస్ చానళ్ల కన్నా యూట్యూబ్‌ను ఎక్కువమంది చూస్తున్నారు. దాంతో కొన్ని న్యూస్ చానళ్లు బట్టకాల్చి మీద వేసే కార్యక్రమాన్ని నెత్తికెత్తుకున్నాయి. వీరి బరితెగింపు ఏ స్థాయిలో ఉందంటే దుష్ప్రచారం చేసినా నాయకులు పట్టించుకోకపోతే.. ‘మీరు మౌనంగా ఉన్నారు కాబట్టి, న్యూస్‌ను అంగీకరించినట్టేనని మళ్లీ ప్రసారం చేస్తున్నారు. బూటకపు వార్తలను అమ్ముకొని బతకడం అలవాటు పడిన వాళ్లు చివరకు సాటి జర్నలిస్ట్ మరణాన్ని కూడా వదిలి పెట్టలేదు. ఒక మహిళా జర్నలిస్ట్ ఆత్మహత్య చేసుకుంటే ఆ సంఘటనపై కూడా సంచలన వార్తలు ప్రసారం చేశారు. తాము ప్రసారం చేస్తున్న బూటకపు వార్తలు నిజమే అయితే, ఆధారాలు చూపుతూ కేసులు పెట్టవచ్చు, బహిరంగ పరచవచ్చు. కానీ, చానల్ నుంచి తొలగించడం ఎందుకు?
మీడియా అంటే అంతా వ్యతిరేకమేనా? సానుకూల వార్తలు ఉండవా? అంటే ఎందుకు ఉండవు. సంబంధిత వ్యక్తి పొగడ్తలు విని సిగ్గుతో ముడుచుకుపోయేంతగా సిగ్గులేకుండా పొగుడుతారు. చంద్రబాబును ఒక కేసులో అరెస్ట్ చేస్తే 150 దేశాల్లో ప్రజలు దానికి వ్యతిరేకంగా ఉద్యమించారట. టీడీపీ సైతం తెలంగాణలో తప్పుడు ప్రసారాలకు అండగా నిలిచి, ప్రజాస్వామ్యం గురించి నీతులు చెబుతున్నది. థంబ్ నెయిల్స్ మీడియా పుణ్యమా అని మీడియాకు విలువ లేకుండాపోతున్నది. మీడియా బతకాలంటే తప్పుడు వార్తల చానళ్లను నిలదీయాలి. మీడియా వ్యాపారి ఒక వ్యాపారం లాభసాటి కాదనుకొంటే ఇంకో వ్యాపారంలోకి వెళ్తాడు. ఒక రాజకీయ పార్టీతో బంధం లాభసాటి కాదనుకుంటే ఇంకో పార్టీకి మీడియాను అప్పగిస్తాడు. కానీ, జర్నలిస్ట్ అంత సులువుగా వృత్తిని వదలలేడు. తెలంగాణలో ఒక నాయకుడు తరుచుగా తాను పార్టీలు మారడమే కాదు, రాత్రికిరాత్రి తన చానల్ పార్టీని కూడా మార్చేసేవారు. వారికి ఇదొక రాజకీయ వ్యాపారం. కానీ, జర్నలిస్టులకు ఇది వృత్తి. సమాజాన్ని కాపాడే జర్నలిజం ఇప్పుడు తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నించాల్సిన దుస్థితి తలెత్తడం బాధాకరం.
-బుద్దా మురళి