మాల్దీవులకు మన దేశానికి మధ్య వివాదం చెలరేగిన నాటి నుంచి మన దేశంలోని కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నది. ప్రధాని మోదీ అక్కడ పర్యటించడంతో ఒక్కసారిగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిపోయింది. లక్షద్వీప్ బీచ్‌లో కుర్చీ వేసుకొని మోదీ కూర్చున్న ఫొటో ఇంటర్నెట్లో హల్చల్ చేయడంతో తమ దేశ పర్యాటకం ఎక్కడ దెబ్బతింటుందోననే భయంతో మాల్దీవుల మంత్రులు వెంటనే స్పందించారు. మోదీతో పాటు మన దేశంపై వారు చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ‘బాయ్‌కాట్ మాల్దీవులు’కు దారితీశాయి. మన సెలబ్రిటీలు ఇచ్చిన ‘మాల్దీవులు వద్దు.. లక్షద్వీప్ ముద్దు’ నినాదంతో మాల్దీవుల వివాదాన్ని నెపంగా చూపి బలవంతంగా లక్షద్వీప్ వైపునకు అందరి దృష్టిని మళ్లించారు.
బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రుల రంగప్రవేశంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకొని ‘దేశభక్తి’ నినాదం తెరపైకి వచ్చింది. ఈ దెబ్బతో మాల్దీవులకు వెళ్లాలని ప్రణాళికలు వేసుకున్న వేలమంది భారతీయ పర్యాటకుల చూపు లక్షద్వీప్‌పై పడింది. మన కేంద్రపాలిత ప్రాంతం బలవంతంగా మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా మారిపోయింది. విమానాలు, హోటళ్లు నిండిపోయాయి. దీంతో సందట్లో సడేమియాలాగా హోటళ్లు, విల్లాలు నిర్మించి.. పర్యాటకులకు వసతులు కల్పిస్తామని కార్పొరేట్ కంపెనీలు ప్రకటించేశాయి. అంతాబాగానే ఉన్నది. కానీ, వెల్లువలా వచ్చిపడుతున్న పర్యాటకులను తట్టుకునే సామర్థ్యం లక్షద్వీప్‌కు ఉందా? అసలక్కడ సరైన వసతులున్నాయా? అక్కడి సహజ సంపద, జీవావరణం పరిస్థితి ఏమిటి? అనే అంశాలను ఎవరూ పట్టించుకోకపోవడం ఆందోళనకరం.
Lakshadweep | మాల్దీవులు మన పొరుగునున్న దేశం. చేపల వేట, పర్యాటకంపైనే ఎక్కువగా ఆధారపడే ఆ దేశానికి ఏటా 2 లక్షల మందికిపైగా భారతీయులు వెళ్తుంటారు. ఆ దేశ జీడీపీలో 28 శాతం పర్యాటకం నుంచే వస్తున్నది. అందుకే మొదటి నుంచి మాల్దీవులు పర్యాటకానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. మన దేశంతో పాటు రష్యా, చైనా, జపాన్ తదితర దేశాల నుంచి వచ్చే లక్షల మంది పర్యాటకులకు సరిపడేలా సకల వసతులు అక్కడ ఉన్నాయి. పైగా మాల్దీవులు 1,200 దీవుల సమూహం. 9 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల 26 అటోల్స్ ఉన్నాయక్కడ. మరి మాల్దీవులతో పోటీగా కార్పొరేట్ల లబ్ధి కోసం బలవంతంగా తెరపైకి తెస్తున్న మన లక్షద్వీప్‌కు ఆ స్థాయిలో సామర్థ్యం ఉందా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి. మాల్దీవులతో మన లక్షద్వీప్‌ను పోల్చడం మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే, లక్షద్వీప్ మొత్తం విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు మాత్రమే. లక్షద్వీప్‌లో 36 దీవులే ఉన్నాయి. వాటిలో 11 దీవుల్లోనే ప్రజలు నివసిస్తున్నారు. వాటిలోనూ 4-5 దీవులు మాత్రమే పర్యాటకానికి అనుకూలంగా ఉంటాయి.
మన సెలబ్రిటీలు ఇచ్చిన ‘బాయ్‌కాట్ మాల్దీవులు’ పిలుపుతో వేలాదిగా తరలుతున్న పర్యాటకులకు లక్షద్వీప్‌లో ఉన్నపళంగా వసతి కల్పించడం ఎంత కష్టంతో కూడుకున్నదో ఒక్కసారి ఊహించుకోండి. సుమారు 60 వేలమంది నివసించే లక్షద్వీప్‌లో మనకు దొరికినట్టు తాగునీరు దొరకదు. రోజూవారీ అవసరాల కోసం సముద్రపు నీటిని శుద్ధి చేస్తారు. వేసవిలో అక్కడ గుక్కెడు తాగునీరు బంగారంతో సమానం.
లక్షద్వీప్‌లో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ సరిగా ఉండదు. సువిశాలంగా ఉండే పెద్ద పెద్ద రాష్ర్టాల్లోనే వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ సరిగ్గా లేక అవి నానా అవస్థలు పడుతుంటాయి. మరి అతిచిన్న లక్షద్వీప్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్థానికుల ద్వారా వెలువడే వ్యర్థాలను శుద్ధి చేయడమే ప్రస్తుతం అక్కడ ఇబ్బందికరంగా ఉన్నది. లక్షల మంది పర్యాటకులు వదిలిపెట్టే వ్యర్థాల నిర్వహణ ఎలా అనేది ప్రశ్నార్థకమే.
మరోవైపు లక్షద్వీప్ మొత్తంలో అగత్తిలో ఒకేఒక్క స్పెషాలిటీ దవాఖాన ఉన్నది. కవరత్తి, మినికాయ్‌లో ఒక్కో దవాఖాన ఉన్నది. మిగతా ప్రాంతాల్లో ప్రైమరీ హెల్త్‌కేర్ సెంటర్లు, ప్రథమ చికిత్స కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. దీంతోపాటు లక్షద్వీప్‌లోని కవరత్తి, కాల్పెనిలో మాత్రమే ఇంధన స్టేషన్లు ఉన్నాయి. అగత్తిలో పెట్రోల్ పంప్ అందుబాటులో లేదు. రేషన్ సరుకులను పంపిణీ చేసినట్టుగా.. అక్కడ మత్స్య శాఖ పెట్రోల్‌ను పంపిణీ చేస్తుంది. టూవీలర్లకు నెలకు 10 లీటర్లు, ఫోర్ వీలర్లకు నెలకు 15 లీటర్లు మాత్రమే అందిస్తారు. పర్యాటకుల సంఖ్య పెరిగితే.. ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం లేకపోలేదు.
ఇక రవాణా విషయానికి వస్తే.. లక్షద్వీప్‌కు చేరుకోవాలంటే కోచి నుంచి మాత్రమే రవాణా వసతులున్నాయి. కోచి నుంచి 496 కిలోమీటర్ల దూరంలోని లక్షద్వీప్‌కు జల, వాయు మార్గాల్లోనే చేరుకోవాలి. లక్షద్వీప్‌లోని ఏకైక విమానాశ్రయం అగత్తిలో ఉన్నది. అక్కడికి వెళ్లాలంటే రోజుకు ఒకటే విమానం అందుబాటులో ఉంటుంది. మూడు నౌకలే ఉంటాయి. అది కూడా నౌకల్లో సుమారుగా 15 గంటల పాటు ప్రయాణిస్తేనే అగత్తికి చేరుకోగలం. ఈ కారణాల వల్ల భారతీయులు తప్పితే విదేశీయులు అక్కడికి వెళ్లే పరిస్థితులు లేవు. వేలాదిగా పర్యాటకులు వస్తున్నారని.. వారికి తగ్గట్టుగా వసతులు కల్పించడం కూడా అసాధ్యమే.
అక్కడి భౌగోళిక పరిస్థితులు అందుకు అనుకూలించవు. 6 కిలోమీటర్ల పొడవు, 1 కిలోమీటర్ వెడల్పు, 3.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉండే అగత్తిలో రవాణా సదుపాయాలు మెరుగుపరచడం అంత తేలికైన విషయం కాదు. విమానాశ్రయాన్ని విస్తరించాలన్నా.. పెద్ద నౌకల రాకకు అనుకూలంగా తీరంలో సదుపాయాలు కల్పించాలన్నా చాలా వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం. నౌకాశ్రయాన్ని విస్తరిస్తే సముద్ర జీవులు బలవుతాయి. లక్షద్వీప్ ప్రజల ప్రధాన వృత్తి చేపల వేట. చేపలు నశించి స్థానికులు ఉపాధికి దూరమవుతారు. సహజ సిద్ధమైన అక్కడి బీచ్‌లు సహజత్వాన్ని కోల్పోతాయి. పగడపు దిబ్బలు ఉనికి లేకుండా పోతాయి. అదే సమయంలో భారీగా విమానాలను నడిపితే.. కార్బన్‌డైఆక్సైడ్‌తో పాటు ఇతర కాలుష్య కారకాలు వెలువడతాయి.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భూతాపం కారణంగా అనేక ద్వీపదేశాలు కనుమరుగయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. సముద్ర మట్టానికి 1-2 మీటర్ల ఎత్తులో ఉన్న లక్షద్వీప్ కూడా సముద్ర జలాల్లో కలిసిపోయే ఆస్కారం ఉన్నది. సుమారు 50 ద్వీప దేశాలకు ఈ ప్రమాదం పొంచి ఉందని ఐక్యరాజ్య సమితి సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఎవరో, ఎక్కడో వెలువరించే కాలుష్యం కారణంగా అమాయక దేశాలు బలిపీఠమెక్కుతున్నాయి. ఈ జాబితాలో మన లక్షద్వీప్ చేరకూడదంటే.. మనం ఇప్పటినుంచే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
లక్షలాదిగా తరలివచ్చే దేశంలోని వివిధ ప్రాంతాల పర్యాటకుల కారణంగా అక్కడి సంస్కృతి కూడా దెబ్బతింటుంది. లక్షద్వీప్ జనాభాలో 90 శాతానికిపైగా ముస్లింలే ఉన్నారు. గుజరాత్‌కు చెందిన ప్రఫుల్ పటేల్ లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు చేపట్టాక పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. పాఠశాలల్లో మిడ్డే మీల్స్‌లో మాంసాహారం పెట్టకుండా ఆయన నిబంధనలు తీసుకొచ్చారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. పర్యాటకులు పెరిగితే ఆదాయం పెరుగుతుందనేది వాస్తవమే. కానీ, ఆదాయంతో పాటు అనేక అనర్థాలు జరుగుతాయనేది జగమెరిగిన సత్యం. గోవానే దీనికి ఉదాహరణ. దేశ విదేశాల నుంచి గోవాకు పోటెత్తుతున్న పర్యాటకుల కారణంగా సహజ అందాలకు నెలవైన 1960ల నాటి గోవా కనుమరుగైంది. ఆ రాష్ట్రం మాదకద్రవ్యాలకు అడ్డాగా మారింది. పబ్‌లు, హుక్కా సెంటర్లు, వ్యభిచార కూపాలకు నెలవుగా తయారైంది.
మాల్దీవులతో వివాదాన్ని సాకుగా చూపి దేశంలోని కార్పొరేట్ కంపెనీలు లక్షద్వీప్‌పై కన్నేశాయి. వాటికి సామాన్య ప్రజల ఇబ్బందులు, అవసరాలు, సంస్కృతులతో సంబంధం ఉండదు. వ్యాపారమే కార్పొరేట్ కంపెనీల లక్ష్యం. లక్షద్వీప్‌కు ఉండే సహజ లక్షణాలను నామరూపాల్లేకుండా చేసైనా సరే కోట్లు సంపాదించడమే వాటికి కావాల్సింది. కార్పొరేట్ కంపెనీలు, రాజకీయాల మాయలో పడి మనమూ ముందూవెనుకా ఆలోచించడం లేదు. సెలబ్రిటీలు పిలుపునివ్వగానే అక్కడి పరిస్థితులను బేరీజు వేసుకోకుండానే విమానమెక్కుతున్నాం. లక్షద్వీప్‌కు విమాన టిక్కెట్లే దొరకడం లేదు. మార్చి చివరి వరకు టిక్కెట్లన్నీ బుక్ అయిపోవడమే దీనికి నిదర్శనం.
మోదీ ప్రధాని అయ్యాక సరిహద్దు దేశాలన్నీ మనకు దూరమయ్యాయి. శ్రీలంక, పాక్, భూటాన్, నేపాల్, అఫ్గానిస్థాన్ తదితర దేశాలు ఎప్పుడో చైనా పంచన చేరాయి. తాజాగా మాల్దీవులు ఆ బాట పట్టింది. ప్రస్తుతం ఒక్క బంగ్లాదేశ్ మాత్రమే మనతో సఖ్యతతో వ్యవహరిస్తున్నది. మన అనాలోచిత విదేశాంగ విధానమే దీనికి ప్రధాన కారణం. లక్షద్వీప్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం మంచిదే. కానీ, అక్కడి భౌగోళిక పరిస్థితులు, జీవావరణం, సంస్కృతులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అలాకాకుండా మాల్దీవులతో వివాదం చెలరేగిందనే కారణంగా కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో బలవంతంగా, హడావుడిగా లక్షద్వీప్‌ను పర్యాటక హబ్‌గా మార్చడం సరైనది కాదు. దానివల్ల అనేక అనర్థాలు జరుగుతాయి. ఇకనైనా విచక్షణతో ఆలోచిద్దాం. లేదంటే.. కార్పొరేట్ల లబ్ధి కోసం జరుగుతున్న రాజకీయ క్రీడలో మనం పావులుగా మారి లక్షద్వీప్‌ను బలి చేసినవారిగా చరిత్రలో మిగిలిపోతాం.
మాలోతు సురేష్
98856 79876