దేశంలో 55 ఏండ్ల తర్వాత అనివార్యంగా జరగాల్సిన లోక్సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరగడం ఆనవాయితీ. కానీ, జనాభా పెరుగుదల అభివృద్ధికి అడ్డుకట్ట అని, జనాభా పెరుగుదలను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచనలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ర్టాలు పాటించాయి. అవే ఈ రాష్ర్టాల పాలిట తీవ్ర శాపంగా మారింది. పునర్విభజన విషయంలో కేంద్రం స్పష్టమైన ముసాయిదాను ప్రతిపాదించకపోవడం దక్షిణాది రాష్ర్టాల ఆందోళనకు కారణమవుతున్నది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యంగ్యంగా ఒక్కో జంట 16 మంది పిల్లలను కనాలంటూ తమ రాష్ట్ర ప్రజలకు పిలుపునివ్వడం పునర్విభజన ప్రక్రియ వ్యతిరేకతకు అద్దం పడుతున్నది. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభ స్థానాల పెంపు విషయంలో సమతుల్యతను పాటించేలా ప్రో-రేటా సిద్ధాంతాన్ని అమలుపరిచి రాష్ర్టాల వాటా కాపాడుతామని ప్రకటించారు. అయితే స్టాలిన్ ఆయన మాటలు అంతా బూటకమైనవని అభివర్ణించారు. పునర్విభజన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే… జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ర్టాల సాఫల్యత ఆయా రాష్ర్టాల రాజకీయ ప్రాతినిధ్యానికే ఎసరు పెడుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ర్టాలు ఉమ్మడి పోరుకు సిద్ధమయ్యాయి. ఈ నెల 22న చెన్నై కేంద్రంగా కలిసొచ్చే దక్షిణాది రాష్ర్టాల అన్ని రాజకీయ పార్టీల నేతలతో జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమావేశం నిర్వహించి లోక్సభ సీట్ల పునర్విభజనపై రాజీలేని పోరాటం చేద్దామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు.
స్వతంత్ర భారత చరిత్రలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను ఒకసారి పరిశీలిస్తే… 1951లో 36.1 కోట్ల జనాభాకు గాను ప్రతి 7.3 లక్షలకు ఒక నియాజకవర్గం చొప్పున 494 సీట్లు కేటాయించగా, 1961లో 43.9 కోట్ల జనాభాకు 8.4 లక్షల జనాభా నిష్పత్తితో 522 స్థానాలకు పెంచారు. చివరిసారిగా 1971లో నమోదైన 54.8 కోట్ల జనాభాకు 10.01 లక్షలకు ఒకరి చొప్పున 543 లోక్సభ స్థానాలకు పెంచారు. ఆ తర్వాత 1976లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో జనాభా నియంత్రణను అమలుచేస్తున్న రాష్ర్టాలు నష్టపోకూడదని, జనాభా నియంత్రణను అన్ని రాష్ర్టాలు పాటించాలన్న ఉద్దేశంతో 2021 జనగణన వరకు లోక్సభ స్థానాలను పెంచకుండా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం చేశారు. నాడు జనాభా నియంత్రణను పాటిస్తున్న రాష్ర్టాలు నష్టపోవొద్దన్న భావనతో చట్టం తీసుకువచ్చారు. ఇప్పుడు అదే చట్టం జనాభా నియంత్రణను పకడ్బందీగా అమలుచేసి, విజయం సాధించిన రాష్ర్టాల పాలిట శాపంగా మారింది. 2002లో వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ 84వ రాజ్యాంగ సవరణ చేసి 2026 తర్వాత జరిగే తొలి జనాభా లెక్కల ప్రకారం లోక్సభ స్థానాల సంఖ్య పెంచాలని నిర్దేశించింది. నాటి కేంద్ర ప్రభుత్వ సూచనలను పకడ్బందీగా అమలుచేయడం వల్ల దక్షిణాది రాష్ర్టాల్లో జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట పడింది. ఇప్పుడు దక్షిణాది రాష్ర్టాల్లో జనాభా తక్కువగా ఉండటం వల్ల లోక్సభలో ఆయా రాష్ర్టాల ప్రాతినిధ్యానికి భారీగా కోత పడనున్నది. ఇప్పటికే లోక్సభలో ఉత్తరాది రాష్ర్టాల్లోని స్థానాల సంఖ్య దక్షిణాది రాష్ర్టాలకన్నా ఎక్కువగా ఉన్నది. ఇది ఆయా రాష్ర్టాల పట్ల వివక్షకు కారణమవుతున్నది.
ఒకవేళ జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ర్టాలు మరింత నిర్లక్ష్యానికి గురవుతాయి. పునర్విభజన కోసం కేంద్రం రెండు ప్రతిపాదనలను ఆలోచిస్తున్నది. మొదటిది జనాభా లెక్కల ప్రకారం లోక్సభ స్థానాలను 848కి పెంచి దేశ జనాభాతో భాగించగా వచ్చేది దేశ పార్లమెంట్ స్థానం సగటు జనాభా. ఈ సగటు పార్లమెంటు జనాభా సంఖ్యతో రాష్ట్ర జనాభాను భాగిస్తే ఆ రాష్ట్రంలోని పార్లమెంటు స్థానాల సంఖ్య వస్తుంది. ఈ విధంగా చూస్తే దక్షిణాది రాష్ర్టాల స్థానం పార్లమెంట్లో స్థానాలు 130 నుంచి 165కు మాత్రమే పెరుగుతాయి.
కొద్దిమేర పెరిగిన ఈ నిష్పత్తి ప్రకారం చూస్తే దారుణంగా 23 శాతం నుంచి 19 శాతానికి స్థానాలు పడిపోనున్నాయి. ఇక రెండో ప్రతిపాదన ఏమంటే.. లోక్సభ స్థానాలను ప్రస్తుతం ఉన్న 545కే పరిమితం చేసి, చేపట్టబోయే జనాభా లెక్కల ప్రకారం పునర్విభజించటం. ఇలా చేసినా నష్టపోయేది దక్షిణాది రాష్ర్టాలే. ఈ విధానంలో దేశ జనాభాను 545తో భాగిస్తారు. అప్పుడు జనాభా అధికంగా పెరిగిన రాష్ర్టాల్లో లోక్సభ స్థానాలు కూడా పెరుగుతాయి. జనాభా తక్కువున్న రాష్ర్టాల్లో తగ్గిపోతాయి. ఈ లెక్కన తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్సభ స్థానాలు 14కు పడిపోతాయి. రెండింటిలో ఏ విధానంలో నియోజకవర్గాలను పునర్విభజించినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమ ప్రాబల్యం అధికంగా ఉన్న ఉత్తరాది రాష్ర్టాలే ఎక్కువగా ఆధిపత్యం చెలాయించే అవకాశాలుననాయి. దీన్నిబట్టి పార్లమెంటులో దక్షిణాది రాష్ర్టాల మాట ఏ మేరకు చెల్లుబాటవుతుందో అర్థం చేసుకోచ్చు.
జనాభా లెక్కల ప్రాతిపదికన చేపట్టే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పెను ప్రమాదంలోకి నెడుతుంది. అంతేకాదు, దేశంలోని రాష్ర్టాల మధ్య రాజకీయ అసమానతలు ఏర్పడుతాయి. నాటి పాలకులు జనాభా నియంత్రణను పాటించిన రాష్ర్టాలను కాపాడే సదుద్దేశ్యంతో రాజ్యాంగ సవరణ చేసి తెచ్చిన చట్టానికి కనీస ప్రాధాన్యం లేకుండా పోతుంది. కాబట్టి, తప్పకుండా గత పాలకుల మేధోమథనానికి అనుగుణంగా పునర్విభజన చేపట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాల్సిన అవసరం ఉన్నది. .
దక్షిణాది రాష్ర్టాల్లో జనాభా తక్కువగా ఉండటం వల్ల లోక్సభలో ఆయా రాష్ర్టాల ప్రాతినిధ్యానికి భారీగా కోత పడనున్నది. ఇప్పటికే లోక్సభలో ఉత్తరాది రాష్ర్టాల్లోని స్థానాల సంఖ్య దక్షిణాది రాష్ర్టాలకన్నా ఎక్కువగా ఉన్నది. ఇది ఆయా రాష్ర్టాల పట్ల వివక్షకు కారణమవుతున్నది.