‘మా భూములు మాగ్గావాలే’ అంటూ లగచర్లలో లంబాడీ బిడ్డల లడాయి మట్టిబిడ్డల పంతానికి అద్దం పట్టింది. భూమి కోసం జరిగిన అన్ని పోరాటాల్లో భూమిపుత్రులే గెలిచారు తప్ప, రాజ్యం ఎన్నడూ పైచేయి సాధించలేదు. ఉన్న ఊరు కన్న తల్లితో సమానమని అంటారు. ఏ కన్నతల్లి తన సొంత బిడ్డకు శాపనార్థాలు పెట్టదు. కానీ, తన సొంత నియోజకవర్గ ప్రజలే ‘నీ అధికారం కాలిపోను’ అని శపించే దారుణ పరిస్థితికి దిగజారిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభమో ఆలోచించుకోవాలి.
రాజకీయ వ్యవస్థలో ఏ నాయకుడికై నా తన సొంత నియోజకవర్గమే మొదటి ప్రాధాన్యంగా ఉంటుంది. అందుకే అంటారు వడ్డించేవాడు మనవాడైతే ఏ మూల న కూర్చున్నా డోకా ఉండదని. కానీ, ఆ వడ్డిం చే వాడే నడ్డి విరిచే వాడయ్యాడని కొడంగల్ ప్రజలు కన్నీళ్లు పెట్టే దుస్థితి నెలకొన్నది.
ఫార్మా కంపెనీలకు తమ భూములను ధారాదత్తం చెయ్యబోమని, ‘మా భూములు మాకే’నని మర్లబడ్డ లగచర్ల రైతుల లడాయిని బెదిరింపులతో, అక్రమ కేసులతో, తన రాజ్యహింసతో, పోలీసుల అణచివేతతో కప్పిపుచ్చాలని రేవంత్‌రెడ్డి చూస్తున్నారు. కానీ, మండే సూర్యుడిని గొంగడిలో దాచడం, నిప్పు రవ్వలను బట్టలో మూలకట్టడం, పారే ఏరును వలలో బంధించడం సాధ్యం కాదని తెలియ దు పాపం. పోరాటాల పురిటిగడ్డలో ప్రశ్నించడానికి అనుమతి తీసుకోవాల్నా? తల్లిపాలు తాగడానికి బిడ్డకు అనుమతి కావాల్నా? గిరిజనులకు, రైతు బిడ్డలకు భూమితో విడదీయరాని అనుబంధం ఉంటుంది.
అది తల్లిపాలలాంటి పేగు బంధం. తల్లి నవమాసాలు మోసి అన్నం మెతుకులు అలవాటు అయ్యేదాకా పాలిచ్చి సాకితే, నేల తల్లి, వ్యవసాయ భూమి మాత్రం కట్టె కాలే దాకా అన్నం పెడుతూ తల్లిలా సాకుతుంది. ఆ తల్లిలాంటి భూమిని లాక్కుంటామంటే లడాయి చెయ్యక లొంగిపోతారా? పాలకులకు సైతం పరిమితులుంటాయని మర్చిపోవద్దు. లగచర్ల లడాయికి సంఘీభావంగా మానుకోటలో ధర్నా పెడితే అనుమ తి లేదన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. గిరిజనుల భూములు లాక్కోవడానికి ఎవరి అనుమతి తీసుకున్నది? భూమి అంటే కేవలం రియల్ ఎస్టేట్ సరిహద్దులుగానే కనిపించే రేవంత్‌కు భూమి బంధం విలువ తెలుసా?
ఈ నేలపై జరిగిన అనేక తిరుగుబాటులు భూమి కోసం, భుక్తి కోసం, తాడిత, పీడిత ప్రజల విముక్తి కోసం జరిగినవే. నాడు భారత స్వాతంత్య్రం కోసం బ్రిటిష్‌వారితో జరిగిన పోరు, నిజాం నవాబు రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం… ఏవైనా భూమి కోసం జరిగినవే. నాడు జల్, జంగల్, జమీన్ నినాదంతో కొమురం భీం పోరుసల్పిన నేల ఇది. దేశ్‌ముఖ్ దొరలను ఉరికిచ్చిన చాకలి ఐలమ్మ నడయాడిన నేల ఇది. జైలు గోడల మధ్య మగ్గుతూ ఆ గోడలపైనే బొగ్గుతో ‘నా నిజాము తరతరాల బూజు’ అని రాసి సంకెళ్ల మధ్య సైతం సమరం సాగించిన ధీశాలి దాశరథి పుట్టిన గడ్డ ఇది.
‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి. అన్యాయాన్నెదిరించినోడు నాకు ఆరాధ్యుడు’ అన్న ధిక్కార స్వరం కాళోజీని కన్న నేల ఇది. పోరాటాలకు పుట్టినిల్లు అయిన ఓరుగల్లు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి పోరుకు సిద్ధమైంది. మా జాతి బిడ్డలకు జరిగిన అన్యాయంపై గర్జించడానికి మానుకోట గడ్డకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన బలగంతో వస్తున్నారన్న మతలబును అందుకొని నలుమూలల నుంచి వేలాదిమంది ప్రజలు మానుకోట నడిబొడ్డుకు చేరుకున్నారు. అడుగడుగునా సర్కారు పెట్టిన నిర్బంధం, కోర్టు విధించిన పరిమితికి మించి గిరిజన బిడ్డలు మానుకోట గడ్డకు తరలిరావడం విశేషం.
లగచర్లలో లడాయి జరిగితే మానుకోటకు ఏం సంబంధం? అన్న ప్రభుత్వ ప్రశ్నకు ప్రజా స్పందనే సమాధానమైంది. మానుకోట రాళ్లు నాడు తెలంగాణ ఉద్యమ సత్తా ప్రపంచానికి చాటాయి. నేడు అదే మానుకోట రాళ్లను ముద్దాడి ఆ స్ఫూర్తిని నరనరాన నింపుకొని కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టడానికి ప్రతీ తెలంగాణ బిడ్డ కంకణబద్ధులు కావడం శుభపరిణామం.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు)
– ఏనుగుల రాకేష్‌రెడ్డి