కొవిడ్ అనంతర ద్రవ్యోల్బణాన్ని మోదీ సర్కారు సమర్థవంతంగా ఎదుర్కొన్నదని దేశ ప్రజలను నమ్మించడానికి విశ్వప్రయత్నం సాగుతున్నది. ఇందులో కేంద్ర అర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్, ముఖ్య ఆర్థిక సలహాదారు, ఆర్థిక సలహా కమిటీ పెద్దలు, ఆర్థిక శాఖ వివిధ సెక్రటరీలు తలో చేయి వేస్తున్నారు. వివిధ దేశాలలో ద్రవ్యోల్బణాన్ని భారత దేశ ద్రవ్యోల్బణంతో పోల్చి గొప్పలు చెబుతున్నారు.కానీ వీరు ఎంతగా గొప్పలు చెప్పినా సరే, ఈ లెక్కలు అర్ధ సత్యాలని స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలతోపాటు ఆర్బీఐ, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ వెల్లడించిన లెక్కలను నిశితంగా పరిశీలిస్తే తెలిసిపోతుంది.
కొవిడ్ సమయంలో ప్రజల కొనుగోలు శక్తి తీవ్రంగా పడిపోవడం వలన, ప్ర జల అవసరాలు తీర్చడానికి, డిమాండ్‌ను పెంచడానికి ప్రపంచంలో అనేక దేశాలు కొవిడ్ ప్యాకేజీలను ప్రకటించాయి. డిమాండ్ పెరుగుదలను, ఉత్పత్తిని సాధించడంలో ఆ కొవిడ్ ప్యాకేజీలలోని ఆర్థిక ఉద్దీపన ముఖ్య భూమికను పోషిస్తుంది. ప్రజలకు నగదు బదిలీ చేయడం, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు చేయూత ఇవ్వడం, ఇతర సేవలు, ఉత్పత్తి రంగాలకు ఆర్థిక మద్దతును చేకూర్చడాన్ని ఆర్థిక ఉద్దీపనగా చెప్పవ చ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వ్యక్తులకు, వ్యవస్థలకు ప్రత్యక్ష నగదు బదిలీ.
మోదీ ప్రభుత్వానికి అయినదానికి కానిదానికి గొప్పలు చెప్పుకోవడం అలవాటు. ఇటీవల జీ20 అధ్యక్ష పదవి రొటేషన్ ద్వారా వచ్చింది. కానీ దాన్ని కూడా పెద్ద ఘనకార్యంగా చూపుతూ, విశ్వ గురువుగా ప్రచారం చేసుకుంటున్నది. ఇదే కోవలో కేంద్ర ప్రభుత్వం తాను ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనను కూడా గొప్పగా చెప్పుకుంటున్నది. కానీ ఇదే జీ20 దేశాలతో పోలిస్తే మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన అత్యల్పం. ఇక గొప్పలు చెప్పుకోవడం దేనికి? సింగపూర్, యూఎస్ఏ, హాంగ్‌కాంగ్, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జపాన్ వంటి దేశాలు ఐదు శాతం జీడీపీ కంటే ఎక్కువ ఆర్థిక ఉద్దీపన ప్రకటించాయి. దక్షిణాఫ్రికా, బ్రెజిల్, థాయిలాండ్, ఇండొనేషియా, ఇటలీ, స్పెయిన్, మలేషియా, చైనా, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్ దేశాలు 1.7 శాతం జీడీపీ కంటే ఎక్కువగా ఆర్థిక ఉద్దీపన ప్రకటించాయి. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాలతో పోలిస్తే భారతదేశం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన అత్యల్పంగా 1.3 శాతం జీడీపీ మాత్రమే.
ఎన్నో దేశాలలో ప్రజలకు నగదు బదిలీ జరిగింది. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి నిలబడింది. సేవలు, పరిశ్రమ రంగాలకు చేయూత లభించింది. అత్యధిక నగదు లభ్యత వల్ల ఆ దేశాలలో భారతదేశం కంటే ద్రవ్యోల్బణం ఎక్కువ ఉండే అవకాశం మామూలే. కొవిడ్ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ మనీ పద్ధతిలో ప్రజలకు నగదు అందిస్తే మంచిదని నరేంద్రమోదీ ప్రభుత్వానికి సూచించారు. పలువురు ఆర్థికవేత్తలు కూడా ఇదే విధంగా అభిప్రాయపడ్డారు. ఆ సూచనలను కేంద్రం పెడ చెవిన పెట్టింది. హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేయడం, లోపభూయిష్ట జీఎస్టీ విధానంతో పాటు మోదీ ప్రభుత్వ ఇతర అస్తవ్యస్త ఆర్థిక విధానాల వలన భారతదేశం నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణాన్ని 2 నుంచి 6 శాతం లోపు కట్టడి చేయాలనే లక్ష్యం నిలబెట్టు కోలేక పోయింది. అక్టోబర్- డిసెంబర్ 2019 లోనే ద్రవ్యోల్బణం 6.7గా నమోదు కాగా జనవరి- మార్చి 2020లో కూడా 6.7గా నమోదు అయింది. డిమానిటైజేషన్, జీఎస్టీ సవాళ్లను ఎదుర్కోనడానికి ఆ సమయంలో అడ్డదిడ్డంగా రెపో రేట్ తగ్గించడంతో పాటు ఇతర అంశాల వల్ల ద్రవ్యోల్బణం పెరిగిందని ఆర్థిక వేత్తలు విశ్లేషించారు.
భారతదేశంలో ద్రవ్యోల్బణం గురించి ఆలోచించకుండా 60% భారతీయులకు హెలికాప్టర్ మనీ ఇస్తే కొవిడ్ సమయంలోనే కాకుండా కొవిడ్ అనంతరం కూడా డిమాండ్ పెరుగుతుందని, తద్వారా ఉత్పత్తి రంగానికి తోడ్పాటు అం దించవచ్చు అని నోబెల్ బహుమతి గ్రహీత అభినవ్ బెనర్జీ సూచించారు. ప్రజలకు డబ్బు పంచ డమనే సూచనను పెడచెవిన బెట్టిన మోదీ సర్కా ర్ పరిశ్రమలకు మాత్రం ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్‌ను అమలు చేసిం ది. కానీ డిమాండ్ లేనప్పుడు ప్రొడక్షన్‌కు ఉద్దీపన ఇచ్చినా ఒరిగేది ఏమీ ఉండదనే ఆర్థిక సిద్ధాంతం నిజమైంది. ఉత్పత్తి రంగం 4% కుదించుకుపోయిందనే విషయాన్ని ఇటీవల కేంద్రం ప్రకటించిన గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి.
ఉపాధి – నిరుద్యోగం..
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్), వరల్డ్ బ్యాంక్ నివేదికలను అనుసరించి భారతదేశంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 46 శాతంగా ఉంది. ఇది బంగ్లాదేశ్ (57%) పాకిస్థాన్ (50%) కంటే తక్కువగా ఉండడం గమనార్హం. ఆఫ్ఘనిస్థాన్‌లో, ఏవో కొన్ని ఆఫ్రికన్, అరబ్ దేశాలలో తప్ప, మరే అభివృద్ధి, అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా భారత్ స్థాయిలో లేబర్ పార్టిసిపేషన్ రేట్ అతి స్వల్పంగా లేదు. పీఎల్ఎఫ్ఎస్ ఇటీవల ప్రకటించిన లెక్కలను అనుసరించి మొత్తం కార్మికులలో 46.5 శాతం వ్యవసాయరంగంలో పని చేస్తున్నారని తెలియచేశారు. ఇది 2019లో 42.5 శాతంగా ఉన్నదని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంటే కొవిడ్ కారణంగా సుమారు 4 శాతం సేవలు, ఉత్పత్తి రంగాలలో ఉపాధి పొందలేక, వేరే దారి లేక వ్యవసాయంపై ఆధారపడుతున్నారు అని అర్థం అవుతున్నది. భారతదేశంలో గ్రామీణ కూలీలకు వేతనం పడిపోవడానికి కారణం వ్యవసాయరంగంపై అదనపు భారమే అని స్పష్టం అవుతున్నది. అదే సమయంలో కరోనాకు ముందు రెగ్యులర్‌గా జీతం పొందుతున్న వారు 24 శాతం ఉంటే అది 2021 నాటికి 21 శాతంగా ఉన్నది. అంటే ఈ ఉత్పత్తి, సేవ రంగంలో పనిచేస్తున్న వారు ఆయా రంగాలలో ఉద్యోగాలు కోల్పోయి వ్యవసాయం వైపు మళ్లారు అని భావించవచ్చు.
లేబర్ ఇన్సెంటివ్ సెగ్మెంట్లో 2 లక్షల కోట్ల పీఎల్ఐ వల్ల రాబోయే 5 సంవత్సరాలలో 8 లక్షల ఉద్యోగాలు వస్తాయి అని ఐటీ అండ్ నైపుణ్యాభివృద్ధి మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇటీవల తెలియజేశారు. అంటే మోదీ ప్రభుత్వం ఒక్కో ఉద్యోగానికి పారిశ్రామిక రంగానికి 25 లక్షల రూపాయల సబ్సిడీ ఇయ్యబోతోన్నది అన్న మాట. ఈ పీఎల్ఐ స్కీమ్ రద్దయిన తరువాత ఈ ఉద్యోగాలలో ఎన్ని ఉంటాయో ఊడతాయో ఆ భగవంతునికే తెలియాలి. అదే 2 లక్షల సబ్సిడీ 46.5 శాతం లేబర్ ఫోర్స్ ఆధార పడుతున్న వ్యవసాయానికి ఇచ్చి వుంటే రైతుకు మంచి ధరతో పాటు లక్షల మందికి దాదాపు శాశ్వత ప్రాతిపదికన ఉపాధి దొరికి ఉండేది.
బేటీ కో ఆగే బడావ్..
భారతదేశంలో మహిళా కార్మిక భాగస్వా మ్యం 19 శాతంగా ఉన్నదని వరల్డ్ బ్యాంక్ లెక్కలను బట్టి తెలుస్తున్నది. ఇది బంగ్లాదేశ్ (35%) పాకిస్థాన్ (21%) కంటే తక్కువగా ఉండడం గమనార్హం. ఆఫ్ఘనిస్థాన్, ఏవో కొన్ని ఆఫ్రికన్, అరబ్ వంటి దేశాలను మినహాయిస్తే, పలు వర్ధమాన దేశాలతో పోలిస్తే భారతదేశం లో మహిళా శ్రామిక భాగస్వామ్య రేట్ అత్యల్పం. బేటీ బచావో – బేటీ పడావోకు కేటాయించిన 80 శాతం నిధులను ప్రకటనలకు వినియోగించుకునే ప్రభుత్వం నుంచి ఏమి ఆశించగలం! అభివృద్ధి చెందిన దేశాలలో మహిళా శ్రామిక భాగస్వామ్యం రేటు 50 శాతానికి పైగా ఉన్నది.
అంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే 50 శాతం పైన స్త్రీలు సేవ, ఉత్పాదన రంగంలో పని చేస్తూ తమ కుటుంబ అభివృద్ధితో పాటు దేశ ఉన్నతిలో పాలు పంచుకోవాలి. ఈ దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మోదీ ప్రభు త్వం పూర్తిగా విఫలమైంది. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే కనీసం 60 -70 శాతం జనాభా శ్రామిక శక్తిలో ఉండాలి. అందులో అత్యధికులు సేవ- ఉత్పాదన రంగం లో ఉంటేనే దేశ తలసరి ఆదాయం అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలో ఉండవచ్చు. ఆ దిశగా భారత దేశాన్ని నడపడంలో మోదీ సర్కార్ విఫలమైంది. 2014 , 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భం లో మోదీ ఇచ్చిన నినాదాలు అన్నీ డొల్ల అని, దేశం వికాసం వైపు పోకపోగా తిరోగమన దిశ లో ఉందని ఆర్థిక వేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
-పెండ్యాల మంగళాదేవి