నాడు తెలంగాణ ఉద్యమంపై, ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్‌రెడ్డి నేడు తెలంగాణ ఆనవాళ్లపై, అస్తిత్వంపై, ఆత్మగౌరవంపై కర్కశంగా దాడి చేస్తున్నారు. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిందన్నట్టున్నది ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి.
తెలంగాణ ఉద్యమ సమయంలో మేధావులు ఎంతో మేధోమథనం చేసి సిరి సంపదలకు నెలవైన తెలంగాణ నేలకు తల్లి రూపాన్నిచ్చారు. ఆ తల్లి మెడలో కనకంబు మణిహారం, ఓ చేతిలో జొన్న కంకి, మరో చేతిలో తెలంగాణ సాంస్కృతిక చిహ్నమైన బతుకమ్మ, నెత్తిన బంగారు కిరీటం పెట్టి మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా, రాజసం ఉట్టిపడేలా, చూస్తేనే చేతులెత్తి మొక్కేలా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించారు. కానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికార అహంతో ప్రస్తుత తెలంగాణ తల్లి విగ్రహాన్ని శక్తి హీనంగా, పేదరికం ఉట్టిపడేలా రూపొందించారు. పేద, మధ్యతరగతి, ధనిక వర్గాలనేవి దైవాధీనం. కానీ, మన తల్లి కలలో సైతం ఉన్నతంగానే ఉండాలని కోరుకుంటామన్న విషయాన్ని ఆయన మరిచారు.
ఏ కొడుకైనా తన తల్లిని ఉన్నతంగా గౌరవంగా చూడాలనే కలలు గంటాడు. అందుకు తగ్గట్టుగా శ్రమ పడి తన తల్లికి ఆభరణాలు, పట్టువస్ర్తాలు సమకూర్చుతాడు. కానీ, రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి అంటే పేదరికానికి చిహ్నంగా ఉండాలన్న తీరులో రూపొందించారు. మన దేశంలోని 130 కోట్ల భారతీయులు కొలిచే భరతమాత సైతం నెత్తిన కిరీటంతో, ఆభరణాలతో, చేతిలో త్రిశూలంతో నిండుగా అమ్మతనం ఉట్టిపడే ఆహార్యంతో దర్శనమిస్తుంది. తెలుగు తల్లి కూడా అలాంటి ఆహార్యంతో ఉంటుంది. సంపద, శక్తి, సంస్కృతి తొణికిసలాడుతూ దర్శనమిచ్చే తెలంగాణ తల్లిని ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే దొరల తల్లి, ఉన్నత వర్గాల తల్లి అంటూ అత్యంత హేయంగా మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి తన అక్కసును వెళ్లగక్కారు. అన్నట్టుగానే ఇప్పుడు ఆ తల్లి రూపాన్ని మార్చేసి పైశాచికానందాన్ని పొందుతున్నారు.
బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్‌రెడ్డి తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే తెలంగాణ సమాజం సిరిసంపదలను లక్ష్మీదేవిగా, శక్తిని ఆదిపరాశక్తి దుర్గామాతగా కొలుస్తుంది. తెలంగాణ తల్లి చేతిలో ఉండే బతుకమ్మ సబ్బండ వర్గాలు కలిసిమెలిసి జీవించాలన్న సాంస్కృతిక సందేశం ఇచ్చే చిహ్నం. అడవిలో సహజంగా పెరిగే తీరొక్క పూలను తెచ్చి మన ఆడబిడ్డలు అందమైన బతుకమ్మగా పేరుస్తారు. వాటన్నింటినీ ఒకచోట పేర్చి అందమైన బతుకమ్మకు రూపం పోస్తారు. అంతటి విశిష్టత గల బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలోంచి మాయం చేయడం తెలంగాణ అస్తిత్వాన్ని కనుమరుగు చేసే ప్రయత్నమనే చెప్పాలి. తల్లి ఏ రూపాన ఉన్నా తల్లే. కానీ, రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి ఒక చేతిలో వరి, మొక్కజొన్న పంటను పెట్టి, మరో చేతిని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చిహ్నమైన హస్తం గుర్తుగా ప్రచారం కోసం ఉంచినట్టు రూపొందించారు.
కొత్తగా కచేరీలో చేరిన వాడికి దీర్ఘాలు ఎక్కువ అన్నట్టు కాంగ్రెస్ ఆనవాళ్లను పదిలపర్చడం కోసం రేవంత్‌రెడ్డి పడుతున్న ఆరాటం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ సంస్కృతిపై, ఆత్మగౌరవంపై రేవంత్‌రెడ్డి వరుసగా దాడులు చేస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీకలైన కాకతీయ కళాతోరణాన్ని, హైదరాబాద్‌కు మకుటం లాంటి చార్మినార్‌ను తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి తొలగించేందుకు ప్రయత్నించి భంగపడ్డారు.
ఉద్యమ సమయంలో మార్మోగిన ‘జయ జయహే తెలంగాణ’ గీతానికి సమకూర్చిన సంగీతాన్ని మార్చారు. ఆ గేయం ఇప్పుడు సినీ పాట తరహాలో ఉన్నదని పలువురు మేధావులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కోసం కేటాయించిన స్థలంలో రాష్ట్రంతో ఎలాంటి సంబంధం లేని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అత్యంత హేయనీయం. పద్నాలుగేండ్లు అహరహం పోరాడి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన మహా మనీషి కేసీఆర్. అంతేకాదు, రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా పదేండ్లు పనిచేసి తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రపథాన నిలిపిన మహనీయుడు. అలాంటి మహోన్నత వ్యక్తి ఆనవాళ్లు లేకుండా చేస్తానని తరచూ గొప్పలకు పోతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందుకోసం అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు అనేక తంటాలు పడుతూ అక్కసును వెళ్లగక్కుతున్నారు. ఆఖరికి తన అధికారాన్ని చాటుకోవడానికి అమ్మ రూపంపై కూడా దాడికి తెగబడుతున్నారు.
నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ రాష్ర్టాన్ని ఆగమాగం చేస్తూ రేవంత్‌రెడ్డి తన కురచ బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. తల్లి రూపాన్ని మార్చడమంటే అది తెలంగాణ అమరవీరులకు జరిగిన అవమానంగానే భావించాలి. ఇలాంటి చిల్లర చేష్టలతో రాష్ర్టాన్ని పాలిస్తే తెలంగాణ చరిత్రలో రేవంత్‌రెడ్డి సాంస్కృతిక విధ్వంసకారుడిగా మిగిలిపోవడం ఖాయం. నాలుగేండ్ల తర్వాత మళ్లీ తెలంగాణ బిడ్డల పేగుబంధమైన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే మన తెలంగాణ తల్లిని మనం అంగరంగ వైభవంగా పునఃప్రతిష్ఠించుకోవాలని ప్రతినబూనుదాం. జై తెలంగాణ!!