‘సిద్దిపేట’.. ఈ పేరు వింటే చాలు, తెలంగాణలో అందరికీ ఆత్మీయభావన కలుగుతుంది. రకరకాల భావజాలాలకు సైద్ధాంతిక పునాదులు వేసిన గడ్డగా గౌరవిస్తుంటారు. అందుకే దీన్ని ‘సంకల్ప సిద్ధి పేట’ అని మురిపెంగా పిలుచుకుంటారు. ఆ భూమిపై మొలిచిన మొక్కనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అదే ఇప్పుడు దేశానికి నీడనిచ్చే మర్రిచెట్టుగా ఎదుగుతున్నది. దీనికంతటికీ మూలం చిత్తశుద్ధి. బక్క పలుచటి మనిషి రాజకీయాల్లో నిలబడగలడా అన్న ప్రశ్నలను దాటి దేశ రాజకీయాలకు చుక్కానిగా ఎదిగే క్రమం ఆసక్తికరం. ఆచరణీయం.
కేసీఆర్ జీవితం, రాజకీయం అంతా ప్రకృతితో అనుంధానమైనదే. సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం ఎలా అన్నదానిపైనే ఆయన ఆలోచనలన్నీ తిరుగుతుంటాయి. అపారమైన జల వనరులను వినియోగించుకోలేకపోవడాన్ని చూసే తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ‘నీళ్లు’ ఉద్యమంలో తొలి నినాదంగా మారింది. నీళ్లతోనే నాగరికత పుట్టింది. ఇన్ని శతాబ్దాల్లో పలు రూపాలు ధరించింది. అయినా 21వ శతాబ్దంలోనూ నీరే సమస్యగా మారడం, ఆ నీరే సమస్యలు సృష్టించడం ఆలోచనలో పడేసింది. అదే ఉద్యమంగా మారింది. సంకల్పం సిద్ధించింది. వాగులోని నీరు సాగుభూమిలోకి పారేందుకు కార్యాచరణ అమలైంది. పచ్చదనం పరుచుకున్నది. కడుపు నిండింది. కనులకు పండుగైంది.
ఈ పులకరింత ఒక్క తెలంగాణకే పరిమితం కావాలా? దేశమంతటా ఉండకూడదా? ఇప్పుడు ఇదే ఈ భూమి పుత్రుడిని తొలచివేస్తున్న ప్రశ్న. సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని సంక ల్పం తీసుకున్నారు. అందుకే కార్యక్షేత్రాన్ని విస్తృతం చేసుకున్నారు. అదే భారత రాష్ట్ర సమితి ఏర్పాటుకు దారితీసింది. రానున్న ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా ముందే చెప్పేశారు. రైతుల ప్రభుత్వమే ఏర్పాటవుతుందంటూ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అంటూ నినాదం కూడా ఇచ్చారు. ఇది కేవలం ఎన్నికల స్లోగన్ కాదు.. ఎంతో స్పష్టత ఉన్న భావి ప్రణాళిక. వ్యవసాయం అంటే రైతులు ఆధారంగా జరిగే ఆర్థికవ్యవస్థ నిర్మాణం. దీనికోసమే ఆయన తాపత్రయం. దేశంలో వనరులకు కొరత లేకున్నా, వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామన్నదే ఆయన ఆవేదన. దేశంలో 83 కోట్ల ఎకరాల భూమి ఉన్న ది. అందులో 41 కోట్ల ఎకరాలు మాత్రమే సాగవుతున్నది. మొత్తం భూమికి 40 వేల టీఎంసీల నీరు అవసరమవుతుంది. కానీ, 50 వేల టీఎంసీల నీరు వృథా అవుతున్నది. ఈ దుస్థితిని మార్చలేమా?’ అన్న ప్రాథమిక ప్రశ్నను దేశం ముందుం చారు. దీనికి సమాధానం వెతికే ప్రయత్నమే టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మార్చడం. హాలికుడు పాలకుడైతే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నది ఆయన గట్టి నమ్మకం. తెలంగాణ ప్రజల అనుభవం కూడా ఇదే.
దేశానికి హృదయస్థానంలో ఉన్న తెలంగాణ నుంచి నలుమూలలకూ ఈ వెలుగు ప్రసరిస్తే అంతకుమించి కావలసిందే ముంది? ఊరూరా జలకళ సంతరించుకొని కుంటల్లో కలువలు పూసి అన్నీ ‘కలువ కుంట’లైతే సంకల్పం సిద్ధించినట్టే కదా? మరో ఏడాదిలోకి అడుగుపెట్టిన కేసీఆర్ ఈ లక్ష్యసాధనకు మరో వంద అడుగులు ముందుకువేయాలని ఆశిద్దాం.
కేసీఆర్ అవసరం దేశానికీ ఉన్నది. ఆయన అంబేద్కర్ రాజ్యాంగానికి బద్ధుడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉండాలని రాజ్యాంగం నిర్దేశించింది. స్వేచ్ఛ, సమానత్వాలను కొంతవరకు న్యాయవ్యవస్థ చొరవతోనైనా ప్రజలు పొందగలరు. కానీ సోదరభావం అన్నది ప్రజల ఆచరణలోనే ఉండాలి. అది లేనందువల్లే దేశంలో ఎన్నో సమస్యలు. దీర్ఘకాలంలో అది సామాజిక అశాంతికి దారితీస్తుంది. అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు పెట్టబడులు పెట్టడానికి ముందుకువస్తారు? విదేశీ పెట్టుబడిదారుల్లో విశ్వాసం ఎలా కలుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం కేసీఆర్‌లో దొరుకుతాయి. నాయకుని నడవడికను చూసే ప్రజలు సోదరభావాన్ని నేర్చుకుంటారు. మతాన్ని, దేవుడిని కేవలం వ్యక్తిగత వ్యవహారంగా చూడటం, దాన్ని రాజకీయాలు, ఎన్నికలతోనూ ముడిపెట్టకపోవడం కేసీఆర్ ఆచరిస్తున్న విధానం. రాజ్యాంగం చెప్తున్నది కూడా ఇదే. భిన్నత్వానికి నిలయమైన దేశంలో అన్నింటికీ సమాన గౌరవం లభించి, సోదరభావం నెలకొనాలంటే ఇలాంటి నేతలే అవసరం. కేసీఆర్ లోక కల్యాణం కోసం హిందు ధర్మశాస్ర్తాలకు అనుగుణంగా వ్యక్తిగత హోదాలో వ్రతాలు, హోమాలు అన్నీ చేస్తారు. అదే సమయంలో ఇతర మతాల సంప్రదాయాలను అంతే నిష్ఠతో గౌరవిస్తారు. దీన్ని ఎక్కడా ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించుకోరు. మతం, దేవుడు వేరు. రాజకీయం వేరు. ఇక్కడ మాత్రం రెండు వేర్వేరుగానే ఉండాలి. ఇలాంటి అంశాలపై దృఢ వైఖరి ఉన్న నాయకుడి అవసరమే ప్రస్తుతం దేశానికి కావాల్సింది. ఆ లక్షణాలన్నీ కేసీఆర్‌లో పుష్కలంగా ఉండటం వల్లనే దేశవాసుల దృష్టిని ఆకర్షించారు.
ఇంకొకందుకు కూడా దేశం కేసీఆర్ వైపు ఎదురుచూస్తున్నది. తప్పుని తప్పు అని, ఒప్పుని ఒప్పు అని నిష్కర్షగా చెప్పి ధర్మం పక్షాన నిలిచేవాడే నిజమైన నాయకుడు. ప్రాచీన ధర్మశాస్త్రమైనా, ఆధునిక రాజ్యాంగమైనా ఇదే చెప్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి నాయకులు కరువయ్యారు. పరిపాలన, వ్యవస్థలోని లోపాలను గట్టిగా, అందరికీ అర్థమయ్యేటట్టుగా జనాలకు వివరిస్తున్నవారు ఈ విషయంలో బాధ్యత గల నాయకునిగా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. ధర్మశాస్ర్తాలు, రాజ్యాంగం తెలిసిన నేతగా అన్నింటినీ బేరీజు వేయగలుగుతున్నారు. లోపాలు ఎంచడంతో సరిపెట్టకుండా ఆచరణాత్మక పరిష్కార మర్గాలు సూచిస్తున్నారు. ఉద్యమకారుడిగా కూడా తన పాత్రను పోషిస్తున్నారు. ఉద్యమం ఆలోచనలు, జరిగిన తీరు, సాధించిన ఫలితాలన్నింటినీ ప్రత్యక్షంగా గమనించిన తర్వాత ఆ ఉద్యమకారుడే మాకూ నాయకుడైతే బాగుండునని భావించడం కూడా సహజ పరిణామక్రమంలో జరిగేదే. అందుకు సమయం ఆసన్నమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.
మరొక్క విషయం జాతిని ఆకర్షిస్తున్నది. ప్రకృతి వనరులు, మౌలిక సదుపాయాలు సమాజం అంటే దానికి ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం చేతిలో ఉండాలే తప్ప ఏ ఒక్కరి చేతిలో ఉండకూడదన్నది కేసీఆర్ అభిమతం. ఇది ఎన్నికల్లో ప్రధాన అంశంగా ఉండాల్సినంత ముఖ్యమైన విషయం. ఆర్థికవ్యవస్థనే ప్రభావితం చేసే ఈ విషయమై అందరూ ఆలోచన చేయాలి.
ఇవి కాకుండా రాష్ట్రాల అధికారాలు, ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తి ఇలా ఎన్నెన్నో మౌలిక సమస్యలను ఆయన లేవనెత్తుతున్నారు. వీటిపై మాట్లాడే గొంతు ఆయనదే. అందుకే ఆయన అన్నా, ఆయ న మాటలు అన్నా దేశానికి నమ్మకం కలిగింది. మరో మలుపు తీసుకోవాలని భావిస్తున్నది. దేశానికి హృదయస్థానంలో ఉన్న తెలంగాణ నుంచి నలుమూలలకూ ఈ వెలుగు ప్రసరిస్తే అంతకుమించి కావలసిందే ముంది? ఊరూరా జలకళ సంతరించుకొని కుంటల్లో కలువలు పూసి అన్నీ ‘కలువ కుంట’లైతే సంకల్పం సిద్ధించినట్టే కదా? మరో ఏడాదిలోకి అడుగుపెట్టిన కేసీఆర్ ఈ లక్ష్యసాధనకు మరో వంద అడుగులు ముందుకు వేయాలని ఆశిద్దాం.
(వ్యాసకర్త: బీఆర్ఎస్నాయకులు)
గోసుల శ్రీనివాస్ యాదవ్ 98498 16817