ఖమ్మం జిల్లా వేదికగా 2023 జనవరి 18న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిర్వహించిన భారీ బహిరంగసభ భారతదేశంలో రానున్న విప్లవాత్మక మార్పులకు దిక్సూచి కానున్నదా..? డబ్బు ఐదేండ్లుగా దేశ ప్రజలు అనుభవిస్తున్న మూస, ఓటుబ్యాంకు రాజకీయాలకు చరమగీతం పాడి నవశకానికి నాంది పలుకనున్నదా..? ఓటు కేంద్రంగా కొనసాగుతూ వచ్చిన వికృత పరిపాలనకు అంతిమగీతం పాడబోయే వేదికకు తొలి చరణం అయిందా?
ఢిల్లీ శివార్లలో రక్తతర్పణం గావించి కేం ద్ర ప్రభుత్వం నిర్దయగా రుద్దాలనుకు న్న మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేలా వీరోచిత పోరాటం గావించిన భారత కిసాన్లు సక్రమమైన సవ్య దిశను ఎన్నుకోనున్నారా? మారుతున్న పరిణామక్రమం ఆశాజనకంగా అవుననే సంకేతాలు పంపుతున్నాయి. మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి ఇచ్చిన ‘జై జవాన్-జై కిసాన్’ నినాదాన్ని గత 75 ఏండ్లుగా పాలించిన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు నిర్లక్ష్యానికి గురిచేశాయి. ఆ నినాదాన్నే కేంద్రం గా చేసుకొని దేశంలో మొట్టమొదటిసారిగా ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తుకున్న నినాదం భార త రైతుకు తమ భవిష్యత్తు పట్ల ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తున్నది.
భారతదేశంలో 355 మిలియన్ ఎకరాల సా గుభూమి అందుబాటులో ఉన్నది. కానీ, కేవలం 138 మిలియన్ ఎకరాలకే సాగునీరు అందడం 75 ఏండ్ల వైఫల్యం కాదా? అందులో సుమారు 60 శాతం మేర రైతులు ఇంకా భూగర్భం నుంచి బోర్ల ద్వారా నీటిని తోడుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. 2 కోట్ల వ్యవసాయ పంపుసెట్లు (తెలంగాణలోని 26 లక్షల 54 వేలు మినహాయించి) అర్ధరాత్రి, అపరాత్రి వచ్చే అరకొర కరెంటుతో వ్యవసాయం చేసుకుంటూ ఎండిన పొలాల వంక చూస్తూ కన్నీరు పెడ్తుండటం వాస్త వం కాదా? 75 లక్షలమంది రైతులు రూ.90 లకు లీటర్ దొరికే డీజిల్‌తో వ్యవసాయం చేసుకుంటూ బాధ్యతతో మనకు అన్నం పెడుతుంటే రైతాంగం దురవస్థకు కారణమై సిగ్గు పడాల్సింది ఈ దేశ పాలకులు కాదా? ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్తున్నట్లు 4 లక్షల 10 వేల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా గతేడాది జూన్ నెలలో 2 లక్షల 10 వేల మెగావాట్లు పీక్ డిమాండ్ నమోదైంది. మనకున్న ఉత్పత్తి సామర్థ్యంలో సగానికి కూడా చేరుకోనప్పుడు దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలెందుకు?
ఏడాదికి మన దేశ అవసరాలకు 1,520 బిలియన్ యూనిట్ల కరెంటు సరిపోతుంది. అందు లో 20 నుంచి 25 శాతం మేరకు సాగుకు అవసరం ఉంటుంది. అంటే సుమారు 350 నుంచి 400 బిలియన్ యూనిట్లు అన్నమాట. డిమాం డ్ రూపంలో చూసినప్పుడు 50,000 మెగావాట్లు. అంటే దేశ వ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే లక్షా యాభైవేల కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చవుతుంది. 20 లక్షల కోట్లు కార్పొరేట్ శక్తులకు మాఫీ చేయగలిగిన పాలకులకు రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి ఎందుకు చేతులు రావడం లేదు.
రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ అవసరమైన ఎరువులు,విత్తనాలు,సరిపడా కరెంటు. రైతులకు అందుబాటులో ఉంచినప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాలు వాటంతటవే నడిచివస్తా యి. ఖమ్మం సభలో పాల్గొన్న పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు అందరూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను అభినందించడం విశేషం. ఇది కదా దేశానికి మాడల్ అంటే. ఈ మధ్య ఉచితాలు ప్రజలను సోమరులను చేస్తాయని, దేశాన్ని శ్రీలంక, వెనిజులా వలె మారుస్తాయని చెప్పుకొచ్చే నయా రాజకీయ నాయకులు, సూడో మేధావులూ పుట్టుకొచ్చారు. ప్రజాసంక్షేమం -అభివృద్ధి సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లినప్పుడే ఉత్తమ ఫలితాలు ఆవిష్కృతమవుతాయి. పాలకులకు వ్యాపార ధోరణి మాత్రమే ఉండాలా? మానవీయ కోణంలో ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాల్సిన బాధ్యత పాలకులపై ఉండదా? రాముడిలో ప్రజలు చూసుకుంటున్న సుగుణం కూడా అదే కదా!
కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలను, దిగువ, ఎగువ మధ్య తరగతి ప్రజలను వారి మానాన వారినొదిలేసి కేవలం సంపన్న కార్పొరేట్ శక్తుల సేవలో పునీతమవుతున్నదన్న విషయం నిస్సంకోచంగా వాస్త వం. ఆస్ట్రేలియా కార్మైఖేల్ బొగ్గు గనులు, శ్రీలంక మన్నార్, పునేరిన్ పవర్ ప్రాజెక్టులు, బంగ్లాదేశ్ కోసం జార్ఖండ్‌లోని గొడ్డాలో నిర్మితమవుతున్న థర్మల్ పవర్ ప్లాంట్, జర్మనీ తో 70 బిలియన్ డాలర్ల పునరుత్పాదక విద్యుత్ ఒప్పందం, మొరాకో పవర్ ప్లాంట్ ఇవన్నీ మనకేం సూచిస్తున్నాయి?
దేశ రైతాంగం అవసరాల ను, పేద, బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనారిటీ ప్రజల సంక్షేమం కూడా ప్రభుత్వ బాధ్యతలుగా భావించకుండా విదేశాంగ విధానం, చివరికి రక్షణ వ్యవహారాలు ప్రభుత్వరంగ సంస్థలు సైతం కేవలం కొద్దిమంది సంపన్నవర్గాల పరంచేస్తున్న ప్రస్తుత కేంద్రప్రభుత్వం అత్యంత వినాశకర విధానాలను అవలంబిస్తున్నది.
తాజాగా ‘ఆక్స్‌ఫామ్’ అనే అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల విశ్లేషణ సంస్థ దేశ సంపదలో 40 శాతంగా ఉన్న 54 లక్షల కోట్ల దేశ సంపద కేవలం దేశంలోని వంద మంది సంపన్నుల వద్ద పోగుపడినట్లు పేర్కొన్నది. 50 శాతం జనాభా వద్ద కేవలం 3 శాతం సంపద మాత్రమే ఉన్నది. పన్ను చెల్లింపుల విషయానికి వస్తే ధనవంతుల వాటా 3 శాతం ఉండగా, పేద ప్రజలే 64 శాతం చెల్లిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలకు ఇది పరాకాష్ఠ. గత ఎనిమిదేండ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో ఎక్కువగా లబ్ధి పొందినది కొద్దిమంది గుజరాత్‌కు చెందిన సంపన్న వర్గాలు మాత్రమే.
ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా కనీస అవసరాలకు నోచుకోకుండా దోపిడీకి గురవుతున్న అశేష ప్రజానీకానికి ప్రత్యేకించి రైతాంగానికి, బడుగు, బలహీన వర్గాలకు తెలంగాణ పాలనా పద్ధతుల ఆవశ్యకత ఎంతగానో ఉన్నది. ఇప్పటికే విఫలమైన జాతీయ రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ను ప్రజలు చూస్తున్నారు. రాబోయే ఏడాదికాలం భారత రాజకీయ ముఖచిత్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని ఖమ్మం లో జరిగిన భారీ బహిరంగ సభ తేటతెల్లం జేసింది.
జై తెలంగాణ.. జై భారత్.
-తుల్జారాంసింగ్ ఠాకూర్
78930 05313