ఏ శక్తి వైకల్య ఘడియన శని నెత్తి మీద కూసుందో..! పాడి బర్రెను జారవిడిచి ఎగిరి తన్నే దున్నను తెచ్చుకున్నాం. అదిప్పుడు ఎగిరెగిరి తంతుంటే ఒళ్లంతా గాయాలైతున్నయి. గాయపడ్డ బిడ్డ ‘అమ్మా’ అనటం ఎంత ప్రాకృతికమో..! నిలువెల్లా గాయపడ్డ తనువులు అంతే ప్రాకృతికంగా ‘బాపూ’ అని పలవరిస్తూ గుండెలు బాదుకుంటన్నయి.
వెనుకటికి ఎండకాలంతో పాటే ఊళ్లకు దొంగల భయం చొరబడేది. ఆ ఊళ్లె దొంగలు పడ్డరు.. ఈ ఊళ్లె దొంగలు పడ్డరు. దోస్కపోయిండ్రు అని వదంతులు పుట్టేయి. అవి వదంతులు కావు, నిజం కూడా ఉండేది. తమను తాము కాపాడుకునేందుకు ఊరు, ఊరంతా నిద్రాగారం లేకుండా జాగారం చేసేది. ఇంటికి పంటకు కాకుండా జనం తీవ్ర ఒత్తిడితో ఉండేవాళ్లు. అలిసి విసిగి వేసారి పోయేవాళ్లు. ‘ఆరు పథకాలు ఇస్తా.. ఆనాటి రోజులు మళ్లీ తెస్తా’ అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను పాతర పెట్టి ఆనాటి రోజులను టంఛన్‌గా మళ్లీ తెచ్చింది. ఇవ్వాళ తెలంగాణ పట్టణాలు పల్లెలు మళ్లీ జాగారం చేస్తున్నాయి. దొంగరాత్రి వేళ బుల్డోజర్లు వస్తున్నయి. లంకిని పడ్డట్టు ఇళ్ల మీద పడుతున్నయి. కంటి మీది రెప్ప వాలినంతలో గూళ్లను చిదిమేస్తున్నయి. పాలకులు పంపిన రాక్షస బుల్డోజర్లు ఎప్పుడు ఎవరి ఇంటిమీద పడుతయో తెల్వక జనం హడలిపోతున్నరు. వీటికి వదంతులు తోడైనయి. ‘అగో వచ్చే.. ఇగో వచ్చే’ నంటూ అధికారులే లీకులు వదులుతున్నరు. జనం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నరు. నిద్రకాచి ఇంటి కావలి కాసుకుంటున్నరు.
‘నా ఇల్లు కూలిపోతంది.. కేసీఆర్ అన్నా రాయే’ అని దంపతులు గుండెలు బాదుకుంటా గోసటిళ్లిన దృశ్యం మానవ గుండె తడిని తడిమింది. ‘సర్ నిలబడ్డ చోటు నుంచి జారిపోతున్నం’ అని ఓ తల్లి దీనత్వానికి హరీశ్‌రావే వలవల ఏడ్చిండు. ఒక్క మూసీ నది కాదు.. ముప్పేట సర్కారు బుల్డోజర్లు జనం మీద పడుతుంటే పేద, మధ్యతరగతి కుటుంబాలు కకావికలమైపోతున్నయి.
ఇది ఊహించని ఆపదైతే కాదు. ఎన్నికలకు ముందే కేసీఆర్ పసిగట్టి చెప్పిండు. లోకం పోకడను గమనించే..! ‘మనం చెదిరిపోయిననాడు మళ్లీ పాత తెలంగాణ వస్తది. బతుకులు ఆగమైతయి. మోసపోతే గోసపడుతం. చెప్పటం నా బాధ్యత. ఒక్కసారి దెబ్బతింటే..! ఉన్న కూర్పు చెడిపోతే తెలంగాణ సమాజానికి మంచిది కాదు’ అని కేసీఆర్ మా జిల్లా కేంద్రం సూర్యాపేట సభలో వ్యథభరిత స్వరంతో చెప్పిండు. అసుంటపోయి ఖమ్మం సభల చెప్పిండు. అదేమాట పాలమూరు, ఇందూరుల చెప్పిండు. కానీ, మన చెవికెక్కలేదు. ఆ సందర్భంలో తెలంగాణ ఆగమైపోతదేమో..! అనే బాధే కానీ.. తన మదిన రాజ్యకాంక్ష ఇసుమంతైనా లేదు.
రాజకూటం మీద యావే ఉంటే.. వీళ్లను జూట కొట్టడం పెద్ద పనే కాదు. కానీ, ఆయన మహాభారతం, రామాయణ ఇతిహాసాలను ఔపోసన పట్టిన నిర్వికారుడు. విలువల వైరుధ్యాలను, నైతిక సంఘర్షణను రాజకీయ ప్రయోజనాలకు ఆపాదించటాన్ని నిర్ద్వంద్వంగా తృణీకరించిన నిరాకారి. భవిష్యత్తు నిర్ణయాన్ని జనానికే వదిలేశారు. కానీ, మనం జూట మెరుపులకే తల వంచినం. కేసీఆర్ మీద ఎందుకంత కోపం వచ్చిందని అడిగితే..! ‘సద్ది తిన్న కాడ రేవు తల్వమా… తిన్నోళ్లము చెప్పమా.. సారు మీద మాకెక్కడిది. కేసీఆర్ పాలనుండగ సంసారం పాలు పొంగినట్టు ఉండే. కానీ ‘నేను అంతిత్త.. ఇంతిత్త’ అని శని మీద పడ్డట్టే మీది మీదికొచ్చే అన్నది కల్వకుర్తి మధునవ్వ. మానవ స్వభావమే లోభం ద్వేషంల సంగమం. దాన్ని పెంచి పోషించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ.
ఆ కర్మ ఫలమే ఈ కాంగ్రెస్ పాలన. మన తలరాతను మనమే తిరగరాసుకోవాలి గాని, ఆత్మహత్య చేసుకోవటం పరిష్కారం కాదు. తన బిడ్డల ఇంటిని ‘హైడ్రా’ భూతం కబళిస్తుందనే భయంతో బుచ్చమ్మ అనే తల్లి ఉసురు తీసుకున్నది. ఆమెను చూసి ఇంకొకరు ఆ ప్రయత్నం చేయవద్దు. ఇప్పుడు దొంగ పొద్దు కాలమే నడుస్తున్నది. కానీ, మనకు రాజ్యహింస కొత్త కాదు.. కొట్లాడటం కొత్త కాదు. రజాకార్ల కండ్లళ్ల కారం కొట్టి రాజ్యం తెచ్చుకున్నవాళ్లం. సోనియాగాంధీ మెడలు వంచి తెలంగాణను గుంజుకున్నవాళ్లం. ఈ హైడ్రాలు, అమీబాలు మనకు లెక్కే కాదు. మొన్న హరీశ్‌రావు రాల్చిన కన్నీటి చుక్కలకే సర్కారు కూసాలు కదిలినయి. రజాకార్లు ఊళ్ల మీద పడ్డనాడు గుత్ప సంఘం పుట్టింది. దొంగలు ఊళ్ల మీద తెగబడ్డ రోజుల్లో తెగుబాటు ఊరును కాపాడుకున్నది.
కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు యువజన సంఘం, మహిళా సంఘం, కూలీ సంఘం,కులసంఘం పురుడు పోసుకున్నయి. మళ్లీ జనం సంఘటితం కావాలి. ప్రజా ఉద్యమాలకు ఊపిరిపోయాలి. దండు కడితే నేనే ముందుంటనని హరీశ్‌రావు మాటిచ్చిండు.
ఈ సందిట్లనే మళ్లీ గోతి కాడి నక్కల కూత మొదలైంది. కేసీఆర్ ఏడీ.. ఏడీ అని వగలు పోతున్నరు. అవన్నీ ఢిల్లీ ప్రేరిత గుంట నక్కల ఊలలే. కేసీఆర్‌ది అప్పుడైనా, ఇప్పుడైనా శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణకు కృష్ణావతారమే. జనానికి తన అవసరం ఉంటేనే ప్రత్యక్ష ఉద్యమంలోకి వస్తారు. ఇక కంఠం తెగినా వెన్ను చూపడు. కడదాకా నిలబడుతాడు. గాలి రాజకీయాలు.. చిల్లర ఎత్తులు వేసే నేత కాదు. మదింపు లేనిదే ఏ పని చేయడు. వ్యూహాలను నిర్ణయించటం, వాటిని మదించటం.. వాంచిత ఫలితాలను నిష్కర్షగా అమలుచేయటం ఆయన నైజం. జనం గోస ఆయనకెప్పుడో సుతిముట్టింది. ఆయన మనసిప్పుడు వాయుగుండం ఏర్పడ్డ సముద్రం. వేయి ఆలోచనల ఘర్షణ సంగమం. ఒక్క హైడ్రా కాదు, పిశాచ పాలకుల జేజమ్మ దిగివచ్చినా పేదింటిని ముట్టుకోలేనంత పక్కా వ్యూ హంతో ప్రజల మధ్య నిలబడుతడు. అప్పటిదాకా మన ప్రయత్నం మనం చేద్దాం. సకలజనులం సంఘటితమై కొట్లాడుదాం.
-వర్ధెల్లి వెంకటేశ్వర్లు