నెర్రెలు బారిన బీళ్లతో, నీళ్లు లేక ఎండిన చేన్లతో, నీరింకిన బోర్లతో, కాలిన మోటరు కరెంటు కష్టాలతో కాంగ్రెస్ పాలనలోని నాటి తెలంగాణ తల్లడిల్లింది. సీఎం కేసీఆర్ వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తున్నారు. రైతు కేంద్రంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా పాలన సాగుతున్నది. ముఖ్యంగా తెలంగాణలో 95 శాతం ఉన్న సన్న, చిన్నకారు రైతులకు సాగునీరు, 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు భరోసా కల్పిస్తున్నాయి. రైతు ఆత్మగౌరవంతో బతికే పరిస్థితిని కేసీఆర్ కల్పించారు. అందుకే తెలంగాణ నేడు దేశానికి మాడల్‌గా కీర్తించబడుతున్నది.
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రత్యామ్నాయ తెలంగాణ అభివృద్ధి అజెండాతో కాకుండా, కుల అజెండాతో, రైతు వ్యతిరేక విధానాలతో ముం దుకు వస్తున్నారు. అందులో భాగంగానే రేవంత్‌రెడ్డి అమెరికాలో సన్న, చిన్నకారు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఉచితాలు అనుచితమనే తన అంతరంగాన్ని బహిర్గతం చేశాడు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానంగానే పరిగణించాలి. రేవంత్‌రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం కాదన్నది ఆ పార్టీ అధికార ప్రతినిధులు స్పష్టం చేశారు. సోనియా గాంధీ కూడా ఉచిత కరెంటుకు వ్యతిరేకమని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. ఉచితాలు, పేదల సంక్షేమం పేరుతో జరిగే ఖర్చు దేశ ఆర్థికవ్యవస్థకు తీరని భారమని, దేశాభివృద్ధికి అది నష్టం చేస్తుందని ప్రధాని మోదీ పదే పదే చెప్తున్నాడు. అదే విషయాన్ని రేవంత్‌రెడ్డి కూడా వల్లె వేస్తున్నాడు. దీన్నిబట్టి ప్రజా సంక్షేమం విషయంలో కాంగ్రెస్, బీజేపీల వైఖరి ఒకటేనన్నది సుస్పష్టం.
దేశాన్ని ఎక్కువకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ, రైతాంగానికి ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులకు చేసిందేం లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఏం చేస్తున్నదో ప్రజలకు చెప్పాలి. రాజ్యాంగంలో పేర్కొన్న సామ్యవాద సంక్షేమరాజ్య భావనకు కాంగ్రెస్ ఎప్పుడో తిలోదకాలిచ్చింది. గ్రామ స్వరాజ్యం, జై జవాన్-
జై కిసాన్, రైతేరాజు, గరీభీ హటావో అంటూ నినాదాలకే పరిమితమైంది. దళిత, గిరిజన, ఆదివాసీ, మైనారిటీల సాధికారత అని చెప్పడం తప్ప వారికి చేసిందేం లేదు. భవిష్యత్తులోనూ చేస్తుందన్న గ్యారంటీ లేదు.
కాంగ్రెస్ గ్రామీణ భారతాన్ని, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మౌలిక సదుపాయాలైన సాగునీరు, తాగునీరు, నిరంతర విద్యుత్తు కల్పించలేకపోయింది. దీనివల్ల గ్రామీణ ఆర్థికవ్యవస్థ సంక్షోభంలోకి నెట్టబడింది. ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులు ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లి కూలీలుగా మారి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం ఫలితంగా గ్లోబలైజేషన్, లిబరలైజేషన్లో భాగంగా తీసుకువచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలతో జరిగిన అభివృద్ధిలో రైతులు భాగస్వాములు కాలేకపోయారు. సమగ్ర, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి జరుగకపోవడం వల్ల దేశం అత్యంత పేదలు, అత్యంత ధనవంతులుగా విడిపోయింది. కరోనా కాలంలో కోట్లాది మం ది వలస కూలీలు, పేదలు ‘అన్నమో రామచంద్రా’ అం టూ నడిచినప్పుడే ఈ దేశాభివృద్ధి డొల్లతనం బయటపడింది. ఈ పాపంలో సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌కు భాగస్వామ్యం లేదా!
కాంగ్రెస్ పార్టీ చేతకానితనంతో వ్యవసాయరంగాన్ని కుదేలు చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టింది. తెలంగాణకు చరిత్ర పొడవునా తీవ్ర ద్రోహం చేసిన పాపం కాంగ్రెస్‌దే. అధికారమే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్ల వేటలో తెలంగాణను ఒక ప్రయోగశాలగా మార్చింది. ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ స్టేట్‌ను ఫజల్ అలీ కమిషన్ నివేదికకు విరుద్ధంగా విశాలాంధ్ర పేరిట రాజకీయాలకు తెరలేపి తెలంగాణకు తీవ్ర అన్యా యం చేసింది. పెద్దమనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కి తెలంగాణ హక్కులను ఆంధ్ర పాలకులు కాలరాస్తుంటే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు చోద్యం చూస్తూ కూర్చున్నారు. దీనికి నిరసనగా 1969-70లో విద్యార్థులు, టీఎన్జీవోలు ఉద్యమిస్తే 369 మంది విద్యార్థి యువకులను పొట్టనబెట్టుకున్నది. నాడు తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని ఇందిరకు రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆకాంక్షను తెలిపే లేఖ ఇవ్వడానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులను కాంగ్రెస్ సీఎం బ్రహ్మానందరెడ్డి కాల్చిచంపింది నిజం కాదా?
తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు గెలిచిన 11 మంది తెలంగాణ ప్రజా సమితి ఎంపీలను ప్రలోభ పెట్టింది నిజం కాదా? వారిని కాంగ్రెస్‌లో కలుపుకొని తెలంగాణ వాదాన్ని లేకుండా చేయాలని కుట్ర పన్నింది నిజం కాదా? అఖిలపక్ష ఒప్పందం, అష్టసూత్ర, పంచసూత్ర పథకాలతో తెలంగాణ ప్రజలను
ఏమార్చింది వాస్తవం కాదా!
1973లో జరిగిన ‘జై ఆంధ్ర’ అనే కల్పిత ఉద్యమానికి భయపడి ఆంధ్ర నాయకత్వానికి లొంగిపోయింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆరు సూత్రాల పథకం పేరుతో ముల్కి నిబంధనలను రద్దు చేసి తెలంగాణ ప్రజల నోటికాడి బువ్వను గుంజుకున్నది వాస్తవం కాదా! నిన్న గాక మొన్న మలిదశ తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలమీద, ఉద్యమకారులమీద, విద్యార్థులపైన ఎన్ని నిర్భంధాలను విధించిందో చూడలేదా? ఉద్యమకారులను లాఠీలు ,భాష్పవాయుగోళాలతో హింసించింది మరిచిపోయారా? నాటి ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా ఉన్న నాపై 180 కేసులుపెట్టి 6 నెలల జైలుకు పంపింది కా్రంగెస్ కాదా? కాగ్రెస్ పెద్దల తప్పుడు నిర్ణయాల వల్ల శ్రీకాంతాచారి వంటి ఎంతోమంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నది నిజం కాదా? మీ పాలనలో తెలంగాణ అస్తిత్వానికి, అభివృద్ధికి ఏ మాత్రం కృషి చేయకుండా తెలంగాణ వనరులను తరలించుకుపోతున్న ఆంధ్రులకు హారతులు పట్టింది నిజం కాదా?
తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణ ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. తెలంగాణలో సమ్మిళిత సమగ్ర సమతుల్య అభివృద్ధి జరుగుతున్నది. ఈ సందర్భంలో తెలంగాణను బలహీనపర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతున్నది. ఉచితాలు వద్దని, ధరణిని రద్దు చేస్తామని, 24 గంటల కరెంట్ వద్దని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇటువంటి నాయకులకు కర్రుకాల్చి వాతపెట్టాల్సిందే. కాంగ్రెస్ పార్టీని శంకరగిరి మాన్యాలు పట్టించాల్సిందే…
-డి.రాజారాం యాదవ్
97051 31472