అన్నదాతలకు హస్తం పార్టీ ప్రభుత్వాలు చేసిన మోసాలను ఏకరువు పెట్టడమంటే ‘పేదరాశి పెద్దమ్మా, పెద్దమ్మ కొడకా..’ అన్నట్టు చాలా పొడవైన చరిత్రనే చెప్పుకోవాల్సి వస్తుందనే సత్యం అందరికీ తెలిసిందే. అదే చారిత్రక సంప్రదాయ ఒరవడిలో భాగంగానే, రేవంత్‌రెడ్డి సర్కార్ మంత్రి మండలి సుదీర్ఘ సమావేశంలో రైతు నెత్తిన చెయ్యెట్ల పెట్టాలో చర్చించి, నిర్ణయాలు వెల్లడించారు. విత్తనానికి వెన్నుపోటు ఎలా పొడవాలో లోతుగా చర్చోపచర్చలు చేసి, భరోసా బాగోతాన్ని రైతులకు వినిపించారు.
ప్రజలు ఏమనుకుంటారోననే బెరుకూ లేదు, చేసిన బాసలను బలిపీఠం ఎక్కించడానికి ఈ ప్రభుత్వానికి ఏ భావోద్వేగమూ అడ్డం రావడం లేదు. అసలే ఇది కాంగ్రెస్ సర్కార్ కదా..! అందునా మోస పోవడానికి సిద్ధంగా ఉండే జనాలను, అబద్ధాలతో మోసగించడమే మా పని అని ఏనాడో కుండబద్దలు కొట్టినట్టు తెలియజేసిన రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం నుంచి ఏ మాట కట్టుబాటును కోరుకోగలమనీ..? అయితే ప్రభుత్వమే వ్యవసాయ రంగంలో కూడా విష ప్రయోగాలు మొదలు పెట్టడమే అందరికీ ఆవేదన కలిగిస్తున్నది. ఏడాదికి మునుపు రైతులకు ఎన్నో రంగుల కలలను చూపించిన కాంగ్రెస్ పార్టీ, నేడు పట్టపగలే వారితో చుక్కలు లెక్కపెట్టిస్తున్నది. ఏ రంగానికైనా సర్కార్ ఏమిస్తున్నదనే దానికంటే, వాటిపై ఏ దృక్పథంతో ఉన్నదనేదే దీర్ఘకాలికంగా ఆయా రంగాల్లో ఫలితాలను ప్రభావితం చేస్తుంది. వివిధ ప్రాధాన్య రంగాల్లో ఇచ్చిన హామీల అమలు పట్ల ప్రభుత్వాల చిత్తశుద్ధి, ఆయా రంగాల్లోని వారి ఆత్మ విశ్వాసంపై ప్రభావం చూపిస్తుంది.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో హామీల అమలుకు పిండ ప్రదానం చేస్తూ, ఇతరేతర పనులకు గల్లా పెట్టెను ఊపుతుండటమే అనేక సమస్యలకు కారణం అవుతున్నది. అందుకే, రైతు భరోసా కోతకు నిధుల కొరత కథ చెప్తున్న ప్రభుత్వం, మూసీ సుందరీకరణకు మాత్రం లక్ష కోట్ల పెట్టుబడికి కాలరెగరేస్తుండటమే సర్కార్ వక్రబుద్ధిని బట్టబయలు చేస్తున్నది. ఫార్మా క్లస్టర్ల పేరిట బలవంతపు భూ సేకరణకు వందల కోట్లు వెదజల్లేందుకు ఉవ్విళ్లూరుతున్న ప్రభుత్వం, పంటల పెట్టుబడికి పైసల లోటు స్టోరీ వినిపించడమే నీచ నైజానికి అద్దం పడుతున్నది. రైతులకు ఇచ్చిన హామీల అమలుకు చేతులు రాని ఈ ఇందిరమ్మ సర్కారే, ఫోర్త్ సిటీ పేరిట మాత్రం ఖర్చుకు కాలు దువ్వుతున్నది. ఈ చర్యల వెనుక అవగాహన లోపముందనడానికి సిక్ట్సీ ఇయర్స్ ఇండస్ట్రీ హిస్టరీ చెప్పే కాంగ్రెస్ సర్కార్‌ను అనడానికి ఆస్కారమే లేదు. అర్థం చేసుకోగలిగితే, ఆ పార్టీ చరిత్రలోనే వంచనత్వం ఇమిడిపోయి ఉన్నదనే తత్వం అందరికీ బోధపడుతుంది.
ఆ విద్రోహపు ఒరవడిలోనే మొన్నటి మంత్రి మండలి సమావేశానంతరం ముఖ్యమంత్రి అలవోకగా రైతు భరోసాపై తాజా ప్రకటన చేశారు. గాంధీ కుటుంబం, ఏఐసీసీ వ్యవహారంపై పూర్తిగా అవగాహన పెంచుకున్న రేవంత్‌రెడ్డికి, తన తప్పులెన్నే సుగుణం పార్టీ పెద్దలకు ఏ కోశానా
ఉండదని తెలిసిపోయింది. రాహుల్‌గాంధీ రాజ్యాంగం, రైతుల జపం కేవలం పార్టీ పూర్వ ప్రచార శైలిలో అంతర్భాగమే కానీ, ఢిల్లీ పెద్దలకు కొత్త సంప్రదాయమేమీ అలవడలేదనే వాస్తవం రేవంత్ రెడ్డికి స్పష్టంగా తెలుసు.
పిలిచినప్పుడల్లా, కష్టం కలిగినప్పుడల్లా తోడు గా వచ్చి వాలిపోతానని ఏడాది కిందట నయా గాంధీ చేసిన భావోద్వేగ ప్రసంగం ఏరు దాటేందుకే కానీ, ఎన్నికల తర్వాత ఆచరించేందుకు రాహుల్‌గాంధీకి తీరికెక్కడిది? ప్రచారానికి, ప్రచారానికి మధ్య విహారంలో మునిగితేలే రాహుల్‌గాంధీకి తెలంగాణ రైతులకు జరుగుతున్న దగా చెవికెక్కనే ఎక్కదనే సంగతి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కు తెలుసు. రాష్ర్టాలను పార్టీ రాజకీయ అవసరాలకు ఆదరువుగా మాత్రమే చూసే కాంగ్రెస్ అధిష్ఠానానికి, ఆయా రాష్ర్టాల కాంగ్రెస్ సర్కార్లు ఏం వెలగబెట్టినా అడిగే ధైర్యం ఉంటుందని ఎలా ఆశించగలం..? అది తెలిసే, అడిగేవారెవ్వరూ పార్టీలో లేరనే, పాలనలో ప్రజా విశ్వాస ఘాతుకానికి సీఎం రేవంత్ రెడ్డి ఏ మాత్రం వెనకాడటం లేదు. ప్రభుత్వం తన విలువైన సమయాన్ని ఆశ్రి త జనాలతో పరాచికాలాడటానికో, పాలనను చదరంగపు క్రీడలో వలె ఎత్తులు, పై ఎత్తుల ప్ర యత్నాలకో వృథా చేసుకోవడం నిజంగా బాధాకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి రైతాంగం పరిస్థితి, వ్యవసాయరంగంలో సంక్షోభ స్థితి మది లో మెదిలితే, ఏ పాలకుడు ఇలా అన్నదాతలకు ఇచ్చిన హామీలపై పిల్లి మొగ్గలు వేయడు. విత్తులు నాటి, తాళేరుకోలేక, రాలిపోయే ఆ నాటి రైతాం గం దుస్థితి రేవంత్ సర్కార్‌కు కనీసం గుర్తుంటే కదా..? పొలాల్లో అడుగు పెట్టలేక, గ్రామాల్లో ఉండలేక తల్లడిల్లిన తెలంగాణ మదిలో మెదిలితేనే హృదయం ఉన్న ఎవరికైనా కళ్లు చెమర్చకుం డా ఉండవు. కానీ, సీఎం రేవంత్ మాత్రం సమైక్యాంధ్రలోనే అంతా బాగుండిందని అనగలుగుతున్నాడంటే, ఏ అవగాహన పుణికిపుచ్చుకొని ఏలుతున్నాడో సామాన్యులకూ అర్థమవుతుంది.
రాష్ట్ర ఏర్పాటుతోనే లేగదూడ తల్లి వైపు పరిగెత్తినట్టు, కేసీఆర్ ప్రభుత్వం సాగు రంగం వైపు పరుగులు పెట్టడం వెనుక ఎంత తండ్లాట ఉన్నదో కాంగ్రెస్ సర్కార్‌కు వెయ్యి జన్మలెత్తినా అర్థం కాదు. రైతుబంధు, రైతు బీమా లాంటి చారిత్రక రైతు సంక్షేమ పథకాల అమలు వెనుక పొలాలపై ఏ ఒక్క రైతు కన్నీటి చుక్క రాలిపడరాదనే మానవీయ దృక్పథం దాగి ఉన్నది.
పండేది, పండనిది, ఏ పంట వేసేది, వేసింది, లేనిది లెక్కలు తీసి, రైతులకు నానా పరీక్షలు పెట్టి పైసలు సహాయం చేసే దుర్మార్గపు దాటవేత ధోరణితో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు వ్యవహరించి ఉంటే, నేటికీ తెలంగాణ రైతాంగానికి, పొలాల్లో పరిగలేరుకునే పరిస్థితే ఉండేది. కానీ తలాతోక లేని ఆలోచనలతో పరిపాలన సాగిస్తున్న హస్తం సర్కార్, లెక్కల్లో రైతులనూ తూకమేసుకొని బేరీజు వేసుకుంటున్నది. దానివల్లనే రెండు పంటలకు రైతు భరోసాను ఎగ్గొట్టి, ఏడాది గడిచాక తీరిగ్గా కోతల స్కీమ్‌ను ముందు పెట్టింది.
భూ యజమానులు, కౌలు రైతులకు ఎకరానికి తలా రూ.15 వేలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు అధికారంలోకి రాగానే అకౌంట్లలో జమ చేస్తామని నమ్మించి, తీరా నేడు రైతాంగాన్ని నోటితో చెప్పి నొసటితో కాంగ్రెస్ పాలకులు వెక్కిరించారు. ఇస్తామని ప్రకటించిన రూ.12 వేలు సైతం ఖాతాల్లో పడేదెన్నడో, అసలు పడుతుందో లేదో, పడినా ఎన్నాళ్లు పడుతుందో, ఎంతమంది రైతులకు పడుతుందో అర్థం కాని గందరగోళం అందరిలో ఏర్పడిపోయింది. ఇంతలా రైతులను సంకటస్థితిలోకి, సీతమ్మను అగ్గిలో దూకి పాతివ్రత్యం నిరూపించుకోమని అడిగినట్టు, రైతులకు పంట డిక్లరేషన్లు ఇవ్వమనే ఆంక్షలు ప్రభుత్వం పెట్టడం ఎవ్వరికైనా ఆవేదన కలిగించకమానదు.
గత కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాల అమల్లోనే కాదు, రైతుల కోసం వందేండ్ల ముందు చూపుతో అడుగులు వేసింది. సాగురంగం ఎలాంటి పరీక్షలెదురవ్వని పరిస్థితిని రాష్ట్రంలో స్థిరీకరించేదుకు మిషన్ కాకతీయతో పాటు, సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసింది. గతంలో గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ఆధారంగా 75 శాతం విశ్వసనీయత కలిగిన నికర జలాల్లో తెలంగాణకు 969 టీఎంసీలను కేటాయించినా, ఏనాడూ కనీసం 400 టీఎంసీలనూ వాడుకున్నదే లేదు. కానీ, కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం, సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్లను నిర్మించి శాశ్వతంగా గోదావరి జలాల గరిష్ఠ వినియోగానికి చర్యలు చేపట్టింది. ఇవేకాక గోదావరి బేసిన్లో ఉన్న అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను సంపూర్ణంగా వినియోగించడానికి కృషిచేసింది. కృష్ణా పరీవాహక ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడంతో పాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం ద్వారా కృష్ణా నదిలో న్యాయమైన నీటి కేటాయింపుల సంపూర్ణ వినియోగానికి కేసీఆర్ సర్కార్ శ్రమించింది.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలకు కాళేశ్వరం, అసమర్థతకు పాలమూరు ఎత్తిపోతల బలైపోతున్నాయి. నిర్మాణాత్మక పనులు వదిలేసి వివాదాల ను రాజేసి రోజులు వెళ్లదీస్తున్న సీఎం రేవంత్, పాలమూరు ప్రాజెక్టుకూ తన మామ జైపాల్‌రెడ్డి పేరున నామకరణం చేసి పిల్ల చేష్టల పనితీరును కొనసాగిస్తున్నాడు. ఆ మాటకొస్తే రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ సర్కార్లది నోట్లో బెల్లం కడుపులో కత్తుల తీరు అనేది చారిత్రక వాస్తవం. 2014కు ముందటి కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్లు కూడా రైతుల పట్ల రేవంత్‌రెడ్డి తీరునే కనబరిచాయి. రైతు డిక్లరేషన్ లాగానే ఆర్భాటంగా డాక్టర్ స్వామినాథన్ కమిషన్‌ను కేంద్రం, డాక్టర్ జయతీఘోష్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసి, వాటి నివేదికలను నీళ్ల పాలు చేసేశారు. ఇవేకాదు కోనేరు రంగారావు భూ కమిటీ, ఆత్మహత్యలపై జస్టిస్ రాం చెన్నారెడ్డి కమిషన్ ఇలా ఎన్నో నియమించి, తర్వాత నట్టేట ముంచేశా రు. ఇందిరా గాంధీ నుంచి రేవంత్‌రెడ్డి హయాం దాకా, కాంగ్రెస్ సర్కార్లే రైతుల పాలిట యమపాశా లు. ఈ రైతు వ్యతిరేక విధానాల నుంచి దృష్టి మళ్లించేందుకు, నడిబజారులో రేవంత్ రెడ్డి సర్కార్‌ను దోషిగా నిలబెడుతున్న కేటీఆర్‌ను అడ్డుకునేందుకు ఏసీబీ విచారణ డ్రామా నడిపిస్తున్నారు. కనీస న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కేటీఆర్‌తో పాటు న్యాయవాదిని కూడా అనుమతించని కాంగ్రెస్ కుసంస్కారం హేయాతిహే యం. ఎన్ని విన్యాసాలు ప్రదర్శించినా వలువ లు విప్పేసిన కాంగ్రెస్ సర్కార్ విద్రోహం బట్టబయలైపోయింది.
(వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
-డాక్టర్ ఆంజనేయ గౌడ్