బడాయిల బచ్చిగానికి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు చూస్తుంటే ’బడాయిల బచ్చుగానికి ఏడు దొడ్లు.. మూడు ఎడ్లు’ అన్నట్టుగా ఉన్నది. రాష్ట్రంలో పాలన ముచ్చట ఎట్లున్నా, రికార్డులు బ్రేక్ చేయడంలో మాత్రం సీఎంకు సాటిరారు. ఢిల్లీకి 75 పర్యటనలు పూర్తి చేసుకొని సెంచరీ దిశగా దూసుకుపోతున్నడు. ఇన్నిసార్లు దిల్లీకి పోయి ఏం తెచ్చిండ్రో ఏమో గానీ, చిల్లర పైస అదనంగా తెచ్చిన పాపాన పోలేదు. పోయిన ప్రతీసారీ హడావుడే తప్ప హస్తిన నుంచి ఒరిగిందేమీ లేదు. ఏటా విదేశాలకు పోవడం, బిజినెస్ మీట్లు అనడం.. అక్కడికి పోయాక ఎవరితో ఏం మాట్లాడుతున్నరో, ఏ కంపెనీలు రాష్ర్టానికి వచ్చాయో మంత్రులకు కూడా అర్థమైతున్నదో లేదో!
తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ 2024లో 17 రోజులు అమెరికాలో తిరిగి ఒక రికార్డు కొట్టిండ్రు. ఆ రికార్డ్ రేవంత్‌రెడ్డిని ఆకర్షించినట్టు కనబడుతున్నది. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 10 వరకు 25 రోజులపాటు అమెరికా, బ్రిటన్, జర్మనీ, చైనాను చుట్టేసి వస్తారట. పెట్టుబడుల సంగతి దేవుడెరుగు, తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముతో గ్లోబల్ టూర్లు ఎవరికోసం? దేనికోసం? అని సామాన్యులు బుర్ర గోక్కుంటున్నారు. విదేశీ గడ్డపై సీఎం’షికార్లు’ చూసి కేంద్రమంత్రులు సైతం అవాక్కవుతున్నారట! ఏదేమైనా రికార్డులు కొట్టడంలో సీఎం ఉత్సాహం చూపుతున్నారు గానీ, ఇవేమీ పనికొచ్చే రికార్డులు కాదు కదా!
సాగుపై సోయి లేని సర్కార్

రాష్ట్ర ప్రభుత్వానికి సాగునీళ్ల మీద సోయి ఎప్పుడొస్తదో. రైతన్నల ప్రాణాలు గొంతులోకొస్తే తప్ప నేతలు కుర్చీల నుంచి కదలట్లేదు. కాంగ్రెస్ పాలకుల బెదిరింపులు, హెచ్చరికలతో అన్నదాతల వరి సాగు చేయడానికి దిగులు పడ్డారు. దంచికొట్టిన వర్షాలతో గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులు నిండుతుంటే చూడముచ్చటగా ఉన్నది. మరి నదులు పారుతున్నప్పుడు మోటార్లు ఆన్ చేసి చెరువులు, కుంటలు నింపాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? కానీ సర్కార్ మొద్దునిద్ర వీడటంలేదు, మోటార్లు స్టార్ట్ చేయడంలేదు. కాళేశ్వరం, దేవాదుల దగ్గరి నుంచి కృష్ణా బేసిన్‌లోని భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల దాకా ఏ ఒక్క పంప్ హౌస్‌లోనూ మోటార్లు ఆన్ కాలేదు. నదులు పారుతుంటే నీళ్లు పారించుకునే బుద్ధి లేక, సోయి మరిచి కునుకు తీసింది.
బీఆర్ఎస్ పార్టీ గట్టిగా హెచ్చరిస్తేనే తప్ప ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం కాలేదు. నదులు పారుతుంటే ఎత్తిపోసి చెరువులు నింపకపోతే ఊరుకునేది లేదని, ఈ నెల 11న కేటీఆర్ ఆధ్వర్యంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పరిధిలోని నార్లాపూర్ ముట్టడిస్తామని బీఆర్ఎస్ అల్టిమేటం జారీ చేసింది. అంతే! ఎక్కడ కేటీఆర్ వస్తారో, ముట్టడి ఏందో అని సర్కార్ వెన్నులో వణుకు పుట్టింది. గంటల వ్యవధిలోనే కేఎల్ఐ పరిధిలోని ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి పంప్‌హౌస్‌లలో మోటార్లు గర్జిస్తూ నీళ్లు ఎత్తిపోయడం మొదలుపెట్టారు. ప్రజల తరఫున నిలదీసేటోళ్లు ఉంటేనే గానీ ఈ మొద్దునిద్ర పాలనలో మోటార్లు తిరుగవని మరోసారి రుజువైంది!
డిజిటల్ కబుర్లు.. దొంగదారి బాదుడు!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏమంటున్నారంటే… ’సాధారణ యూపీఐ యూజర్లకు ఎలాంటి ఛార్జీలు లేవు భయ్యా.. అదంతా కేవలం వ్యాపారాలకే వర్తిస్తాయి’ అని కవర్ చేస్తున్నారు. అసలు మర్మమంతా ఇక్కడే ఉన్నది! ఆ అదనపు ఛార్జీల భారం ఆఖరికి ఎవరి నెత్తి మీద పడుతదో తెలియదా?! ఇప్పటికే డెబిట్, క్రెడిట్ కార్డుల గోల భరించలేక జనం అల్లాడిపోతుండ్రు. వీసా, మాస్టర్ కార్డ్ లాంటి అంతర్జాతీయ కంపెనీల బాదుడు తట్టుకోలేక షాపుల వాళ్లు ముందే బోర్డులు పెడుతున్నారు. ’కార్డు ఇస్తే ఒక రేటు.. క్యాష్ ఇస్తే ఇంకో రేటు’ అని మొఖం మీదే తేల్చిచెప్తున్నారు. ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితిని బీజేపీ సర్కార్ యూపీఐ మీదకు కూడా తెస్తున్నది! అంటే డిజిటల్ లావాదేవీకి అదనపు ట్యాక్స్ పడితే, ఆ పైసలు దుకాణదారుడి సొంత జేబులోంచి కడ్తడా? కస్టమర్ నుంచే కదా వసూలు చేస్తడు.
’దేశంలో దొంగ నోట్లు పోవాలి, నల్లధనం అంతం కావాలి, అందుకే డిజిటల్ ఇండియా తెచ్చాం’ అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. ఇప్పుడేమో వింత నిర్ణయాలతో జనాల జేబులకు చిల్లులు పెడుతున్నారు. డిజిటల్ ఇండియా అంటే కేవలం ఉత్త మాటలేనా? డొల్ల కబుర్లేనా? అని సామాన్యులు అడుగుతున్నారు.
నలభై కోట్ల ఆస్తి.. సొంతిల్లు లేదు !

మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గ ఓటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిండ్రు. సారుకు సొంత ఇల్లే లేదట! అందుకే వచ్చే ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా గెలిపిస్తామంటేనే బరిలోకి దిగుతాడట. ఇదేంటి ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన లెక్క ప్రకారమే రూ.40 కోట్ల ఆస్తి కలిగి ఉన్న వెంకటరెడ్డికి సొంత ఇల్లు లేకపోవుడేందో అని రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటుండ్రు.
సారు పేరు మీద ఇండ్లు లేవు కానీ, వాళ్ల శ్రీమతి పేరిట హైదరాబాద్‌లో ఇండ్లు, ప్లాట్లు, ఎకరాల కొద్దీ వ్యవసాయ పొలం, లగ్జరీ కార్లు.. అన్నీ కలిపి కేవలం నలభై కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయట! పాపం, ఆ మాత్రం ఆస్తులతో ఆ కుటుంబం ఎట్లా నెట్టుకొస్తుందో ఆ దేవుడికే తెలియాలి! ఆస్తులు కేవలం నలభై కోట్లే ఉన్నాయని తెలిసి జనం జాలిపడి ఏడవాలా, లేక ఆశ్చర్యపోయి నోరెళ్లబెట్టాలా అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. మరి ప్రజలేం చేస్తారో చూడాలి. ఇల్లే లేని మీరు మా కోసం ఇంత కష్టపడటం ఎందుకు? అని ఇంటికి సాగనంపుతారా? కాలమే నిర్ణయించాలి!
-దాము నర్మాల