తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 చిరస్మరణీయమైన రోజు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను, పోరాటాన్ని దేశం దృష్టికి తీసుకువెళ్లిన రోజు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అని కేసీఆర్ సింహగర్జన చేసి ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్న రోజు. ‘ఈ బక్కోడితే ఏమైద్దిలే’ అంటూ హేళన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతల మెడలు వంచిన రోజు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ 2009, నవంబర్ 29వ తేదీన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేట దగ్గర రంగధాంపల్లిలో ఏర్పాటుచేసిన దీక్షాస్థలం వద్దకు బయల్దేరిన కేసీఆర్ వాహనాన్ని నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలోనే అడ్డుకొని, ఆయన దీక్ష చేయకుండా కుట్ర పన్నింది.
కరీంనగర్ మానేరు బ్రిడ్జి సమీపంలోని అల్గునూరు చౌరస్తాలో పోలీసు బలగాలు, రిజర్వ్ పోలీస్ బెటాలియన్లు కేసీఆర్ వాహనాన్ని చుట్టుముట్టాయి. ఆయనను బలవంతంగా వాహనం నుంచి దింపేశారు. కాంగ్రెస్ కుట్ర మనస్తత్వాన్ని ముందే గుర్తెరిగిన కేసీఆర్ అక్కడే రోడ్డు మీదే ధర్నాకు దిగారు. దీంతో, ఆయనను పోలీసులు ఖమ్మం జైలుకు తరలించారు. ఉక్కు సంకల్పం ఉన్న కేసీఆర్ అక్కడ జైలులోనే ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇక్కడ పోలీసులు(కాంగ్రెస్ ప్రభుత్వం) కేసీఆర్‌ను ఖమ్మం తరలించడంలోనూ కుట్ర ఉన్నది. ఖమ్మం ఆంధ్ర ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో అక్కడ తెలంగాణ సెంటిమెంట్ తక్కువగా ఉంటుందని వారు భావించారు. అయితే, వారి కుట్రను తెలంగాణ ప్రజలు బద్దలు కొట్టారు. కేసీఆర్ అరెస్టుతో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి కాంగ్రెస్ ఎంతకైనా తెగించవచ్చన్న అనుమానంతో డిసెంబర్ 1న కేసీఆర్ ‘నేను లేకున్నా ఉద్యమం నడవాలి’ అని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. దీన్నిబట్టి కేసీఆర్ సంకల్పం ఎంత గట్టిదో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ దీక్షతో రాష్ట్రంలో ఆందోళనలు ఉధృతమవుతున్న వేళ డిసెంబర్ 2న బీజేపీ నేత అద్వానీ పార్లమెంట్లో కేసీఆర్ దీక్ష గురించి ప్రస్తావించారు. మరోవైపు, కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబర్ 3న ఆయనను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఈ పరిస్థితుల్లోనూ కేసీఆర్ తన ప్రాణాల గురించి ఆలోచించలేదు. కుటుంబం గురించి ఆలోచించలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తన జీవన పరమావధిగా దీక్షను కొనసాగించారు.
‘తెలంగాణ వస్తే జైత్రయాత్ర.. లేకపోతే నా శవయాత్ర’ అని ఆస్పత్రి బెడ్ మీది నుంచే ప్రకటించారు. డిసెంబర్ 4న కేసీఆర్‌ను ఐసీయూకు తరలించారు. ఆయన కోమాలోకి పోయే ప్రమాదం ఉన్నదని వైద్యులు హెచ్చరించారు. అయినా, కేసీఆర్ వెరవలేదు చావుకు భయపడి వెనుకడుగు వేయలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన దీక్ష, తెలంగాణ ప్రజల ఆందోళనలు కొనసాగుతాయని తేల్చిచెప్పారు. డిసెంబర్ 5న వెంకటస్వామి, చిరంజీవి లాంటి కాంగ్రెస్ ఎంపీలు, టీడీపీ అధినేత చంద్రబాబు కేసీఆర్‌ను కలిసి, దీక్ష విరమించాలని, ప్రాణాలకు ముప్పు ఉన్నదని వారించినా కేసీఆర్ సంకల్పం చెదరలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టే వరకు తన దీక్ష ఆగదని స్పష్టం చేశారు.
అలాంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల గురించి కాక, రాజకీయ లబ్ధి పైనే దృష్టి పెట్టింది. ప్రత్యేక తెలంగాణపై రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం పెడతామని, కేసీఆర్‌పై ఉన్న కేసులను ఎత్తివేస్తామని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేసింది. కానీ, కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. పార్లమెంట్లో బిల్లు పెట్టేవరకు తన పోరాటం ఆగదన్నారు. మరోవైపు, కేసీఆర్ ఆరోగ్యం మరింత క్షీణిస్తోందన్న వార్తలతో తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకాయి. ఎక్కడ చూసినా తెలంగాణ నినాదమే వినిపించింది. బంద్‌లతో బస్సులు, రైళ్లు స్తంభించిపోయాయి. లాయర్లు, ఇంజినీర్లు, మేధావులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇలా నాలుగున్నర కోట్ల మంది ఒక్కటయ్యారు. ‘మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి’ అని రోడ్ల మీదికి వచ్చి గొంతెత్తి నినదించారు. తెలంగాణ ప్రాంతం రణరంగంగా మారింది.
డిసెంబర్ 7న అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ నుంచి ఉన్న అన్ని పార్టీల రాజకీయ నాయకులు తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ప్రకటించారు. మరోవైపు, డిసెంబర్ 8న కేసీఆర్ మరణం అంచుల్లోకి వెళ్లారు. ఇక తమ చేతుల్లో ఏమీ లేదని వైద్యులు ప్రకటించారు. తెలంగాణ సమాజంలో ఆందోళన మొదలైంది. కేసీఆర్‌కు ఏమైనా జరిగితే రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌దే బాధ్యత అని తెలంగాణ సమాజం ఉగ్రరూపం దాల్చింది. ఈ ప్రాంతం అగ్నిగుండమైంది. తప్పని పరిస్థితుల్లో అప్పటి కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
డిసెంబర్ 9న ఒక్కరోజే కాంగ్రెస్ కోర్ కమిటీ 5 సార్లు సమావేశమైంది. సమావేశం మధ్యలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అప్పటి హోంమంత్రి చిదంబరం బయటకు వచ్చి జయశంకర్ సార్‌తో ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన ఎలా ఉండాలన్న దానిపై చర్చ జరిగింది. రాష్ట్ర ఏర్పాటుపై ఎలాంటి గందరగోళం లేకుండా స్పష్టమైన పదజాలం ఉండాల్సిందేనని జయశంకర్ సార్ చిదంబరానికి స్పష్టం చేశారు. ఆ తర్వాత చిదంబరం అదే రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుగురించి రాత్రి 11.30 గంటల సమయంలో ప్రకటించారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనికోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తారు’ అని ప్రకటించారు. ఉద్యమ సమయంలో విద్యార్థులు, ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ శాంతించారు. నిమ్స్ నుంచే ‘ఇది తెలంగాణ ప్రజల విజయం’ అని ప్రకటించారు. 11 రోజుల సుదీర్ఘ దీక్షతో తెలంగాణను ఏకం చేసిన కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాతనే తన దీక్షను విరమించారు.
– (వ్యాసకర్త: రాష్ట్ర శాసనమండలి సభ్యులు)
దాసోజు శ్రవణ్‌కుమార్