ఇంటింటికీ కేసీఆర్ ధీమా
బీఆర్ఎస్ అధ్యక్షుడు, గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో పూర్తిగా సంక్షేమ పథకాలతో నిండి ప్రజలకు వరాల జల్లు కురిపించింది.
ప్రజా సంక్షేమానికి కట్టుబడి చేసిన మంచి పనులే నాయకులను అందలం ఎక్కిస్తాయి. రాజకీయాల జోలికి పోకుండా అందరికీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలను అందించిన రాజనీతిజ్ఞులకే చరిత్ర బ్రహ్మరథం పడుతుంది. అలాంటి ప్రభుత్వాలే భవితకు దారి దీపాలవుతాయి. జాతికి ఆదర్శ పాఠాలుగా మిగులుతాయి. దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణకు అలాంటి నికార్సయిన దార్శనికత, నిబద్ధత కలిగిన నాయకత్వం ఉండటం వల్లే రాష్ట్ర ప్రగతి సాధ్యమైంది. అటువంటి నాయకత్వానికే ప్రజలు తమ విశ్వాసాన్ని ప్రకటిస్తారని అనేక సందర్భాల్లో రుజువైంది. ప్రస్తుతం ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోతో మరోసారి అధికార పార్టీకే ప్రజలు పట్టం కట్టనున్నారని స్పష్టమైంది.
బీఆర్ఎస్ అధ్యక్షుడు, గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో పూర్తిగా సంక్షేమ పథకాలతో నిండి ప్రజలకు వరాల జల్లు కురిపించింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలకు దీటుగా ఈ మ్యానిఫెస్టోను తీర్చిదిద్ది ప్రజల ముంగిట పెట్టినట్టు స్పష్టమవుతున్నది.
నేటి రాజకీయాల్లో ఎన్నికల ప్రణాళికలనేవి కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. అనేక రాష్ర్టాల్లో ఎన్నికల ప్రణాళికలను ప్రజలు, ఓటర్లు ఏమాత్రం సీరియస్గా ఆలోచించని నేపథ్యంలో తెలంగాణలో మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలు విడుదల చేస్తున్న మ్యానిఫెస్టోలపై ప్రజలు విస్తృతంగా చర్చిస్తున్నారు. ఆయా మ్యానిఫెస్టోలను పూర్తిగా ఆకళింపు చేసుకొని తులనాత్మక అధ్యయనం చేస్తున్నారు. ఈ విషయంలో మన విద్యావంతులు, మేధావులు, బుద్ధిజీవులు ముందుంటారనే విషయంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
మ్యానిఫెస్టోలతో ఓటర్లు మారుతారా? ఓట్లు పడతాయా? అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పలేము. కానీ తెలంగాణలో మ్యానిఫెస్టోలను చదివి వాటి సాధ్యాసాధ్యాలను పరిశీలించి, విశ్లేషించి, వివరించగల విషయ పరిజ్ఞానం తెలంగాణ ప్రజలకు ఉందనేది విస్మరించలేని ఆంశం.అందుకే టీఆర్ఎస్ పార్టీ 2014 మ్యానిఫెస్టోకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. అనేక మా మ్యానిఫెస్టోనే మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని సందర్భాల్లో స్పష్టం చేసింది. 2018 ఎన్నికల మ్యానిఫెస్టో, 2019 పార్లమెంట్ ఎన్నికల మ్యానిఫెస్టో, 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టోలను కూడా బీఆర్ఎస్ ప్రధాన ప్రచార అస్త్రంగా నిలబెట్టింది.
ఎన్నికల మ్యానిఫెస్టో కూర్పులో కేసీఆర్ తీసుకునే జాగ్రత్త, దాన్ని ప్రచారంలోకి తీసుకురావడంలో చూపించే ఆయన చతురత, అందులోని అంశాలను పార్టీ కార్యకర్తలకు, తద్వారా ప్రజలకు చేరవేసే నైపుణ్యత తెలంగాణలో మిగతా ఏ పార్టీలకు లేకపోవడం గులాబీ పార్టీకి
కలిసి వచ్చే అంశం.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 17న సోనియా, రాహుల్ గాంధీ సమక్షంలో విడుదల చేసిన ఆరు గ్యారెంటీల ప్రకటనకు దీటుగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను తీర్చిదిద్దారని నిస్సంకోచంగా చెప్పవచ్చు. గత తొమ్మిదిన్నరేండ్ల నుంచి కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి ఎన్ని విమర్శలు వస్తున్నా వాటి అమలు విషయంలో చూపిస్తున్న శ్రద్ధ పలువురి ప్రశంసలు పొందింది. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను విస్మయానికి గురిచేస్తుంది. రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్ లాంటి అనేక పథకాలను వివిధ రాష్ర్టాలు అధ్యయనం చేసి ఆచరింపజేసే పరిస్థితికి రావడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు అమలు చేస్తున్న పథకాలన్నింటిని మరింతగా విస్తరించి కొనసాగిస్తామని ప్రకటిస్తూనే ప్రజల ఆదరణ ఉన్న ఆ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేయడానికి కార్యాచరణను రూపొందించి, కొత్త ప్రజాకర్షక పథకాలను బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రకటించింది .
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ‘కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా’ అన్న పథకం రేపు ఇతర పార్టీలను ఆకర్షించక తప్పదు. ఎల్ఐసీ ద్వారా చేసే ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ కచ్చితంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించక తప్పనిపరిస్థితి. ఇది ఈ మ్యానిఫెస్టోకు హైలైట్గా నిలువబోతున్నది. ఈ ఒక్క పథకమే రేపు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి ప్రజలను మరోసారి కారు గుర్తు పై ఓటు వేసే విధంగా మార్చబోతుంది.
అదేవిధంగా రేషన్ కార్డు ఉన్నవారందరికీ సన్నబియ్యం, రూ.16 వేల వరకు రైతుబంధు పెంపు, పింఛన్లు రూ.5 వేలకు పెంపు, సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా అర్హులైన మహిళలకు రూ.3వేలు, ఇంటి స్థలం లేని పేదలకు ఇండ్ల స్థలాల కేటాయింపు, అర్హులైన పేద మహిళలకు రూ.400లకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ సహాయం రూ.15 లక్షల వరకు పెంపు, మైనారిటీ సంక్షేమ బడ్జెట్ పెంపు, గిరిజనేతరులకు పోడు భూములు, అర్హులైన జర్నలిస్టులకు రూ.400లకే సిలిండర్, అగ్రవర్ణ పేదలకు స్కూల్స్, మహిళా స్వశక్తి గ్రూపులకు సొంత భవనాలు వంటి పథకాలు కాంగ్రెస్, బీజేపీ హామీలకు దీటుగా నిలుస్తాయి.
ఉద్యమం కానీ, పాలన కానీ మాట ఇస్తే మడమతిప్పని నేతగా కేసీ ఆర్ అందరి మన్ననలు అందు కున్నారు. మ్యానిఫెస్టోల్లో ఇవ్వ ని హామీలను కూడా అమలు చేసిన ఘనత కేసీఆర్ది. ఈసారి ఎన్నికల్లోనూ ఆయన ప్రకటిం చిన మ్యానిఫెస్టోను నూటికి నూరుశాతం అమలు చేస్తారన్న విశ్వాసం ప్రజల్లో ఉన్నది. కేసీఆర్ ప్రకటించిన ఈ మ్యానిఫెస్టో కచ్చితంగా ప్రజాదరణకు నోచుకొని ఈసారి ‘మళ్లీ సారే..గెలిచేదికారే’ అన్న నినాదం నిజం కాబోతున్నది.
-కాలేరు రూపజ్యోతి
92902 33450
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

