తెలంగాణ రాష్ట్ర ఉద్యమ జెండాను మొదటగా ఎత్తుకున్న గడ్డ కామారెడ్డి. ఉద్యమ రథసారథి, సీఎం కేసీఆర్ ఆనాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కదం తొక్కిన సందర్భంలో కామారెడ్డినే మొదటగా జై కొట్టింది. తెలంగాణ ఉద్యమానికి ఓ రకంగా బలమైన వేదికగా కామారెడ్డి ఎప్పటికీ ప్రత్యేకమే. ఆనాడు తెలంగాణ ధూంధాం పేరిట మొదటి సభ జరిగింది కామారెడ్డిలోనే. నాడు ‘జై తెలంగాణ’ నినాదాలతో కామారెడ్డి గంజ్ ప్రాంతమంతా దద్దరిల్లడంతో పాటు ఉత్తర తెలంగాణలో తెలంగాణ నినాదం బలపడడానికి కారణమైందని చెప్పవచ్చు.
నిత్యం గులాబీని గుండెల్లో దాచుకొని ఉద్యమ నాయకుని వెంట నడిచింది. ఉద్యమ సారథి ఏ పిలుపునిచ్చినా, విజయవంతంగా అమలు చేసిన ఘనత కామారెడ్డి గడ్డది. ఉమ్మడి రాష్ట్రంలో కామారెడ్డి అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్నా నిర్లక్ష్యానికి గురైంది. ఆ నిర్లక్ష్యమే ఉద్యమ రథసారథి వెంట నడవడానికి కారణమైంది.
కామారెడ్డి ఏ1 గ్రేడ్ మున్సిపాలిటీగా ఉండడంతో పాటు, సారవంతమైన భూములను కలిగి ఉండటంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు అన్నపూర్ణగా పిలవబడింది. ఉమ్మడి రాష్ట్రంలోనే బెల్లం తయారీకి పెట్టింది పేరుగా తీపిని పంచిన గడ్డ కామారెడ్డి. అదిలాబాద్, కరీంనగర్, మెదక్ ప్రాంతాలకు మధ్యలో ఉన్న కామారెడ్డి వ్యాపార, వాణిజ్య సంస్థలకు ప్రధాన కేంద్రం. అయినప్పటికీ నాటి సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల కామారెడ్డి అభివృద్ధికి నోచుకోలేదు.
బెల్లంపై ఆంక్షలతో పాటు, పాలకుల కరెంటు ఆంక్షల వల్ల కామారెడ్డి ఎడారిగా మారిన దుస్థితులు నెలకొన్నాయి. దీంతో జీవనోపాధి కోసం ఉమ్మడి నిజామాబాద్ నుంచి గల్ఫ్ బాట పట్టిన దుర్భర స్థితిని కామారెడ్డి ఎదుర్కొన్నది. పొట్టకూటి కోసం ఎడారి దేశాలకు వలస వెళ్లి, శవాలై విగత జీవులుగా రావడం లాంటి అనేక ఘటనలు కామారెడ్డికి సర్వసాధారణమైంది. ఊర్లకు ఊర్లు ఖాళీ అయి, పిల్లలు లేని పల్లెలుగా ఆనాడు కామారెడ్డి ఆవేదనలను ఎదుర్కొన్నది. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలువెట్టింది మొదలు కామారెడ్డి గడ్డ సమైక్య పాలకులను ఎదురించడానికి మర్లపడుతూనే వచ్చింది. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు తావు లేకుండా చేసిన సమైక్య పాలకుల కుట్రలను తిప్పికొట్టడానికి కామారెడ్డి ఉద్యమ జెండాను గుండెలకు హత్తుకున్నది. తెలంగాణ సాధించే దాకా సమైక్యవాదులపై తిరుగుబాటుకు పిడికిలి ఎత్తింది.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో కామారెడ్డికి జరిగిన మోసం అంతా ఇంతా కాదు. కరెంటు కోతలతో తెలంగాణ అంతటా జరిగినట్టే కామారెడ్డిలోనూ రైతు ఆత్మహత్యలుండేవి. పంటలు పండక దుర్భర జీవితాలు గడిపిన ప్రజలే అధికం. కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలం పూర్తిగా గల్ఫ్ బాట పట్టింది. ఏ తండా చూసినా, పల్లె చూసినా గల్ఫ్ నుంచి శవాల పెట్టెలు దించుకొని పుట్టెడు దుఃఖంలో కుమిలిపోయిన సందర్భాలు అనేకం. పది జిల్లాల తెలంగాణలో కామారెడ్డి డివిజన్ కేంద్రమే అయినప్పటికీ జిల్లా కేంద్రానికి ఉండాల్సిన అవకాశాలన్నీ కలిగి ఉన్నది.
ఉమ్మడి రాష్ట్రంలో కామారెడ్డి రాష్ట్రంలో నెంబర్ 2 మున్సిపాలిటీగా ఉన్నప్పటికీ అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు. దేశంలోనే అతి పెద్ద జాతీయ రహదారి నాటి ఏడో నెంబరు, నేడు 44వ రహదారితో పాటు కామారెడ్డికి రైల్వేలైను వ్యవస్థ కూడా ఉన్నప్పటికీ పాలకులు ఈ ప్రాంతానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రస్తుత కామారెడ్డి డిగ్రీ కళాశాలకు ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్నది. ఉత్తర తెలంగాణలో ఏ జిల్లాలో డిగ్రీ కళాశాల లేని కాలంలోనే ఇక్కడ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేశారు. కామారెడ్డి ప్రజలు భవిష్యత్తు తరాలకోసం దాదాపు 200 ఎకరాలకు పైగా భూమిని విరాళంగా ఇచ్చారు. ఈ మధ్యనే కళాశాలకు న్యాక్ స్వయం ప్రతిపత్తి హోదాను ఇచ్చింది. కరీంనగర్, ఆదిలాబాద్‌తో పాటు పలు జిల్లాలవారు ఈ కళాశాలలో చదివి ఉన్నత స్థాయుల్లో స్థిరపడ్డారు. అంతటి చరిత్ర కలిగిన కామారెడ్డి దినదినాభివృద్ధి చెందాల్సింది పోయి… తీవ్రమైన నిర్లక్ష్యానికి గురైంది.
జిల్లాలో సిద్ధరామేశ్వరాలయం (బిక్కనూర్), శ్రీ స్వయంభూ రామలింగేశ్వర స్వామి అలయం (మద్దికుంట), శ్రీ కాలభైరవస్వామి (రామారెడ్డి), భీమేశ్వరాలయం (తాడ్వాయి),లక్ష్మీనర్సింహస్వామి (చుక్కాపూర్) దేవాలయాలు అనేకం ఉన్నప్పటికీ వలస పాలకుల నిర్లక్ష్యం మూలంగా అభివృద్ధికి నోచుకోలేదు. కానీ నేడు తెలంగాణ వచ్చాక కేసీఆర్ పాలనలో కామారెడ్డి పల్లెలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
హైదరాబాద్ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం వల్ల కామారెడ్డికి దక్కాల్సిన గుర్తింపు దక్కకుండాపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే సీఎం కేసీఆర్ కృషి మూలంగా ప్రగతిని సాధించిందనే చెప్పవచ్చు. ప్రధానంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి దశలోనే కామారెడ్డిని జిల్లాగా ఏర్పాటు చేయడంతో అప్పటి దాకా ఉన్న ప్రత్యేకతతో పాటు మరింత ప్రాధాన్యత దక్కినట్లయింది. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అనేక సంస్కరణల మూలంగా నేడు కామారెడ్డి జాతీయ రహదారులను తలపించే రోడ్ల సౌకర్యంతో కళకళలాడుతున్నది. బహుళ అంతస్తుల నిర్మాణాలతో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతున్నది. జిల్లా ఏర్పాటు తర్వాత ఆధునాతన సౌకర్యాలతో కలెక్టరేట్, వైద్య కళాశాల పూర్తయి నేడు తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఇదంతా కేవలం పదేండ్ల కాలంలోనే సాధ్యమవ్వటం అది కూడా ఉద్యమ నేత పాలనలో సాకారమవ్వటం జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం. ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత కామారెడ్డి మళ్లీ తన ప్రత్యేకతను చాటుకుంటున్నది.
ఇంతటి ప్రాధాన్యం కలిగిన కామారెడ్డి నుంచి ఈసారి సీఎం కేసీఆర్ అసెంబ్లీ బరి లో నిలుస్తుండటంతో తెలంగాణ దృష్టి అంతా కామారెడ్డి వైపే ఉన్నది. ఎన్నో ప్రత్యేకతలున్న కామారెడ్డి నుంచి ఉద్యమ నాయకుడు పోటీ చేస్తున్నాడంటే మరింత అభివృద్ధికి బాటలు పడ్డట్టే. కామారెడ్డి నుంచి కేసీఆర్ విజయం సాధిస్తే జిల్లా రూపు రేఖలు మారుతాయని జిల్లా వాసు ల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి. ఇప్పటికే కేసీఆర్‌ను గెలిపిస్తామని కామారెడ్డి పల్లెలన్నీ ముక్తకంఠంతో ప్రతిన చేస్తున్నాయి.
సంపత్ గడ్డం
78933 03516