2019 జూన్ 21.. తెలంగాణ చరిత్ర గతిని మార్చిన రోజు. కరువుతో అల్లాడిన తెలంగాణ నేల తల్లి నీటి వ్యథ, తెలంగాణ ప్రజల కన్నీటి వ్యథ తీరిన రోజు ఇది. గోదారమ్మ ఉవ్వెత్తున ఎగిసిపడి తెలంగాణ ప్రజల కన్నీళ్లను తుడిచిన శుభదినమిది. దశాబ్దాల జలకల సాకారమై కేసీఆర్ అపర భగీరథుడిగా సాక్షాత్కారమైన రోజు ఇది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి జలాలతో కాళేశ్వరుడి పాదాలు కడిగిన రోజు ఇది. తెలంగాణ జీవనాడి కాళేశ్వరాన్ని జాతికి అంకితం చేసి నేటికి సరిగ్గా ఆరు వసంతాలు పూర్తయ్యాయి.
అప్పటికీ, ఇప్పటికీ ఎంత తేడా. నాడు కరువుతో అల్లాడిన భూముల్లో నేడు కాసుల పంటలు పండుతున్నయి. నాటి బీడు భూముల్లో నేడు బంగారం విరగబూస్తున్నది. ఒకనాటి వలసల తెలంగాణకు నేడు ఇతర రాష్ర్టాలవారు వలస వస్తున్నారు. ఒకప్పుడు గొంతెండిన నేలపై నేడు నిండు వేసవిలోనూ మత్తళ్లు దుంకుతున్నయి. స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణకు ఎదురైన మొదటి సవాలు సాగునీటి సమస్య. నీళ్లున్నా మన నేలపై నిలవని పరిస్థితి. ఉమ్మడి పాలకులు ఒకటి అరా ప్రాజెక్టులు కట్టినా నీళ్లు పారని దుస్థితి. నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టిన సమైక్య పాలకులు తెలంగాణను ఎండబెట్టారు, తెలంగాణ రైతాంగాన్ని పాడెక్కించారు. ఇలాంటి పరిస్థితుల్లో పాలనా పగ్గాలు అందుకున్న కేసీఆర్ నీళ్ల కోసం భగీరథ ప్రయత్నమే చేశారు. నాటి భగీరథుడు దివి నుంచి భువికి గంగను తీసుకొస్తే.. అభినవ భగీరథుడు పాతాళంలోని గంగను పొలాలకు పారించారు. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. కానీ, కమీషన్ల కోసం తల లాంటి ప్రాజెక్టును వదిలేసి తోక వంటి కాలువలను తవ్వి కాసులు వెనుకేసుకున్నది. మరోవైపు మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కేసీఆర్ సంకల్పించారు. మేడిగడ్డ వద్ద బ్యారేజీ కడితే వందల టీఎంసీల నీటిని ఒడిసిపట్టుకొని ఎత్తిపోయవచ్చని గ్రహించారు. కేంద్రం నుంచి అనుమతుల కోసం అహర్నిశలూ శ్రమించారు, సాధించారు.
రైతులను ఒప్పించి, మెరుగైన ప్యాకేజీ ఇచ్చి భూసేకరణ చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులకు లోటు రానివ్వలేదు. సమర్థుడైన హరీశ్‌రావును నీటిపారుదల శాఖ మంత్రిగా నియమించి ఎల్లవేళలా ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. చిన్న చిన్న ప్రాజెక్టుల నిర్మాణాలకే దశాబ్దాలు పడుతున్న ఈ అనిశ్చిత రాజకీయ వ్యవస్థలో మూడేండ్లలోనే జలయజ్ఞాన్ని పూర్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశం పంటలకు నీరందించడం మాత్రమే కాదు, తెలంగాణ పునర్నిర్మాణం కూడా. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన జలాశయాలు, కాలువలతో తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగాయి. తద్వారా బోరుబావుల్లో నీటి లభ్యత పెరిగింది. కాళేశ్వరం నీటిని మిషన్ భగీరథకు అనుసంధానించడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల జీవనప్రమాణాలను మెరుగుపరిచింది. తద్వారా వారు అనారోగ్యంపై పెట్టే ఖర్చు తగ్గింది. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. జలాశయాల్లో ఏడాదంతా నీళ్లు ఉండటం వల్ల మత్స్యకారులకు ఉపాధి దొరికింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన జలాశయాలతో రాష్ట్రంలో పర్యాటక శోభ సంతరించుకున్నది. రాష్ట్ర పర్యాటకరంగం ఆదాయమూ పెరిగింది. తెలంగాణలో పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలకు కాళేశ్వరం ప్రధాన నీటి వనరుగా మారింది. ఇది రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి, ఉద్యోగ కల్పనకు దోహదపడింది. పంటల ఉత్పాదకత పెరగడం వల్ల పశుగ్రాసం కూడా పుష్కలంగా లభిస్తున్నది. దీంతో డెయిరీ రంగం కూడా అభివృద్ధి చెందింది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క వ్యవసాయాన్నే కాదు, తెలంగాణను పునర్నిర్మించింది.