కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ ఎదుట విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇది ఊహించిన పరిణామమే. కేసీఆర్‌నే లక్ష్యంగా చేసుకొని రాజకీయ కక్షసాధింపులో భాగంగా ఈ కమిషన్ ఏర్పాటైనట్టు ముందే దేశమంతటికీ అర్థమైంది. 2024 మార్చిలో ప్రారంభమైన విచారణ లో చివరికి 14 నెలల తర్వాత లక్ష్యం మేరకు కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. దేశంలో కమిషన్ల కథలు అందరికీ తెలిసినవే. అదే కోవలోనే ఈ కమిషన్ విచారణ సాగింది.
ఇప్పటివరకు అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ప్రాజెక్టుతో సంబంధం లేనివారిని పిలిపించారు. ప్రభుత్వం ఆశించిన విధంగానే చాలామంది సమాచారం ఇచ్చినట్టు తెలుస్తున్నది. వాటితోనే విచారణ ముగుస్తున్నదని భావిస్తున్న తరుణంలో కేసీఆర్, హరీశ్‌రావు, ఈటలకు పిలుపు అందింది.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను ఒడిసిపట్టి తెలంగాణ భూములను పారించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు ఇది. అంతా శుభారంభమే అయినా.. ఆ తర్వాత మేడిగడ్డ వద్ద బ్యారేజీ కుంగడం, ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడం, కమిషన్ ఏర్పాటు వంటి పరిణామాలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును నిరర్థకంగా మార్చే ప్రయత్నం జరిగింది తప్ప మేడిగడ్డ బ్యారేజీని బాగుచేయించి దాన్ని కొనసాగించాలనే ప్రయత్నం చేయలేదు. ఆ ఉద్దేశం ప్రభుత్వంలో ఏ కోశానా లేదు. ఎల్ అండ్ టీ ముందుకు వచ్చి ఉచితంగా మరమ్మతులు చేస్తామన్నా అనుమతులు ఇవ్వలేదు. ఒక్క పిల్లర్ కుంగిపోతేనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ప్రాజెక్టు మొత్తం కూలిందనే వాదన చేస్తూ దాన్నే కొనసాగిస్తున్నారు. మిగిలిన రిజర్వాయర్లనూ వినియోగించడం లేదు. సాగు నీటి కొరత వల్ల లక్ష ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయినా వారిలో చలనం రాకపోవడం శోచనీయం.
తెలంగాణకు గోదావరి జలాలు ప్రాణప్రదమైనవి. వాటిని అన్నివిధాలా వినియోగించుకోవాలి. కాళేశ్వరం ఆనవాళ్లు లేకుండా చేయాలనే తపన తప్ప, కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించి రైతులను బాగుపరిచే ప్రత్యామ్నాయాలేవీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. ఇదెంత విషాదం? తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పినా దానిపై అడుగు ముందుకేయలేదు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్‌ను వాడుకుంటున్నదనే విషయం అంతిమంగా అర్థమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని గుర్తించి దాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు సలహా సూచనలు ఇవ్వకపోగా చోద్యం చూస్తున్నది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. ఏతావాతా తెలంగాణకు తీవ్ర నష్టం చేయడమే ఈ రెండు పార్టీల ఉద్దేశంగా కనిపిస్తున్నది. ఇప్పటికే పోలవరం ద్వారా గోదావరి జలాలను, బనకచర్ల ద్వారా కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం తరలించుకొని వెళ్లే సన్నాహాల్లో ఉన్నది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నివిధాలా సహకరిస్తున్నాయి.
కాళేశ్వరం విచారణ పేరిట తతంగం నడిపించి, ఏదో చేద్దామన్న యావ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తున్నది. కానీ, అది సాధ్యమయ్యే పనికాదు. న్యాయవ్యవస్థ రాజకీయాలకు అతీతమైంది. విద్యుత్తు కమిషన్ వ్యవహారంలో ప్రభుత్వానికి ఇప్పటికే చేదనుభవం ఎదురైన విషయాన్ని మర్చిపోరాదు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ వద్ద బ్యారేజీ కాదు. ఎన్నో రిజర్వాయర్లు, సొరంగాలు, వందల కిలోమీటర్ల కాలువలు. ప్రభుత్వం ఇకనైనా కమిషన్ల కథలు మాని, పాలనపై దృష్టిసారించాలి. రాష్ర్టానికి ప్రయోజనకరమైన పనులు చేయాలి. ఎన్నికల హామీ లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలు ఇంకా నెరవేరలేదు. తద్వారా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. మొత్తంగా రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిపోయింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని ముఖ్యమంత్రి ప్రతీ సభలో చెప్తుండటం విడ్డూరం. ఇలాంటి పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలి? రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలని ఆలోచించాలి తప్ప, కమిషన్లు, విచారణల పేరుతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజ లే చరమగీతం పాడుతారు. ఆరు గ్యారంటీల ను పక్కనపెడదామనుకునే ఆలోచనతోనే కాం గ్రెస్ ప్రభుత్వం ప్రజలకు కథలు చెప్తున్నది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి ఆ నీటిని పారించాలి. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలి. వర్షాభావ ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు చేపట్టి కార్యదక్షతను నిరూపించుకోవాలి.