ఇరిగేషన్ చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ప్రపంచ రికార్డు. స్వల్పకాలంలో నిర్మితమైన అతి భారీ ప్రాజెక్టు ఇది. విభిన్న ప్యాకేజీల రూపంలో బీడు భూములకు పరుగులు తీస్తున్న కాళేశ్వరం జలాలతో అడుగడుగునా ఇంజినీరింగ్ నైపుణ్యం ప్రస్ఫుటంగా కండ్లకు కనిపిస్తుంది. సర్జ్‌పూల్ లాంటి ఏర్పాట్లు, భూ అంతర్భాగంలో భారీ టన్నెల్ నిర్మాణాలతో రైతుల పొలాలకు సాగునీరు తరలించే ప్రక్రియను చేపట్టడం మరెక్కడా లేదంటే అతిశయోక్తి కాదు.
రైతుల పొలాలు ఎండకూడదని, కాలం తో సంబంధం లేకుండా సాగునీటికి కొరత ఉండకూడదని తలచి రూ.80,190 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును నిర్మించారు. అయితే… దీనికి అనుబంధంగా ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా పేరుగాంచిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వర్షాభావ పరిస్థితుల్లో ఎండిపోకూడదనే ఉద్దేశంతో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం చేపట్టడం మరో అద్భుతం. ఈ పథకం ద్వారా పోచంపాడ్ ప్రాజెక్టు కాలంతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా నీళ్ల తో నిండుకుండలా ఉండనున్నది. ఎక్కడో మేడిగడ్డలో ఎత్తిపోసిన కాళేశ్వరం జలాలను పలుమార్గాల ద్వారా నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మం డలం పోచంపాడుకు చేర్చడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో వరద కాలువను నీళ్ల తరలింపునకు వాడుకోవడం ఇంజినీరింగ్ మహిమకు తార్కాణంగా నిలుస్తున్నది.
సహజంగా నీళ్లు పల్లమెరుగు అంటుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనలో ఈ నానుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా మార్చేశారు. పల్లానికి పరుగులు తీసే గోదారమ్మను ఎత్తిపోతల పథకాల ద్వారా సముద్ర మట్టానికి దాదాపుగా 600 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల చెంతన ఉన్న బీడు భూములకు జీవం పోస్తున్నారు. ఎస్సారెస్పీలో గమ్మత్తేమంటే వరద నీటి వృథాను అరికట్టేందుకు ఉద్దేశించిన కాలువను అధునాతన సాంకేతికత సాయంతో గ్రావిటీ సూత్రాన్ని ఉపయోగించి దిగువకు పారే కాలువలోనే కాళేశ్వరం జలాలను ఎదురెక్కించి పారించడం గొప్ప విషయం. చిన్నప్పుడు మనకు పల్లెటూర్లో అడపా దడపా కొండల్లో, గుట్టల్లో, పచ్చని పంటపొలాల్లో రెండు మూతుల పాములు తారసపడేవి. అవి మనుషులకు ప్రాణహాని తలపెట్టకపోయినప్పటికీ వింత ఆకారంతో ఆకట్టుకునేవి. దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తే రెండుదిశలా పాకుతూ జారుకునేది. అలా రెండు మూతుల పామును వరద కాలువకు అన్వయిస్తే అచ్చంగా సరిపోతుందనిపిస్తున్నది. గోదావరి నదిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద నీటిని ఎగువ నుంచి దిగువకు మోసుకెళ్లే వరద కాలువలో దిగువ నుంచి నీళ్లను ఎగువకు ఎత్తిపోయడం అంటే మాటలకు అందని మహత్యం ఇది.
వరద కాలువ 102వ కి.మీ. వరకు కాళేశ్వరం జలాలను తరలించి అక్కడినుంచి కొత్త కాలువలు, పైపులైన్లు, భూ సేకరణ లాంటివి అవసరమే లేకుండా రెడీగా ఉన్న వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ చేయాలనే కేసీఆర్ ఆలోచన వరద కాలువ ప్రాధాన్యాన్ని పెంచేసింది.
దేశ స్వాతంత్య్ర అనంతరం రూపొందిన నీటిపారుదల ప్రాజెక్టుల్లో శ్రీరాంసాగర్ ఒకటి. ఉమ్మడి రాష్ట్రంలో కీలక ప్రాజెక్టుగా పేరొందిన పోచంపాడు కాలక్రమేణా తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. 1983 నుంచి ఎస్సారెస్పీకి వరదలు ప్రారంభం కాగా భారీ గా వరదలు వచ్చిన ప్రతిసారి మిగులు జలాలను ప్రాజెక్టు గేట్లు ఎత్తి గోదావరిలోకి వదిలేసేది. ఇలా వృథాగా పోతున్న జలాలను ప్రాజె క్టు దిగువన వినియోగించుకోవాలనే లక్ష్యం తో లక్షల మెట్ట భూములకు సాగునీటిని అం దించాలని వరద కాలువ నిర్మాణానికి పూనుకున్నారు. ఎస్సారెస్పీ మిగులు జలాలను దిగువకు తరలించడమే వరద కాలువ ప్రధాన ఉద్దేశం కాగా… కేసీఆర్ ఆలోచనతో ఇదే కాలువ రివర్స్ పంపింగ్‌తో దిగువ నుంచి ఎగువకు నీళ్లు ప్రవహిస్తుండటం చరిత్రాత్మకం.
(వ్యాసకర్త: నమస్తే తెలంగాణ జర్నలిస్టు)
– జూపల్లి రమేష్‌రావు94925 70992