కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప నీటిపారుదల ప్రాజెక్టు అని, కేసీఆర్ సత్సంకల్పంతో తెలంగాణ లో నదులకు పునరుజ్జీవనం కల్పిస్తున్నారని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ గతంలో కొనియాడారు. కాళేశ్వరంతో గోదావరి సజీవంగా మారిందని, నదులు ఉన్నచోటే మానవ నాగరికత అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాజెక్టును సందర్శించాక రాజేంద్రసింగ్ చెప్పిన మాటలు చరిత్ర పుటల్లో ఇంకా సజీవంగానే ఉన్నాయి. కాళేశ్వరంపై కొండపల్లి రాజేంద్ర శ్రీవాత్సవ తీసిన 60 నిమిషాల డాక్యుమెంటరీ ‘లిఫ్టింగ్ ఏ రివర్’ 2021 జూన్ 25న డిస్కవరీ ఛానల్లో ప్రసారమైంది.
రెండేండ్లపాటు ప్రాజెక్టు నిర్మాణ పనులను ఫాలో అవుతూ, ఇంజినీర్లతో ఇంటర్వ్యూ లు చేస్తూ ఆయన వందల గంటల ఫుటేజ్‌ను రికార్డు చేశారు. ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌లో ‘మానవుడు, యంత్రాలు కలిసి రూపొందించిన అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు. ఒక నదిని అచ్చంగా ఎత్తిపోశారు’ అని చెప్తారు. ఒక నది నుంచి 169 టీఎంసీల నీటిని 45 లక్షల ఎకరాలకు చేర్చడం, 30 టీఎంసీల తాగునీటిని అందించడం, 13 జిల్లాలకు ప్రయోజనం కల్పించడం, ప్రాజెక్టులో సుమారు 10 జాతీయ, 5 అంతర్జాతీయ కంపెనీలు భాగస్వామ్యం కావడం, భిన్నమైన భాషలు, జాతీయతలను కాళేశ్వరం ప్రాజెక్టు ఒక దగ్గరకు చేర్చిందని ఇందులో చెప్తారు. ఇదీ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం.
కాళేశ్వరంపై ఈ రోజు దుష్ప్రచారం చేసేవారికి 2014కు ముందున్న తెలంగాణ గోస తెలియదా? నీళ్లు లేక పంట పొలాలన్నీ నెర్రెలుబారితే బతకడానికి బొంబాయి వెళ్లిన రోజులు మరిచిపోయారా? తినడానికి గడ్డి, తాగడానికి నీళ్లు దొరక్క పశువులు బక్కచిక్కి చనిపోయిన రోజులు గుర్తులేవా? కూటికి, నీటికి పల్లెల్లోని ప్రజలు కన్నీరు పెడుతున్న తీరుని వివరించిన గోరేటి వెంకన్న పాటలను అప్పుడే మరిచిపోయారా? నాడు తెలంగాణలోని ఏ పల్లెలో చూసినా రోదనే కనిపించేది. కరువుకాటకాలతో జనం విలవిలలాడిపోయారు. ఉద్యమంతో సాధించుకున్న తెలంగాణలో మొదటి రెండేండ్లలోనే మిషన్ కాకతీయతో చెరువుల్లో జలకళ వచ్చింది. బీడు భూములు పచ్చగా మారాయి.
2016లో శంకుస్థాపన జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు 2019 జూన్ 21న ప్రారంభమైంది. మూడేండ్లలో ఒక మహాద్భుత ప్రాజక్టుతో తెలంగాణలో భూగర్భ జలాలు ఉవ్వెత్తున పెరిగాయి. లక్ష్మి, సరస్వతి, పార్వతి బ్యారేజీలతో పాటు శ్రీరాజరాజేశ్వర, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ లాంటి జలాశయాలు అందుబాటులోకి వచ్చాయి. 240 టీఎంసీల నీళ్లను మన తెలంగాణలోనే వాడుకోవాలని, మన రైతులకే మేలు చేయాలనే తలంపుతో నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. హైదరాబాద్ నగరానికి రేపటికి నీళ్లు అందించేది మల్లన్న సాగరే. 50 టీఎంసీలతో నిర్మించిన ఈ జలాశయం నిండితే హైదరాబాద్ నగరానికి రెండు మూడేండ్ల వరకు తాగునీటికి ఇబ్బంది ఉండదు. ఇవన్నీ కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన ప్రాజెక్టులు. గోదావరిని సజీవంగా ఉంచడమే కాకుండా పూర్వ ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోని చెరువులకు నీళ్లు అందించే విధంగా రూపొందించిన ఈ ప్రాజెక్టుపై మొదటినుంచి విషప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ బతుకు చిత్రాన్ని తిరగరాసిన కాళేశ్వరంపై రాజకీయం చేసినన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకే నష్టం.
-కన్నోజు మనోహరాచారి
79950 89083