చరిత్రలో ఎప్పుడూ కేవలం వ్యవసాయం మీదే సంపాదించి ధనవంతులైన రైతుల ఉదాహరణలు లేవు. వ్యవసాయం జీవనాధారమనేది నిజమే. కానీ, నిజజీవితంలో మాత్రం అది కుటుంబాన్ని నిలబెట్టే స్థాయికి రాలేదు. పిల్లల చదువు, ఇంటి నిర్మాణం, పెళ్లిళ్లు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ వ్యవసాయం మీదే ఆధారపడి నెరవేరతాయా అంటే, చాలా సందర్భాల్లో కాదు. ఎందుకంటే, వ్యవసాయంలో లాభనష్టాల లెక్కలు స్పష్టంగా ఉండవు. బ్రేక్ ఈవెన్ (ఖర్చులకు సరిపడే ఆదాయం) అనే మాటే ఉండదు. ఒక్కోసారి, కొంతమంది రైతులు లాభపడినా, చాలామందికి మాత్రం అప్పులే మిగులుతాయి.
వ్యవసాయం బతుకుదెరువు వృత్తి నుంచి లాభాల మార్గంగా మారినప్పటి నుంచి రైతు బతుకు మరింతగా కష్టాల్లో కూరుకుపోయింది. నూతన ఆర్థిక విధానాల ప్రభావంతో వ్యవసాయం మునుపటిలా లేదు. లాభాల కోసం పంటలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది కానీ, లాభం మాత్రం చేతికి రాలేదు. దాంతో చాలామంది రైతు కుటుంబాల్లో బాధ, నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. పొలం చిన్నదా, పెద్దదా అనే తేడా లేకుండా, ప్రతీ రైతు ఇప్పుడు అప్పు అనే ముప్పు అంచున ఉన్నాడు. ఇది కేవలం రైతు సమస్య కాదు, మన సమాజం మొత్తం ఎదుర్కొంటున్న పెద్ద సవాలు. తెలంగాణలో పేదరికం ఒక పరిస్థితి కాదు, అదొక కుట్ర. దశాబ్దాలుగా వర్షాభావం, నీటికొరత, మార్కెట్ అసమతుల్యతలు, ప్రభుత్వాల నిర్లక్ష్యం ఇవన్నీ కలగలిసి రైతును బలహీనంగా మార్చాయి. దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే ఇక్కడ పేదరికం తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ వ్యవసాయం ఒక రకంగా జూదంలా మారిపోయింది.
తరతరాలుగా తెలంగాణలో వ్యవసాయం అంటే కేవలం బతుకుదెరువు, లాభాల కోసం కాకుండా, కుటుంబం గడిస్తే చాలు అన్నట్టే సాగు చేసేవాళ్లు. ఇప్పటి పరిస్థితుల్లో చూస్తే, గ్రామాల్లో పది ఎకరాల కంటే ఎక్కువ భూమి సాగుచేసే రైతులు అరుదే. సగటు రైతు దగ్గర ఐదెకరాల కంటే తక్కువ భూమే ఉంటుంది.
కొంతమంది రైతులు బావులు తవ్వుకుని ఒక సీజన్లో వరి వేసేవాళ్లు. అదృష్టం బాగుంటే, బావిలో నీరు ఎక్కువగా ఉంటే కొంతభూమిలో రెండో పంట కూడా వేయగలిగేవాళ్లు, కానీ, అది ఖరీఫ్ కంటే తక్కువ విస్తీర్ణంలోనే. వరి అంటే ఖర్చుతో కూడిన పంట. అందుకే, నీటి సౌకర్యం ఉన్న రైతులే దాన్ని సాగు చేయగలిగారు. నీటిపారుదల కోసం బావుల మీదే ఆధారపడిన రైతులకు, నీటిని పైకి ఎత్తే పంపులు పెట్టడం అంటే పెద్ద ఖర్చే. బావులు ఉన్న రైతులు మొదట్లో మోట సహాయంతో నీళ్లు ఎత్తేవాళ్లు. తర్వాత ఆయిల్ పంపుసెట్లు వచ్చాయి. వాటితో వ్యవసాయం కొంచెం యాంత్రికంగా మారింది. అయితే, ఈ వ్యవస్థలో కూడా ఓ పరిమితి ఉంది. నీళ్లు వాలుభూములకే పారేవి. కానీ, ఆయిల్ పంపుసెట్లు వచ్చాక నీటిని ఎత్తి ఎత్తైన భూములకూ తీసుకెళ్లగలిగారు. దాంతో సాగు విస్తీర్ణం కొంచెం పెరిగింది. తర్వాత విద్యుదీకరణ వచ్చింది. అంటే, డీజిల్ కోసం పట్టణాలకి తిరగాల్సిన అవసరం తగ్గింది. మెయింటెనెన్స్ ఖర్చులు కూడా కొంత తగ్గాయి. కానీ, విద్యుత్తుతో నడిచే పంపుసెట్లు వచ్చిన తర్వాత మరో సమస్య మొదలైంది. ప్రతిరైతు తన పొలానికి నీళ్లు తేవాలనే పోటీ మొదలైంది. ప్రభుత్వం విద్యుత్తుకి సబ్సిడీలు ఇచ్చింది. వాణిజ్య పంటలు పెరిగాయి. దాంతో గ్రామాల్లో నీటివనరుల కోసం గట్టిపోటీ మొదలైంది. అందరూ వరి సాగుచేసే ప్రయత్నం చేశారు.
1980ల వరకూ తెలంగాణలో సాగు అంటే బావుల మీదే ఆధారపడిన వ్యవసాయం. కానీ, ఆ దశాబ్దం చివర్లో బోర్వెల్ యంత్రాలు గ్రామాల్లోకి వచ్చేశాయి. 1990ల చివరికి భూగర్భ జలాలు బాగా తగ్గిపోయాయి. కానీ, బోరు తవ్వడం ఆగలేదు. పాత బోరు ఎండిపోతే, కొత్త బోరు వేయాల్సిందే. ఇలా ప్రతి ఏడాది లోతుగా తవ్వడం, సాగునీళ్ల కోసం పోరాడటం, అన్నీ కలిసి వ్యవసాయాన్ని ఒక ప్రాణాంతక జూదంగా మార్చేశాయి. అప్పులపాలై… బోరు బావుల కోసం తిరుగుతూ ఒక స్వీయ విధ్వంసక చక్రంలో రైతులు చిక్కుకున్నారు. అంతేకాదు, వరుస కరువులు ఈ పరిస్థితిని మరింత దిగజార్చాయి. 1990 నుంచి 2015 మధ్యకాలం తెలంగాణ రైతులకు చీకటి రోజులు. నీటి కోసం పోరాటం, ప్రభుత్వాల నిర్లక్ష్యం, వివక్ష, ఇవన్నీ కలిసి వ్యవసాయాన్ని సంక్షోభం దిశగా నడిపించాయి.
నదీజలాల్లో తెలంగాణకు న్యాయం జరగలేదన్నది ఓ చేదునిజం. కృష్ణా, గోదావరి నదులు తెలంగాణ మీదుగా ప్రవహించినా, ఇవి సహజంగా దిగువకు వెళ్లేలా ఉండటంతో, ఎత్తైన పొలాలకు నీళ్లు ఎక్కించాలంటే పెద్ద కష్టమయ్యేది. దాంతో, ఈ నదుల నీరు తెలంగాణ రైతులకు కాకుండా, ఆంధ్రా ప్రాంతాల్లోని కొంతమంది పెట్టుబడిదారుల తీరని దాహాన్ని తీరుస్తున్నది. ఇది యాదృచ్ఛికం కాదు. తెలంగాణ వ్యవసాయాన్ని పట్టించుకోని ప్రభుత్వాల నిర్లక్ష్యం, నీటిపంపిణీలో అసమానతలు, ఇవన్నీ కలిసి ఈ అన్యాయాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని సిద్ధాంతకర్తలు, ఉద్యమకారులు ఈ వ్యవస్థపై ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. ఇక భూముల విషయంలోనూ అదే కథ. ఆంధ్రా ప్రాంతాల్లో వ్యవసాయ ఆదాయం తగ్గిపోతుండ టంతో, అక్కడి పెట్టుబడిదారులు హైదరాబాద్ చుట్టుపక్కల భూములపై కన్నేశారు.
ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే, తెలంగాణాలో ఐదెకరాలు వస్తాయన్న మాటలు అప్పట్లో చాలానే వినిపించేవి. దాంతో, తెలంగాణలో భూముల ధరలు తక్కువగా ఉంచి, పెద్దఎత్తున కొనుగోళ్లు జరిగాయి. హైదరాబాద్ విస్తరిస్తుందన్న అంచనాతో, తక్షణ లాభాల కంటే భవిష్యత్తు కోసం భూమిని సేకరించాలన్న పెట్టుబడిదారుల వ్యూహం స్పష్టంగా కనిపించింది. ఇది కేవలం మార్కెట్ వ్యవహారం కాదు, తెలంగాణ రైతుల భూములపై జరిగిన నిశ్శబ్ద దండయాత్ర అని చెప్పొచ్చు. అట్లాగే ఇది కేవలం వ్యక్తిగత వ్యవహారం కాదు, ప్రాంతాలకతీతంగా వర్గప్రయోజనాల కోసం సాగిన వ్యవసాయ వ్యూహం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి, ఇక్కడి పది జిల్లాల్లో తొమ్మిది జిల్లాలు వెనుకబడినవే. దీన్నిబట్టి ఇక్కడి రైతులను, వ్యవసాయాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేశారో స్పష్టంగా చెప్పొచ్చు. కానీ, ఈ వాస్తవాన్ని అప్పటి మీడియా అంగీకరించలేదు. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు ఒక ప్రధాన నినాదం అయినా, దాన్ని కూడా వ్యక్తిగత, రాజకీయ లాభాల కోసం నడిపిన నినాదంగా చూపించేందుకు ప్రయత్నించారు. ఇది కేవలం నీటి కోసం పోరాటం కాదు, తెలంగాణ రైతు గౌరవం కోసం సాగిన ఉద్యమం.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ప్రారంభమైన తర్వాత, ఎండిపోయిన పొలాలు, ఆశలు కోల్పోయిన రైతుల బతుకుల్లో కొత్త వెలుగు వచ్చింది. సాగు కోసం ఎదురుచూపులు, నీటి కోసం పోరాటం, ఇవన్నీ కాళేశ్వరం వల్ల చాలా వరకు తగ్గాయి. ఈ ప్రాజెక్టుకు రూపురేఖలు ఇచ్చింది తెలంగాణ ఇంజినీర్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వ దార్శనికత. బ్యారేజీలు, పంపింగ్ స్టేషన్లు, రిజర్వాయర్లు, కాలువలు, ఇవన్నీ కలిపి ఎన్నో దశల్లో నీటిని ఎత్తి, పొలాలకు తీసుకెళ్లేలా చేసిన ప్రణాళిక ఇది. కాళేశ్వరం కేవలం ఓ ప్రాజెక్టు కాదు, తెలంగాణ రైతు గర్వానికి నిలువెత్తు నిదర్శనం. ఈప్రాజెక్టును ముందుకు నడిపించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దుష్ప్రచారాలను, కోర్టు కేసులను ఎదుర్కొంటూ, ప్రతి దశను స్వయంగా పర్యవేక్షిస్తూ, దీన్ని నిజంగా రైతుకు ఉపయోగపడేలా చేశారు. ఆ దృఢసంకల్పం లేకపోతే, ఈ స్థాయిలో వ్యవసాయాన్ని ఊహించడమే కష్టం.
2019 జూన్‌లో ప్రారంభమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తెలంగాణ వ్యవసాయరంగానికి నిజంగా గేమ్‌చేంజర్. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో పంటల ఉత్పత్తి బాగా పెరిగింది. ముఖ్యంగా ఆహారధాన్యాల విషయంలో కేంద్ర వ్యవసాయ శాఖ డేటా ప్రకారం, 2018-19 నుంచి 2023-24 మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి పది రాష్ర్టాల్లో అత్యధిక వృద్ధిరేటు సాధించింది. అంటే, కాళేశ్వరం నీళ్లు పొలాల్లోకి వచ్చాక రైతుల ఆశలు పంటలుగా మారాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. కాలువల ద్వారా, చెక్‌డ్యామ్‌లతో వాగులు, వంకల ద్వారా నదులు నిండటంతో భూగర్భ జలాలు నిలకడగా మారాయి. దాంతో వరుసగా నాలుగేండ్లుగా వరి దిగుబడులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. కాళేశ్వరం నీళ్లు మాత్రమే కాకుండా రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలూ రైతులకు ధైర్యం ఇచ్చాయి. దాంతో తెలంగాణ వ్యవసాయ వృద్ధిరేటు నాలుగు శాతంగా ఉన్న జాతీయ సగటును దాటి 7.8 శాతానికి చేరింది.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కేవలం పంట దిగుబడులు పెరగడమే కాదు, భూగర్భజలాలు కూడా మెరుగయ్యాయి. రిజర్వాయర్లు నిండడంతో, చెరువులు, వాగులు తిరిగి జీవం పొందడంతో, భూమిలో నీటిమట్టం సగటున 4 మీటర్లకు పైగా పెరిగిందని హైడ్రోలాజికల్ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఫ్లోరైడ్ సమస్య. చాలా జిల్లాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు నీటిమట్టం పెరగడంతో, ఆ కాలుష్యం స్థాయిలు తగ్గాయి. ఇది ఆరోగ్యపరంగా చాలా పెద్ద ఊరట.
నీటి లభ్యత పెరగడంతో రైతుల ఆత్మహత్యల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. దేశవ్యాప్తంగా చూస్తే, ఈ విషయంలో తెలంగాణే అత్యంత స్పష్టమైన మెరుగుదల చూపిన రాష్ట్రంగా నిలిచింది. వ్యవసాయ పునరుజ్జీవానికి ఇది ఒక మంచి ఉదాహరణ. కాళేశ్వరం నీళ్లు పొలాల్లోకి వచ్చాక పంటల ఉత్పత్తి బాగా పెరిగింది. దాంతో ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్లు, పంటల మందులు లాంటి వ్యవసాయ ఇన్పుట్లకు డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది. సాగు విస్తీర్ణం పెరగడంతో పొలాల్లో పనిచేసే కూలీలకు పని దొరికింది. అలాగే ఇన్పుట్స్ సరఫరా చేసే వ్యాపారాలు పెరిగాయి.
కాళేశ్వరం వల్ల రైతులకు కనిపించని లాభాలు కూడా ఉన్నాయి. గత ఐదేండ్లలో సగటు రైతు కనీసం లక్ష రూపాయలు ఆదా చేశాడని అంచనా. ఎందుకంటే, భూగర్భ జలాలు నిలకడగా ఉండకపోతే, ప్రతి రైతు కొత్త బోరు వేయాల్సి వచ్చేది. తెలంగాణలో బోరు తవ్వడం అంటే కనీసం లక్ష రూపాయలు సమర్పించుకోవాల్సిందే. ఆ ఖర్చు తప్పించుకోవడం కూడా రైతుకి పెద్ద ఊరటే. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పంటలే కాదు, తెలంగాణ గ్రామాల ఆర్థిక పరిస్థితి కూడా బాగా మారిపోయింది. రైతుల ఆదాయం పెరగడంతో వాళ్ల కొనుగోలు శక్తి కూడా పెరిగింది. కిరాణా, బట్టలు, ఎలక్ట్రానిక్స్, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, టీవీలు, అలాగే ఇల్లు కట్టేందుకు సిమెంట్, ఇనుము లాంటి వస్తువుల కోసం సమీప పట్టణాల్లో ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. దాంతో రిటైల్ షాపులు, రవాణా, కట్టడాల రంగాల్లో పట్టణాల్లో గిరాకీ పెరిగింది. ఇది ఉద్యోగాలు పెరగడానికి, చిన్న వ్యాపారాలు బలపడడానికి దోహదం చేస్తున్నది.
కాళేశ్వరం వల్ల తెలంగాణలో వ్యవసాయం పూర్తిగా మారిపోయింది. ఎన్నో ఏండ్లుగా కష్టాల్లో ఉన్న రైతుల జీవితాల్లో వెలుగు వచ్చింది. ఎప్పుడూ నీటికోసం ఎదురుచూసే రోజులు పోయి, ఇప్పుడు పంటలకు నమ్మకమైన సాగునీరు అందుతున్నది. వరిసాగు విస్తరించింది. కొత్త రకాల పంటలు వేయడం మొదలైంది. ధాన్యం ఉత్పత్తి బాగా పెరిగింది. తెలంగాణ ఇప్పుడు వ్యవసాయరంగంలో దేశంలో ముందున్న రాష్ర్టాల్లో ఒకటిగా నిలిచింది. రైతులపై అప్పుల భారం తగ్గింది. పర్యావరణానికి కూడా ప్రయోజనం చేకూరింది. గ్రామాల్లో ఆర్థికచైతన్యం వచ్చింది. పనుల అవకాశాలు పెరిగాయి, పట్టణాల అభివృద్ధికి కూడా తోడ్పడింది. చాలాకాలం తర్వాత రైతు కుటుంబాలు ఆర్థికంగా కొంత ఊపిరి పీల్చుకుంటున్నాయి. వాళ్ల ముఖాల్లో ఆనందం కనిపిస్తున్నది. పండగలా జీవితం సాగుతున్నది. కాళేశ్వరం తెలంగాణ అభివృద్ధికి అంకితమైన రాజకీయ నాయకత్వ ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలుస్తున్నది.
స్వాతంత్య్రానంతర భారతదేశంలో ‘జై కిసాన్’, రైతేరాజు’ వంటి నినాదాలు వినిపించినా, అవి కార్యరూపం దాల్చక, అధికార యంత్రాంగం, ఎన్నికల రాజకీయాల గోడలను దాటలేకపోయాయి. ‘జై కిసాన్’ అనేది ‘నై కిసాన్’గా మారిపోయింది, రైతేరాజు కాస్త వ్యవసాయ కూలీగా దిగజారిపోయాడు. కుల రాజకీయాలు ప్రాధాన్యం పొందిన తర్వాత, వ్యవసాయ రంగానికి రాజకీయ ప్రాధాన్యం తగ్గిపోయింది. ఈ పరిస్థితికి మినహాయింపు తెలంగాణ ఉద్యమం. నీటిని మూడు ఉద్యమ నినాదాల్లో ఒకటిగా చేర్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే ఉద్యమస్ఫూర్తితో సాగునీటి రంగంపై దృష్టిపెట్టిన తొలి తెలంగాణ ప్రభుత్వం కృషి ఫలితంగా కాళేశ్వరం రూపుదిద్దుకుంది. కాబట్టి కాళేశ్వరం ఒక నీటిపారుదల పథకం మాత్రమే కాదు, ఇది తెలంగాణ రైతులపై వివక్షకు, నిరాదరణకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి నిలువెత్తు చిహ్నం.