భారతదేశ సామాజిక ముఖచిత్రం కులం పునాదిగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో అన్ని కులాలకు, తరగతులకు సమాజంలోని వివిధ వర్గాల మధ్య తీవ్ర అసమానతలను తగ్గించి, బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వాలను భారత రాజ్యాంగం నిర్దేశిస్తున్నది.
ఇందులో భాగంగానే ప్రాతినిధ్యం లేని, లేదా తక్కువగా ఉన్న వివిధ కులాలకు, తరగతులకు అవకాశాలు కల్పించేందుకు అనేక మార్పులను, చర్యలను ప్రభుత్వాలు తీసుకుంటూ వస్తున్నాయి. అనేక రకాలైన అభివృద్ధి, సంక్షేమ కార్యాచరణతో పాటు రిజర్వేషన్లను కూడా రాజ్యాంగం రచించిన పెద్దలు ఒక ఆసరాగా అణగారిన వర్గాల కోసం అందించారు.
స్వాతంత్య్రానంతర భారతదేశంలో విద్య, ఉద్యోగాల్లో కొన్ని కులాలు తీవ్ర వెనుకబాటుకు గురవుతుండగా వారిని గుర్తించి, మిగతా వారితో సమానంగా అవకాశాలు కల్పించే ప్రయత్నమే రిజర్వేషన్ల ఏర్పాటు. దీనికి నేపథ్యం స్వాతంత్య్రానికి పూర్వం నుంచే ఉన్నది. అప్పట్లోనే బ్రిటిష్ వారి కాలంలో 1881-1931 మధ్య జరిగిన 5 జనాభా లెక్కల్లో ఈ వెనుకబాటును గుర్తించి రిజర్వేషన్లు కల్పించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ స్థితిగతులను అధ్యయనం చేసిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ అదే పద్ధతిని కాలానుగుణమైన మార్పులతో కొనసాగించాలని భావించింది.
రాజ్యాంగంలోని అధికరణం 38 ప్రకారం ప్రభుత్వాలు సామాజిక క్రమాన్ని కాపాడటం ద్వారా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి. సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ న్యాయాలు సాధించాలి. అది ప్రభుత్వాల బాధ్యత.
రాజ్యాంగంలో అత్యంత వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు చేర్చబడినాయి. అయితే అప్పటికీ ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించబడలేదు. చంపకం దొరై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తమిళనాడులో బీసీ రిజర్వేషన్లు చెల్లవని తీర్పు ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా తమిళనాడు అంతటా నిరసనలు పెల్లుబుకాయి. పెరియార్ రామస్వామి నాయకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తమిళ ప్రజలు ఉద్యమించారు. దీంతో దిగొచ్చిన కేంద్రం 1951లో తొలి రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15 (4), 16 (4) లను రాజ్యాంగంలో చేర్చింది. ఈ క్రమంలో 1961లో రాష్ర్టాలు తమ సొంత సర్వేలు నిర్వహించి, రాష్ట్ర-నిర్దిష్ట ఓబీసీ జాబితాలను రూపొందించాలని భారత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దానికనుగుణంగా ఉమ్మడి ఏపీలో ప్రయత్నాలు జరిగినా పాలకుల చిత్తశుద్ధి లేక విఫలమయ్యాయి. చివరగా అనంత రామన్ కమిషన్ 1970లో సమర్పించిన నివేదిక వల్ల తొలిసారి బీసీలకు రిజర్వేషన్లు దక్కాయి.
ఇక కేంద్ర సంస్థల్లో రిజర్వేషన్ల విషయానికి వస్తే మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం సామాజికంగా లేదా విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించడానికి, కేంద్ర సంస్థల్లో రిజర్వేషన్ల కోసం 1979 జనవరి 1 నాడు మండల్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఈ కమిషన్ 1980 డిసెంబర్ 31న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దురదృష్టవశాత్తూ ఈ నివేదిక పదేండ్ల పాటు కాంగ్రెస్ పాలనలో కోల్డ్ స్టోరేజీలో పెట్టబడింది. మళ్లీ 1990లో నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఉండగా ఈ నివేదిక వెలుగుచూసింది. సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో 1990 ఆగస్టు 7న అప్పటి ప్రధాని వీపీ సింగ్ పార్లమెంట్లో మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని ప్రకటించారు. బీసీలకు కేంద్రం నియంత్రణలోని విద్యా సంస్థల్లో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రకటించి అమలుచేశారు. 1993, సెప్టెంబర్ 8 నుంచి కేంద్ర విద్యావకాశాలు, ఉపాధి రంగాల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
కుల, జనగణన అవసరం: భారతదేశంలో ఇప్పుడు లభిస్తున్న రిజర్వేషన్లకు స్వాతంత్య్రానికి పూర్వం 1931లో బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన మాత్రమే ఆధారం. ఆ తర్వాత ఇప్పటివరకూ కేంద్రం మళ్లీ ఆ పనికి పూనుకోలేదు. 2018లో అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాము 2019లో మళ్లీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్త కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత వారు అధికారంలోకి వచ్చినా మళ్లీ ఆ మాటే ఎత్తలేదు. బ్రిటిష్ పాలనలో 1881 నుంచి 1931 మధ్య జరిగిన 5 జనాభా లెక్కల్లో అన్ని కులాలను లెక్కించారు.
1951లో నిర్వహించిన మొదటి జనాభా గణనలో, కులాన్ని లెక్కించరాదని జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రాజ్యాంగంలో చేర్చారు కాబట్టి ఎస్సీ, ఎస్టీలను లెక్కించేందుకు మినహాయింపు ఇచ్చారు. 1951 నుంచి ప్రతి జనగణనలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీలు) వారిని లెక్కించారు. అయితే అప్పటికే ఎస్సీ, ఎస్టీల అంత ఎక్కువ వెనుకబాటు కాకపోయినా మిగతా కులాల కన్నా వెనుకబాటుకు గురవుతున్న ఓబీసీల సమస్యలు తెరమీదికి వచ్చాయి.
అయితే ఓబీసీ రిజర్వేషన్ల కోసం కులాలవారీగా, ప్రాంతాలవారీగా ఓబీసీల జనాభా లెక్కలు తప్పనిసరి. కాబట్టి భారత ప్రభుత్వం ఆ తర్వాత తొలిసారిగా వచ్చిన 2001 జనాభా లెక్కల ప్రకారం ఓబీసీలను లెక్కించి ఉండాలి. కానీ, అలా చేయలేదు. దీనివల్ల మొత్తంగా అన్ని రిజర్వేషన్లు కలిపి 50 శాతానికి మించినప్పుడు ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు. విచారించిన కోర్టు ఓబీసీల కులగణన జరగలేదు కాబట్టి మొత్తంగా 50 శాతానికి దాటకుండా అందులోనే బీసీ రిజర్వేషన్లు సర్దుబాటు చేయాలని చెప్తూ వచ్చాయి. కాబట్టి ఓబీసీలకు తమ రిజర్వేషన్లు తమకు దక్కాలంటే కులగణన అనివార్యమవుతుంది.
2012లో ఉమ్మడి ఏపీ స్థానిక ఎన్నికల్లో నోటిఫికేషన్ రాగా అదే సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. విషయం కోర్టుకు చేరడంతో హైకోర్టు నిమ్మక జయరాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయనే కారణం చేత బీసీ రిజర్వేషన్లను కొట్టివేసింది. ఇదే సందర్భంలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన మరో రెండు తీర్పులు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల మనుగడనే ప్రశ్నార్థకం చేశాయి. 2021లో మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన వికాస్ కిషన్‌రావు గవలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో అయినా, 2022లో మధ్యప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో అయినా సుప్రీంకోర్టు స్పష్టంగా ట్రిపుల్ టెస్ట్ ప్రకారం మాత్రమే బీసీ రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్పునిచ్చింది. అంటే… 1.డెడికేటెడ్ బీసీ కమిషన్ రిజర్వేషన్ ప్రక్రియ పర్యవేక్షించేందుకు నియమించాలి. 2.బీసీల జనాభా నమోదు చేయాలి. వారి వెనుకబాటును నిరూపించగలగాలి. 3.మొత్తంగా రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదు.
ఈ నేపథ్యంలో 2023 తెలంగాణ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ చేసింది. ఇందులో భాగంగా బీసీలకు ఉపవర్గీకరణతో కూడిన 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి తర్వాత అధికారంలోకి రావడం జరిగింది. ఆ మేరకు కాంగ్రెస్ చర్యలు తీసుకోవలసి ఉన్నది. బీసీ రిజర్వేషన్ల కోసం ఇదివరకే కోర్టులు సూచించిన మేరకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వల్ల చాలా జాప్యం జరిగింది. దాదాపు 12 నెలల కాలం వృథా కావడం జరిగింది.
ఎట్టకేలకు ఏర్పర్చిన డెడికేటెడ్ కమిషన్ నిర్వహిస్తున్న సర్వేలో అనేక అంశాలు సరిచేసుకోవలసి ఉన్నది. ఇంకా ఎన్యుమరేటర్లు చాలా ఇండ్లకు రానట్టు తెలుస్తున్నది. అలాగే సమయాభావం ఉన్నందున ఎన్యుమరేషన్ నెమ్మదిగా జరగడం సరికాదు. కొన్నిచోట్ల కులగణన పత్రాలు రోడ్ల పక్కన కనిపిస్తుండటం ఆందోళనకరం. ప్రస్తుత బీసీల స్థితిగతుల నేపథ్యంలో వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ ముందడుగుకు ఈ కింది చర్యలు తీసుకోవలసి ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వం కుల, జనగణనను పారదర్శకంగా, సమగ్రంగా నిర్వహించాలి. కామారెడ్డి డిక్లరేషన్‌లో హామీ ఇచ్చినట్టుగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకనే ఎన్నికలు నిర్వహించాలి. బీసీల వెనుకబాటుకు, జానాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రిజర్వేషన్ల మొత్తం పరిమితిని 50 శాతం దాటి పెంచేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలి. బీసీ విద్యార్థులకు రీయింబర్స్మెంట్ ఎప్పటికప్పుడు విడుదల చేయాలి. సంక్షేమ హాస్టళ్లలో విద్య, వసతి, భోజనం మెరుగుపర్చాలి. శాసనసభలో మహాత్మా జ్యోతీబా ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలి.
వివిధ సభల్లో బీసీల ప్రస్తుత ప్రాతినిధ్యం : స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటుతున్నా నేటికీ బీసీల ప్రాతినిధ్యం ఎందులోనూ వారి జనాభా ప్రకారం లేవు. లోకసభలో ఓబీసీ ఎంపీలు (2024 ఎన్నిక తర్వాత) ప్రస్తుతం 138 (25.4 శాతం) మంది ఉన్నారు. గత ఎన్నికల్లో కానీ, అంతకు ముందు ఎన్నికల్లో కానీ ఎప్పుడూ వీరు ఇంతకన్నా తక్కువే ఉన్నారు. 2009లో 18 శాతం ఉండగా, 2014లో 20 శాతం, 2019లో 22.8 శాతం ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 21 శాతం మంది మాత్రమే ఓబీసీ వర్గానికి చెందినవారు. దేశంలోని ఏ ఎన్నిక తీసుకున్నా బీసీల ప్రాతినిధ్యం 20 నుంచి 25 శాతం లోపే. సమాజంలో 52 శాతం ఉన్న బీసీలు ఉమ్మడి ఏపీలో 294 మంది ఎమ్మెల్యేల్లో వీరి సంఖ్య ఏ రోజూ 40 మందిని దాటలేదు. 90 మంది ఉన్న కౌన్సిల్ సభ్యుల్లో 20 మందిని చేరలేదు. ఇక తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలలో కేవలం 22 మంది (18.5 శాతం) మాత్రమే బీసీలు. ఈ పరిస్థితే ఇలా ఉంటే స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉన్నది. అలాగే ఇటు నిధుల పరంగానూ బీసీలు ప్రస్తుతం కేంద్రంలో తమకు రావాల్సిన వాటిలో కనీసం సగం వనరులు, అవకాశాలు కూడా పొందలేక పోతున్నారు. ఈ పరిస్థితుల్లో బీసీల సంక్షేమం కోసం కేంద్రంలో ఒక్క మంత్రిత్వ శాఖ లేకపోవడం విచారకరం. బీసీలకు శాఖ ఉంటే బడ్జెటరీ కేటాయింపుల్లో ప్రాధాన్యం దక్కేది. 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో ఓబీసీల సంక్షేమానికి 2 వేల కోట్లు మాత్రమే కేటాయిస్తే ఓబీసీ సంక్షేమం, అభివృద్ధి ఎలా జరుగుతుంది?
సమగ్రమైన కులాల వారీ డేటా లేకుం డా విద్య, ఉద్యోగాల్లో, రాజకీయ రంగా ల్లో వెనుకబాటును గుర్తించలేం. ఈ పరిస్థితి వల్ల రిజర్వేషన్లకు ప్రతిబంధకాలు ఏర్పడుతాయి. అలాగే బలహీన వర్గాల కోసం రాజ్యాంగబద్ధంగా నిర్దేశించబడిన సామాజిక న్యాయ విధానాలు సమర్థవంతంగా అమలు కావు. బీసీలకు సంబంధించినంత వరకు రాజ్యాంగం కులాలకు బదులుగా తరగతి అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ, సుప్రీంకోర్టు ఇప్పటివరకు ఇచ్చిన వివిధ తీర్పులు వెనుకబడిన తరగతులను నిర్వచించడానికి కులాన్ని ప్రధాన ఆధారంగా పరిగణించాయి.
తెలంగాణ జాగృతి విద్య, ఆర్థిక, రాజకీయంగా వెనుకబడిన వర్గాల, కులాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న సామాజిక సంస్థ. అసెంబ్లీలో బడుగుల సూర్యుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో అనేక కార్యక్రమాలు, ఉద్యమ రూపాలు తీసుకొని విగ్రహాన్ని సాధించిన సంస్థ. తర్వాత మహిళా బిల్లు కోసం సైతం ఢిల్లీ వేదికగా అఖిల పక్షాల మద్దతు కూడగట్టడమే కాకుండా జంతర్ మంతర్వద్ద భారీ ధర్నా నిర్వహించింది.
రాజకీయ రంగంలో నేటికీ నామమాత్ర ప్రాతినిధ్యానికే పరిమితమవుతున్న బీసీల కోసం హైదరాబాద్ సహా 5 చోట్ల రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి మద్దతు కూడగట్టింది. ఈ సందర్భంగా వివిధ కులసంఘాలు, బీసీ మేధావులు లేవనెత్తిన అనుమానాలు హేతుబద్ధమైనవి. వీటన్నింటినీ నివృ త్తి చేసి, సమర్థవంతంగా కులగణన చేయవలసిన అవసరం ఉన్నది. బీసీలకు స్థానిక సంస్థల్లో న్యాయమైన వాటా దక్కేదాకా సమష్టిగా రాజకీయ పార్టీల సంస్థల కృషి అవసరం.
ఇప్పటికే 2011లో జతీయ జనాభా లెక్కల్లో భాగంగా సేకరించిన కులాల వారీ వివరాలు చెల్లుబాటు కానందున ఎక్కువ జాగ్రత్త అవసరమని మేము భావిస్తున్నాం. ఇటీవల బీహార్‌లో చేసిన కులగణన కూడా సాంకేతిక సమస్యలతో తాత్కాలికంగా అమలు కాలేదు. కాబట్టి ము న్ముందు చట్టసభల్లో, న్యాయస్థానాల్లో నిలబడేలా సాధికారిక సమగ్ర కులగణన జరపాలి.
రాజకీయ రిజర్వేషన్లు : ఇక స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల విషయానికి వస్తే 1993 వరకు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఎక్కడా బీసీ రిజర్వేషన్లు లేవు. 73వ, 74వ సవరణల (1993) తర్వాత, రాజ్యాంగం పంచాయతీలు, మున్సిపాలిటీలలో ఓబీసీలకు కూడా తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించింది. ఇందుకు రాజ్యాంగంలో ఆర్టికల్ 243 (6) మరియు ఆర్టికల్ 243డీ (6) చేర్చబడ్డాయి. ఈ ఆర్టికల్స్ ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు జనాభా దామాషా ప్రకారం, మహిళకు 33.33 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఇవి తప్పనిసరిగా ఇవ్వవలసినవి అని సూచించారు. కానీ, ఓబీసీలకు వచ్చేటప్పటికి రిజర్వేషన్లు ఎంత శాతమో చెప్పలేదు. వెనుకబడిన తరగతుల వారు ఆయా రాష్ర్టాలు ఇచ్చిన రిజర్వేషన్లు పొందాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. దీనికనుగుణంగా ఉమ్మడి ఏపీలో పంచాయతీ రాజ్ చట్టం (1994) తీసుకువచ్చారు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఈ చట్టంతో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 1994 నుంచి లభించడం ప్రారంభమైంది.