రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు కావొస్తున్నది. ఈ కాలంలో వారి పనితీరుకు ఈ నెల 11వ తేదీన ఓ పరీక్ష జరుగబోతున్నది. అదే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక. అయితే, 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు గురించిన ప్రస్తావన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో చేయడం లేదు. అయినా, ఆ పార్టీ నాయకులకు ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. దానికి, ఆ నాయకులు సమాధానం చెప్పలేకపోతున్నారు.
ఇప్పటికే జనం ఓ అభిప్రాయానికి బలంగా వచ్చారనే చర్చ జోరుగా సాగుతున్నది. కాంగ్రెస్ నాయకుల మాటలపై నమ్మకం పోయిందని కొందరు ఓటర్లు బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంలోనే సీఎం రేవంత్ ఓ అడుగు ముందుకేసి కారు పార్టీకి ఓటేస్తే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు నిలిపివేస్తామన్నారు. ఈ మాట విన్న నియోజకవర్గ ప్రజలే కాదు, సొంత పార్టీ నాయకులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇచ్చిన గ్యారెంటీల్లో అమలుచేస్తున్న ఆ కొన్ని పథకాలనూ నిలిపివేస్తామనడంతో రోడ్ షోకు హాజరైన ప్రజలు అయోమయానికి లోనయ్యారు. తమను గెలిపించకుంటే ప్రజలకు సంక్షేమ పథకాలు నిలిపేస్తామని చెప్పిన తొలి సీఎం ఈయనే కావొచ్చని అనుకుంటున్నారు. మరి కొందరు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు అప్పట్లో ఓటర్లపై ఫైర్ అయిన సందర్భాలను గుర్తుకుతెచ్చుకుంటున్నారు. గురువు బాటలో నడుస్తున్న శిష్యుడని మరికొందరు వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసేది పేదలే. ప్రధానంగా తెలంగాణ జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చి స్థిరపడిన వలసజీవులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎర్రగడ్డ, రహమత్‌నగర్, షేక్‌పేట్, బోరబండ, సోమాజిగూడ, వెంగళ్రావునగర్, యూసఫ్‌గూడ ప్రాంతాలున్నాయి. అందులో ఎర్రగడ్డ, రహమత్‌నగర్, షేక్‌పేట ప్రాంతాలకు చెందినవారే ఎక్కువ మంది ఓట్లు వేస్తారు. గెలుపోటములను నిర్ణయించేది ఈ డివిజన్ల ఓటర్లే. సంక్షేమ పథకాలు ఇక్కడి ఓటర్లను ప్రభావితం చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నగరంలోని పేదలకు ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్ల గురించి తెలుసు. అంతేకాదు, వేలమంది పేదలు గృహ ప్రవేశాలు ఇం కా చేయాల్సి ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇప్పటివరకు వారికి తాళాలు ఇవ్వలేదని తెలుస్తున్నది. ఈ విషయం పేదలకూ తెలుసు. అంతేకాదు, ఉచిత కరెంట్, పేదలకు కష్టకాలంలో బియ్యం పంపిణీ, బస్తీ దవాఖానాల సౌలభ్యం కూడా వారి మనస్సులో ఉన్నది. అంతేకాదు, పేదింటి బిడ్డల వివాహాలకు లక్షా నూట పదహార్లు అందుకున్నవారూ ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాన్పుల సమయంలో గత ప్రభుత్వం ఆదుకున్న సందర్భమూ వారు ఇంకా మర్చిపోలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజానీకం లబ్ధి పొందిన పథకాల జాబితా చాలా పెద్దది.
జూబ్లీహిల్స్ అనగానే మేడలు, మిద్దెలు మనసులోకి రావడం సహజం. కానీ, మైసూర్ బజ్జీలో మైసూర్ లేనట్టే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ అనే ప్రాంతం ఉండదు. కొన్ని ఆర్థిక స్థితిమంతులున్న కాలనీలు ఉన్నప్పటికీ ఎక్కువ మురికి వాడలు ఇక్కడే ఉన్నాయి. పేదల సంక్షేమం కేంద్రంగా కేసీఆర్ అమలుచేసిన పథకాల గురించిన చర్చే ఇప్పుడు ఎక్కువగా అక్కడ జరుగుతున్నది. ఓటరు నాడి తెలుసుకునేందుకు ప్రయత్నించిన ప్రతి ఒక్కరికీ ఎదురవుతున్న అనుభవమిదే. గడిచిన పదేండ్లలో కరెంట్ కోతల్లేవంటున్నారు. అంతే కాదు, ‘అప్పటి-ఇప్పటి’ ప్రభుత్వ పనితీరు గురించి సవివరంగా ఓటర్లే వివరిస్తున్న సందర్భాలెన్నో ఉన్నాయి. బీఆర్ఎస్ కంటే తాము ఎక్కువ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు చెప్పారు. రెండేండ్లు పూర్తవుతున్నా ఇప్పటివరకు పథకాలను సంపూర్ణంగా అమలుచేయలేదు. ఉచిత బస్సు పథకాన్ని మరింత పక్కాగా అమలుచేయాలని బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, బస్సుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయాలూ ఈ నియోజకవర్గ ప్రజల మధ్య తీవ్ర చర్చగా ఉన్నాయి. బస్సు చార్జీలను గత ప్రభుత్వం పెంచలేదు. ఈ ప్రభుత్వం పెంచింది. ఈ నియోజకవర్గంలో ఉండే పేదలకు బస్సే ప్రధాన ప్రయాణ సాధనం. అది వారికి భారంగా మారింది. మెట్రో ప్రయాణం వారికి ఆర్థికంగా భారమవుతున్నది. అందుబాటులో ఉందనుకున్న బస్సు చార్జీలు పెంచడంతో పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. మహిళలకు ఉచితం అంటూనే ఈ మేరకు మగ వారి జేబులకు చిల్లులు పెట్టారు. ఈ విషయాన్నీ ప్రజలు గమనిస్తున్నారు.
కాంగ్రెస్ నాయకులు రొటీన్ మాటలే చెప్తున్నారు. కేటీఆర్ రోడ్ షోలు జనంతో కిక్కిరిసిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రజా స్పందన ఇట్లుంటే సీఎం రేవంత్ ఓటర్లను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు తాజా మాటలతో తేలిపోయింది. తమ పార్టీకి కాదని వేరేవారికి ఓటేస్తే సంక్షేమ పథకాలు అందివ్వబోమంటున్నరు. ఇలాంటి మాటలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తాయని గ్రహించాలి.
ఇలా చెప్పడం వల్ల అటూ ఇటుగా ఉన్న ఓటర్లు కూడా సంపూర్ణంగా బీఆర్ఎస్ వైపు మళ్లుతున్నారనే చర్చలు జోరందుకున్నాయి. రెండేండ్లుగా కాంగ్రెస్ నాయకులు మాటలు తప్ప చేతల్లేవని ప్రజలకు అర్థమైంది. అందుకే రెండేండ్ల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అని ముఖ్యమంత్రి గాని, కాంగ్రెస్ నాయకులు గాని చెప్పేందుకు సాహసించడం లేదు. క్షేత్రస్థాయి విషయాలు వారికి అర్థమవుతున్నాయి. అందుకే ఓటర్లను నయానా, భయానా తమ వైపునకు తిప్పుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, అది కూడా బెడిసి కొట్టినట్టయిందని రాజకీయ పండితుల విశ్లేషణ.
గత ప్రభుత్వంపై సానుభూతి ఎక్కువగా కన్పిస్తున్నది. ప్రధానంగా ఇది సిట్టింగ్ సీటు కావడం, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అకాల మరణంతో జరుగుతున్న ఉప ఉన్నిక కావడం, అతని సతీమణియే ఇక్కడ పోటీచేయడం సహజంగానే కొంత సానుభూతి ఉంటుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ హయంలో అమలుచేసిన కొత్త పథకాలు లేవు. పాతవి పడకేశాయి. ఇక ఆ సంగతి గురించి చెప్పాల్సిన పనిలేదు. బీజేపీ అంతర్గతంగా ప్రచారం ముమ్మరం చేసిందంటున్నారు కానీ వాస్తవ పరిస్థితి భిన్నం. ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకు వివిధ సంఘాలు, సంస్థలు, స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అందులో ఫార్మా సిటీ రైతులు ప్రధానంగా ఉన్నారు. నిరుద్యోగులు భారీ ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఈ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న అభిమానం బాగా పనిచేస్తుందనే చర్చ సాగుతున్నది. పదేండ్ల సంక్షేమ పథకాలు అమలైన తీరును కూడా ప్రజలు పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. అంటే, తాము ఎవరి పక్షమో ఇప్పటికే వారో నిర్ణయానికి వచ్చారనే అభిప్రాయం కూడా ఉన్నది. గత రెండేండ్లుగా ఇచ్చిన హామీలు అమలుచేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాణేనికి ఒకవైపు చూస్తున్న ఇక్కడి ఓటర్లు గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు జరిపిన తీరు తద్వారా పొందిన లబ్ధిని నాణేనికి రెండోవైపు చూస్తున్నట్టు అక్కడ సర్వేలు చేస్తున్న సంస్థలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ రెండే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించే అంశాలు. ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్ తమ పార్టీని గెలిపించకపోతే ఉన్న ఆ ఒకటి, రెండు పథకాలకు కూడా మంగళం పాడేస్తానని చెప్పి బెదిరించడమా? బ్లాక్ మెయిల్ చేయడమా? అనేది ఇప్పుడు ఓటర్లు మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించుకోవాలేమో.
ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకు వివిధ సంఘాలు, సంస్థలు, స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అందులో ఫార్మా సిటీ రైతులు ప్రధానంగా ఉన్నారు. నిరుద్యోగులు భారీ ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఈ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న అభిమానం బాగా పనిచేస్తుందనే చర్చ సాగుతున్నది. పదేండ్ల సంక్షేమ పథకాలు అమలైన తీరును కూడా ప్రజలు పదే పదే గుర్తు చేసుకుంటున్నారు.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
అస్కాని మారుతీ సాగర్
90107 56666