తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముందే వస్తే బాగుండుననే మాటలు ఇటీవల తరచూ వినవస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఎన్నికలు ఐదేండ్లకోసారి అయినందున తిరిగి జరగవలసింది 2028 నవంబర్లో. అనగా మరొక మూడేండ్లకు. రేవంత్ రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు కాగా, మరుసటి ఎన్నికలు ముందే వస్తే బాగుండుననే మాట ప్రజల నుంచి మొదట సుమారు ఏడాదిన్నర పాటు వినరాలేదు. కాంగ్రెస్ పరిపాలనను గమనించటం, ఆశనిరాశలు, సాధారణ ధోరణిలో విమర్శించటం ఆ విమర్శలు క్రమంగా పెరగటంగా సాగింది. ఈ ప్రభుత్వం పోయి తిరిగి కేసీఆర్ వస్తే బాగుండుననే మాటలు ఆ తర్వాత నుంచి మెల్లగా మొదలై ఈసరికి క్రమంగా ఎక్కువవుతున్నాయి.
ఇది అసాధారణ స్థితి. అధికారం కోసం ప్రయత్నించే పార్టీలు ఎన్నికలలో హామీలివ్వటం సహజం. అందులో కొంత అతిశయోక్తులు కూడా సహజం. తమ జీవితంలో అనేక ఎన్నికలను చూసిన ప్రజలకు ఈ రెండూ అనుభవంలోనివే. అందువల్ల హామీలలో అతిశయోక్తులను, వాటి అమలులో వైఫల్యాలను ఒకమేర వరకు పట్టించుకోరు. కొన్నింటికి సంబంధించి, ఇంకా సమయం ఉంది గదా చూద్దాము లెమ్మనుకుంటారు. అది ప్రజలకు ఉండే ఉదార స్వభావం. కానీ, ఏదైనా పరిమితులు దాటినప్పుడు వారి దృష్టి మరొక విధంగా ఉంటుంది. ఆ విధంగా, ప్రస్తుత ప్రభుత్వానికి ఏడాదిన్నర గడిచేసరికి ఆ పరిమితి పూర్తిగా మించిపోయినట్టు అర్థమవుతున్నది. కనుకనే, ఎన్నికలు ముందుగానే వస్తే బాగుండుననే మాటలు అప్పటినుంచి నెమ్మదిగా మొదలై, ఇప్పుడు రెండేండ్లు కావస్తున్న సమయానికి తరచుగా వినవస్తున్నాయి.
వాస్తవానికి ఏడాదిన్నర పాటు వేచి ఉండటం కూడా ఎక్కువే. ఎందుకంటే, గత ఎన్నికల సమయంలో తమ ఆరు గ్యారెంటీలకు కాంగ్రెస్ పార్టీ స్వయంగా పెట్టుకున్న గడువు కేవలం 100 రోజులు. అనగా 3 మాసాల 10 రోజులు. హామీలలోని అతి ముఖ్యమైన వాటిలోని ఒక్కటైన రైతు రుణమాఫీకి అసలు గడువనేది లేదు. అధికారం స్వీకరించిన వెంటనే ఆ పని చేస్తామన్నారు. కొన్నింటికి మొదటి శాసనసభా సమావేశాలలోనే చట్టం చేస్తామన్నారు. అందుకు, గ్యారెంటీల వంద రోజులకు ఏడాదిన్నర చాలా చాలా ఎక్కువ. అయినప్పటికీ, ‘వంద రోజులంటే వందేనా. ఆరు నెలలన్నా ఓపిక పట్టలేరా. ఏడాది సమయమైనా ఇవ్వరా’ అనే మాటలు ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల వరకు వినవచ్చాయి. ప్రజల విషయానికి వస్తే, కొందరు 100 రోజుల గడువు తీరిన కొద్దివారాల నుంచి విమర్శలు చేయగా, ఆ విమర్శకుల సంఖ్య ఆరు నెలలు, ఏడాది, ఒకటి రెండు పంట కాలాలు గడుస్తున్న కొద్దీ పెరగసాగింది.
ఏడాది దాటినకొద్దీ ఒకదానికొకటి తోడు కాసాగాయి. హామీల అమలు పట్ల ఆయా వర్గాలలో ఆశలు చచ్చిపోవటం ఒకవైపు ఏవో సాకులతో పేదల ఇండ్ల కూల్చివేతలు, భూముల ఆక్రమణలు, నిరసించిన పేదలపై అణచివేతలు మరొకవైపు, రకరకాల పరిపాలనా వైఫల్యాలు, పైనుంచి కిందివరకు పెచ్చరిల్లసాగిన అవినీతి ఇంకొక వైపు, ప్రశ్నించే ప్రతిపక్షాలపై ఎదురుదాడులు, దొంగ కేసులు, ఎన్నికలలో కాంగ్రెస్కు ప్రచారాలు చేసి తమను నమ్మించి ఇప్పుడు నమ్మక ద్రోహాలపై నోరు విప్పని మేధావి గణాలు, తమ బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు గత ప్రభుత్వంపైన, కేంద్రంపైన నెపాన్ని నెట్టివేసే ధోరణి, ముఖ్యమంత్రితో పాటు కొందరు ఇతర మంత్రులూ పార్టీ నాయకుల నోటి దురుసుతనం వంటివన్నీ కలిసి ప్రజల సహనాన్ని నశింపజేశాయి. ఏడాది గడిచినప్పటి నుంచి ఇది వేగంగా జరగసాగింది.
ఇదంతా ఒక పరిణామక్రమం అన్నమాట. అకస్మాత్తుగానో, ఎవరైనా బోధనలు చేస్తేనో జరిగింది కాదు. పైగా, తమ సొంత అనుభవాలను, అవగాహనను పరిగణనలోకి తీసుకొని ఒక అభిప్రాయానికి రాగల సామాన్య ప్రజలు, పైన అనుకున్నట్టు తగినంత ఉదార స్వభావం కూడా కలవారు, అకస్మాత్తుగానో, ఇంకెవరైనా చెప్తేనో ఇటువంటి ముఖ్యమైన విషయాలలో ఒక అభిప్రాయానికి రారు.
ఈ పరిణామక్రమంలో తిరిగి గమనించవలసిన అంశాలు మూడున్నాయి. ఒకటి, ప్రభుత్వం పట్ల అసంతృప్తి గ్రామాలలో, పట్టణాలలో, అన్నివర్గాలలో కూడా కన్పిస్తుండటం. గత ఎన్నికలలో హైదరాబాద్ నగరవాసులు బీఆర్ఎస్ను పూర్తిగా బలపరచగా, కాంగ్రెస్ రెండేండ్ల పాలనను చూసి ఇప్పటికీ తమ అభిప్రాయాన్ని మార్చుకోలేదు. కాంగ్రెస్ పట్ల వారి వ్యతిరేకత పెరిగినట్టు తోస్తున్నది. గ్రామీణులకు సంబంధించి, కాంగ్రెస్ విపరీతమైన హామీలతో ఆకర్షితులైన ఆ ప్రజలలో అదంతా వట్టి మోసమని అర్థమై గత అభిప్రాయాన్ని ఏడాది గడిచేసరికి మార్చుకోవటం మొదలైంది. గమనించవలసిన మూడు అంశాలలో ఒకటి ఇది కాగా, వివిధ కారణాల వల్ల కాంగ్రెస్కు మద్దతుదారులైన వారు కూడా జరుగుతున్నది చూసి, ప్రభుత్వాన్ని సమర్థించలేని ఇబ్బందికి గురయ్యే పరిస్థితి రావటం రెండవది. వారు మొదటి ఏడాది కాలం ఏదో చెప్పి సమర్థించినా, ఆ తర్వాత నుంచి వారి వాదనలో, స్వరంలో బలహీనత కనిపించసాగింది. ఇంకా చెప్పాలంటే తాము సైతం నిరసన భావాలకు రావటం మొదలైంది. కాకపోతే, ఆ మాట బహిరంగంగా అనలేరు. జనాంతికంగా పలకరిస్తే తమ బాధ వెళ్లబోసుకుంటారు.
ఇక మూడవ మార్పు ఏవో కారణాలతో కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరించిన మేధావులు, ఎటూ ఉండని తటస్థ ప్రజా వర్గాలకు సంబంధించినది. ఇందులో మేధావుల పరిస్థితి, ఈ ఏడాది రెండేండ్ల పరిస్థితిని గమనించి, గొంతులో వెలక్కాయ సామెత వలె తయారైంది. ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడే నిజాయితీ కలగటం లేదు, సాహసం రావటం లేదు. మాట్లాడకపోతే ప్రజలు ఎత్తిచూపటం, తమను నిలదీయటం మరొకవైపు మొదలైంది. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలకు గత ప్రభుత్వాన్ని నిందించే ఉపాయాన్ని ప్రభుత్వం వలెనే వీరు కూడా కొంతకాలం అనుసరించారు. కానీ అది ప్రజల దృష్టిలో చెల్లుబాటు కావటం లేదని అర్థమైనట్టున్నది. దానితో, ఆ బృందంలోని కొందరు, తమ పరువు కాపాడుకునేందుకా అన్నట్టు నంగి నంగి మాటలు ఎప్పుడైనా మాట్లాడుతున్నారు.
ఎక్కువ మంది ఇప్పటికీ మౌనం వహించటమో, ప్రభుత్వానికి మచ్చిక కావటమో చేస్తున్నారు. చివరగా, కమ్యూనిస్టుల విషయం మాట్లాడుకోవాలో లేదో స్పష్టత రావటం లేదు. పోయిన ఎన్నికలప్పుడు వారిద్దరి వైఖరిని నిర్ణయించింది పెద్ద పార్టీలు దయతో చేసే సీట్ల ప్రదానం మాత్రమేనని తెలిసిందే. ఆ ప్రదానాన్ని స్వీకరించి తద్వారా సోషలిజం సాధనకు పాటుపడుతున్న ఒక పార్టీ, ‘మిత్ర ధర్మాన్ని’ పాటించి, ప్రజలకు ఏమి జరుగుతున్నది, జరగటం లేదు అనేదానితో నిమిత్తం లేకుండా అధికార పక్షం పట్ల ‘మిత్ర విధేయత’ను అనుసరిస్తున్నది. ‘సీట్ల ప్రదానం’ కుదరని పార్టీ స్పష్టమైన రీతిలో ఏమి చేయాలన్నది తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతూ, ప్రజల పక్షాన ప్రభుత్వంతో గాలి యుద్ధాలు మాత్రం చేస్తున్నది. ‘బీజేపీని ఓడించటం కోసం’ అనే సిగ్గుబిళ్లను కట్టుకొని పరువు కాపాడుకోజూస్తున్నది.
దీనంతటి మధ్య ప్రజల నుంచి, ఈ ప్రభుత్వాన్ని ‘ఇంకా ఎంతకాలం భరించా’లనే ప్రశ్నలు వినవస్తున్నాయి. సామాన్య ప్రజలు లెక్కలు సరిగా గుర్తులేనందువల్ల మిగిలింది, ‘ఇంకో ఏడాదా? అని, ఇంకో రెండేండ్లా’ అని అడగటం పలు చోట్ల వినవస్తున్నది. ‘కాదు మూడేండ్లు’ అని చెప్తే నిట్టూర్చుతున్నారు. ఈ అడగటాలు, నిట్టూర్పులు కొంతకాలం క్రితం వరకు తక్కువగా ఉండేవి. ఇటీవల పెరుగుతున్నాయి. అప్పుడు మంద్రస్వరంలో వినిపించేవి. ఇప్పుడు తీవ్రంగా మారుతున్నాయి. ఈ ప్రభుత్వాన్ని భరించవలసిన సమయం తాము అనుకుంటున్న దానికన్న ఎక్కువై కనిపించటంతో అసహనం కలిగి, ఆగ్రహంగా మారుతున్నది. అది వారి మొహాలలో, పదజాలంలో కనిపిస్తున్నది.
అగ్నికి ఆజ్యం వలె దీనంతటికి తోడవుతున్న స్థితి ఒకటున్నది. అది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన గ్యారెంటీలను, ఇతర హామీలను రాగల కాలంలోనూ అమలుచేయలేదన్న అభిప్రాయం ప్రజలకు ఏర్పడటం. అదేవిధంగా, స్వయంగా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ప్రయాణించి వచ్చి డిక్లరేషన్ పత్రాలు ప్రకటించి నమ్మబలికిన గాంధీ వంశ మహాశయులు తమ అధికార ఆశయం తీరింది గనుక ఇక ఆ విషయమై పల్లెత్తి అయినా మాట్లాడబోరని తెలిసిపోవటం. ఇక్కడి ప్రభుత్వం ఎప్పుడో ఒకటి మొక్కుబడిగా చేసి, మాటలతో మభ్యపెట్టే పని మాత్రం చాలానే చేయజూస్తుందని బోధపడటం. ఇటువంటివన్నీ అగ్నికి ఆజ్యం వలె తోడవుతున్నందున, ఎన్నికలు ఇంకా మూడేండ్లు ఉండటంపై విసుగు పెరుగుతున్నది. అంతకన్న ముందు వచ్చే అవకాశం లేదా అని అడుగుతున్నవారూ కనిపిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొద్దిరోజుల క్రితం, తమ పార్టీ తెలంగాణలో తిరిగి అధికారానికి రావటం అసాధ్యమని అన్నట్టు వార్తలు వెలువడ్డాయి. వాటిని ఆయన ఖండించకపోవటం గమనించదగినది. దానిని బట్టి, ఆయనకు ఇక్కడి సమాచారాలు సరిగానే చేరుతున్నాయనుకోవాలి.
-టంకశాల అశోక్