రాజు సమర్థుడైతే రాజ్యం బాగుంటుంది. అదే అసమర్థుడైతే ఆ రాజ్యం ఆగమైపోతుంది. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి కూడా ఇదే!
పరిపాలన అనుభవం లేని వ్యక్తుల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది. కాంగ్రెస్ పాలనా వైఫల్యాలు ప్రజలకు
శాపాలుగా మారాయి. రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలు ప్రజలపై గుదిబండలుగా పరిణమించాయి.
కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో పోరాటాలు, ఆత్మ బలిదానాలు, ఉద్యమాల ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్రం పదేండ్లపాటు సంక్షేమం, అభివృద్ధిలో దేశానికి రోల్‌మోడల్‌గా మారింది. అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో తెలంగాణను దేశం అనుసరించింది. పంజాబ్‌ను తలదన్ని దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ నిలిచింది. తలసరి ఆదాయంలోనూ నెంబర్ వన్‌గా వెలిగింది. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో చేసి తెలంగాణను అగ్రపథాన నిలిపారు కేసీఆర్.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండేండ్లు పూర్తికావస్తున్నాయి. ఇటీవలి క్యాబినెట్ సమావేశంలో రెండేండ్ల ప్రజాపాలన విజయోత్సవాలు జరపాలని నిర్ణయించారు. అసలు రెండేండ్లలో కాంగ్రెస్ సర్కార్ ఏం సాధించిందని విజయోత్సవాలు చేసుకుంటారు? వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి కంటే మోసాలే ఎక్కువగా చేసింది. పరిపాలన చేతగాక, ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడుతూ అభివృద్ధిని అటకెక్కించి సొంత ఆస్తులను పెంచుకునేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ దెబ్బకి తెలంగాణ అన్ని రంగాల్లో కిందపడింది. ‘వద్దురా నాయన’ కాంగ్రెస్ పాలన అని నేడు జనం చీత్కరించుకునే పరిస్థితి వచ్చింది. రైతు రుణమాఫీ అరకొరగానే చేశారు. రూ.2 లక్షలకు పైగా రుణమున్న వారితో బ్యాంకుల్లో నగదు కట్టించుకొని మోసం చేశారు.
రైతుబంధును ఎగ్గొట్టి రైతన్నకు కొండంత ధీమా లేకుండా చేశారు. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూల్చుతూ, బడా బాబులకు అండగా నిలుస్తూ వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఆడబిడ్డలకు రూ.2,500 ఇస్తానని బీరాలు పలికి మోసం చేశారు. అక్కాచెల్లెళ్లకు కేసీఆర్ ఇచ్చిన కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం అదనంగా ఇస్తామని నమ్మబలికి, చివరికి రూ.లక్ష కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. వృద్ధులకు రూ.4,000 పింఛన్ ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఎన్నికలకు ముందు అశోక్ నగర్లో నిరుద్యోగులతో కూర్చొని ఛాయ్ తాగిన రాహుల్‌గాంధీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చారు. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే ఉరికించి కొడుతున్నారు. లగచర్లలో తమ భూములు లాక్కోవద్దని ఎదురుతిరిగితే రైతులకు బేడీలు వేసి, ఆడవాళ్లను హింసించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సోషల్ మీడియాలో ప్రశ్నించినవాళ్లను జైళ్లకి పంపిస్తున్నది ఈ ప్రజా ప్రభుత్వం. రెండేండ్లలోనే రూ.2 లక్షల కోట్ల పైచిలుకు అప్పులు చేసి కొత్తగా ఒక్క భవనమైనా కట్టారా? కొత్తగా ఒక్క ప్రాజెక్టు అయినా నిర్మించారా? అసలు ఏం చేశారని విజయోత్సవాలు జరుపుకుంటారు?
కులగణన పేరుతో తప్పులతడకగా సర్వే చేయించి బీసీలను కాంగ్రెస్ సర్కార్ వంచించింది. ఎన్నికలు వస్తున్నాయని ఆగమేఘాల మీద 42 శాతం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో పెట్టి హడావుడి చేశారు. రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిసీ, రాజ్యాంగం ప్రకారం సాధ్యం కాదని తెలిసినా, కోర్టుల ముందు చెల్లవని తెలిసినా, పార్లమెంట్లో చట్టం చేయాలని తెలిసినా, తామేదో బీసీలను ఉద్ధరిస్తున్నామని చెప్పుకోవడానికి, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి జీవో విడుదల చేశారు. చివరకు కోర్టులో వారే కేసులు వేయించి, బీసీలను మోసం చేశారు.
స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటేనే కాంగ్రెస్ పార్టీ జంకుతుందంటే రాష్ట్రంలో వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 42 శాతం బీసీ రిజర్వేషన్ ఒక డ్రామా అని తెలిసిపోవడంతో ఇప్పుడు కొత్త డ్రామాలాడుతున్నది కాంగ్రెస్. హస్తం నాయకులు మోసం చేయని రంగం లేదు. వాళ్ల మాటలకు అడ్డూ అదుపూ లేదు. కాంగ్రెస్ అవినీతి చరిత్రను స్వయంగా వాళ్ల మంత్రులే బయట పెట్టుకోవడం గమనార్హం. ప్రభుత్వ ఖజానాను వాటాలు వేసుకుంటున్నారు. పంపకాల్లో తేడా వచ్చి బజారున పడి పరువు తీసుకుంటున్నారు. బీహార్‌లో ఉండే గన్ కల్చర్‌ను తెలంగాణకు తీసుకువచ్చారు. బ్లాక్మెయిల్, చీకటి దందాలు, బెదిరింపు రాజకీయాలకు నెలవుగా మార్చారు.
ఒకప్పుడు పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న తెలంగాణ నేడు పెట్టుబడి పెట్టాలంటే జంకే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయింది. దాన్ని నమ్ముకుని బతుకుతున్నవారు రోడ్డునపడ్డారు. ఇంత జరుగుతున్నా తెలంగాణలో కాంగ్రెస్‌కు వంతపాడటం తప్ప బీజేపీ కనీసం ప్రశ్నించిన పాపాన పోలేదు. ఉమ్మడి మిత్రులుగా పరస్పరం సహకరించుకుంటూ కాంగ్రెస్-బీజేపీలు చీకటి సంసారం చేస్తున్నాయి. దేశంలో విరోధులు అయినప్పటికీ కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలన్న ఉమ్మడి ఎజెండాతో రాష్ట్రంలో మాత్రం పరస్పరం సహకరించుకుంటున్నాయి. కాంగ్రెస్‌పై బీజేపీ ఈగ కూడా వాలనీయడం లేదు. ఈ పార్టీల తీరు చూసి వారి కార్యకర్తలే నవ్వుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ చేష్టలు, వారు చేస్తున్న దుర్భర పాలనను చూసి విసిగిపోయిన జనం ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. బహిరంగంగానే రేవంత్ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ పాలన బాగుండేదని, తెలంగాణను రేవంత్‌రెడ్డి సర్వనాశనం చేస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ చేసిన మోసాలకు గట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చే తీర్పు కోసం యావత్ తెలంగాణ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించినా హైదరాబాద్ మాత్రం బీఆర్ఎస్ వెంట నడిచింది. నేడు తెలంగాణకు కావాల్సిన హక్కుల కోసం తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నది. అందుకే కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. అభివృద్ధిని కాంక్షించేవారు, కాంగ్రెస్ దుష్ట చేష్టలను అంతమొందించాలని కోరుకునేవారు, తమ ఓటుతో సమాధానం చెప్పాలి. సోయి తప్పి పరిపాలనను పట్టించుకోకుండా తెలంగాణను ఆగం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సోయికి రావాలంటే ఓటే ఆయుధం. సరైన తీర్పు ఇచ్చి కాంగ్రెస్ చేసిన ధోకాకి ప్రజల చేతిలో ఇప్పుడు ఉన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనే మోకాతో బుద్ధి చెబుతారని యావత్ తెలంగాణ సమాజం ఆశిస్తున్నది. ఎప్పటికైనా మనోడు మనకైతడు. జాతీయ పార్టీలతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదు. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష.జై తెలంగాణ!
-తెలంగాణ విజయ్
94919 98702