శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న రైతులను నడి రోడ్డుపై కాల్చి చంపేలా చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు రైతుల సంక్షేమ నినాదాన్ని జపిస్తున్నది. వ్యవసాయంపై కార్పొరేట్లకు ఆధిపత్యం కట్టబెట్టేందుకు నల్ల చట్టాలను తేవాలని ప్రయత్నించిన పార్టీ రైతుల కోసం మేమున్నామంటూ ముందుకొస్తున్నది. కానీ దీనివెనుక ఉన్న వ్యూహాలను రైతులు పసిగట్టాలి. బీజేపీని ఆదరిస్తే బతుకులు దుర్భరమవుతాయని గ్రహించాలి.తెలంగాణ రైతుల మాదిరి దేశ రైతాంగమంతా బీజేపీ కల్లబొల్లి మాటల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
విద్వేషం చిమ్మడం తప్ప ఏనాడూ సామాన్యులు, రైతుల గురించి పట్టించుకోని బీజేపీ తెలంగాణలో పాగా వేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నది. ఆ పార్టీ జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్నవారు తెలంగాణకు తరచూ వస్తున్నా ఇక్కడ ప్రజలకు లబ్ధి చేకూర్చే ప్రకటనలేమీ చేయడం లేదు. ఇటీవల ఖమ్మంలో రైతు గోస – బీజేపీ భరోసా పేరుతో బీజేపీ నిర్వహించిన సభ అలాంటిదే. దేశంలో గుణాత్మక మార్పు కోసం అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏమి చేయాలో తోచక బీజేపీ మరోసారి రైతు గోస పేరిట సభ నిర్వహించడం హాస్యాస్పదంగా ఉంది. బీజేపీ అంటేనే సంపన్నుల పార్టీ అన్న సంగతి అందరికీ తెలిసిందే! కొత్త నినాదం ఎత్తుకున్నంత మాత్రాన బలపడతామని వారనుకోవడం భ్రమే అవుతుంది. సంస్కరణల పేరుతో సామాన్యలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ… తెలంగాణపై కపట ప్రేమను ఒలక బోస్తున్నది ఆ పార్టీ.
తెలంగాణ ఉద్యమ నాయకుడిపై విద్వేష ప్రసంగాలు చేయడానికే తప్ప తెలంగాణ అభివృద్ధి పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని అనేక సందర్భాల్లో తేలిపోయింది. తరచూ తెలంగాణకు వచ్చే బీజేపీ కేంద్ర మంత్రులు హడావుడి చేయడం తప్ప నిధులు ఇచ్చేదేమీ ఉండదు. రాష్ట్ర నేతలను కలవడం, తెలంగాణలో ఇంకేం చేస్తే అధికారంలోకి రావొచ్చని ఆలోచనలు చేయడం మాత్రమే చేస్తున్నారు. అప్పుడప్పుడూ ఉప ఎన్నికలు తీసుకొచ్చి కేసీఆర్ ముందు ఓడిపోతున్నారు. ఎలాగైనా కేసీఆర్‌ను ఓడించి తెలంగాణను తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలనే ఆరాటమే తప్ప అభివృద్ధికి కేంద్రం తరపున నిధులు ఇవ్వాలన్న ధ్యాసే ఉండదు.
తెలంగాణ ముఖ్యమంతి కేసీఆర్ గజ్వేల్‌లో మిషన్ భగీరథ పథకాన్ని జాతికి అంకితం చేసిన కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు. స్వయంగా మోదీ ప్రారంభించిన ఈ పథకం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచినప్పటికీ కేంద్రం నుంచి నిధులు ఇస్తానని మోదీ హామీ ఇవ్వలేకపోయారు. తరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ రాష్ర్టానికి న్యాయంగా ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదు. సొంత రాష్ట్రం గుజరాత్‌కు మాత్రం నిధుల వరద పారిస్తూ విపక్ష పాలిత రాష్ర్టాలపై వివక్ష చూపిస్తున్నారు. వివిధ రంగాల్లో సాధించిన ప్రగతికి తెలంగాణ జాతీయ, అంతర్జాతీయ సంస్థల మన్ననలు పొందుతున్నా అవేవీ కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదు.
తెలంగాణ ఉద్యమ రథసారథి, ముఖ్యమంతి కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లినప్పుడు సాదాసీదా వ్యక్తిలా సామాన్యులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. రాష్ట్రంలోని పరిస్థితులను గమనించి ఫోన్లలో నేరుగా గ్రామ సర్పంచులతో మాట్లాడి భరోసా ఇస్తారు. ఇటీవల వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించి బాధిత రైతులకు మనో ధైర్యాన్నిచ్చారు. పెద్ద నాయకుడు వస్తున్నాడంటే.. కచ్చితంగా ఎంతో కొంత నిధులు కేటాయిస్తారనే ఆశ ప్రజల్లో ఉంటుంది. దాన్ని కేసీఆర్ నిజం చేసి చూపిస్తున్నారు. కానీ రాష్ర్టానికి తరచూ వస్తున్న ప్రధాని మోదీ మాత్రం కేసీఆర్‌ను దూషించడం, తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేయాలని చెప్పడానికి మాత్రమే పరిమితం కావడం విడ్డూరం. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి కోసం పారదర్శకంగా పాలన నిర్వహిస్తూ, సబ్బండ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న కేసీఆర్ వెంటే తెలంగాణ సమాజం నడవాల్సిన అవసరం ఉన్నది.
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణపై మరోసారి విషం చిమ్మడానికే ఖమ్మం సభకు వచ్చారని ప్రజలు గ్రహించాలి! కపట ప్రేమతో మన దగ్గరకు వస్తున్న నేతల కుట్రలను పసిగట్టకపోతే పచ్చవడుతున్న తెలంగాణ చిచ్చులతో రగిలిపోయే ప్రమాదం ఉన్నది. మణిపూర్‌లో చిన్నా పెద్ద తేడా లేకుండా చాలామంది మైనారిటీలు మంటల్లో కాలిపోతుంటే రాజకీయ ఆధిపత్యం కోసం మౌనంగా ఉంటున్న బీజేపీకి తెలంగాణలో స్థానంలో లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉన్నది.
-సంపత్ గడ్డం
78933 03516