జపాన్ను అధిగమించి ప్రపంచంలోని నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని మే 25న నీతి ఆయోగ్ ప్రకటించింది. ఆకాశమే హద్దుగా సాగుతున్న భారత వృద్ధికి ఇది నిదర్శనమని కేంద్ర మంత్రులు గొప్పలు చెప్పుకొన్నారు. రెండున్నర నుంచి మూడేండ్లలో జర్మనీని కూడా భారత్ దాటేస్తుందని కూడా అన్నారు. కొన్ని న్యూస్ చానెల్స్ బాకాలూదాయి. సోషల్ మీడియాలో కొందరు ‘భక్తులు’ ఇది ఆర్థిక విజయమని ట్రెండింగ్ చేశారు. అసలు మనం ఒక్కో మెట్టు ఎందుకు ఎక్కాలి? నేరుగా అమెరికాను కూడా దాటేసి ప్రపంచంలోని అగ్ర ఆర్థిక వ్యవస్థగా మారిందని ఎందుకు ప్రకటించకూడదు? ఏం చెప్పినా నమ్మేవారు ఉన్నారు కదా!
జీడీపీ అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది? అనేది (భక్తులకు) వారికి తెలియనవసరం లేదు. మోదీ నేతృత్వంలో భారత్ విశ్వగురుగా మారుతున్నదని గర్వంతో ఛాతీ విరుచుకోవడమే వారికి తెలుసు. భవిష్యత్తులో ఏదైనా కారణం వల్ల జర్మనీని అధిగమించడానికి మూడేండ్ల కంటే ఎక్కువ సమయం పడుతుందని చెప్పినా వారు గుడ్డిగా నమ్మేస్తారే తప్ప, ఎప్పటికీ ప్రశ్నించరు. జీడీపీ అనేది దేశపు ఆర్థిక ఆరోగ్యానికి సూచిక. ఇది దేశంలో ఉత్పత్తి అయిన అన్ని వస్తువులు, సేవల మొత్తం ద్రవ్య విలువను సూచిస్తుంది. ఆర్థికవేత్తలు ప్రధానంగా రెండు విధానాలుగా జీడీపీని లెక్కిస్తారు. ఒకటి, ఉత్పత్తి విధానం. ఇది వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు వంటి వివిధ రంగాల్లో ఆర్థిక కార్యకలాపాల విలువను ప్రతిబింబిస్తుంది. రెండోది, వ్యయ విధానం. ఇది వస్తువులు, సేవలపై మొత్తం ఖర్చును ప్రతిబింబిస్తుంది. భారతదేశ జీడీపీ గణాంకాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా చర్చనీయాంశమవుతున్నాయి. జీడీపీ గణాంక పద్ధతిని, డేటా మూలాధారాలను మార్చడమే అందుకు కారణం. కొత్త పద్ధతి ప్రకారం కార్పొరేట్ రంగం డేటా ఎక్కువగా వచ్చిచేరింది. ఇది వృద్ధి గణాంకాల సవరణను వివాదాస్పదం చేసింది. దీంతో మొత్తం గణాంకాల విశ్వసనీయతపైనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కొత్త విధానం పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు తర్వాత ఏర్పడిన ఆర్థిక మందగమనం విమర్శల నుంచి తప్పించుకోవడానికి కూడా సహాయపడింది.
ఈ నేపథ్యంలో 2011-17 మధ్యకాలంలో భారత జీడీపీ వృద్ధి 2-2.5 శాతం ఎక్కువగా చూపించి ఉండొచ్చని ప్రధాని పూర్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం వంటి కొందరు ఆర్థికవేత్తలు చెప్పారు. జీడీపీ గణాంకాలు బ్యాంక్ క్రెడిట్, ఎగుమతి పనితీరు, వేతన వృద్ధి వంటి సూచీలకు వాస్తవ దూరంగా ఉన్నాయని రతిన్ రాయ్, జయతి ఘోష్ వంటి ఆర్థికవేత్తలు కూడా ఆరోపించారు. ఇద్దరు స్వతంత్ర సభ్యులు రాజీనామా చేయడంతో స్టాటిస్టికల్ కమిషన్ విశ్వసనీయత కూడా దెబ్బతిన్నది.
భారత్ దాని జనాభా సామర్థ్యంతో పోలిస్తే చాలా తక్కువ పనితీరు కనబరిచింది. కానీ, అందుకు భిన్నంగా చాలా దేశాలు జనాభాను దేశాభివృద్ధికి అనుకూలంగా వినియోగించుకున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పారిశ్రామిక విస్తరణను చేపట్టిన జపాన్ 1970ల నాటికి ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించింది. 1960-90లలో సాంకేతిక, పారిశ్రామిక శక్తిగా దక్షిణ కొరియా రూపాంతరం చెందింది. ఆర్థిక సంస్కరణల తర్వాత తయారీరంగంలో వృద్ధి సాధించిన చైనా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగింది.
భారత యువ జనాభా నిరుద్యోగంలో, తక్కువ ఉత్పాదకత రంగంలో చిక్కుకుపోయింది. దేశ జనాభాను సక్రమంగా వినియోగించుకొని ఉంటే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేది. అందుకు సిగ్గుపడాల్సిందిపోయి, నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని గర్వపడుతున్నది. దేశంలోని ప్రజలకు కనీస అవగాహన ఉంటే ‘అసలు మనమెందుకు ప్రపంచంలోని నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థ కాలేదు?’ అని పాలకులను ప్రశ్నించేవారు. జీడీపీ వృద్ధి ముఖ్యమే. కానీ, అది ప్రజల జీవితాలను మెరుగ్గా మార్చగలిగినప్పుడు మాత్రమే. భారత తలసరి జీడీపీ 2,800 డాలర్లు కాగా, జపాన్ తలసరి జీడీపీ 33,000 డాలర్లు. మానవాభివృద్ధి సూచీలో జపాన్ (19) కంటే భారత్ (132) చాలా వెనుకబడి ఉంది. భారతదేశాన్ని జపాన్‌తో పోల్చడమనేది తప్పుదోవ పట్టించడమే.
వృద్ధాప్య జనాభా ఎక్కువగా ఉన్నా, సున్నా వృద్ధి నమోదవుతున్నప్పటికీ జపాన్ తన పౌరులకు సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన విద్య, సమర్థవంతమైన మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రతను అందిస్తున్నది. యువ జనాభా, వేగవంతమైన వృద్ధి కలిగిన భారత్ మాత్రం అధిక శిశు మరణాలు, విద్యావ్యవస్థ వైఫల్యం, అధ్వానమైన ప్రజారవాణా, పోషకాహార లోపంతో ప్రతి రంగంలో వెనుకబడి ఉన్నది.
ప్రపంచంలోని అత్యంత అసమాన దేశాల్లో భారత్ కూడా ఒకటి. దేశంలోని మొదటి 10 శాతం మంది జనాభా 57 శాతం ఆదాయాన్ని కలిగి ఉన్నది. కింది వరుసలోని 50 శాతం మంది ఆదాయం 13 శాతం మాత్రమే. సంపదపరంగా చూస్తే దేశంలోని ఒక శాతం జనాభా చేతుల్లోనే 40.6 శాతం సంపద పోగై ఉన్నది. కింది వరుసలో ఉన్న సగం జనాభా వద్ద మూడు శాతం సంపద మాత్రమే ఉన్నది.
2020 నుంచి బిలియనీర్ల సంపద 35 శాతం పెరగగా, అందుకు విరుద్ధంగా ద్రవ్యోల్బణం పేదల జీవితాలను పీక్కుతినేసింది. ఈ జీడీపీ మ్యానియాకు ఇప్పటికే అడవుల నరికివేత, నదుల విషతుల్యం, గ్రామాల వలసలు, నగరాల్లో ఊపిరాడకపోవడం, రైతుల్లో నిరాశ, ప్రజాస్వామ్యం ఖూనీ చేయడం వంటి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇది అభివృద్ధి కానే కాదు, జీడీపీని చూపించి దోపిడీ చేయడమే.
(అవుట్‌లుక్ సౌజన్యంతో…)
-ఆనంద్.టి