‘ఆవిడ అరకిలో టమాటలు కొంటున్నది. నల్లడబ్బు దండిగా ఉందేమో’. ఇది అప్పుడెప్పుడో దశాబ్దాల కిందట ఆర్కే లక్ష్మణ్ వేసిన కార్టూన్లో సగటు మహిళ మాట. ఇప్పుడది వైరల్ అవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
వాతావరణ మార్పుల ఫలితంగా ఏర్పడుతున్న కరువులు, వరదల చక్ర భ్రమణంలో ఇరుక్కున్న భారత్ ప్రస్తుతం ఆహార కొరత సమస్యను ఎదుర్కొంటున్నది. గోధుమలు, తర్వాత బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడమే ఇందుకు నిదర్శనం. సగటు కన్న కొంచెం ఎక్కు వ వర్షపాతమే నమోదు అవుతున్నప్పటికీ ప్రాం తాల మధ్య వ్యత్యాసం ఏర్పడి పంటలపై ప్రభా వం చూపుతున్నది. ఇటీవల వర్షాల వల్ల కొత్తగా వేసిన వరి పంటలు దెబ్బతినడంతో బాస్మతియేతర రకాల బియ్యంపై కేంద్రం నిషేధం విధించింది. దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. అయితే సంక్షోభం కేవలం వరి అన్నానికే పరిమితం కాలేదు. టమాట ధరలు గత కొద్దిరోజులుగా ఇస్రో వదిలిన రాకెట్లా పైపైకి పోతున్నాయి. దీంతో మార్కెట్లు, దుకాణాలు, లారీల్లో ఉంచిన టమాటలు చోరీకి గురవుతున్నాయి. టమాట రైతులు పంటపొలాల దగ్గర పగలూరాత్రి కావలి ఉంటున్నారు. మరోవైపు కార్టూన్లు, జోకులు పేలుతున్నాయి. అయితే ఒకప్పుడు ప్రభుత్వాలను పడగొట్టినట్టుగా చెప్పుకొనే ఉల్లిగడ్డల ధరలు మాత్రం ఓ మోస్తరు స్థిరత్వాన్ని సంతరించుకున్నాయి.
ప్రపంచ కర్బన ఉద్గారాల్లో చైనా, అమెరికా తర్వాత మూడో స్థానంలో ఉన్న భారత్ వాతావరణ మార్పుల ప్రభావం వల్ల ఆహార అభద్రతకు గురికావడం మనం చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలూ ఈ సమస్యకు కారణమవుతున్నాయి. ఉదాహరణకు రోడ్డు రవాణానే తీసుకుంటే విద్యుత్తు వాహనాలకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లభించడం లేదు. ఫలితంగా వాటి అమ్మకాలు ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. పైగా పబ్లిక్ చార్జర్ల ఏర్పాటులో మనదేశం అమెరికా, చైనా కన్నా చాలా వెనుకబడి ఉన్నది. బయో ఇంధనం కోసం ఇథనాల్ తయారీని ప్రోత్సహించడం మంచిదే. దానివల్ల మన చమురు దిగుమతి వ్యయం, కాలుష్యం తగ్గుతాయి. కానీ అది వ్యవసాయంపై ఒత్తిడి పెంచుతున్నది. చెరకు వంటి పంటలు నీళ్లను అధికంగా వినియోగించుకుంటాయన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ధరల విధానం వల్ల ఈ పంటకు డిమాండ్ పెరుగుతున్నది. ఈసారి పంట విస్తీర్ణం 17 శాతం పెరుగుదల నమోదు చేసింది. అదే సమయంలో వరి పంట విస్తీర్ణం 8 శాతమే పెరిగింది. మరోవైపు పప్పుదినుసుల పంటల విస్తీర్ణం 0.8 శాతం తగ్గింది. పునర్వినియోగ ఇంధన వనరుల విషయంలోనూ భారత్ వెనుకబడి ఉన్నది. 2028 నాటికి 55 గిగావాట్ల సౌరవిద్యుత్తు ఉత్పాదనకు టెండర్లు పిలువడం పెద్ద లక్ష్యమే. కానీ ఆ లక్ష్యం ఆశయాల స్థాయి దాటి ఆచరణ రూపం దాల్చడానికి చాలా కృషి జరగాల్సి ఉన్నది.
ఈ శతాబ్దిలో వాతావరణ మార్పుల దుష్ఫలితాలను అందరి కన్నా ఎక్కువగా అనుభవించాల్సింది భారతే. కానీ వచ్చే దశకాల్లో మరే ఇతర దేశం కన్నా ఎక్కువ స్థాయిలో ఈ దేశ కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయి. పంటల సమస్యలు, వరదలు, కరువులు, ఎగుమతి నిషేధాలు, రైతు ఆత్మహత్యలు తగ్గాలంటే ఈ ధోరణిని వెనుకకు మళ్లించాల్సి ఉంటుంది.
– రచన: డేవిడ్ ఫిక్లింగ్
– అనువాదం: రఘురాములు