బీఆర్ఎస్ (టీఆర్ఎస్)కు ఎన్నికలు కొత్త గాదు. ఎన్నికల్లో పోరాడటం కొత్త గాదు. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్కు ఎన్నికల్లో గెలవడం అంతకన్నా కొత్త గాదు. ఇంకా చెప్పాలంటే బీఆర్ఎస్ పురుడుపోసుకున్నదే పోరాడటం కోసం, ఎన్నికల పోరులో గెలవడం కోసం. ఆ గెలుపు బాటలో ఎన్నో ఎన్నికలు, మరెన్నో ఉప ఎన్నికలను చూసింది బీఆర్ఎస్.
ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రూపంలో మరో పోరు వచ్చింది. అయితే, గతంలో వచ్చిన ఎన్నికలు, ఉప ఎన్నికలు అన్ని ప్రత్యేక తెలంగాణ సాధన కోసమైతే, త్వరలో జరగనున్న ఈ ఉప ఎన్నిక మాత్రం కొట్లాడి సాధించిన తెలంగాణను రక్షించుకునేందుకు, తెలంగాణ అస్తిత్వాన్ని సంరక్షించుకునేందుకు. నాడు తెలంగాణ కోసం కేసీఆర్ సారథ్యంలో జరిగిన ఉద్యమంలో సకలజనులంతా టీఆర్ఎస్ వెంటే నిలిచినట్టుగా.. నేడూ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు కేటీఆర్ నేతృత్వంలో జరుగుతున్న ఈ పోరులో ప్రజలందరూ బీఆర్ఎస్ వెంటే నడుస్తున్నారు. తమను తాము కాపాడుకునేందుకు, తమ హక్కులను, తమ జీవితాలను సంరక్షించుకునేందుకు సమాయత్తమవుతున్నారు.
తెలంగాణ పోరుగడ్డ. ఈ పోరాటాల గడ్డపై ఎన్నో జెండాలు ఉండొచ్చు. ఇక్కడి ప్రజలకు ఎన్నెన్నో ఎజెండాలు ఉండొచ్చు. కానీ, తెలంగాణ అస్తిత్వానికి ముప్పు వాటిల్లినప్పుడు, తెలంగాణ ఉనికికి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు జెండాలు, ఎజెండాలను పక్కనపెట్టి మరీ తెలంగాణ ఏకమైపోతుంది. ఉద్యోగులు-నిరుద్యోగులు, ఆటోడ్రైవర్లు-ఆర్టీసీ కార్మికులు, వయోజనులు-వృద్ధులు, కార్మికులు-శ్రామికులు.. ఇలా సకలజనులంతా ఏకమై పోరు సల్పుతారు. తెలంగాణను కాచుకుంటారు. మలి దశ తెలంగాణ ఉద్యమం సమయంలో జరిగిందదే. ఇప్పుడూ అదే జరుగుతున్నది. ఈ మహోజ్వల ఘట్టానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేదిక అయ్యింది.
2001 ఏప్రిల్ 27న తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారు. నాటి నుంచీ స్వరాష్ట్రం కల సాకారమయ్యేంత వరకు తెలంగాణ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఆయన వాడిన అస్త్రం ఎన్నికలు. తెలంగాణ వాదం లేదని రాజకీయ ప్రత్యర్థులు విర్రవీగిన ప్రతీసారి ఆయన ఎన్నికల కదనరంగంలోనే తేల్చుకున్నారు. 2001 నుంచి 2014 వరకు కేసీఆర్ ఎన్నోసార్లు ఎంపీ, ఎమ్మెల్యే పదవులను, కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతోనూ అనేకసార్లు రాజీనామాలు చేయించి ఎన్నికల బరిలో నిలిపారు. అలా పోరులో నిలిచిన ప్రతీసారి టీఆర్ఎస్కు ఈ తెలంగాణ అండగా నిలబడ్డది. కులం లేదు.. మతం లేదు.. వర్గం లేదు.. తెలంగాణ సమాజమంతా ఏకమై స్వరాష్ట్రం కోసం ఎన్నికల పోరుసల్పింది. నేడు కూడా తెలంగాణ తనను తాను కాపాడుకునేందుకు ఏకమైంది. గులాబీ జెండాకు మరోమారు ‘జై’ కొట్టేందుకు సిద్ధమైంది.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలిచ్చింది. కాంగ్రెస్ నైజం తెలిసిన తెలంగాణ ప్రజలు తనను నమ్మరని తెలిసీ, వాటికి గ్యారెంటీలని తోక తగిలించింది. మాయచేసిందో, మంత్రం వేసిందో మొత్తానికి హస్తం పార్టీ హస్తవాసి మారింది. అధికారంలోకి రాగలిగిందే కానీ, తన వక్రబుద్ధిని, కపటత్వాన్ని, మోసం చేసే నైజాన్ని మాత్రం కాంగ్రెస్ వదులుకోలేకపోయింది. నమ్మకద్రోహి కాంగ్రెస్ పార్టీకి విద్రోహ నాయకత్వం తోడవడంతో తెలంగాణ ప్రజల హస్తవాసి తారుమారైంది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ సర్కారు నెరవేర్చలేదు. గ్యారెంటీల వారెంటీ ఎప్పుడో ముగిసింది. పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, తులం బంగారం, విద్యార్థులకు విద్యాభరోసా కార్డు, విద్యార్థినులకు స్కూటీలు.. ఇలా చెప్పుకొంటూపోతే ఒకటా రెండా అభయహస్తం మ్యానిఫెస్టో మొత్తం అమలుకు నోచుకోని హామీల చిట్టానే. కొత్తవి చెయ్యకపోగా పాత పథకాలను ఊడగొట్టారు కాంగ్రెస్ పాలకులు.
పైగా రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలు, అకృత్యాలు, విధ్వంసాలు రాజ్యమేలుతున్నాయి. పచ్చని తెలంగాణ, పసిమొగ్గలాంటి తెలంగాణ వాడిపోయింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం కాంగ్రెస్ పాలనలో ధ్వంసమైపోయింది. హైడ్రా లాంటి అర్థంపర్థం లేని విధాన నిర్ణయాలతో హైదరాబాద్ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతిన్నది. మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ సర్కార్ బుల్డోజర్ పాలన సాగిస్తున్నది. రూపాయి రూపాయి కూడబెట్టి కట్టిన పేదల ఇండ్లను కూల్చివేస్తున్నది. వారిని గూడు లేని పక్షులను చేసింది. సర్కారు అనాలోచిత నిర్ణయాల కారణంగా నగరంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది. దాంతో నిర్మాణరంగంతోపాటు దానిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన అనేక రంగాలు కుప్పకూలిపోయాయి. ప్రజలకు చేసేందుకు పనులు లేవు, ఉండేందుకు ఇల్లు లేదు. ఆకలి బాధలు, పేదల ఆర్తనాదాలు తప్ప, అభివృద్ధి పనులు కానరావడం లేదు.
ఈ పరిస్థితుల నేపథ్యంలోనే తెలంగాణ గుండె రగిలింది. కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందుకే ఎక్కడికక్కడ తెలంగాణ తిరగబడుతున్నది. నమ్మించి వెన్నుపోటు పొడిచిన రేవంత్ ప్రభుత్వాన్ని ఓటు పోటు పొడిచేందుకు రెండేండ్లుగా తెలంగాణ ఎదురుచూసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రూపంలో నేడు ప్రజలకు అవకాశం వచ్చింది. అందుకే కులాలకతీతంగా, మతాలకతీతంగా, వర్గాలకతీతంగా జూబ్లీహిల్స్ వేదికగా తెలంగాణ ఏకతాటిపైకి వచ్చింది. కాంగ్రెస్ సర్కారు పీచమణిచేందుకు సంసిద్ధమైంది. జెండాల్లేవ్.. ఎజెండాల్లేవ్.. జూబ్లీహిల్స్ గడ్డపై తెలంగాణ జెండా ఎగురవేస్తామని ఎలుగెత్తి చాటుతున్నది.
– (వ్యాసకర్త: రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్)
వై.సతీష్ రెడ్డి 96414 66666