స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రైతాంగాన్ని పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ.. రైతులు బాగుపడుతుంటే చూడలేక కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించి ముఖ్యమంత్రిగా ఉద్యమ నాయకుడు కేసీఆర్ పగ్గాలు చేతపట్టి రైతుబాంధవుడిగా రైతుల ప్రయోజనం కోసం అనేక పథకాలకు శ్రీకారం చుట్టారు. వీటిని నిలిపివేసి రాష్ట్ర వ్యవసాయ రంగానికి, రైతాంగానికి నష్టం చేసేలా కనికరం లేని చర్యలకు కాంగ్రెస్ పాల్పడుతున్నది. రైతాంగానికి లాభం చేయాల్సిందిపోయి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రైతుల నోట్లో మట్టికొట్టాలనే కుట్రలకు కాంగ్రెస్ పార్టీ తెరతీసింది.
రైతుల పొలాలకు కేసీఆర్ ప్రభుత్వం ఉచితంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తుంటే మూడు గంటలు చాలంటూ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడటం, భూముల బదలాయింపుపై రైతులకే హక్కు కల్పిస్తూ రూపొందించిన ధరణిని బంగాళాఖాతంలో విసిరివేస్తామని భవిష్యత్తులో పట్వారీ వ్యవస్థను తీసుకువస్తామని, రైతులకు నష్టం తెచ్చే కార్యక్రమాలు తెస్తామని బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కతోపాటు, ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పదేపదే చెప్పడం, బుధవారం రోజు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాణిక్‌రావు ఠాక్రే.. ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తూ రైతుబంధును నిలిపివేయాలని కోరడం.. కాంగ్రెస్ పార్టీకి రైతుల పట్ల ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేస్తున్నాయి.
నిరంతర ప్రక్రియగా ప్రతి సంవత్సరం రెండు సీజన్లలో వేసే రైతుబంధును ఎన్నికల పేరు చెప్పి నిలిపివేయాలని కుట్రలకు పూనుకోవడం కాంగ్రెస్ పార్టీ చిన్న, సన్నకారు రైతాంగ వ్యతిరేక ధోరణులకు అద్దం పడుతున్నది. తెలంగాణ ప్రగతిని ఆగంచేసే దిశగా ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపుల్లలు వేస్తున్న కాంగ్రెస్ నేడు తెలంగాణ సంక్షేమాన్ని అడ్డుకోజూస్తున్నది. ఇది వారి ఫక్తు రాజకీయ స్వార్థానికి అవకాశవాదం, మూర్ఖత్వానికి పరాకాష్ఠగా మారింది.
దేశంలో, రాష్ట్రంలో దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా రాజ్యమేలిన కాంగ్రెస్ ఏనాడూ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రపంచానికి పట్టెడన్నం పెట్టే రైతులే.. ‘అన్నమో రామచంద్రా’ అంటూ ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు కోకొల్లలు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతుల పరిస్థితి కడు దయనీయం. సాగునీరు లేక, పంటలు పండక, ఆదుకునే ప్రభుత్వం లేక ఎందరో రైతులు ఊరు విడిచి వలస వెళ్లారు. బొంబాయి, దుబాయి, భీమండి, హైదరాబాద్‌తోపాటు దేశంలోని నలుమూలల పొట్టకూటి కోసం వెళ్లడం తెలిసిందే.
సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తూ రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను అమలుచేస్తూ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ స్థిరీకరణకు పటిష్ఠమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టాకే తెలంగాణలో వలసలు తగ్గాయి. రైతుబంధు, రైతుబీమాల భరోసా, ధీమాతో వలసవెళ్లిన కుటుంబాలు స్వగ్రామాలకు తిరిగివచ్చి వ్యవసాయం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నాయి. వాస్తవానికి ఎన్నికల మ్యానిఫెస్టోలో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) పార్టీ రైతుబంధు ప్రస్తావన చేయలేదు. రైతుబంధు వంటి పథకం పెట్టాలని డిమాండ్ కూడా చేయలేదు. రైతుల కష్టాలు తెలిసిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎవరూ అడగకుండానే స్వయంగా రైతుల సంక్షేమం కోసం, రైతుబంధు ప్రవేశపెట్టి కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న రైతాంగానికి అండగా నిలిచారు. ఇంతటి ప్రయోజనం కలిగిన రైతుబంధును నిలిపివేయాలని తన స్వార్థం కోసం కాంగ్రెస్ కర్కశంగా ఆలోచించి ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది.
రైతులకు పంట సమయంలో డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారని, పెట్టుబడి కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని విష వలయంలో ఇరుక్కుంటున్నారని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. 2018, మే 1న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 2018 నుంచి ఆగస్టు 2023 నాటికి పది విడతల్లో 68,99,076 మంది రైతులకు రూ.74,815.09 కోట్లను పంట పెట్టుబడిగా అందించింది. ఈ పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించందంటే దీని గొప్పతనాన్ని అంచనా వేయవచ్చు. ఇటువంటి గొప్ప మానవీయ కోణం కలిగిన రైతుబంధును నిలిపివేయమని చెప్పడం కాంగ్రెస్ నాయకుల అవివేకానికి నిదర్శనం. ఈ విషయం తెలిసిన రైతాంగం కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దిగజారుడు రాజకీయాలపై తెలంగాణ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుబంధు కింద ఎకరానికి ప్రారంభంలో రెండు సీజన్లకు కలిపి రూ.8 వేలు ప్రభుత్వం అందించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దీన్ని పెంచుతూ ఎకరానికి రెండు సీజన్లకు కలిపి రూ.10 వేలు అందిస్తున్నది. తాజాగా మ్యానిఫెస్టోలో ఎకరానికి ఏటా రూ.16 వేలు ఇస్తామని ప్రకటించారు. దీనితో తమ ఓటమి ఖాయమని భావించిన కాంగ్రెస్ పార్టీ.. రైతులకు రైతుబంధు అందకుండా కుటిల యత్నాలకు పాల్పడుతున్నది.
రాష్ట్రంలో రైతుబంధు పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య విషయానికి వస్తే రాష్ట్రవ్యాప్తంగా 68,99,076 మంది ఉన్నారు. లబ్ధిపొందుతున్న వారిలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన రైతులున్నారు. ఎస్సీ రైతులు 8,88,926 మంది (12.88 శాతం మంది), ఎస్టీ రైతులు 9.72.972 (14.10) శాతం మంది, బీసీ రైతులు 36,46,804 (52.86) మంది, మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు మొత్తం కలిపి 79.85 శాతం ఉండగా ఇతరులు 20.15 శాతం మంది ఉన్నారు. ఇలా సబ్బండ వర్గాల రైతులకు రైతుబంధును ముఖ్యమంత్రి కేసీఆర్ అందించారు. దీన్ని పరిశీలిస్తే ఏ ఒక్క వర్గానికో కాకుండా అన్ని వర్గాలకు చెందిన రైతు సంక్షేమానికి ఈ పథకం ఊతం అందించింది.
2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.10,486. 36 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 10, 532. 02 కోట్లు, 2020-21లో 14,656.01 కోట్లు, 2021-22లో 14,772.94 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 14,743.02 కోట్లు రైతుబంధు కింద రైతులకు చెల్లించారు. ఇంతటి గొప్ప పథకాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అడ్డుకోవాలని చూస్తూ రైతాంగం జీవితాలతో ఆడుకుంటున్నది. రైతు వ్యతిరేక పార్టీగా ఇప్పటికే ప్రజల్లో ముద్ర వేసుకున్న కాంగ్రెస్ పార్టీ, రైతుబంధు నిలిపివేయాలని లేఖ రాసి మరోసారి ఆ సంగతి రుజువు చేసుకున్నది. ఆ పార్టీ తత్వమే అంత.. ఇంక దాన్నుంచి అంతకు మించి ఏం ఆశిస్తామని జనం పెదవి విరుస్తున్నారు.
-రమేశ్ హజారి
93909 19090