హైడ్రా.. ఇదో మెదడు లేని చేతనం. ఆకలి తప్ప, ఆలోచన లేని జలచరం. నాడీకణం కమాండ్‌తో కదిలే హైడ్రోజోవా జీవి. మేత వేస్తే రూపం మార్చుకుంటుంది. శత్రువు ఎదురుపడితే దూరంగా పారిపోతుంది. హైదరాబాద్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వదిలిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కూడా ఇవే లక్షణాలతో తడబడుతున్నది. రెండు అడుగులు బలంగా వేసిందో లేదో.. అప్పుడే రూపం మారింది. రోకు తప్పింది. మహా నగరం తూర్పు, పడమర, ఉత్తర దిక్కుల్లోనే హైడ్రా సంచరిస్తుంది. కానీ, దక్షిణ దిక్కు గమనానికెందుకో జంకుతున్నది.
హైడ్రా కమిషనర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ వ్యక్తిత్వం మీద ఎవరికీ ఎటువంటి అనుమానం లేదు. తను కమిషనర్‌గా ఉన్నడు కాబట్టే, జనం హైడ్రా గమనం మీద కొంత భరోసాతో ఉన్నరు. ఒక ప్రభుత్వ పాలసీ దాని స్వభావం మీద కాకుండా అధికారి విశ్వసనీయత మీద మనుగడ సాగించటం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. హైడ్రాకు కమాండ్ ఉంటేనే కదిలే జీవి. అట్లాగే కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు కమాండ్ మీద నడిచేదే పోలీసు వ్యవస్థ. అది పోలీసు ఉద్యోగ ధర్మం. హైడ్రా గమనం మీద రోజురోజుకు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కూల్చివేతల దశలో కాంగ్రెస్ మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు ఇల్లు కూలగొట్టింది. హైడ్రా పనితనానికి ఇదే రోల్ మోడల్ అని ప్రకటించింది. ఇది అభినందనీయమే. కానీ, దానికి ఆనుకొనే ఉన్న అదే రాజుగారి రక్త సంబంధీకుల ఇంటిని ఎందుకు పడగొట్టలేదనే అనుయోగం అప్రస్తుతం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ట్రైసిటీలో చెరువుల పరిరక్షణ, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్, ప్రభుత్వ భూముల దురాక్రమణ అంటూ అవతరించి, ఆటోపం చేస్తున్న హైడ్రా దక్షిణం దిక్కును ఎందుకొదిలేసింది?
మహానగరం త్రయ చెరుగుల హైడ్రా విధ్వంసం జరుగుతుంటే.. నాలుగో దిక్కు నయా జమానా సాగుతున్నది. ఐటీ సిటీ రాయదుర్గంలో ఆక్యుపెన్సీ లేదన్న మెట్రో రైలు, జనమే లేని బేగరి కంచెకు దారులు వెతుకుతున్నది. రీజినల్ రింగు రోడ్లు పంట పొలాల్లో పాములు తిరిగినట్టు అష్ట వంకర్లతో పారాడుతున్నయి. 300 అడుగుల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు.. రేడియల్ రహదారులు.. కనెక్టింగ్ రోడ్లు.. వాటి వెనకాలే వేల ఎకరాల భూములు.. ఒత్తిళ్ల ఒప్పందాల దందా దుమ్ము లేపుతుందట. నాడు అజలాపూర్, ఇర్విన్, వెల్దండ పల్లెల్లో జల్, జమీన్, జంగల్ నినాదంతో గన్ను పట్టి, ప్రజాదర్బార్లు పెట్టి రాజ్ బహుదూర్ల భూములను పంచిన అన్నలే.. ఇవాళ నయీం అనుచరులై బేగరి కంచెల (ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ) రౌడీ దర్బార్లు పెట్టిండ్రట. నాడు సాగు చేసుకొమ్మని రైతుకు ఇచ్చిన భూములకు నేడు కబ్జా హక్కును రద్దు చేస్తున్నరట. కబ్జా రద్దు పరిచిన భూములకు కూడా అగ్రిమెంట్లు చేస్తున్నరట. అగ్రిమెంట్లు, ఆక్రమణ వెనుక ఎవరున్నారనే మీమాంసను పక్కనపెడితే.. ముళ్లకంచెలో కృత్రిమ రియల్ ప్రకంపనలు జనించటమే హైడ్రా అంతర్గత వ్యూహమా?
కూడు, గూడు, గుడ్డ కమ్యూనిస్టు సిద్ధాంతం. కూడు దొరికేది వ్యవసాయ భూమిలోనే. కమ్యూనిస్టు కార్యాలయాలు ప్రజా పోరాటాల కేంద్రాలని కామ్రేడ్లు నిత్యం నినదిస్తుంటారు. రాజ్యానిది ఎప్పుడూ బలవంతమే. కాపు కాయాల్సిన బాధ్యత కామ్రేడ్ల మీదుంది.
ఇప్పటి ప్రజా పోరాటాల్లో అతి బలమైనది సొంతింటి కలే. సర్కారు భూముల్లో ఎర్ర జెండాలు పాతమని ఒక్క పిలుపిస్తే.. వేల మంది బీద బిక్కి, బక్క జనాలు లాఠీలకు, తూటాలకు ఎదురుబోతరు. 60 గజాల ఇంటి జాగ కోసం ఆత్ర పడుతరు. అటువంటిది దశాబ్దాలుగా తనువుతో పెనువేసున్న పేదింటికి హైడ్రా రూపంలో ఆపద వచ్చింది. మరో వైపు పల్లె పొలిమేర మీద ట్రిపుల్ఆర్ కత్తి వేలాడుతున్నది. దొంగ రాత్రి పంటపొలాల మీద డ్రోన్లు తిరుగుతున్నయి. రాత్రికిరాత్రే హద్దులు గీసిపోతున్నయి. ఏ క్షణం ఊర్ల మీద పడి భూములు లాక్కుంటారోనని రైతాంగం భయపడుతోంది. ఈ విపత్తును అడ్డుకునే శక్తి ఏది? ప్రజా ఉద్యమాలే కదా..! మరి ఇప్పుడా ఆపన్న హస్తం ఏది? అన్న స్థానంలో నిలబడి ఆదుకోవాల్సిన ఉద్యమకారులు, ఎర్రన్నలు ఎందుకు సందేహిస్తున్నరు.
ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు శభాష్..! అని జబ్బలు చరిచిన సీపీఐ నారాయణకు మనస్ఫూర్తిగా విప్లవాభివందనాలు. అవినీతి, అక్రమం కూలాల్సిందే. అదే హైడ్రా రెండు బలమైన అడుగులు వేయకముందే గతితప్పి పేదల కొంపల మీదికి మల్లుతుంటే.. ఎదురెందుకు వెళ్లటం లేదు? రోకు తప్పిన హైడ్రా పట్టుమని పది ఫామ్‌హౌస్‌లు కూల్చకముందే వెయ్యి బక్క గూళ్లను చిదిమేసింది. బేగరి కంచెల సెటిల్మెం ట్లు పెట్టింది. ఇప్పుడు ఉద్యమ గొంతులు ఏకం కావాలని సకల జనులు వాంఛిస్తున్నరు.
వర్ధెల్లి వెంకటేశ్వర్లు