మంచి చేయడమే తప్పయితే కేసీఆర్‌ను కచ్చితంగా శిక్షించాల్సిందే. ప్రాణాలు పణంగా పెట్టి, తెలంగాణ తెచ్చినప్పటి నుంచి తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపేవరకు ఆయన చేసిన ప్రతీ పనిపై కమిషన్ వేయాల్సిందే. ఒకటి కాదు, రెండు కాదు.. వందల కమిషన్లు వేయాల్సిందే. కేసీఆర్‌ను విచారించాల్సిందే. అవసరమైతే ఇటలీ, గుజరాత్ నుంచి న్యాయమూర్తులను పట్టుకొచ్చి మరీ విచారించాలి. వలస పాలనలో దోపిడీకి గురై తల్లడిల్లిన తెలంగాణ బానిస సంకెళ్లు తెంచినందుకు, మన నీళ్లు, మన నిధులు దోచుకొని.. మన తెలంగాణను వెనుకపడేసినోళ్లను తరిమికొట్టి ప్రత్యేక రాష్ర్టాన్ని తీసుకువచ్చినందుకు… ఆ తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకువెళ్లినందుకు కేసీఆర్‌పై వందలకొద్ది విచారణ కమిషన్లు వేయాల్సిందే.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యం కాదని ఎంతో మంది మధ్యలో వదిలేసిపోయినా, ఆరంభంలోనే అమ్ముడుపోయినా, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినందుకు.. ప్రాణాలకు సైతం తెగించి తెలంగాణ తెచ్చినందుకు కమిషన్ వేసి కేసీఆర్‌ను విచారించాలి. సిట్టింగ్ జడ్జి, రిటైర్డ్ జడ్జిలతో, సీబీఐ, ఈడీ, సీవీసీ వంటి కేంద్ర సంస్థలు ఎన్ని ఉంటే అన్ని తీసుకువచ్చి కేసీఆర్‌పై విచారణ జరిపించాలి. తెలంగాణ వాళ్లకు పాలించడం రాదని వలస పాలకులు గేలి చేసిన మాటలను అబద్ధాలు చేస్తూ.. రాష్ట్రం సిద్ధించిన ఒకటి, రెండేండ్లలోనే కరెంటు, నీటి కష్టాలు ఎలా తీర్చారు? ఎందుకు తీర్చారో తెలుసుకోవడానికైనా కచ్చితంగా కమిషన్ వేయాల్సిందే. తెలంగాణ వాళ్లకు వ్యవసాయం తెలియదన్న వారి ముఖంపై ఫడేల్మని కొట్టినట్టు రాష్ట్రంలో సాగు విస్తీర్ణాన్ని కోటి 35 లక్షల ఎకరాల నుంచి 2 కోట్ల 38 లక్షల ఎకరాలకు ఎలా పెంచగలిగారో.. కోటి 54 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తిని 3 కోట్ల 78 లక్షల మెట్రిక్ టన్నులకు.. అంటే 145.45 శాతం ఎలా పెంచగలిగారో? అసలు అలా పెంచాలని ఎందుకు అనిపించిందో? తెలుసుకోవడానికి కచ్చితంగా కేసీఆర్‌ను విచారించాల్సిందే, కమిషన్ వేయాల్సిందే.
2014లో దేశవ్యాప్తంగా పంట భూమిలో తెలంగాణ వాటా 2.2 శాతంగా ఉంటే, దానిని 5.35 శాతానికి ఎందుకు పెంచారో? ఇందులో కేసీఆర్ దురుద్దేశం ఏమిటో కచ్చితంగా విచారించాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలనలో 62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకే ఆపసోపాలు పడితే, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడికతీసి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి హైదరాబాద్ వరకు ఎలా నీళ్లు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? కోటి 35 లక్షల ఎకరాలకు నిరంతరాయంగా, ఒక ఎకరా పంట కూడా ఎండిపోకుండా నీరందించే స్థాయికి తెలంగాణను ఎలా అభివృద్ధి చేశారు? నీటిని ఎలా అందించగలిగారో తెలుసుకోవడానికి కచ్చితంగా ఒక కమిషన్ వేయాల్సిందే, విచారణ చేయాల్సిందే.
పంటలు సాగు చేసేందుకు నీళ్లు లేక, పంట పెట్టుబడికి డబ్బులు లేక ఉరికి వేలాడిన రైతన్నకు రైతుబంధుతో బంధువైనందుకు, రైతన్నలకు పెట్టుబడి కష్టాలు తీర్చినందుకు.. అసలు రైతుబంధు ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి దేశంలోని మాజీ న్యాయమూర్తులందరితో కమిషన్ వేయాల్సిందే. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమాతో పెద్ద కొడుకులా నిలిచినందుకు కేసీఆర్‌ను విచారించాల్సిందే. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతుబంధును ఆపకుండా ఇచ్చినందుకు కచ్చితంగా కేసీఆర్‌పై కేసులు పెట్టాల్సిందే. యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కకావికలం చేసినా.. రైతు పండించిన పంట పాడుకావద్దని, ఒక్క గింజ కూడా వదిలిపెట్టకుండా అన్ని పంటలు కొనుగోలు చేసినందుకు కేసీఆర్‌పై వందల కొద్ది కేసులు పెట్టాల్సిందే.
హరితహారం ద్వారా ఊరూరా చెట్లు నాటి.. దేశంలో పచ్చదనం, అటవీ ప్రాంతం పెరిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపినందుకు విచారణ కమిషన్ వేయాల్సిందే. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో గ్రామాలు, పురపాలికలను అభివృద్ధి బాటలో నడిపించినందుకు కేసులు పెట్టాల్సిందే. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, శ్మశానవాటిక, ట్రాక్టర్ పెట్టాలనే ఆలోచన వచ్చినందుకు.. గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్ది మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు అందించినందుకు.. ఆడబిడ్డలు బిందెలతో రోడ్డెక్కకుండా చేసినందుకు.. జాతీయ అవార్డుల్లో సింహభాగం మన గ్రామాలు, పురపాలక సంఘాలకే వచ్చేలా చేసినందుకు కేసీఆర్‌ను విచారించాల్సిందే. కేసీఆర్ కిట్‌తో గర్భిణులకు తోబుట్టువైనందుకు, కల్యాణలక్ష్మితో పెళ్లి పీటలెక్కిన ఆడబిడ్డకు మేనమామ అయినందుకు, కంటివెలుగుతో వృద్ధుల జీవితాల్లో వెలుగులు నింపినందుకు, రూ.100, రూ.200గా ఉన్న పింఛన్లను రూ.3 వేలకు పెంచినందుకు కచ్చితంగా కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాల్సిందే. కులవృత్తులకు ఊతమిచ్చి చేపపిల్లలతో ముదిరాజు బిడ్డలకు తోడుగా నిలిచినందుకు, గొర్లు పంపిణీ చేసి యాదవ బిడ్డలను ఆర్థికంగా బలపర్చినందుకు, రజక, నాయీబ్రాహ్మణులకు ఉచిత కరెంటు ఇచ్చినందుకు, నేత, గీత కార్మికులకు పింఛన్ ఇచ్చినందుకు కేసీఆర్‌ను సీబీఐతో విచారించాల్సిందే.
తోడబుట్టినవాళ్లే పట్టించుకోని ఈ రోజుల్లో ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు, రంజాన్ పండుగకు తోఫా, క్రిస్మస్ పండుగకు గిఫ్ట్ ప్యాకింగ్‌లు ఇచ్చినందుకు కేసీఆర్‌పై ఎంక్వయిరీకి ఆదేశాలు జారీ చేయాల్సిందే. యాదాద్రి లాంటి అద్భుత ఆలయాన్ని నిర్మించినందుకు, అర్చకులకు ధూప దీప నైవేద్యాల కింద రూ.10 వేల గౌరవ వేతనం ఇచ్చినందుకు కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాల్సిందే. వెయ్యికిపైగా గురుకులాలను పెట్టి పేదింటి బిడ్డలకు ఉచిత వసతి, విద్యాభ్యాసం అందించి అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా, ఎవరెస్టు శిఖరాన్ని సైతం అధిరోహించేలా చేసినందుకు కచ్చితంగా కేసీఆర్‌పై వందల కేసులు పెట్టాల్సిందే. జిల్లాకో మెడికల్ కళాశాల పెట్టినందుకు, వైద్యరంగాన్ని బలోపేతం చేసి దవాఖానల సామర్థ్యం పెంచినందుకు కేసీఆర్‌పై మరో విచారణ కమిషన్ వేయాల్సిందే. 2 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు, ఐటీ రంగంలో ఉద్యోగాలు మూడింతలు పెంచినందుకు, ఐటీ ఎగుమతులను రూ.57 వేల కోట్ల నుంచి రెండున్నర లక్షల కోట్లకు పెంచినందుకు, తెలంగాణ జీడీపీని రూ.3.78 లక్షల కోట్ల నుంచి రూ.13.28 లక్షల కోట్లకు పెంచినందుకు, రూ.లక్షగా ఉన్న తలసరి ఆదాయాన్ని రూ.3 లక్షలకు పైగా పెంచినందుకు, తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపినందుకు కచ్చితంగా కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాల్సిందే.
ఇలా.. ఆయన చేసిన ప్రతీ మంచిపనిపై.. ప్రతీ సంక్షేమ పథకంపై.. ప్రతీ అభివృద్ధి పథకంపై.. వాటిద్వారా వచ్చిన సత్ఫలితాలపై కచ్చితంగా కమిషన్లు వేయాల్సిందే. కానీ ఒక్క విషయం.. రాజకీయ కక్షసాధింపు కోసం రేవంత్ తన అహంకారం చూపించడానికి కమిషన్లు వేయొచ్చు గాక, వాటికి కేసీఆర్ భయపడరు. గజరాజు వెళ్తుంటే కుక్కలు చాలా మొరుగుతాయి. అంత మాత్రాన గజరాజు విలువ తగ్గిపోతుందా? అట్లాగే నాణ్యమైన వజ్రం మెరిసినట్టు కేసీఆర్ కీర్తి ప్రకాశిస్తూనే ఉంటుంది.