వందేండ్ల కమ్యూనిస్టు ఉద్యమం భారతదేశంలో అనేక ఆర్థిక, రాజకీయ పోరాటాలు చేసింది. ఎందరో నాయకులు తమ జీవితాలను త్యాగం చేశారు. అయితే భారతదేశంలో అస్పృశ్యత నివారణ, కుల నిర్మూలన విషయంలో వారు నిర్దిష్టమైన కార్యక్రమాలతో ముందుకు వెళ్లలేకపోయారు. కాబట్టి ఆ ఉద్యమం విఫలమైందని చెప్పక తప్పదు. దీనికి కారణం కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రధానంగా అగ్రకుల,అగ్రవర్ణ ఆధిపత్యం కొనసాగుతూ రావడమే. ముఖ్యంగా కమ్యూనిస్టులు హిందూ మతోన్మాదాన్ని ఎదిరిస్తున్నారు. కానీ, హిందువులుగా జీవిస్తున్నారు. కులాన్ని నిర్మూలించకుండా వర్గ విప్లవం విజయవంతం కాదని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాడే చెప్పారు.
ఈ అస్పృశ్యత, కులం నిర్మూలనలను ఒక పాలసీగా తీసుకొని పనిచేయకపోవటం వల్ల సొంత కుటుంబాల్లో, సొంత కులాల్లోనే పెళ్లిళ్లు జరుగుతూ రావడంతో పార్టీలకు నాయకులు మిగిలిపోయారు.
‘ఈ రోజుల్లోనూ కులవ్యవస్థను సమర్థించేవాళ్లుండటం ఒక దురదృష్టం. కుల వ్యవస్థను సమర్థించడం ఎన్నో రకాలు. అందులో ఒకటి కుల వ్యవస్థను శ్రమ విభజన (పనిని పంచుకునే) పద్ధతితో పోల్చడం. కులవ్యవస్థ శ్రమ విభజనే కాదు, అది శ్రామికుల విభజన కూడా. నాగరిక సమాజానికి శ్రమ విభజన అవసరమే. అయితే, శ్రమ విభజనతో పాటు శ్రామికుల విభజన జరగడం, వారి నడుమ అసహజమైన, అలంఘ్యమైన అడ్డుగోడలు కట్టబడటం ఏ నాగరిక సమాజంలోనూ లేదు. అంతేకాదు, శ్రామికుల్లోని ఈ విభాగాలు ఒకదానిపై ఒకటి నిమ్నోన్నత కులాల వారీగా నిర్మించబడిన వారసత్వపు నిరంకుశత్వం ఇది. శ్రామికులలో శ్రామికులు హెచ్చుతగ్గు తారతమ్యాలతో తరగతులుగా విభజింపబడిన ఈ రకమైన పద్ధతి మరే దేశంలోనూ లేదు. కులవ్యవస్థలోని ఈ పద్ధతి వ్యక్తులు చేయవలసిన పనులను, అవలంబించవలసిన వృత్తులను, పుట్టుకను బట్టి ముందే నిర్ణయించడం అనే పద్ధతి. తాము ఏ పనికి తగుదురో, ఏ వృత్తికి సమర్థులో అట్టి పనులను, వృత్తులను చేబట్టే స్వేచ్ఛను హిందువులకు కులవ్యవస్థ అనుమతించడం లేదు’ అని అంబేద్కర్ అన్నారు.
అంబేద్కర్ సామాజిక, ఆర్థిక శాస్త్రంలో అంతర్జాతీయ స్థాయిలో అధ్యయనం చేసిన మేధావి. ఆయన ‘భారతదేశంలో కార్మికవర్గం, కర్షక వర్గం ఒక వర్గంగా రూపొందాలంటే వారిలోని కులభావం, హిందూమత భావాన్ని నిర్మూలించాలి. అంటే ఆర్థిక పోరాటానికి ప్రతి అడుగులో కులం, మతం, వర్ణం, ఆచారం, సంప్రదాయం, మూఢత్వం అడ్డువస్తా’యని చెప్పారు. ‘మార్క్సిస్టులు సీపీఐ, సీపీఐఎంఎల్ పార్టీలో ఉన్న నాయకవర్గం హిందూమత భావజాలంలో ఉన్నంతకాలం వారు భారతదేశంలో ఏ రకమైన పరిణామాన్ని తీసుకురాలేర’ని అంబేద్కర్
స్పష్టంగా చెప్పారు.
‘నా ఉద్దేశాన్ని మీకు ఇంకా విపులంగా చెప్పాలంటే సోషలిజాన్ని సాధించడంలో సాధక బాధకాలు అన్నింటినీ పూర్తిగా వివరించవలసి ఉన్నది. సోషలిస్టులు ఉద్దేశించి న ఆర్థిక సంస్కరణలు ఎప్పుడు, ఎలా సా ధ్యపడుతుంది? విప్లవం ద్వారా అధికారా న్ని హస్తగతం చేసుకుంటే కానీ అది సాధ్యం కాదన్నది స్పష్టమే కదా. ఆ అధికారాన్ని చేజిక్కించుకునేవాళ్లు కార్మికవర్గం (ప్రొలిటేరియట్) ప్రజలై ఉండాలి. అయితే, ఇక్కడ నేను అడిగే మొదటి ప్రశ్న విప్లవం తేవడానికి ఇండియాలోని కార్మికవర్గ ప్రజలంతా ఏకమవుతారా? ఆ విప్లవానికి ప్రజలను ప్రేరేపించే శక్తి ఏది? నా దృష్టిలో ఆ శక్తి ఒక్క టే. అది ఏదంటే తనతో పాటు విప్లవంలో పాల్గొంటున్న మరొక వ్యక్తి పట్ల సంపూర్ణ విశ్వాసం. కార్మిక వర్గం అంతా కలిసి ఏకం కాకపోతే, ఏక ముఖంగా పోరాడటానికి ఉద్యమించకపోతే విప్లవం ఎలా రాగలదు? ఇంపైన సమాసాలను, భాషను వాడటంలోనే సోషలిస్టులు తృప్తి పడకుండా, సోషలిజం అనేదాన్ని నిర్దిష్టమైన వాస్తవ రూపం లో సాధించాలనే కోరిక తమకుంటే వారు సాంఘిక సంస్కరణ ప్రాధాన్యాన్ని గుర్తించక తప్పదు’ అని అన్నారు అంబేద్కర్.
నిజానికి భారతదేశంలోని కమ్యూనిస్టులు కుల నిర్మూలన ప్రాధాన్యాన్ని, అస్పృశ్యత నిర్మూలన ప్రాధాన్యాన్ని తెలిపేవాటి పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని, దీనికి కారణం భారతదేశ వ్యాప్తంగా బ్రాహ్మణుల చేతిలో కమ్యూనిజం, తెలుగు రాష్ర్టాల్లో కమ్మ, రెడ్డి నాయకత్వంలో ఉండటం వల్ల వారు తెలిసే కుల నిర్మూలనా పట్ల, అస్పృశ్యత పట్ల ఉదాసీనంగా ఉన్నారని చెప్పక తప్పదు. ఈ విషయంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆయా రాష్ర్టాల్లో ఉండే కులాధిపత్యాలను అధ్యయనం చేశారు. ముఖ్యం గా తెలుగు రాష్ర్టాల రూపకల్పనలో కమ్మ, రెడ్డి ఆధిపత్యం ఏర్పడింది. కమ్యూనిస్టులు ఏపీలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్‌తోనూ జతకట్టారు. తెలంగాణలో రెడ్లు, రెడ్లు ఏకమవుతారు. కాంగ్రెస్ రెడ్లు, కమ్యూనిస్టు రెడ్లు ఏకమవుతుంటారు. కోస్తాంధ్రాలో కూడా కమ్యూనిస్టులు రెడ్లు, కాంగ్రెస్ రెడ్లు ఏకమవుతారు. అందువల్ల అస్పృశ్యత నిర్మూలన, కుల నిర్మూలన, కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా వారు తీసుకోలేకపోయారు.
కారంచేడు ఉద్యమం తర్వాత కులాధిపత్యం మీద, కుల నిర్మూలన మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కులాన్ని, అస్పృశ్యతను కమ్యూనిస్టు ఉద్యమం విస్మరించిందని పీపుల్స్‌వార్ నుంచి బయటకు వచ్చిన కె.జి.సత్యమూర్తి, ఓపీడీఆర్ నాగిరెడ్డి గ్రూప్ నుంచి వచ్చిన కంచె ఐలయ్య, నక్సలైట్ మూమెంట్ నుంచి వచ్చిన బీఎస్ రాము లు లాంటి చాలామంది నేతలు బాహాటంగా చర్చకు దిగారు. కమ్యూనిస్టు ఎంఎల్ పార్టీ ప్రతినిధులుగా ఉన్న బ్రాహ్మణవర్గం వారు కె.జి.సత్యమూర్తికి, బీఎస్ రాములుకు, కంచె ఐలయ్యకు సమాధానం చెప్పలేకపోయారు. భారత కమ్యూనిస్టు ఉద్యమం కులానికి భారత సమాజంలో ఉండే పట్టు విషయంలో సరైన అంచనాతో ఉద్యమాన్ని నడపలేదు. తెలంగాణ, శ్రీకాకుళం పోరాటాలు జరిగిన ప్రాంతాల్లో కులం వేళ్లు తెగలేదు. అస్పృశ్యతాభావం రూపుమాయలేదు. అనేక సందర్భాల్లో కమ్యూనిస్టు ఉద్యమకారుల రచనల్లో దళితుల పరిస్థితుల గురించి విశ్లేషించారు. తరిమెల నాగిరెడ్డి ‘తాకట్టులో భారతదేశం’లో, పుచ్చలపల్లి సుందరయ్య, దేవులపల్లి ‘తెలంగాణ పోరాట చరిత్ర’ల్లోనూ దళితుల స్థితిగతులపై కొన్ని భాగాలు రాశారు.
అయితే, ఈ అస్పృశ్యత, కులం నిర్మూలనలను ఒక పాలసీగా తీసుకొని పనిచేయకపోవటం వల్ల సొంత కుటుంబాల్లో, సొంత కులాల్లోనే పెళ్లిళ్లు జరుగుతూ రావడంతో పార్టీలకు నాయకులు మిగిలిపోయారు. అందుకే, ఈనాడు కమ్యూనిస్టు ఉద్యమం పునశ్చరణ చేసుకున్నది. అస్పృశ్యత నిర్మూలనా, కుల నిర్మూలనా సిద్ధాంతాలను, కార్యక్రమాల ప్రధాన వైవిధ్యంగా స్వీకరించి అంబేద్కర్‌ను ఆధునిక సిద్ధాంతకర్తగా అన్వయించుకున్నది. పునర్వివేచనతో ముందుకు నడిస్తే లక్షలాది మంది కార్యకర్తలున్న కమ్యూనిస్టు ఉద్యమం భారతదేశ సాంఘిక, సాంస్కృతిక విభాగాల్లో రాబోయే దశలలో పెను మార్పులు తీసుకురావడానికి చారిత్రక చోదకశక్తి అవుతుందని దళిత ఉద్యమం, అంబేద్కర్ ఉద్య మం బలంగా నమ్ముతున్నాయి.
-డాక్టర్ కత్తి పద్మారావు 98497 41695