న్యూఢిల్లీ : గర్భాశయ క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం శనివారం ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా కౌమార బాలికలకు వేసే ఈ టీకాల పంపిణీని ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ప్రారంభించనున్నారు. దేశంలో 14 ఏండ్లు దాటిన ప్రతి బాలికకూ ఈ టీకా వేయనున్నారు.
వచ్చే 90 రోజుల్లో 15 ఏండ్లు దాటిన వారు కూడా ఉచితంగా టీకా పొందేందుకు అర్హులని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు 30 వేల కేంద్రాల్లో 90 రోజులపాటు ప్రతిరోజూ టీకా పంపిణీ జరుగుతుందని పేర్కొన్నది. అన్ని ప్రభుత్వ దవాఖానలు, ఆరోగ్య కేంద్రాల్లో టీకా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఆ తరువాత టీకాల పంపిణీ కేంద్రాల్లో వారానికి రెండు రోజులు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చని వివరించింది.