ఇటీవల జరిగిన రెండు వరుస ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైన ఆ పార్టీ మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. అనంతరం ఏడు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఘోర పరాభవాన్ని చవిచూసింది. మొత్తం 13 స్థానాలకు గానూ 10 చోట్ల ఆ పార్టీ ఓడిపోవడం గమనార్హం.
పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లలో గెలుపొందాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ, 2019లో సాధించిన 303 సీట్లను కూడా ఆ పార్టీ అందుకోలేకపోయింది. అంతేకాదు, ప్రభుత్వా న్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన 272 స్థానాలనూ సాధించలేకపోయింది. 240 సీట్లలో మాత్రమే గెలుపొందిన కమలం పార్టీ మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. మిత్రపక్షాలను కలుపుకొన్నప్పటికీ ఎన్డీయే బలం 300 దాటకపోవడం గమనార్హం.
గతంలో బీజేపీ పార్లమెంటరీ పక్షనేతగా ఎన్నికయ్యాకే ఎన్డీయే పక్షనేతగా మోదీ ఎన్నికయ్యేవారు. కానీ, మొదటిసారిగా బీజేపీ పార్లమెంటరీ పక్షనేతగా కాకుండా నేరుగా ఎన్డీయే పార్లమెంటరీ పక్షనేతగా మోదీ ఎన్నికవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వరుస పరాభవాల నేపథ్యంలో తమ అసలుసిసలు రాజకీయ ఆయుధమైన కట్టర్ హిందూత్వను తిరిగి తెరపైకి తీసుకొచ్చేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. మరో రెండు నెలల్లో మహారాష్ట్ర, హర్యానా, ఝార్ఖండ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో దాని రాజకీయ ఆవశ్యకత ఆ పార్టీకి బాగా తెలుసు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం పూర్తిగా అంతమైపోయిందని బీజేపీ నమ్మించజూస్తున్నది. ఆ విషయాన్ని ఆ పార్టీ నాయకులు అనేకసార్లు ప్రచారాస్త్రంగా వాడుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో జమ్మూకశ్మీర్‌లో పెరుగుతున్న ఉగ్రదాడులు ఆ పార్టీకి షాకిచ్చాయి. ఈ వివాదాలకు తోడు లోక్‌సభ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ యూపీ బీజేపీలో తీవ్ర దుమారాన్ని రేపింది. ప్రభుత్వం కంటే ఆర్గనైజేషన్ పెద్దదని పేర్కొన్న యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య.. సమస్యను పరిష్కరించేందుకు పార్టీ కేంద్ర నాయకత్వం ముందుకురావాలని ఒత్తిడి చేశారు. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా యూపీ బీజేపీలో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగారు.
తన రాజకీయ అదృష్టాన్ని మలుపు తిప్పేందుకు తిరిగి కట్టర్ హిందూత్వ వైపు మళ్లాలని ఆ పార్టీ నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతున్నది. అందుకు సంబంధించిన అనేక సూచనలు ప్రస్తుతం అకస్మాత్తుగా తెరపైకి వచ్చాయి. హిందూత్వ ఎజెండాకు మళ్లీ జీవం పోసేందుకు సహాయపడే అనేక ఎత్తుగడలు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. మటన్, మచ్లీ, ముజ్రా, మంగళసూత్రం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు కేటాయిస్తారని ప్రచారం చేసినప్పటికీ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించలేకపోయింది. దీంతో సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ఎత్తుగడలు తప్పనిసరిగా మారాయి.
‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ నినాదాన్ని పక్కనపెట్టి.. దాని స్థానంలో ‘జో హమారే సాథ్, హమ్ ఉన్కే సాథ్’ అనే కొత్త నినాదాన్ని తీసుకురావాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి ఇటీవల పిలుపునిచ్చారు. బెంగాల్లో 2019లో 18 ఎంపీ స్థానాలను గెల్చుకున్న బీజేపీ 2024లో 12 స్థానాలకు పడిపోయిన నేపథ్యంలో టీఎంసీ వెనకున్న ముస్లింల ఏకీకరణే రాష్ట్రంలో తమ పార్టీ ఓటమికి కారణమని సువేందు ఆరోపించారు. మరోవైపు అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తమ రాష్ట్ర జనాభాలో వస్తున్న మార్పుల గురించిన అంశాన్ని లేవనెత్తారు. ఆ రాష్ట్రంలో ప్రతి పదేండ్లకు ముస్లిం జనాభా 30 శాతం పెరుగుతున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం అస్సోంలో ముస్లింల జనాభా 40 శాతంగా ఉన్నదని, 2041 నాటికి అస్సోం ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మారుతుందని హిమంత ఆరోపించారు. దేశంలో జమ్మూకశ్మీర్ తర్వాత ముస్లింల జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా అస్సోం అవతరిస్తుందని ఆరోపించడం ద్వారా ముస్లిం వ్యతిరేక భావనను మరింతగా రెచ్చగొట్టాలని ఆయన చూస్తున్నారు.
అదేవిధంగా శ్రావణ మాసం సందర్భంగా జరిగే కన్వర్ యాత్ర మార్గంలోని దుకాణాల యజమానులు తమ పేర్లను ప్రదర్శించాలనే మరో వివాదం తెరపైకి వచ్చింది. మతపరమైన విభజనను మరింతగా పెంచేందుకు ఇది దారితీసింది. ఈ వివాదానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముగింపు పలికిన వెంటనే ఉత్తరాఖండ్‌లో ఇలాంటి వివాదమే తెరపైకి వచ్చింది.
2023లో కర్ణాటకలో వలె గతంలోనూ కొన్ని రాష్ర్టాల ఎన్నికల్లో హిందూత్వ వ్యూహం ఫలించలేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ హిజాబ్‌పై నిషేధం, ముస్లింలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ల రద్దు వంటి అంశాలు ఓట్లు రాబట్టడంలో విఫలమయ్యాయి. 2023లో జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో బీజేపీ సఫలమైంది. ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకతను తిప్పికొట్టేందుకు బీజేపీకి ఉన్న ఏకైక ఆశ హిందూత్వ కార్డు మాత్రమే. 2019తో పోలిస్తే మహారాష్ట్రలో 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీని కంగు తినిపించాయనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 48 స్థానాలకు గానూ 41 సీట్లను బీజేపీ గెల్చుకోగా.. తాజా ఎన్నికల్లో ఇండియా కూటమి 30 స్థానాలను కైవసం చేసుకున్నది. మహారాష్ట్రలో ఓట్ల శాతంలో వ్యత్యాసం చాలా తక్కువగా ఉన్నది. సార్వత్రిక ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీకి 44.92 శాతం ఓట్లు రాగా.. అధికార మహాయుతి కూటమికి 43.54 శాతం ఓట్లు పోలయ్యాయి. హిందూత్వ కార్డు గనుక పనిచేస్తే.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమిపై తమ విజయం సాధ్యమేనని బీజేపీ లెక్కలు వేసుకుంటున్నది.
రాజ్ థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) 288 స్థానాలకు గాను 250 చోట్ల పోటీ చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. అదే గనుక జరిగితే ఎన్డీయే ఓట్లపై నేరుగా ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితుల్లో హిందూత్వ కార్డును ఉపయోగించడం ద్వారా మాత్రమే రాజ్ థాక్రే పార్టీని సమర్థవంతంగా ఎదుర్కోగలమని బీజేపీ భావిస్తున్నది. హర్యానాలో గత పదేండ్లుగా అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీ ఆ రాష్ట్రంలో బలహీనంగా ఉన్నది. ఆ రాష్ట్రంలో బీజేపీ ఆధారపడేది కూడా హిందూత్వ కార్డు మీదనే.
హిందూత్వ ఒక్కటే అధికార పార్టీ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపగలదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అంతేకాదు, హిందూత్వ మాత్రమే బీజేపీ క్యాడర్లో నూతనోత్తేజాన్ని తీసుకురావడంతో పాటు ఓటు బ్యాంకును ఏకీకృతం చేస్తుందని వారు నమ్ముతున్నారు. కులగణనతో పాటు దళితులు, ఆదివాసీలు, ఓబీసీలకు రిజర్వేషన్ల పెంపు తదితర హిందువుల మధ్య చీలికలను సృష్టించే ప్రతిపక్ష నేత రాహుల్ ఎత్తుగడలను హిందూత్వ ద్వారా మాత్రమే సమర్థవంతంగా ఎదుర్కోగలమనేది వారి విశ్వాసం.
వివిధ కులాలు, వర్గాలను ఏకం చేసే శక్తి హిందూత్వకు ఉందని, గత పదేండ్లుగా చేసినట్టుగా హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు హిందూత్వ తమకు సాయపడుతుందని బీజేపీ అంచనా వేస్తున్నది. ఈ పరిస్థితుల్లో రానున్న ఎన్నికలను ఆ పార్టీ ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరం. మళ్లీ కట్టర్ హిందూత్వ వైపు మళ్లుతుందా, లేదా? అనేది కాలమే చెప్పాలి. అయితే ఝార్ఖండ్‌లో గెలవడంతో పాటు మహారాష్ట్ర, హర్యానాల్లో తిరిగి అధికారాన్ని నిలుపుకోవాలంటే మాత్రం హిందూత్వ మాత్రమే బీజేపీకి కనిపిస్తున్న ఏకైక మార్గం.