శుక మహర్షి- పరీక్షిన్మహారాజా! మురహరుడు శ్రీధరుడు కృష్ణుడు కరమొప్పగ మిక్కిలి మక్కువతో ఒక పిడికెడు అటుకులను ఆరగించాడు- బొక్కాడు. తరువాత గ్రక్కున- వెంటనే దామోదరుడు కుతూహలంతో మరొక గుప్పెడు అటుకులను గ్రహించగా, ఒప్పులకుప్ప రుక్మిణీదేవి అప్పుడే తన కరకమలాలతో వారిజాక్షుని చేతిని పట్టుకొని వారిస్తూ ఇలా పలికింది..
కం॥ ‘సొంపారగ నితనికి బహు
సంపద లందింప నివియ చాలును నిక భ
క్షింపగ వలవదు త్రిజగ
త్సంపర్క! దేవదేవ! సర్వాత్మ హరీ!
‘మూడు లోకాలకు అంతులేని ఐశ్వర్యాలు అనుగ్రహించు శ్రీమంతా! దేవదేవా! సర్వాత్మస్వరూపా! శ్రీహరీ! ఈ నిరుపేద విప్రునికి సొంపారగ- (సొగసుమీర) కరువు తీరగ నిండుగ బహుసంపదలు అందించడానికి, పుండరీకాక్షా! ఇందాక విందారగించిన ఆ పృథుక తండులాలే- అటుకులే చాలు. ఇంకా మెండుగా- అధికంగా తినకండి’. సుదాముడు నాటి రాత్రి గదాగ్రజుని- కృష్ణుని మందిరాన తనకు అత్యంత ముదావహాలైన- ప్రియమైన వివిధ పదార్థాలను ఆరగించాడు. మెత్తని హంసతూలికా తల్పంపై నిద్రించాడు. స్వర్గలోకాన్ని మించిన భోగానుభవంతో ఆ రాత్రి గడిపాడు. అనగా సోమయాజి పొందే పరలోక- స్వర్గసుఖాన్ని ఇహలోకం- ద్వారకలోనే ఆనందానికి పెన్నిధియైన సారసాక్షుడు శౌరి సన్నిధిలోనే పొందాడు. ‘తృష్ణా క్షయః స్వర్గపదం కిమస్తి?’- పేరాస (దురాశ) తొలగుటయే మేరుపృష్ఠం- ఆధ్యాత్మిక స్వర్గం. ‘సత్సంసర్గః స్వర్గః’- సత్ రూపుడైన పరమాత్ముని సంసర్గమే- సంగమే స్వర్గం.
మరునాటి ఉదయం గిరిధరుడు హరి కొంత దూరం వెంట నడిచి సాగనంపగా కుచేలుడు తన పురానికి పయనమయ్యాడు. ముందుకుసాగుతూ నందనందనుని సందర్శించిన ఆనందంలో తన హృదయారవిందంలో ఇలా తలచాడు..
కం॥ ‘నా పుణ్య మరయ నెట్టిదొ
యా పుణ్యనిధిం బ్రశాంతు నచ్యుతు నఖిల
వ్యాపకు బ్రహ్మణ్యుని జి
ద్రూపకు బురుషోత్తముని బరుం గనుగొంటిన్’
యోచింపగా నా పురాకృత సుకృతం- పుణ్య విశేషం ఎలాంటిదో కాని, పుణ్యనిధి, ప్రశాంత చిత్తుడును, అచ్యుతుడును- సచ్చిదానంద స్వరూపం నుంచి చ్యుతి లేని (జారిపడని) వాడును, షడ్భావ వికార రహితుడును, బ్రహ్మణ్యుడును- బ్రాహ్మణ హితకారియు, చిద్రూపుడును- జ్ఞానమే మేను- శరీరంగా కలవాడును అయిన శ్రీనివాసుని దర్శించగలిగాను. ‘కృష్ణా! ఆపన్న శరణ్యా! నీవు బ్రహ్మణ్య దేవుడవన్నమాట ఇన్ని రోజులకు నాకు స్వానుభవంతో తెలిసి వచ్చింది. నిష్ఠ దరిద్రుడనైన నేనెక్కడ? యదు శ్రేష్ఠుడవు, శ్రీమతాంవరుడవు- శ్రీమంతులలో వరిష్ఠుడవు, శ్రీధరుడవు, శ్రీకరుడవు (ప్రపన్నులైన భక్తులను సంపన్నులుగా చేయువాడవు) వాసుదేవుడవైన నీవెక్కడ? అయినప్పటికీ, నన్ను సోదరుని వలె- అన్నగా భావించి, మిక్కిలి మన్నన- ఆదరాభిమానాలతో అక్కున చేర్చుకున్నావు. అల్పుడనైనా, భక్త కల్పవృక్షమా! నన్ను నీ తల్పంపై కూర్చుండబెట్టింది చాలక పట్టపురాణి రుక్మిణీదేవిచే చామరం పట్టించావు. నా ప్రయాణపు బడలిక పోగొట్టావు. కడలిశయనా! నన్ను ఒడలు మరచునట్లు కట్టి పడేశావు. ఉల్లము- హృదయంలో ప్రేమానురాగాలు వెల్లిగొనగ- పరవళ్లు త్రొక్కగ, శ్రీదేవిని లాలించే పాణి పల్లవాలతో నా పాదాలొత్తి, దైవ స్వరూపంగా భావించి, వివిధ ఉపచారాలు గావించి, నన్ను ఆదరించావు’. ఇంత దివ్యంగా, భవ్యంగా తనను ఆరాధించిన అవ్యయనిధి- తరగని పెన్నిధి, కరుణాపారావారుడు- దయాసముద్రుడు శ్రీమన్నారాయణుడు కృష్ణుడు తనకు ద్రవ్యమివ్వని కారణాన్ని అల్పసంతోషి కుచేలుడు మదిలో ఇలా కల్పించుకున్నాడు..
ఉ॥ ‘శ్రీనిధి యిట్లు నన్ను బచరించి ఘనంబున విత్తమేమియు
న్నీని తెఱుంగు గానబడె నెన్న దరిద్రుడు సంపదంధుడై
కానక తన్ను జేరడని కాక శ్రితార్తిహరుండు సత్కృపాం
భోనిధి సర్వవస్తు పరిపూర్ణునిగా నను జేయకుండునే’
.. అది సరే కాని, సకల సంపదలకు నిధియైన జలధిశయనుడు, భక్త సులభుడు నన్ను అవ్వారిగా- ఎంతగానో సత్కరించాడు, బాగానే ఉంది కాని, నాకు ఘనంగా ధనం ఇవ్వాలని ఎందుకు అనుకోలేదు? ఇందులో వింత ఏముంది? దరిద్రుడు ఉన్నపళంగా సంపన్నుడైతే ఆ కలిమికి కన్నుకానక తన్ను (హరిని) మరచిపోతాడని తలచాడు కాబోలు వెన్నుడు! లేనిచో, ఆశ్రితుల ఆర్తిని బాపే అంబుజాక్షుడు, అపార కృపాంబునిధి జగన్నాథుడు నన్ను సకలైశ్వర్య సంపన్నునిగా చేయకుండా ఉంటాడా?’ ‘ఆనుకూల్యస్య సంకల్పః’- ఇలా భగవత్సంకల్పానికి అనుగుణంగా- అనుకూలంగా సంకల్పించడం ‘శరణాగతి’కి ప్రథమ లక్షణం. (భగవదనుకూల సంకల్పం, ప్రతికూల త్యాగం, రక్షిస్తాడన్న అఖండ విశ్వాసం, రక్షకునిగా ఆయననే వరించడం, దైన్య భావన- పరమాత్మకు దీనత్వమెంతో ప్రియం, ఆత్మ నివేదన (భరన్యాసం) శరణాగతికి లక్షణాలు). పోతన అమాత్యుని కమనీయమైన పై ఉత్పల (నల్ల కలువల)మాల, మూలంలోని ‘అధనోయం ధనం ప్రాప్య..’ అనే అనుష్టుప్ శ్లోకపు అచ్చ- శుద్ధమైన భావ గంధాన్ని గుబాళించే గుళుచ్ఛం- వికసించిన కలువపూల గుత్తి!
శుకుడు- రాజా! ఇలా వితర్కించుకుంటూ కుచేలుడు సతర్కం- సావధానంగా తన ఊరు చేరుకున్నాడు. వీధిలోని తన గృహం- కుటీరం కానరాలేదు. కాని, సూర్యచంద్రుల కాంతితో సమాన శోభతో భాసమానమైన- ప్రకాశిస్తున్న బంగారు, చంద్రకాంత శిలలతో నిర్మితమైన రంగారు- విలాసవంతమైన భవనాలు, కోకిలలు రాయంచలు, చిలుకలు, నెమళ్లు ఉత్సాహంతో కూస్తూ సంచరిస్తున్న ఉద్యానవనాలు, వికసించిన తెల్ల తామరలు, కలువలతో ఉల్లసిత- వెలుగొందు కొలనులు కనువిందు గావిస్తున్నాయి. మణిమయ హేమ భూషణాలు ధరించి తళతళలాడుతూ పలువురు చేటికా భామలు- కొలువు కత్తెలు (సేవకురాళ్లు) పనిపాటలలో పోటీ పడుతున్నారు. ఇలాంటి సౌధాన్ని చూచి సుధాముడు మిక్కిలి అక్కజ (ఆశ్చర్య)పడి- ముక్కున వేలిడి ‘ఇది ఏ గొప్ప పుణ్యాత్ముని భవనమో కదా! పూర్వం ఇక్కడలేని ఈ ‘లక్ష్మీనివాసం’ వైభవం అపూర్వం!’ అని భావించి వెనుదిరుగుతున్న భూదేవుని- కుచేలుని కని, దేవకాంతల వంటి భామినులు- యువతులు అతనిని సమీపించి ‘స్వామీ! లోనికి విచ్చేయండి’ అంటూ స్వాగతం పలికారు. సంగీత నృత్య వాద్యాలతో ఆయనను అంతఃపురానికి తోడ్కొని వెళ్లారు. పతిదేవుడు వచ్చాడని తెలిసి సతీమతల్లి శ్రీమతి అతి సంతసంతో మానవ రూపధారిణి అయిన ఇందిర- మహాలక్ష్మి వలె ఆయనకు ఎదురొచ్చింది. ఇందీవరా (అరవిందా)ల వంటి నేత్రాలనుంచి ఆనందబాష్పాలు రాలుతుండగా భర్త పాదారవిందాలకు గోవింద స్మరణ పూర్వకంగా వందించి మదిలోనే ఆలింగనం చేసుకుంది. చెరకు విలుకాని (మన్మథుని) బాణాల వలె ఉన్న పరిచారికల సేవలందుకొంటూ అతుల ఐశ్వర్యంతో తులతూగుతున్న తన లలన- భార్యను కుచేలుడు కన్నాడు. శ్రీపతి అనుగ్రహం వల్ల అమరిన ఈ సౌభాగ్యానికి ఆ సతీపతులిద్దరూ మితిలేని ఆనందాన్ని పొందారు. నందుపట్టి- కృష్ణుని తన డెందం (హృదయం)లో గట్టిగా కట్టివేసుకొని కుచేలుడు ఆ దివ్య భవనంలో ఎట్టి మనోవికారాలకూ వశపడకుండా హాయిగా జీవిస్తూ ఇలా తలపోశాడు..
కం॥ ‘నను నా వృత్తాంతంబును
దన మనమున గనియు నేమి దడవక నను బొ
మ్మని ఈ సంపద లెల్లను
నొనరగ నొడగూర్చి నన్ను నొడయని జేసెన్’
‘ధనాకాంక్షతో నేను జనార్దనుని వద్దకు వెళ్లాను. ఆ ఘనాఘన సుందరుడు నా మనసు తెలిసి కూడా నాతో ఏమీ అనలేదు. నన్నేమీ అడగలేదు. నాకు వీడ్కోలిచ్చి పంపిన అనంతరమే ఈ సంపదలు అనుగ్రహించాడు. అనన్య చిత్తులై తన్ను సేవించే భక్తకోటి సమర్పించిన పదార్థం కొద్దిదైనా దానిని కోటి గుణితంగా పెద్దగా భావించి, స్వీకరించి భగవంతుడు వారిని అనుగ్రహిస్తాడు అనటానికి నా వృత్తాంతమే పెను- గొప్ప తార్కాణం’. ‘సుదాముడు ప్రారబ్ధం కొద్దీ- అదాన దోషం వలన దరిద్రుడయ్యాడు. విరించి- బ్రహ్మదేవుడు అతని నుదుట ‘శ్రీక్షయః’ (సంపద నశించుగాక) అని రాసి ఉంచాడు. అతని ఫాలదేశాన తిలకం దిద్దుతూ వనమాలి బలానుజుడు బ్రహ్మరాతను తలక్రిందులు చేశాడు. ‘యక్ష శ్రీః’- (కుబేరుని వంటి సంపద కలుగుగాక) అని గీత మార్చాడు. కుచేలుని ప్రారబ్ధ కర్మను క్షీణింపజేయడానికి భగవంతుడు అతని అటుకులు భుజించాడు. దరిద్రాన్ని మటుమాయం చేశాడు. పరమాత్మ పరోక్ష ప్రియుడు కాన సంపదను ప్రత్యక్షంగా చెప్పి ఇవ్వలేదు’ అని డోంగ్రే జీ భాగవత రహస్యం.
‘భక్తికి ఫలం భుక్తి- భోగములు కావు. నాకు భక్తి లేనందుకే భగవంతుడు భౌతిక సంపదలనిచ్చాడు. కాన, నేను పునః పునః భక్తినే కోరతా. అండజవాహనుని- కృష్ణుని పాద పుండరీకాల- కమలాలపై నాకు జన్మజన్మలకు తన్మయత్వంతో కూడిన నిండైన భక్తి నెలకొని ఉండుగాక’- ఇలా తలచి కుచేలుడు తన ఇల్లాలితో కలిసి జీవిస్తూ హరిభక్తి సుధారస వాహినిలో ఓలలాడుతూ సంసార బంధాలను బాసి ముక్తుడయ్యాడు.
కం॥ ‘మురహరుడిట్లు కుచేలుని
జరితార్థుని జేసినట్టి చరితము విను స
త్పురుషులకిహపర సుఖములు
హరి భక్తియు యశము గలుగు నవనీనాథా!’
ఓ అవనీనాథా (రాజా)! కనకచేలుడు కుచేలుని కృతార్థుని గావించిన కమనీయ వృత్తాంతం విన్నవారికి ఇహపర సుఖాలు, హరిభక్తి, కీర్తి కలుగుతాయని బాదరాయణి- శుకుడు పరీక్షిత్తుతో సాదరంగా పలికాడు.