ఖమ్మం, మార్చి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులపై పోలీసులు ఆదివారం లాఠీలతో విరుచుకుపడ్డారు. మహిళలు, పిల్లలు, వృద్ధులని కూడా చూడకుండా దొరికినవారిని దొరికినట్టు కొట్టారు. ఇటీవల వెలుగుమట్ల భూదాన్ భూముల్లోని పేదల ఇండ్లను ప్రభుత్వం బుల్డోజర్లతో నేలమట్టం చేసిన నేపథ్యంలో నిర్వాసితులైనవారిని ప్రభుత్వం ఖమ్మంలోని అంబేద్కర్ భవన్, టీటీడీసీ భవనాల్లోని పునరావా స కేంద్రాలకు తరలించింది. అయితే, అక్కడ వారికి కనీస సౌకర్యాలూ కల్పించలేదు. కనీసం భోజనం కూడా ఏర్పాటుచేయలేదు. దీంతో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సొంత ఖర్చులతో కొద్ది రోజులుగా రెండు పూటలా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పునరావాస కేంద్రాల్లో ఉం టున్న బాధితుల వద్దకు పలు పార్టీల నేతలు, ఆయా సంఘాల నాయకులు ప్రతిరోజూ వచ్చి పరామర్శించి వెళ్తున్నారు. ఆదివారం కూడా హైదరాబాద్‌లోని వివిధ యూనివర్సిటీలకు చెందిన నాయకులు వచ్చి పరామర్శించారు.
ఈ సమయంలో బాధితుల గోడు విన్న ఓ విద్యార్థి నాయకుడు స్పందిస్తూ.. బాధితులకు మద్దతుగా దీక్ష చేసేందుకు పూనుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడు దీక్ష చేయకుండా అడ్డుకున్నారు. అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో బాధితులంతా కలిసి పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మాకు మద్దతుగా ఎవరు వచ్చినా ఇలాగే అరెస్టు చేస్తున్నారెందుకు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వ తీరుపైనా మండిపడ్డారు. అయినప్పటికీ, ఆ విద్యార్థి నాయకుడిని పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో బాధితులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులంతా కలిసి బాధితులు, మహిళలను ఈడ్చిపడేశారు. ఒకానొకదశలో లాఠీలకు పనిచెప్పారు. దీంతో బాధితులకు, మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాల నొప్పులు భరించలేని మహిళలు.. మిన్నంటే రోదనలతో అంబేద్కర్ భవన్ బయటకు వచ్చారు. బాధితులందరూ కలిసి అక్కడే ఉన్న ప్రధాన రహదారిపై పడుకొని నిరసన తెలియజేశారు.
వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని రోడ్డుపై నుంచి తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో బాధితులు అక్కడ కూడా పోలీసులను నిలదీశారు. అయినప్పటికీ బాధితులను పోలీసులు ఈడ్చిపడేశారు. ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ కోల్పోయి లాఠీలకు పనిచెప్పారు. బూటు కాళ్లతో తొక్కుతూ, దుర్భాషలాడారు. ఆడ, మగ అనే తేడా లేకుండా కంటికి కనిపించిన వారందరిపైనా లాఠీలతో విరుచుకుపడ్డారు. మహిళలను మహిళా పోలీసులతోనే నిరోధించాలన్న కనీస నియమాన్ని విస్మరించి కాఠిన్యాన్ని ప్రదర్శించారు. రోడ్డుపై కూర్చున్న వారినీ వదల్లేదు. ‘సారూ.. కనికరించండి..’ అని వేడుకున్నప్పటికీ ఈడ్చిపారేశారు. ఈ క్రమంలో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ‘కాలు, చేయి విరిగాయి దేవుడా..’ అన్నప్పటికీ కనికరం చూపకుండా మెడలు పట్టి నెట్టి పడేశారు.
తమకు తగిలిన గాయాలను తట్టుకోలేక కొందరు మహిళలు రోదించిన తీరు హృదయ విదారకంగా మారింది. ఒక మహిళ తనకు తగిలిన గాయాన్ని చూపిస్తూ రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. ‘ఇదేం రాజ్యంరో.. మూడు రోజులుగా ఇక్కడే పడి ఉన్నా ఎన్నడూ పట్టించుకోలేదు కదరో.. పోలీసుల దెబ్బలకు నా కాలు, చెయ్యి విరిగినయిరో.. మీ వల్ల మా ఇండ్లు, మా వాకిళ్లు పోయినయిరో..’ అంటూ పోలీసుల లాఠీ దెబ్బల ధాటికి ఖమ్మం అంబేద్కర్ భవన్లోంచి ఓ బాధితురాలు కుంటుకుంటూ, తలబాదుకుంటూ వస్తూ చేసిన ఆర్తనాదాలు కంటతడిపెట్టించాయి. కాగా, టీటీడీసీ, అంబేద్కర్ భనాలను తక్షణమే ఖాళీ చేసి వెళ్లి పోవాలంటూ అధికారులు హుకుం జారీ చేయడం గమనార్హం. లేదంటే మంచినీళ్లు కూడా ఇవ్వబోమంటూ అధికారులు మొండికేస్తున్నారు. ఈ విషయమై ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఇప్పటివరకు సహాయ సహకారాలు అందించిన రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు యంత్రాంగమే చెప్తున్నది.

బాధితులకు బాసటగా పార్టీలు, సంఘాలు
వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులకు రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. తొలుత బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎ మ్మెల్సీ తాతా మధు సారథ్యంలో పార్టీ బృందం ఘటనా స్థలానికి బయలుదేరడం, వారిని పోలీసులు అరెస్టు చేయడంతో ఆందోళనకు తొలి అడుగు పడింది. ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం నగరానికి రావడం తో సమస్య రాష్ట్రవ్యాప్తంగా మారింది. సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, మాస్‌లైన్ తదితర వామపక్షాలు సైతం ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తూ బాధితులకు న్యాయం చేయకపోతే ఆందోళనకు సిద్ధమని ప్రకటించాయి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాలకు చెందిన పలువురు నాయకులు, ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘా ల నాయకులు వచ్చి బాధితులకు మద్దతు పలికారు. దీంతో ఆందోళనకు గురైన ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు సరికొత్త నాటకాన్ని తెరమీదకు తెచ్చింది. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించామని కలెక్టర్, అడిషనల్ కలెక్టర్‌తో ప్రకటనలు చేయించిన రేవంత్ సర్కార్.. ఖ మ్మం ఆర్డీవోను బదిలీ చేయడం సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. తాము తప్పు చేశామనే భావనతో, ప్రజల నుంచి పెల్లుబుకుతున్న వ్యతిరేకతను కప్పి పుచ్చుకునే చర్యల్లో భాగంగానే అధికారులను పావులుగా మారుస్తున్నారని ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

అండగా నిలుస్తున్న బీఆర్ఎస్
‘మీకు మంచి నీళ్లు ఇవ్వం.. అన్నం పెట్టం.. తక్షణమే ఖమ్మం విడిచి వెళ్లిపోండి.. లేదంటే క్రిమినల్ కేసుల పాలవుతారు’.. అనే బెదిరింపులు వెలుగుమట్ల బాధితులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ మాటలు అంటున్నది ప్రైవేట్ వ్యక్తులో, వ్యాపారులో కాదు.. సాక్షాత్తూ ఖమ్మం జిల్లా అధికారులే కావడం గమనార్హం. మాటలు అన్నదే తడవుగా నాలుగు రోజులుగా పేదలకు మంచినీళ్లు, భోజనం పెట్టకుండా తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నరు. ఈ నేపథ్యంలో ఇటీవల ఖమ్మం జిల్లా పర్యటకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇండ్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న పేదలకు ఇచ్చిన హామీ, క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరు ప్రతిఒక్కరి మనన్ననలను పొందుతున్నది.
పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో న్యాయ పోరాటం చేస్తుండగా, రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత వద్దిరాజు రవిచంద్ర గత నాలుగు రోజులుగా బాధితులకు ఆహారం అందిస్తున్నారు. ఆదివారం ఆయనే స్వయంగా హాజరై భోజనం వడ్డించి ఆకలి తీర్చడం గమనార్హం. ఈ సందర్భంగా ఆకలి తీర్చుకున్న పేదలను పలుకరిస్తే.. మాయమాటలు నమ్మి తాము కాంగ్రెస్‌కు ఓటేశామని అంటున్నారు. తాము గెలిపించిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు నిలువ నీడ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌కు చెందిన ఏ ఒక్కరూ తమ వద్దకొచ్చి పలుకరించిన పాపాన పోలేదని అంటున్నారు.