ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు తెలంగాణపై చేసిన కుట్రలు మళ్లీ పదునెక్కుతున్నాయి. నదీజలాలు తెలంగాణకు దక్కకుండా చేసే ప్రణాళికలు కండ్లముందే చకచకా సాగిపోతున్నాయి. ప్రధాని మోదీ-ఏపీ సీఎం చంద్రబాబు-తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి త్రయం మన వేలుతో మన కన్నునే పొడిచే వ్యూహాలను గుట్టుగా అమలుచేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం భారీ వ్యయంతో చేపట్టిన గోదావరి- బనకచర్ల లింక్ ప్రాజెక్టు అందుకు నిలువెత్తు నిదర్శనం. వరద జలాల మాటున తెలంగాణకు జీవదాయిని ప్రాణహిత జలాలను కొల్లగొట్టడమే ఆ ప్రాజెక్టు అంతిమలక్ష్యం. అందులో భాగంగానే తెలంగాణ జీవదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్యప్రచారం. కమిషన్ల విచారణ.. ఎన్డీఎస్ఏ నివేదికల పేరిట నిర్వీర్యం చేయడం. తెలంగాణ సోయితోని ఆలోచిస్తే తప్ప అంతుచిక్కదీ కుతంత్రం.
గోదావరిలో ప్రధానంగా ప్రాణహిత, ఇంద్రావతి నుంచే అధిక ప్రవాహాలు ఉంటాయనేది గణాంకాలే చెప్తాయి. ఆ రెండు ప్రధాన ఉప నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తే తెలంగాణ బీడు భూములను గోదారమ్మ పావనం చేసేది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాల పాటు ప్రభుత్వాల తీరు అందుకు భిన్నం. అదొక కుతంత్రం. ఎక్కడా ఏ చిన్న ఆటంకం లేకుంట, ఒక చుక్క తెలంగాణ గడ్డపై నిలవకుండా ధవళేశ్వరం దాకా వినియోగానికి సంకల్పించి, అప్పటికే ఒప్పందాలు పూర్తయి అంతర్రాష్ట్ర సమస్యలు కూడా పెద్దగా లేని తెలంగాణ చారిత్రక ప్రాజెక్టుల గొంతు సైతం నులిమారు.
350 టీఎంసీల వినియోగానికి రూపకల్పన చేసి న శ్రీరాంసాగర్నూ కుదించి, ఎందుకూ కొరగాకుండా చేశారు. 300 టీఎంసీల వినియోగానికి ప్రతిపాదించిన ఇచ్చంపల్లి, 100 టీఎంసీలతో ప్రతిపాదించిన కంతనపల్లి ప్రాజెక్టులకు పాతరేశారు. తెలంగాణవాదుల అలుపెరుగని పోరాటాలకు కంటితుడుపుగా పలు ప్రాజెక్టులను చేపట్టారు. అవీ నీటి లభ్యత లేనిచోట. సూటిగా చెప్పాలంటే పేరుకే ప్రాజెక్టులు తప్ప వాటితో తెలంగాణకు దక్కిన ఫలితం శూన్యం. తెలంగాణ ఏర్పడేనాటికి గోదావరి జలాల్లో తెలంగాణ నికరంగా 100 టీఎంసీలు వాడుకున్న దాఖలాలు లేవంటే కుట్రను అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమ నేతగా కేసీఆర్ ఆ నీటి కుట్రలపై గర్జించారు. కుటిల పన్నాగాల గురించి తెలంగాణ సమాజానికి బోధించారు. అం దుకే స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత అత్యంత ప్రాధా న్యం కలిగిన ప్రాణహిత జలాలను ఒడిసిపట్టడమే ప్రధాన లక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించా రు. ఇంద్రావతి జలాల వినియోగానికి సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్ బరాజ్‌కు శ్రీకా రం చుట్టారు. సూటిగా చెప్పాలంటే ప్రాణహిత, ఇంద్రావతి నదుల నీటిని ఒడిసిపట్టి, ఎగువన నీళ్లు లేని గోదావరి ప్రాజెక్టులకు తరలించి తెలంగాణను పంటలతో పచ్చగా మార్చే లక్ష్యంతో ముందుకుసాగారు.
ఒక్క కాళేశ్వరం అందుబాటులోకి రావడం వల్ల తెలంగాణలోని గోదావరి ముఖచిత్రం మారిపోయిది. ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారానే గోదావరిలో మన 954 టీఎంసీల్లో 450 టీఎంసీలకు పైగా వినియోగించుకునే స్థాయికి తెలంగాణకు చేరుకుంది. ఆ ఫలాలన్నీ అనుభవంలోనే ఉన్నాయి. తెలంగాణలో మన నీళ్లు మనకు దక్కించుకునేందుకు ప్రాజెక్టులు కడుతుంటే తట్టుకోలేని ప్రత్యర్థులు చేసిన పన్నాగాలు తక్కువ కాదు. తెలంగాణలోని తమ తాబేదార్లతో అడ్డగోలు ఆరోపణలు చేయించారు. అందులోనివే కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ట్‌లు.. విద్యుత్తు బిల్లుల భారాలు.. ఆర్థికభారాలు.. ప్రజలపై భారాలు భూకంపాల ప్రమాదాలు. అయినా కేసీఆర్ నాయకత్వం ఆ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పకొట్టింది. ఏపీ ఇప్పుడు కొత్త కుట్రలకు తెరలేపింది. మళ్లీ మన వేళ్లతో మన కండ్లే పొడిపించే పన్నాగాలను అమలుచేస్తున్నది. కేంద్రం అండతో, తెలంగాణలోని తాబేదారి నాయకత్వం సహకారంతో కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్టును ఛిద్రం చేయాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నది. మేడిగడ్డలో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక లోపాన్ని సాకు చూపుతూ ప్రాణహిత జలాలను తెలంగాణకు దక్కకుండా చేసే ప్రణాళికలను వేగంగా ముందుకు తీసుకుపోతున్నది. గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టే అందుకు నిదర్శనం.
బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి గోదావరిలో 1,486 టీఎంసీలను కేటాయించింది. అందులో తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలు. ఏపీ వాటా 518 టీఎంసీలు. కానీ, ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తన వాటా పరిమితికి మించి దాదాపు 776 టీఎంసీలను వినియోగించుకునేందుకు అనుమతులు లేకుండా పలు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. ఇప్పుడు కొత్తగా రోజుకు 2 టీఎంసీల చొప్పున మొత్తంగా 200 టీఎంసీల వరద జలాలను తరలించేందుకు గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది. పేరుకే ఇది 200 టీఎంసీలు కానీ, ఆచరణలో మాత్రం 350 టీఎంసీలకు పైనే.
గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం పనులను ఏపీ సర్కార్ నిర్వహిస్తున్నది. పెన్నా బేసిన్లో ఇప్పటికే ఏపీ సోమశిల, కండలేరు, అవులపల్లి తదితర అనేక రిజర్వాయర్లను నిర్మించింది. పోతిరెడ్డిపాడు ద్వారా ఆయా రిజర్వాయర్లకు కృష్ణా జలాలను ఏటా అక్రమంగా మళ్లిస్తూనే ఉన్నది. ఇప్పుడు గోదావరి జలాలను కూడా ఆ మేరకు పెన్నా బేసిన్‌కు తరలించేందుకు ఏపీ వేగంగా పావులు కదుపుతున్నది. వరద జలాల మాటున కృష్ణాలో చేస్తున్న జలదోపిడీనే రాబోయే రోజుల్లో గోదావరిలోనూ పునరావృతం కానుందనేది మనం తెలుసుకోవాల్సిన సత్యం.
గోదావరి నదీ పరీవాహక ప్రాంతాన్ని మొత్తంగా 12 సబ్ బేసిన్లుగా విభజించారు. అందులో 8 సబ్ బేసిన్ల నుంచి గోదావరికి వచ్చే జలాలు 31.95 శాతం. ఇక జీ9లోని ఒక్క ప్రాణహిత సబ్‌బేసిన్ నుంచే 26 శాతం జలాలు గోదావరిలో చేరుతాయి. జీ10 సబ్‌బేసిన్ అయిన లోయర్ గోదావరి అంటే ఎస్సారెస్పీ నుంచి పోలవరం వరకు మధ్య గోదావరిలో వచ్చిచేరే జలాలు 7.19శాతం, జీ11 సబ్ బేసిన్‌లోని ఇంద్రావతి నుంచి 22.93 శాతం జలాలు గోదావరికి వస్తా యి. సూటిగా చెప్పాలంటే గోదావరి నీటిలభ్యతలో ప్రాణహిత, ఇంద్రావతి జలాలే 48.93 శాతం.
ప్రాణహితలో ఏడాదిలో 300 రోజుల పాటు కనీస వరద ప్రవాహాలు కొనసాగుతుంటాయి. ప్రాణహిత జలాల భరోసాతోనే ఏపీ సర్కారు అంత భారీ వ్యయంతో జీబీ లింక్‌కు పూనుకున్నది. ఏపీ ప్రణాళికలన్నింటికీ, గోదావరి జలాల తరలింపునకు అడ్డంకిగా మారింది కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి మేడిగడ్డ బరాజ్‌లో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక లోపాన్ని చూపి ఏపీ చేతిలో కీలుబొమ్మగా మారిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర నాయకత్వం.. కాళేశ్వరంపై విషప్రచారం చేస్తున్నది. జీబీ లింక్ తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చనున్నది. పోతిరెడ్డిపాడు అందుకు సజీవ సాక్ష్యం. పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణ నేడు అచేతనంగా ఉండాల్సిన దుస్థితి నెలకొన్నది. రేపటి రోజున జీబీ లింక్ ప్రాజెక్టుతోనూ అదే పునరావృతం కానున్నది. ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఈ కుట్రలను తెలుసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిరక్షణకు నడుం కట్టాలి. జలహక్కుల సాధనకు పునరంకితమవ్వాలి.