ములుగు శాసనసభ్యురాలైన ధనసరి అనసూయ తెలంగాణ మంత్రివర్గంలో ప్రస్తుతం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ఆమె కొంతకాలం విప్లవోద్యమంలో పనిచేశారు. ఆ అజ్ఞాత జీవితకాలంలో ఆమె మారుపేరు సీతక్క. నక్సలైట్ జీవితానికి స్వస్తి చెప్పి ప్రజా జీవితంలోకి వచ్చినా ప్రజలు ఇప్పటికీ ఆమెను సీతక్కగానే గుర్తిస్తున్నారు.
తమ జాతి బిడ్డల చిన్న చిన్న అవసరాలు తీర్చడంలో సీతక్క కొంత శ్రద్ధ వహించినా ఒక్కోసారి ఆదివాసీల విషయంలో ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు ఆమె ముందు తొలగించలేని అడ్డంకులుగా నిలబడవచ్చు. కొన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని ఒప్పించలేని పరిస్థితి కూడా ఆమెకు ఎదురవవచ్చు. చివరికి అవి ఆమె ముందు అగ్నిపరీక్షగా కూడా నిలవవచ్చు. లింగ, సామాజిక సమీకరణాల అవసరాల దృష్ట్యా మంత్రివర్గంలో చోటు దక్కినవారు పై వర్గాలకు చెందిన తోటి మంత్రుల ముందు ఎప్పుడైనా రెండో వరుసలోకి వస్తారు. మంత్రి పదవి ఇవ్వకున్నా, ఇచ్చింది తీసుకున్నా పెదవి విప్పలేని నిస్సహాయ పరిస్థితి వీరిది. మంత్రిగా ఉన్నంత మాత్రాన ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయలేని అశక్తత వీరికి ఎదురుకావచ్చు.
ఆదివాసీల పట్ల ఎంత బాధ్యత, మమకారం ఉన్నా ప్రభుత్వాన్ని ఒప్పించి తన ఆకాంక్షలను సాధించుకునే శక్తి సీతక్కకు ఉందా? అనే ప్రశ్న ఎప్పుడూ ఎదురవుతున్నదని అనడానికి ఉదాహరణలు ఉన్నాయి. ఏడాది క్రితం నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో ఉన్న ఆదివాసీ కళాఖండాలను సందర్శించిన సీతక్క కళ్లలో ఒక మెరుపు కనబడింది. ‘ఇవన్నీ మా గిరిజన జాతులు తరతరాలుగా వాడిన ఇసిరెలు కదా’ అని వాటిని ఆమె తడిమారు. సంగీత వాద్యాలు మోగించి శబ్దాన్ని విన్నారు. వందల సంఖ్యలో ఉన్న వీటి సంరక్షణ, ప్రదర్శన బాధ్యత ప్రభుత్వం తీసుకొనేలా కృషి చేస్తానని ఆ సందర్భంగా మాటిచ్చారు. అయితే ఇంతవరకు ఆ హామీ ఎలాంటి కార్యరూపం దాల్చిన దాఖలాలు కనబడలేదు. ఈ విషయంలో తాను చేసిన ప్రయత్నమేమిటో, అందులో ఎంతవరకు సఫలీకృతమయ్యారో, వాటికి శాశ్వత నీడ ఎప్పుడు, ఎక్కడ ఏర్పాటు చేస్తారో చెప్పవలసిన బాధ్యత ఓ గిరిజన మంత్రిగా ఆమెపై ఉంది.
ఈ మధ్య తెలంగాణ అటవీ శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 49 కూడా సీతక్కను ఇరకాటంలో పడవేసింది. కవ్వాల్ టైగర్ రిజర్వును మహారాష్ట్రలోని తడోబా-అంధారి టైగర్ రిజర్వులో కలిపి ‘కుమ్రం భీం టైగర్ కన్జర్వేటివ్ రిజర్వ్’గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆ జీవోలో ఉంది. దీని కోసం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని కాగజ్ నగర్, ఆసిఫాబాద్ ఫారెస్ట్ డివిజన్లలోని పది మండలాలు, 339 గ్రామాల్లోని సుమారు 5 లక్షల జనాభాతో కూడిన లక్షన్నర హెక్టార్ల ప్రాంతాన్ని కేటాయించారు. అంటే ఈ నేలంతా అటవీశాఖ ఆధీనంలోకి వెళ్తుంది. దీంతో ఆ అడవిలో బతికే ఆదివాసీల్లో ఆందోళన మొదలైంది. తమను గ్రామాల్లోంచి ఖాళీ చేయిస్తారేమోననే భయం వారికి పట్టుకుంది. ఈ నిర్ణయం తీసుకొనే ముందు ఎక్కడా గ్రామసభలు నిర్వహించలేదని ఆదివాసీలు అంటున్నారు. 12 మంది సభ్యులతో కూడిన రిజర్వు పరిరక్షణ నిర్వాహక కమిటీ అంగీకారంతో ఈ జీవో వెలువడింది. భయకంపితులైన గిరిపుత్రులు ఇప్పుడు ‘పాహిమాం’ అని సీతక్క గడప తొక్కుతున్నారు.
ఈ జీవో ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఆ ప్రాంతంలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్లు, భవనాల నిర్మాణాలను అటవీ అధికారులు సాగనివ్వడం లేదు. మరోవైపు ఈ జీవో వల్ల గిరిజనులకు ఎలాంటి నష్టం లేదని అధికారులు అంటున్నారు. ప్రభుత్వపు ఈ రెండు నాల్కల ధోరణి ఆదివాసీలను అగమ్యంలో పడవేస్తున్నది. జీవో మర్మం చెప్పాలని వారు తమ మంత్రి ముందు మొరపెట్టుకుంటున్నారు. మంత్రివర్గంలో ఈ నిర్ణయం తీసుకున్నప్పుడే ఎందుకు వ్యతిరేకించలేదని ఆదివాసీలు ఆమెను నిలదీస్తున్నారు.
మరోవైపు అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఈ జీవోను రద్దు చేయాలని మావోయిస్టు పార్టీ పేరిట ఓ లేఖ విడుదలైంది. దీని అమలు వల్ల ఆదివాసీలకు కలిగే నష్టాన్ని తెలుపుతూ మంత్రివర్గంలో ఉన్న సీతక్కను వారు ఆ లేఖలో లక్ష్యం చేసుకున్నారు. ‘ఆదివాసీ బిడ్డ, మాజీ నక్సలైట్‌గా ప్రాచుర్యంలో ఉన్న సీతక్క సొంత నియోజకవర్గంలో ఈ విధంగా జరగడం సిగ్గుచేటు, అవమానకరం. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ధనసరి అనసూయ గారు ఎందుకు ఆదివాసీల గురించి మాట్లాడటం లేదు’ అని లేఖలో వారు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీల హక్కుల పరిరక్షణకు పూర్తి బాధ్యత సీతక్క వహించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తున్నది.
దీనికి స్పందించిన మంత్రి సీతక్క అసలు ఈ లేఖ నిజంగా మావోయిస్టులు విడుదల చేశారా? అనే అనుమానం తనకుందని అన్నారు. ఈ జీవో విడుదలైనా అటవీ శాఖ దాని అమలుకు చెందిన ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదని ఆమె అంటున్నారు. దీన్ని నిలిపివేయాలని ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఒక తీర్మానాన్ని చేసి ప్రభుత్వానికి అందజేశామని ఆమె మీడియాకు తెలియజేశారు. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం అంటే ఇంటి మనిషే వాకిట్లో నిలబడి దేహీ అన్నట్లుంది. ఆమె మాత్రం ‘నా కట్టె కాలేంత వరకు ఆదివాసీ సమాజం హక్కులు కాపాడేందుకు కట్టుబడి ఉన్నాను’ అని భావోద్వేగానికి గురయ్యారు.
ఇలాంటి కఠిన, జఠిల పరిస్థితులు ఎదురైనప్పుడే ప్రభుత్వంలో బహుజన మంత్రుల సత్తా బయటపడుతుంది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించి ప్రజల పక్షాన నిలబడటమా లేక ప్రజలనే మభ్యపెట్టి తమ పబ్బం గడుపుకోవడమా? అనే అనివార్య స్థితిలోకి వారు నెట్టబడతారు. ప్రభుత్వానికి వత్తాసుగా ఉంటే ప్రజల నుంచి తిరస్కారం తప్పదు. ప్రజలే కావాలనుకుంటే రాజకీయ జీవితానికి స్వస్తి తప్పదు. సీతక్క ఆదివాసీ పక్షపాతానికి, రాజకీయ జీవితానికి జీవో 49 ఒక పరీక్షగానే భావించాలి.
-బద్రి నర్సన్
94401 28169