Congress Party | భారతదేశ రాజకీయ చరిత్రలో వాగ్దానాల వొగరుబోతుగా, వెన్నుపోటులో ఆంబోతుగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న పేటెంట్ హక్కులు ప్రాచీనమైనవే. ప్రణాళికలు, డిక్లరేషన్ల రచనకు వారి వార్ రూంలో మేధో రోదన జరుగుతూనే ఉంటుంది. గాలమేస్తే చిక్కే చేపపిల్లలుగా ఓటర్లను చూసే హస్తం పార్టీ దృక్పథంలో ఇసుమంతైనా మార్పు రానే లేదు. చింత చచ్చినా పులుపు చావదన్నట్టుగా పాతాళంలో పడ్డా, కాంగ్రెస్ పనితీరులో పాత నైజమే కనిపిస్తున్నది. ఈ ధోరణే ప్రజలను పది జనపథ్‌కు దూరం చేసింది.
దేశ సమస్యల పట్ల పట్టింపు, ప్రజల ఆకాంక్షలపై లోతైన చూపు కొరవడటమే కాదు, పీసీసీలను పైరవీకారులకు అప్పగించి, పగటికలలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉయ్యాలలూగుతున్నది. కాంగ్రెస్‌ను విశ్వషించలేదనే పగతో, తెలంగాణ ప్రజలపైకి విషం చిమ్మిన వారిని బాణంలా సంధిస్తున్నది ఆ పార్టీ అధిష్టానం. రేవంత్‌రెడ్డికి గాంధీ భవన్‌ను గుత్తకేసింది చాలక, తాజాగా వీసా సిస్టర్ షర్మిలనూ తోడు తెచ్చుకుంటున్నది. తెలంగాణకు ఏ మాత్రం నచ్చని, నవ్వులపాలైన వారిని నమ్ముకొని కదులుతున్న కాంగ్రెస్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారు. కర్ణాటకలో పారిన పాచికలు తెలంగాణలోనూ చేతికందుతాయనుకోవడం ఆ పార్టీ అవివేకానికి నిదర్శనం.
కాకతీయుల పాలన నుంచి నుంచి కేసీఆర్ ప్రభుత్వం దాకా, సాయుధ రైతాంగం పోరాటం నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం దాక అనేక అనుభవాలను జీవితంలో భాగం చేసుకున్న నేల తెలంగాణ. ఏ అనుభూతి మరుగన పడదిక్కడ, ప్రతీది ప్రజల చర్చల్లో, పాటల్లో తర్వాతి తరాలకు తరలించబడుతూనే ఉంటుంది. ప్రతి మలుపులోనూ, హామీల్లో మమ్మీ, అమలులో డమ్మీగా కాంగ్రెస్‌కున్న నేపథ్యం ఏం చేసినా దాచిపెట్టలేనిది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీరాలు పలకడం, అధికారంలోకి వచ్చిన తర్వాత నేరాలు చేయడంలో చేతి గుర్తు పార్టీ అందె వేసిన చెయ్యి అనే సత్యం అందరికీ తెలిసిందే. ఏడు దశాబ్దాల్లో ఎన్ని నినాదాల పువ్వులు ప్రజల చెవుల్లో పెట్టారని?, గరీబీ హటావో నినాదమిచ్చి, వెంటపడి తరిమింది పేదలనే కానీ పేదరికాన్ని కాదు. ఆ పాపపు పాలన పుణ్యమే కదా దేశం ప్రతి మూలనా సమస్యల వనం పెరిగిపోయి ఉన్నది. గురువింద గింజలా కింద మొత్తం విద్రోహమే పరుచుకొని, ప్రగతిని వాగ్దానం చేస్తే నమ్మేదెవ్వరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా డిక్లరేషన్ల పేరిట డూప్లికేషన్ డ్రామానే మళ్లీ ప్రదర్శిస్తే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటారు కానీ నమ్ముతారా? అసలు జాతి ప్రగతిలో శ్రమజీవులను అంటరాని వసంతాలుగా మార్చిందే హస్తం పార్టీ కదా? అంబేద్కర్ ఆశయాలను అంతం చేసే కుట్రలు చేసి, పూలే భావజాలాన్ని పూడ్చిపెట్టే పనివిధానాన్నే పాలనా నమూనాగా అమలు చేశాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు. దళితులను దగా చెయ్యడమే కాదు, కనీసం రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్-17(అంటరాని తనం నిషేధం)ను కూడా అమలు చేయలేని అసమర్థత దశాబ్దాలు ఏలిన కాంగ్రెస్ పార్టీది. అసలు హక్కుల సాధన కోసం అంబేద్కర్ దగ్గరి నుంచి కాన్షీరాం వరకు తలపడింది కాంగ్రెస్ పార్టీతోనే కదా! కాంగ్రెస్ దుర్మార్గపు విధానాల మీద అంబేద్కర్ చేసిన సమరం, పార్లమెంట్ లోపల, వెలుపల కాన్షీరాం సాగించిన పోరాటం మళ్లీ బయటపెడితే హస్తం పాపాల పుట్ట పగులుతుంది. తనదాక వస్తేగాని తెలియదన్నట్లు తెలంగాణ జనాలకు అడుగడుగునా ప్రాణ సంకటం కలిగించింది కాంగ్రెస్ పార్టీ. త్యాగాలు ఆరగించి, ఆరగించి, చివరికి అరగక పొట్టపగిలే స్థితిలో మాత్రమే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుతొలగింది. కేసీఆర్ త్యాగాల పోరాటమే లేకపోయి ఉంటే, ఇప్పటికీ తెలంగాణాను వేదన వలయంలోనే ఉంచేసేవారు.
ఇప్పుడు తెలంగాణ ప్రగతి చరిత్ర పాలనా శాస్ర్తానికి జీవత్వాన్ని సమకూర్చింది. ప్రభుత్వానికి ఆకారాన్ని, అందాన్ని, ఆనందాన్ని అద్దింది. ఈ మహా మార్పు ముందు డొల్ల డిక్లరేషన్లు ఒంటికాలి కుర్చీ వెయ్యాల్సిందే.
ఇట్లాంటి ఎన్నో సత్యాలపై మన్ను కప్పి, ప్రజల దృష్టిని మలచుకోవాలనుకుంటే సాధ్యపడదు కదా, తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేండ్ల ప్రయాణంలో సకలజనుల సమ్మిళిత పురోగతి పోరాటంలో ఎంతో దూరం అడుగులు వేసిం ది. పాలనకు అణగారిన జనం కండ్లను తొడిగి నూతన మార్గంలో నడిపించారు కేసీఆర్. విద్య, ఆరోగ్య, సంక్షేమ రంగాలతో పాటు వ్యవసాయరంగంలోనూ దళిత, బీసీ, మైనారిటీ, మహిళల ప్రగతే కొలమానంగా పథకాలు అమలుచేశారు. రాష్ట్ర ఆదాయంలో, అభివృద్ధి ఫలాల్లో సింహభాగం వాటా బడుగులకే దక్కింది. ప్రతి పథకానికి అభివృద్ధి, ఆత్మగౌరవమే రెండు కన్నులుగా తీర్చిదిద్దారు సీఎం కేసీఆర్. అందుకే కదా ప్రభుత్వ దవాఖానాల్లో తల్లులు, పసి పిల్లల కేరింతలు, పొలాల్లో రైతుల నవ్వులు పండుతున్నాయి. గురుకులాల్లో ఐదు లక్షల కుటుంబాల భవితవ్యం బంగారు దృక్పథంతో తీర్చిదిద్దబడుతున్నది. తాగునీటి గోస, సాగునీటి సమరాలు సమిసిపోయి, నేలనే నీటి కొలనుగా మారింది. రాష్ట్ర ప్రగతిని రిజర్వ్ బ్యాంక్ దాని హ్యాండ్‌బుక్‌లో స్పష్టంగా వివరించింది. కీలక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలకు కేంద్ర సర్కార్ శాఖలే అనేక అవార్డులు ప్రధానం చేశాయి. అయినా అవివేకపు విమర్శలు ఆపని వారిని ఏమనాలి? ఎఫ్ఆర్బీఎం పరిమితులకు లోబడి, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలకంటే శాస్త్రీయంగా రుణాల సమీకరణ, చెల్లింపు చేస్తూ, సుస్థిరాభివృద్ధి రథాన్ని ముందుకు నడిపిస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్. అన్నీ తెలిసి కూడా నోటికి అబద్ధాల మైకులు తొడుక్కొని వాగే కాంగేయుల కాకమ్మ కథలు నమ్మేదెవరు? అసలు కాంగ్రెస్ పాలిత కర్ణాటక, రాజస్థాన్ లాంటి రాష్ర్టాల్లో ఏయే వర్గాలకు ఏం ఒరగబెట్టారో చెప్పుకొనే ధైర్యం ఉన్నదా? చేతిలో ఉన్న రాష్ర్టాల్లో తెల్లమొహం వేసుకొని, తెలంగాణలో తండ్లాడుతున్న హస్తం పార్టీ, ఎండమావులపై ఎగబడుతున్నది.
స్వాతంత్య్రానంతరం దక్కిన చారిత్రక అవకాశాన్ని చేజేతులా చెడగొట్టుకొని, దేశానికి కీడు తలపెట్టింది కాంగ్రెస్ పార్టీ. సవ్యమార్గంలో పరుగులు పెట్టించాల్సిన జాతిని, అగాథంలోకి అడుగులు వేయించింది. రాజకీయవ్యవస్థలో ఉండకూడని అవలక్షణాలన్నీ అభరణాలుగా ధరించి, తరాలుగా ఊరేగుతున్నది. ఇది దాచుకొని ప్రజాస్వామ్య పలుకులు వల్లిస్తున్న కాంగ్రెస్ తీరును చూస్తుంటే ఇల్లలుకుతూ తన పేరునే మరిచిపోయిన ఈగ కథ గుర్తుకొస్తున్న ది. అదే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం, ప్రజలిచ్చిన అవకాశాన్ని, రాబోయే నూరు తరాలకు లోటురాని రీతిలో ప్రగతిగా పరిచిచూపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రజలను ప్రేమించే ప్రభుత్వానికి, పనిచేసే పాలకులకు ఆకాశమే హద్దు అనే సత్యాన్ని ఆచరణలో బతికించింది గులాబీ సర్కార్. అందుకే కాంగ్రెస్‌కు చీత్కారా లు, బీఆర్ఎస్కు ఆహ్వానాలు ఎల్లకాలం ఎదురయ్యే రాజకీయ వాస్తవాలు. తెలంగాణ మళ్లీ గెలుస్తుంది. కేసీఆర్ వెంట అలుపన్నది రానే రాని ప్రగతి పథగామిలా ఎల్లకాలం నడుస్తుంది. రేవంత్, షర్మిల, కేవీపీలు, వారి వెనుక నక్కి, తెలంగాణపై దాడికి, దోపిడీకి పగటి కలలు కంటున్న వారిని జనరాశులు ఏనాడో కనిపెట్టేశారు.
(వ్యాసకర్త: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్)
– డాక్టర్ ఆంజనేయ గౌడ్ 98853 52242