1990కి ముందు హైదరాబాద్ నగరం అనిశ్చితికి చిరునామాగా ఉండేది. మత ఘర్షణలతో పాటు ఏదో ఒక సమస్యపై తరచూ ఉద్యమాలు జరిగి ఉద్రిక్తతలు చోటు చేసుకునేవి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజధాని నగరం ప్రశాంత జీవనానికి, అభివృద్ధికి చిరునామాగా మారింది. కేవలం పాశ్చాత్య దేశాల్లో మాత్రమే నిర్వహించే ఫార్ములా ఈ-రేస్ ఇటీవల నగరంలో జరగడం ఇందుకు తాజా ఉదాహరణ.
అవి… 1990ల కన్నా ముందు రోజులు. పీజీతోపాటు చిన్నపాటి ఉద్యోగం చేయడానికి హైదరాబాద్ చేరుకున్నాను. మా చదువుల కోసం ఎల్బీ నగర్ రింగ్ రోడ్ సమీపంలో మా నాయన ఒక చిన్న ఇల్లు కట్టించారు. అప్పట్లో హైదరాబాద్‌లో తరచూ మత కల్లోలాలు జరిగేవి. వీటికి తోడు పెద్ద ఎత్తున పుకార్లు పుట్టేవి. ఇక నగరంలోని ఏ ప్రాంతంలోనైనా మత పరమైన హింస జరిగిందంటే చాలు మా గల్లీ లోని మగవాళ్లంతా ముఖ్యంగా యువకులు కట్టెలు పట్టుకొని రాత్రిళ్లు గస్తీ కాసేటోళ్లం.
1994లో తెలుగుదేశం పార్టీ పాలన వచ్చిన తర్వాత మత ఘర్షణలు చాలా వరకు అదుపులోకి వచ్చాయి. అయితే నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలు, ధరల పెంపు, విద్యుత్ చార్జీల పెంపు, తీవ్రవాద ఉద్యమాలు…. ఇలా ఏదో ఒక అంశంపై హైదరాబాద్ నగరంలో ఎప్పుడూ ఏదో ఒక ఉద్యమం జరగడం, అవి ఉద్రిక్తతలకు దారి తీయడం… ఇలా రోజూ ఉత్కంఠగా ఉండేది.
అయితే హైదరాబాద్ నగర జీవితాన్ని, నగరంలో వచ్చిన మార్పును మాత్రం 2014 తర్వాత నుంచి పరిగణనలోకి తీసుకోవాలి. ఈ ఎనిమిది ఏండ్లలో హైదరాబాద్ నగరం ప్రతి రంగంలో గణనీయమైన అభివృద్ధిని నమోదు చేసింది. ఐటీ, పరిశ్రమలు, నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ప్రజా రవాణా, ఆరోగ్యం, నూతన ఆవిష్కరణలు, పచ్చదనం, వారసత్వ కట్టడాల పునరుద్ధరణ ఇలా… ఏ రంగాన్ని చూసినా అద్భుత రీతిలో అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధికి పరాకాష్ఠ ఈ నెల 10, 11 తేదీల్లో జరిగిన ఫార్ములా ఈ -రేస్. నగరం నడి బొడ్డున నిర్వహించిన ఈ ఈ-రేస్ నిర్వహణ, వాటి ముగింపు ఉత్సవం, హాజరైన జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, కార్ల రేసింగ్… ఇవన్నీ చూడాలి గానీ రాయడానికి పదాలు రావడం లేదు. ఒకవైపు దేశంలోనే అతి పెద్దదైన సచివాలయ భవన నిర్మాణం.. మరో వైపు అమర వీరుల స్మారక భవనం. అటు పక్క ఎత్తయిన బీఆర్ అంబేద్కర్ విగ్రహం, సుందరమైన ట్యాంక్ బండ్ పక్కనే ఉన్న నెక్లెస్ రోడ్, మింట్ కాంపౌండ్… ఇలా వీటి చుట్టూ 2.80 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రత్యేకంగా అంతర్జాతీయ ప్రమాణాల్లో నిర్మించిన ఈ-రేసింగ్ ట్రాక్‌పై దాదాపు 22 రేసింగ్ కార్లు గంటకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్తుంటే చూసిన అనుభూతి చెప్పనలవి కాదు.
ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ ద్వారా హైదరాబాద్ నగరానికి గ్లోబల్ సిటీగా పేరు వచ్చిందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఈ ఫార్ములా ఈ-రేస్‌ను ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంతి కేటీఆర్ ప్రకటించారు. ఇలాంటి మరెన్నో అంతర్జాతీయ కార్యక్రమాలను, ఉత్సవాలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఫార్ములా ఈ-రేస్ ఒక దిక్సూచిగా మారిందని చెప్పక తప్పదు. కేవలం పాశ్చాత్య దేశాల్లో మాత్రమే నిర్వహించే ఫార్ములా ఈ-రేస్‌ను హైదరాబాద్ నగర ప్రజలకు ప్రత్యక్షంగా చూపించిన సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు.
(వ్యాసకర్త: జాయింట్ డైరెక్టర్,సమాచార పౌర సంబంధాల శాఖ)
-కన్నెకంటి
వెంకట రమణ