‘నమ్మి నానవోస్తే.. పుచ్చి బుర్రైందట..’, ‘అన్నం పెట్టినోడికి సున్నం పెట్టుడంటే ఇదే..’ అన్న సామెతలు మా వూరి చెర్వులోకి గంగ నీళ్లు వచ్చే లిఫ్టు కాల్వ కాడ ఇనవడ్తున్నయ్. అప్పుడే హైద్రావాద్ నుంచి ఆంధ్రానగర్ కట్టపొంటి వస్తున్న నేను వాళ్ల మాటలు విని ఆగిన. అటుదిక్కు చెట్టు కింద బర్లు మేపుకొంటున్న నీరడి పోశన్న, ఈర్నాల శంకరు, గోసమోళ్ల సంజీవు ఇట్ల నలుగురైదుగురు ముచ్చట పెడ్తున్నరు. ‘పొద్దుగాళ్ల పొద్దుగాళ్ల ఏం ముచ్చట వెడ్తున్నరే’ అని మందలించిన.
‘నమస్తే సంతన్న.. ఇదేనా రాకడ’ అంటూ పలుకరింపులైనయ్. ‘ఇగ ఏమైందే అంతగానం వొర్రుతున్నర’ంటూ నేను అడుగంగనే.. పోశన్న అందుకున్నడు. ‘గీ కొత్తగొచ్చిన సర్కారోళ్లు సన్న వడ్లు వెయ్యిండ్రి.. ఐదొందల బోనస్ ఇస్తమని చెప్పంగనే.. అప్పో సొప్పో జేసి అవే వడ్లు నాటితిమి.’, ‘ఇప్పుడేమైందే మరి’ అంటే.. ‘ఏం గావాలె.. నోట్లె మన్నువడుడు ఒక్కటే తక్కువైంది’.. అంటూ రంది వడవట్టె. ‘గట్ల బాధవడకే పోశన్న ఏమైందో జర చెప్పరాదే..’ అంటే అంతలోనే ఈర్నాల శంకరు అందుకొని ‘మా బాధలు మీకేం తెలుసు గా కాంగ్రెసోళ్లను నమ్మితే నట్టేట ముచ్చిండ్రు.. ఇంకేం గావాలె’ అన్నడు. ‘అరె.. మంచిగ జెప్పుండ్రే.. ఏం సమజైతలేదు’ అని అడగగా.. ‘పోయినేడాది ఎలక్షన్ల గా చేతిగుర్తు రేవంతు మా రైతులకు ఎకురానికి రూ.7,500 పెట్టుబడి సాయంగా ఇస్తమన్నడు. ఓటేసి గెలిపించినం.. ఇప్పుడేమో సన్నవడ్లు నాటితిమి.. ఇంకో పది దినాలైతే పంట చేతికొచ్చే టైం అస్తుంది.
ఇప్పటిదాకా పెట్టుబడికి దిక్కే లేకపాయె. ఇంకో ముచ్చట జెప్పాలె.. మొన్న నడిమిట్ల కురిసిన వర్షాలకు పంటలకు మాయదారి రోగమొకటి వచ్చింది. చుట్టుపక్కల ఊర్లల్ల వరి ఆకులన్నీ మాడిపోయినయ్. దానికి మందుకొట్టేందుకు మళ్లీ అప్పు చేయాల్సి వచ్చింది. పంటలకు ఎప్పుడూ చల్లే ఎరువులే కాకుండా ఈసారి పురుగు మందులతో పెట్టుబడి ఎక్కువైంది. అప్పట్లంటే కేసీఆర్ సారు.. వడ్ల నారు పోయంగనే ఠంఛనుగా పెట్టుబడి సాయంమిస్తుండే. నాటే యాళ్లకు ఫోన్లన్నీ టింగ్.. టింగ్ మంటూ మొత్తుకుంటుంటే.. నవ్వుకుంట వెళ్లి పైసలు తెచ్చుకొని పంటలు వేసుకునేవాళ్లం. ఇప్పుడేమో గిట్ల అయిపాయే.. ఎవుసం ఎట్ల జేసుడో ఏమో’.. అంటూ కండ్లల్లకెల్లి నీళ్లు తెచ్చుకోవట్టె.
‘ఏం రంది వడకురా వస్తయిలే ఏటు వోతయి.. రాకపోతే మన కోసం కొట్లాడే కేసీఆర్ మన ఎన్కాల ఉండనే ఉండె. అస్తయి తీయ్’.. అంటూ సంజీవులు చెప్పిండు. ఇంతల్నే పోశన్న అందుకొని.. ‘మన కోసం ఏం అడుగుతడు.. అన్నం పెట్టినోడికి సున్నం పెట్టినోళ్లం.. ఇంక మన గురించి ఆలోచిస్తడా’ అంటుండంగనే సంజీవులొచ్చి.. ‘గాయన కూడా ఒక రైతేరా పోశిగా.. మన బాధలు ఎరుకనే.. ఎలక్షన్ల మనం ఏదో సోయి తప్పి ఆయనను దూరం జేసుకున్నం. కానీ, ఆయనెప్పుడూ మన రైతుల వెంటే ఉంటడు’ అని చెప్పిండు.
ఇంతల్నే శంకరు కలుగజేసుకొని ‘ఏందో ఏమోనే.. మొన్నటిదాకా కౌలు రైతులకు, పట్టా రైతులకు భరోసా ఇస్తమని చెప్పిండ్రు. ఇప్పుడేమో మీరు.. మీరు చూసుకోండ్రి అంటూ అవుతల వడేందుకు చూస్తుండ్రు. నేను మొన్న టీవీల జూసిన గా మంత్రి ఒకాయన ఎవరో ఒకరికే రైతుభరోసా ఇస్తమని చెప్పిండు. ఇంకేంది మన మధ్యల లొల్లివెట్టాలని చూస్తుండ్రు’.. అంటూ గరమైండు. ‘మన కాపులోన్లే సక్కంగ జేయలే.. ఇంక భరోసా ఏమి ఇచ్చేటట్టు ఉన్నడు గీ కొత్త సీఎం. ఇంక నిన్న మల్లొక వార్త చెప్పిండు.. సన్నవడ్లకు కింటాలుకు ఐదొందలు ఇస్తమని.. ఇగ మస్తయింది. గీయన మాటలు మనం నమ్మితే.. గంగల వడుడె. నాకైతే అస్తయన్న ఆశ కనవడ్తలేదు. ముందైతే గా భరోసా పైసలైతే ఇయ్యమను’ అంటూ మళ్లీ అందుకున్నడు.
మధ్యలో ఒకాయన (కాంగ్రెస్ అభిమాని) వొచ్చి ‘అవునే.. నిజమేనే.. మేం కూడా మోసపోయినమనిపిస్తున్నది. ఎలక్షన్ల గాయనను గెలిపించేతందుకు మస్తు జెప్పినం.. ఇప్పుడు ఊర్ల మాకే పతేరా లేకుంట పోయింది’ అనుకుంటూ మెల్లిగా జారుకున్నడు. ‘గంత మంచిగా టైంకు పెట్టుబడి సాయమిచ్చే.. యాళ్లకు వడ్లు కొని పైసలు అకౌంట్ల ఏసిండు. రైతులకు ఏ రందీ లేకుంట చూసుకోండ్రని ఎక్కడ వోయినా.. ఏ మీటింగ్ పెట్టినా ఆఫీసర్లకు.. మంత్రులకు మంచిగ చెబుతుండే.. దేవుడోలె మనల్ని మంచిగజూసుకున్న కేసీఆర్ సారును మనం దూరం జేసుకొని బాధల్ని నెత్తినపెట్టుకున్నం’ అనుకుంట బాధపడ్డరు.
‘నిజమేనే ఒక ఇషయం యాదికొచ్చింది. ఒకపారి.. దేశంల మిడతల దండు వచ్చి పంటల మీది వాలి మొత్తం నాశనం జేసింది గుర్తుకున్నదా మీకందరికి? గా టైంల కేసీఆర్ సారు సీఎంగా ఉండె. మనకు ఆ ముచ్చట తెల్వకముందే కేసీఆర్ సారు ఆఫీసర్లతో మాట్లాడి.. ఇటు దిక్కు ఆదిలాబాద్, బాసర, భైంసా, జుక్కల్, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్ల ఇట్ల తెలంగాణ సుట్టూ గా నీళ్ల మోటర్లు (ఫైరింజన్లు) పెట్టి రెడీగా ఉంచిండు. అప్పుడే అర్థమైందే.. మన కేసీఆర్ సారుకు ఎవుసం మీద.. మన రైతుల మీద ఎంత పీర్తి ఉన్నదో.. అగ్గొ గట్ల ఉండాలె సీఎం అంటే.. ఎంతైనా కేసీఆర్.. కేసీఆరే..’ అంటూ బర్లు కొట్టుకొని పోయిండ్రంతా.
– (వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
– కొండ్లాడ సంతోష్