కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచిపోయాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆ పార్టీ ఇచ్చిన హామీల అమలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందంగా ఉన్నది. ఆరు గ్యారంటీలు, రైతులకు, యువతకు, ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్లు మొత్తంగా మ్యానిఫెస్టోలోని 420 హామీల అమలు అంతా నీటి మూటలు, ఒట్టి ప్రగల్భాలే అని తేలిపోయింది. రైతులు, వ్యవసాయకూలీలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఆర్టీసీ సిబ్బంది, ఆటోడ్రైవర్లు ఇలా వివిధ వర్గాల వారు కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకొని, గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు కూడా అటకెక్కడంతో మండిపడుతున్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించింది. బీఆర్ఎస్ రూ.లక్ష వరకే రుణమాఫీ చేసిందని, కాంగ్రెస్‌కు ఓటేస్తే రూ.2 లక్షల రుణమాఫీ అని, బీఆర్ఎస్ రైతుబంధు ఎకరానికి ఏటా రూ.10వేలు మాత్రమే ఇచ్చిందని, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని, కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇస్తామని, పది రకాల పంటలకు రూ.500 వరకు బోనస్, పంట నష్టం వాటిల్లితే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ఓటర్లను ఆకర్షించింది. ఓట్లు వేయించుకుని గద్దెనెక్కింది. తమను ఆదరించిన రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిలువునా ఇప్పుడు ముంచుతున్నది. హామీలకు సంబంధించి కాంగ్రెస్ సర్కార్ రైతులకు రూ.లక్ష కోట్ల వరకు బకాయి పడింది. ఆరు గ్యారంటీలపై సీఎం సంతకం, క్యాబినెట్ తీర్మానం, చట్టబద్ధ్దత కల్పిస్తామంటూ ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచుకోలేదు. రైతులకు కనీసం యూరియా కూడా సరఫరా చేయలేని దుస్థితిలో సర్కార్ ఉన్నది. రైతుల నుంచి సగం ధాన్యం ప్రభు త్వం కొనకపోవడంతో, రైతులు యాసంగి సీజన్లో 65 లక్షల టన్నుల ధాన్యాన్ని తక్కువ ధరకే మిల్లర్లకు విక్రయించాల్సి వచ్చింది.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో నయాపైసా కేటాయించలేదు. దీంతో రాష్ట్రంలో రైతు రుణమాఫీ ముగిసిన కథ అయిపోయింది. వాస్తవానికి, రూ.రెండు లక్షల వరకు రుణాలు కలిగిన 42 లక్షల మంది రైతులకు రూ.31వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి గతంలో ప్రకటించారు. కానీ, ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసింది. ఈ లెక్కన ఇంకా 16.65 లక్షల మంది రైతులకు రూ.10,384 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉన్నది.
లక్షల మంది రైతులకు రూ.వేల కోట్లు పెండింగ్‌లో ఉండగా రుణమాఫీ పూర్తయినట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో లేని గొప్పలు చెప్పుకోవటం రైతులను నిలువునా మోసం చేయడమే. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాగానే 2026 ఫిబ్రవరి 18న రైతుభరోసా నగదు బదిలీ ఉంటుందని సీఎం పలు సభల్లో ప్రకటించారు. కానీ ఆ మాటలు నీటి మూటలే అయ్యాయి.
ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 10న రిజర్వ్ బ్యాంక్ నుంచి రూ.9 వేల కోట్లు అప్పు తీసుకున్నది. ఈ డబ్బు రైతు భరోసా కోసమేనని ప్రభుత్వ పెద్దలు చెప్పుకొన్నారు. రైతు భరోసా డబ్బులు చెల్లించి, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. కానీ మున్సిపల్ ఎన్నికలు ముగియగానే రైతు భరోసా నిధులు అందరికీ విడుదల చేయలేదు. కానీ మూడెకరాల వరకే పరిమితమైంది. ఈ రైతు భరోసా నిధులు దారి తప్పి రాహుల్ భరోసా అయిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రైతుల కోసం అని చెప్పిన రూ.9 వేల కోట్లు, ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు కోసం దారి మళ్లాయనే ఆరోపణలున్నాయి. కమీషన్లుగా వచ్చిన వెయ్యి కోట్ల రూపాయలను ఇటీవల కేరళ, తమిళనాడు, అసోం, బెంగాల్ రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖర్చు కోసం తరలించి ఉంటారని ప్రచారం జరుగుతున్నది.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు సీజన్లకు గాను రెండు సీజన్లకు పూర్తిగా, రెండు సీజన్లలో సగం మంది రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు, రెండు సీజన్లకు రైతు భరోసా డబ్బులను పూర్తిగా ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కార్, ఇక కౌలు రైతులకైతే భరోసా పథకం పూర్తిగా ఎగవేసింది. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు స్కీమ్ బంద్ అయితదని అంటున్నరు. ఎందుకు బందయితది? మేమేమన్నా దివానాగాళ్లమా, మాకు దిమాక్ లేదా?’ అని ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. మరిపుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అయింది. సగం సీజన్లకు రైతుభరోసాను ఎగ్గొట్టింది. అంటే రేవంత్‌రెడ్డి మాటల ప్రకారమే సర్కార్ పెద్దలు ఏంటో వాళ్లే ఆలోచించుకోవాలి.
ప్రతిసారీ ఏవో ఎన్నికలు ఉన్నప్పుడే అరకొర రైతుభరోసా పేరుతో ప్రభుత్వ పెద్దలు హడావుడి చేస్తున్నారు. అంటే ఎన్నికలు ఉంటనే రైతు భరోసా ఇస్తారా? పంటలు వేసిన ప్రతిసారీ ఇవ్వరా? ఈ లెక్కన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగకపోతే, ఇక రైతుభరోసా స్కీమ్ కూడా రద్దయినట్టేనా అనే కలవరం రైతుల్లో మొదలైంది. రైతుభరోసా అసలు కొనసాగుతుందని అన్నదాతలకు భరోసా ఇవ్వాలంటే ప్రభుత్వం ఈ యాసంగి, వానాకాలం సీజన్లవి కలిపి ఒకేసారి ఇదే నెలలో రైతుభరోసా నిధులు విడుదల చేయాలి. గతంలో ఎగ్గొట్టిన బకాయిలను కూడా పూర్తిగా చెల్లించి తీరాల్సిందే.
రైతు డిక్లరేషన్ ప్రకారం ప్రభుత్వం రాష్ట్రంలోని కోటి పది లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలి. కానీ ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికలో కొర్రీలు పెడుతూ కేవలం 5.19 లక్షల పైచిలుకు లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఇందులో 2024-25 రబీ సీజన్లో 84 వేల మందికి మాత్రమే రూ.6 వేల చొప్పున, ఒక సీజన్‌కే ఆత్మీయ భరోసా అమలు చేసింది. మిగిలిన 4.35 లక్షల మందికి ఆత్మీయ భరోసా ఎగ్గొట్టింది. వీరందరికీ తక్షణమే పెండింగ్‌లో ఉన్న రూ.6 వేలు విడుదల చేయాలి. 2025 ఖరీఫ్ సీజన్‌తోపాటు, తాజాగా ముగిసిన 2025-26 రబీ సీజన్, ఇపుడు ప్రారంభమవుతున్న ఖరీఫ్ సీజన్, మొత్తం మూడు సీజన్లకు కలిపి, మొత్తం లబ్ధిదారులకు మూడు విడతల ఆత్మీయ భరోసా నిధులు రూ.18 వేల చొప్పున ఇవ్వాలి. లబ్ధిదారుల సంఖ్యను పెంచి, కనీసం 25 లక్షల మంది రైతు కూలీలకైనా ఆత్మీయ భరోసా అమలు చేయాలనేది రైతు కూలీల డిమాండ్.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో భాగంగా వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని తెలిపింది. పార్టీ మ్యానిఫెస్టోలో వరితోపాటు మక్క, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, చెరుకు, జొన్నలు వంటి పంటలకు కూడా బోనస్ ఇస్తామని నమ్మబలికింది. కానీ ఒక్క వరిపంటకు, అదీ సన్న రకానికి మాత్రమే బోనస్ అని ప్రకటించి, దొడ్డు రకం వడ్లను సాగు చేసే రైతులను మోసం చేసింది.
2024 ఏడాది ఖరీఫ్ సీజన్లో సన్నాలకు బోనస్‌ను అమలు చేయడంతో వరి రైతులు 2024-25 రబీ సీజన్లోనూ బోనస్ దక్కుతుందని రైతులు అనుకొని, సన్నరకం వరి సాగు చేశారు. కానీ, అన్నదాతల ఆశలు అడియాసలే అయ్యాయి. యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముగిసి ఏడాదిదాటినా ఇప్పటి వరకు రైతులకు దక్కాల్సిన బోనస్ డబ్బులు రూ.1160 కోట్లు విడుదల చేయలేదు. కనుక ఆ పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలి. తాజాగా ధాన్యం సేకరణ ముగుస్తున్న యాసంగి సీజన్ సన్నరకం వడ్లతోపాటు, దొడ్డురకానికి, మ్యానిఫెస్టోలో చెప్పిన హామీ మేరకు ఇతర పంటలకు కూడా బోనస్ ఇవ్వాలనేది అన్నదాతల డిమాండ్.
రైతులు మాత్రమే కాదు, కాంగ్రెస్ హామీలను నమ్మి ఆ పార్టీకి ఓటేసిన వివిధ వర్గాలన్నీ ఇపుడు తాము నమ్మకద్రోహానికి గురయ్యామని రగిలిపోతున్నారు. నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థినులు, ఎస్సీ, ఎస్టీలు, ఆటోడ్రైవర్లు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా ప్రతీ వర్గం కాంగ్రెస్ తమను దగా చేసిందని మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక అన్ని వర్గాల ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ సర్కార్ సగం పాలనా కాలంలోనే కోల్పోయింది. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలన చూసాక, రాష్ట్ర ప్రజలకు ఇది దగాకోరు, నయవంచన సర్కార్ అని ప్రజలకు స్పష్టమైన అవగాహన వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్ల పాలనలో బంగారు తెలంగాణ కల సాకారం కోసం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసింది. కాంగ్రెస్ అదనంగా పథకాలు అమలు చేస్తామంటే నమ్మిన ప్రజానీకం, ఇప్పుడు మొండిచేయి చూపిన పార్టీకి తగినబుద్ధి చెప్పేందుకు సమయం కోసం వేచి చూస్తున్నారు.
– (వ్యాసకర్త: భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే)
గండ్ర వెంకటరమణారెడ్డి