డెహ్రాడూన్, ఆగస్టు 15: విద్య, నియామక పరీక్షల్లోని అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలపై యోగా గురు బాబా రామ్‌దేవ్ శనివారం నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్రం త్వరగా ఘఫ్లా(కుంభకోణం)ను సరిదిద్దకపోతే విద్యార్థుల ఆందోళన మరింత తీవ్రరూపం దాల్చవచ్చని, తాను కూడా మళ్లీ నిరసన చేపట్టాల్సి రావచ్చని ఆయన అన్నారు. నిరసనలు రాజ్యాంగ పరిధిలోనే ఉండాలని చెప్తూ జెన్‌జీ తరం వారు హింస, అరాచకాలలో పాల్గొనరాదని కూడా ఆయన పిలుపునిచ్చారు. విద్య, ప్రభుత్వ నియామకాల్లో జరుగుతున్న అవకతవకలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున యువజనుల నిరసనలకు దారితీయవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ నిరసనలు అల్లర్లుగా మారకూడదని ఆయన అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠం వద్ద జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జార్ఖండ్‌లో జెన్-జీ నేతృత్వంలోని విద్యార్థుల ఆందోళనను ప్రస్తావించారు. సరైన సౌకర్యాలు అందుబాటులో ఉన్న చోట కూడా మోసాలు, ప్రశ్నపత్రాల లీకేజీల వల్ల పరీక్షలు దెబ్బతింటున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల్లో ముఖ్యంగా ఇంటర్వ్యూల సమయంలో అవినీతి జరుగుతున్నదని రామ్‌దేవ్ ఆరోపించారు.