వర్షాలు కురువడం లేదంటే దానికి వాతావరణ పరిస్థితులు కారణమవుతాయి. కానీ రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్నట్టు చేతబడులే కారణమని అంటే ఆ మాటలను ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తమిళనాడు, కర్ణాటకకు వెళ్లి రాష్ట్రంలో వర్షాలు పడకుండా దుష్టశక్తులతో పూజలు చేయిస్తున్నారని వ్యాఖానించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజల ముందు మాట్లాడటం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ప్రజా జీవితంలో శాస్త్రీయ దృక్పథం స్థానం ఏమిటి? అనే ప్రశ్నను ప్రతి పౌరుడు అడుగాల్సిందే. మరోవైపు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆలయాల్లో వరుణ యాగాలు నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ప్రకటన కూడా వెలువడింది. వ్యక్తిగతంగా ఎవరైనా పూజ చేయడం వారి విశ్వాసం. కానీ ప్రభుత్వం శాస్త్రీయ కారణాలకు బదులుగా మతపరమైన కర్మకాండలను పరిష్కారంగా చూపడం మాత్రం భిన్నమైన విషయం.
ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యాల్లో శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, విచారణ, సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించడం గురించి రాజ్యాంగంలోని 51ఏ(హెచ్)లో స్పష్టంగా ఉన్నది. ఇది కేవలం పాఠ్యపుస్తకంలోని ఒక వాక్యం కాదు. ప్రజాస్వామ్య భారతదేశం ఏ దిశగా నడవాలన్నదానిపై రాజ్యాంగ నిర్మాతలు ఇచ్చిన మార్గదర్శకం. అయితే ఇక్కడ రాజ్యాంగపరమైన ఓ సూక్ష్మతను గుర్తించాలి. చేతబడులు నమ్మడం లేదా మూఢనమ్మకాలు కలిగి ఉండడం మాత్రమే స్వయంచాలకంగా రాజ్యాంగ విరుద్ధమై న నేరం కాదు. కానీ రాజ్యాంగ పదవిలో ఉన్న వ్య క్తి తన అధికారిక హోదా, ప్రజా ప్రభావాన్ని ఉపయోగించి శాస్త్రీయ ఆధారం లేని కారణాలను ప్రజలకు వాస్తవాలుగా చెప్పడం మాత్రం రాజ్యాంగ స్ఫూర్తికి స్పష్టంగా విరుద్ధంగా ఉంటుంది.
వర్షాలు ఎలా పడుతాయి? మేఘాల నిర్మాణం, వాతావరణ పీడన మార్పులు, గాలుల దిశ, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, తేమ, ఎల్ లినో వంటి వాతావరణ పరిణామాలపై ఆధారపడి కురుస్తాయి. ఇవన్నీ శాస్త్రవేత్తలు పరిశీలించే అంశాలు. తెలంగాణ ప్రభుత్వం కూడా రైతులకు ఇచ్చిన అధికారిక సమాచారంలో ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు ఉండవచ్చని పేర్కొన్నది. మరి ఈ సంక్లిష్టమైన వాతావరణ శాస్ర్తానికి ప్రత్యామ్నాయంగా హరీశ్‌రావు చేతబడులు చేయిస్తున్నారనే వివరణను ముందుకు తేవడం ఎంతవరకు సమంజసం? ఒక చిన్న ప్రశ్న అడుగుదాం. చేతబడులతో వర్షాలను ఆపగలిగితే కర్ణాటక, తమిళనాడు మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న కావేరీ జల వివాదం ఉండేది కాదు కదా! రెండు రాష్ర్టాలు సుప్రీంకోర్టులు, ట్రైబ్యునళ్లు, నీటి వాటాలు, ఆనకట్టలు, వర్షపాతం గణాంకాలపై ఎందుకు పోరాడుతున్నాయి? ఎవరో ఒకరు రహస్యంగా పూజ చేసి వర్షాన్ని ఆపేస్తే జలవివాదాలన్నీ గంటలో పరిష్కారమైపోయేవి కదా!
అదే తర్కాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు వర్తింపజేస్తే మరింత వినోదంగా ఉంటుంది. కృష్ణా, గోదావరి జలాలపై ఇరు రాష్ర్టాలు ఎందుకు లెక్కలు వేసుకుంటున్నాయి? ప్రాజెక్టులపై చర్చ లు, వివాదాలు ఎందుకు? నీటి విడుదల కోసం అధికారిక ఉత్తర్వులు ఎందుకు? చేతబడులే వర్షాలను నిర్ణయిస్తే జల వనరులశాఖకు బదులుగా ఒక చేతబడులశాఖ పెట్టుకుంటే సరిపోతుంది కదా!
ఈ మాట వ్యంగ్యంగా అనిపించినా ప్రశ్న మాత్రం తీవ్రమైనది. ప్రజలకు శాస్త్రీయ పరిష్కారాలు చూపాల్సిన ప్రభుత్వం, మూఢనమ్మకాల భాషలో రాజకీయ ప్రత్యర్థులను నిందించడం ప్రారంభిస్తే, ముందుముందు ప్రతీ రాజకీయ వైఫల్యానికి ఒక దుష్టశక్తిని వెతకాల్సి వస్తుంది. ఇంకా విచిత్రమేందంటే, ఒకవైపు ఎల్ నినో ప్రభావం, వాతావరణ మార్పులు, వర్షపాత నమూనాలపై ప్రభుత్వం శాస్త్రీయ హెచ్చరికలు ఇస్తున్నది. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులు దుష్టశక్తుల ద్వారా వర్షాలను అడ్డుకుంటున్నారని చెప్పడం ఎలా సరిపోతుంది? శాస్ర్తాన్ని నమ్మే ప్రభుత్వం అయితే వాతావరణ శాఖ చెప్పేది వినాలి. అంతేకానీ చేతబడుల ఆరోపణలతో పాలనను వినోదంగా మార్చకూడదు.
ఇక మరో ప్రశ్న కూడా ఉన్నది. వర్షాల కోసం వరుణ యాగాలు నిర్వహించడం నిజంగా వర్షాన్ని తెప్పిస్తుందని ప్రభుత్వం నమ్మితే, ఆ నమ్మకానికి శాస్త్రీయ ఆధారం ఏమిటి? ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన యాగం తర్వాత వర్షం పడితే అది యాగం వల్లేనని ఎలా నిరూపిస్తారు? అదే సమయంలో యాగం చేసినా వర్షం పడకపోతే దానికి బాధ్యత ఎవరిది? వ్యక్తిగత విశ్వాసాలను ప్రశ్నించడం నా ఉద్దేశం కాదు. ఎవరికైనా దేవుడిపై నమ్మకం ఉండవచ్చు. ఎవరైనా తమ పూర్వీకుల ఆచారంగా వరుణ యాగం చేయవచ్చు. గ్రామాల్లో కప్పల పెండ్లిళ్లు వంటి సంప్రదాయాలు కొనసాగవచ్చు. విశ్వాసం అనేది వ్యక్తిగత హక్కు. కానీ ప్రభుత్వ విధానం శాస్త్రీయ ఆధారాలపై ఉండాలి. ఇదే సెక్యులర్ ప్రజాస్వామ్యానికి కనీస ప్రమాణం.
రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడానికి వందలాది అంశాలు ఉంటాయి. వారి విధానాలను ప్రశ్నించవచ్చు, విమర్శించవచ్చు. కానీ చేతబడులు, దుష్టశక్తులు వంటి నిరూపించలేని అంశాలను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించడం ప్రజాస్వామ్య చర్చ స్థాయిని దిగజార్చడమే అవుతుంది. ముఖ్యమంత్రి స్వయంగా వర్షాలపై అధికారులను అప్రమత్తం చేయడం, ముందస్తు హెచ్చరికలను అమలు చేయాలని ఆదేశించాలి.
గతంలో భారీ వర్షాల సమయంలో ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ అధికారులు సరిగా స్పందించలేదని ఆయనే విమర్శించిన సందర్భాలున్నాయి. మరి అదే స్థాయిలో వాతావరణ శాస్త్రం, నీటి నిర్వహణ, చెరువుల పరిరక్షణ, పట్టణ డ్రైనేజీ, సాగునీటి ప్రణాళిక, వర్షపు నీటి సంరక్షణపై దృష్టి పెట్టడం మరింత అవసరం.
వర్షాలను కురిపించేది రాజకీయ నాయకుల మాటలు కాదు, ప్రకృతి వ్యవస్థలు. నీటి సమస్యను పరిష్కరించేది చేతబడుల ఆరోపణలు కాదు, శాస్త్రీయ ప్రణాళికలు. ముఖ్యమంత్రి ఒక రాజకీయ నాయకుడు కావచ్చు. కానీ సీఎం అయిన తర్వాత ఆయన మాటలు ఒక పార్టీకి చెందిన వ్యక్తి మాటలుగా మాత్రమే ఉండవు. అవి ప్రభుత్వాన్ని ప్రతిబింబిస్తాయి. అందుకే ఆయన మరింత జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థిని ఓడించడానికి శాస్ర్తాన్ని ఓడించాల్సిన అవసరం లేదు. తెలంగాణకు ఇప్పుడు కావలసింది చేతబడుల కథలు కాదు, వాతావరణ డాటా. దుష్టశక్తుల ఆరోపణలు కాదు, నీటి నిర్వహణ. వరుణ యాగాల ప్రచారం కాదు, శాస్త్రీయ వ్యవసాయ ప్రణాళిక. భయాలు కాదు, ప్రజలకు నిజమైన సమాచారం. రాజ్యాంగం శాస్త్రీయ దృక్పథాన్ని కోరుతున్న దేశంలో, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నుంచి ప్రజలకు రావాల్సిన సందేశం ఒక్కటే. మూఢనమ్మకాన్ని కాదు, ఆధారాన్ని నమ్మండి దుష్టశక్తులను కాదు. శాస్ర్తాన్ని ప్రశ్నించండి, రాజకీయ ఆరోపణలను కాదు. నిజాలను వెతకండి. అదే తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రేపటి తరానికి, నిజమైన నాయకత్వం అవుతుంది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-సీహెచ్‌వీ ప్రభాకర్‌రావు