ఢిల్లీలో రైతుల ఆందోళన ఉధృతమై కేంద్రంలోని మోదీ సర్కారు ఉక్కిరిబిక్కిరి అయిన రోజులు అందరికీ గుర్తుండే ఉంటాయి. అప్పటినుంచి కాంగ్రెస్ రైతు శ్రేయోభిలాషిగా నటించడం మొదలుపెట్టింది. కానీ ఆ పార్టీ అసలు స్వరూపం తెలియాలంటే మరో జలియన్‌వాలా బాగ్గా పేరుపడిన ముల్తాయ్ రైతుల ఊచకోతను గుర్తుచేసుకోవాలి.
సునీలంకు పైర్ ఉద్యోగి మృతి కేసులో 15 ఏండ్ల తర్వాత కోర్టు యావజ్జీవం వేసింది. ఆందోళనకారులను రెచ్చగొట్టాడనేది ఆయనపై ప్రధానమైన ఆరోపణ. దాదాపు అన్ని కేసులు ఉపసంహరించుకోవడమో, కొట్టివేయడమో జరిగింది. కానీ ప్రత్యక్ష సాక్షుల కథనం మరోలా ఉన్నది. పోలీసులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపారని, రెండున్నర గంటల పాటు ఊచకోత కొనసాగిందని ఆరోపణలు వచ్చాయి.
ప్రధాని మోదీ నల్లచట్టాలు వెనుకకు తీసుకుంటున్నట్టు ప్రకటించగానే, కాంగ్రెస్ రైతు అనుకూల ఫోజులు కొట్టడం ఎక్కువైంది. రైతుల మీద ప్రేమ ఒలకబోయడం ఎక్కువైంది. తాము అధికారంలోకి వస్తే రైతులను ఆదుకుంటామని చెప్పుకోవడం మొదలుపెట్టింది. కానీ కాంగ్రెస్ అసలు రంగు తెలుసుకోవాలంటే ముల్తాయ్‌లో మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్‌సింగ్ హయాంలో జరిగిన రైతుల ఊచకోతను గుర్తు చేసుకుంటే సరిపోతుంది. 1998 జనవరి 12న జరిగిన ఆ ఘటనలో 24 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ ఘటనను 1998 సంవత్సరపు ‘జలియన్‌వాలా బాగ్’గా అభివర్ణించడం గమనార్హం.
దీని నేపథ్యంలోకి వెళ్తే… 1997లో మధ్యప్రదేశ్ రైతులు పంట నష్టాలతో కుదేలయ్యారు. రుణబాధలు మిక్కుటమయ్యాయి. వీటి ఫలితంగా ఆకలిచావుల అంచులవరకు వెళ్లాల్సి వచ్చింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు ఆందోళన బాటపట్టారు. పంట పరిహారం చెల్లించాలని, రుణాలు మాఫీ చేయాలని, కరెంటు బిల్లులు వసూలు చేయరాదని, పంట బీమా చెల్లించాలని పలు డిమాండ్లను మధ్యప్రదేశ్ సర్కారు ముందుంచారు. 1997 డిసెంబర్ 25న రైతులు ముల్తాయ్ తహసీల్‌ను ముట్టడించారు. 13 రోజులపాటు ఏకధాటిగా ఆందోళన కొనసాగుతుండగా పోలీసులు వచ్చి టెంట్లు పీకేశారు. వారు రాత్రిపూట చీకట్లో వచ్చి దాడిచేశారని, భోజన ఖర్చులకు రైతులు తెచ్చుకున్న డబ్బులను కూడా గుంజుకున్నారని ఆరోపణలున్నాయి. పోలీసు దాడి తర్వాత కూడా రైతులు శాంతియుతంగా ఆందోళన కొనసాగించారు. జనవరి 11న పోలీసులు వచ్చి ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న సునీలం ఆచూకీ చెప్పమని అంటూ కొందరు రైతులను పట్టుకుపోయి పోలీసు స్టేషన్లో ప్రశ్నించారు. కానీ వారినుంచి పోలీసులు ఏమీ తెలుసుకోలేకపోయారు.
పోలీసు వేధింపుల ఫలితంగా ఆందోళన తీవ్రమైంది. రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. జనవరి 12న ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆ రోజుల్లోనే కొత్తగా ఏర్పడిన కిసాన్ సంఘర్ష్ సమితి పిలుపు మేరకు రైతులు తహసీల్‌కు తాళం వేసి అధికారులను ఘెరావ్ చేసేందుకు ఉద్యుక్తులయ్యారు. ఈలోగా ఆందోళనకారుల్లో కొందరు రాళ్లువేయడం మొదలుపెట్టారు. కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ దశలో మధ్యప్రదేశ్ పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. 19 మంది మరణించారని, 150 మందికి పైగా గాయపడ్డారని అధికారిక వార్తలు వెలువడ్డాయి. కాగా మృతుల సంఖ్య 24 వరకు ఉంటుందని అనధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి.
ఈ ఆందోళన వెనుక సూత్రధారిగా భావిస్తున్న సునీలం పూర్తిపేరు సునీల్ మిశ్రా. ఆ సమయంలో సమాజ్‌వాదీ పార్టీ శాసనసభ్యునిగా ఉన్నారు. కాల్పుల ఘటన తర్వాత పార్టీ ఆయనను సస్పెండ్ చేసినప్పటికీ తర్వాత ఎత్తేశారు. సునీలంపై, రైతులపై పోలీసులు ఆరోపణలు చేశారు. సునీలంను అరెస్టు చేసి రెండుమూడు నెలల తర్వాత విడుదల చేశారు. ఆందోళనకారులు ఓ ఫైర్ సర్వీస్ ఉద్యోగిని చంపేశారని, దాంతో పోలీసులు ఆత్మరక్షణకు కాల్పులు జరిపారని జ్యుడీషియల్ కమిషన్ తీర్మానించింది. ఈ విచారణకు సునీలం హాజరు కాలేదు. హైకోర్టు జడ్జితో లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తనకు పెరుగుతున్న జనాదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ సర్కారు తప్పుడు కేసుల్లో ఇరికించిందని, 450 గ్రామాల్లో తాను ప్రారంభించిన రైతు ఉద్యమాన్ని చూసి ఆ పార్టీకీ జడుపు పుట్టిందని కూడా సునీలం ఆరోపించారు. సునీలంపై, రైతులపై 66 కేసులు పెట్టారు. అందులో చాలావరకు తర్వాత ఉపసంహరించుకున్నారు.
కాల్పులు జరిపించిన అధికారుల మీద మాత్రం ఎలాంటి కేసులు నమోదు కాలేదు. సునీలంకు ఫైర్ ఉద్యోగి మృతి కేసులో 15 ఏండ్ల తర్వాత కోర్టు యావజ్జీవం వేసింది. ఆందోళనకారులను రెచ్చగొట్టాడనేది ఆయనపై ప్రధానమైన ఆరోపణ. దాదాపు అన్ని కేసులు ఉపసంహరించుకోవడమో, కొట్టివేయడమో జరిగింది. కానీ ప్రత్యక్ష సాక్షుల కథనం మరోలా ఉన్నది. పోలీసులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపారని, రెండున్నర గంటల పాటు ఊచకోత కొనసాగిందని ఆరోపణలు వచ్చాయి. రైతుల సమస్యలు పరిష్కరించడం చేతకాని కాంగ్రెస్ సర్కారు వారిపై తూటాలు కురిపించి తూతూమంత్రం తంతుగా విచారణలు జరిపించి చేతులు దులిపేసుకున్నది. కాంగ్రెస్ పాలనలో జరిగిన ఘోరదురంతాల్లో ఒకటిగా ముల్తాయ్ రైతు ఊచకోత చరిత్రలో నిలిచిపోయింది.
ఎడిటోరియల్ డెస్క్