తమ్మిడిహట్టి ప్రహసనం దారెటు?
తమ్మిడిహట్టి బరాజ్ ఎత్తును పెంచాలన్న తెలంగాణ అభ్యర్థనను మరోసారి పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే, తుది నిర్ణయానికి వచ్చే ముందు పలు అంశాలపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నదని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని తెలంగాణ సర్కార్ వెల్లడించింది.
తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి సంబంధించి ముంబయిలో ఈ నెల 26న ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరిగాయి. చర్చలు ముగిసిన వెంటనే తెలంగాణ ప్రభుత్వ వర్గాల నుంచి ఒక పత్రికా ప్రకటన జారీ అయింది. ఇరు రాష్ర్టాల సెక్రటరీల కమిటీ తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణం వల్ల సంభవించే ముంపు విస్తీర్ణం, చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంపై పడే ప్రభావాలు అధ్యయనం చేసి బరాజ్ నిర్మాణానికి ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తుందని పేర్కొన్నారు. తమ రాష్ర్టానికి, రాష్ట్ర ప్రజలకు ప్రతికూల ప్రభావం లేకపోతే 148 మీటర్ల ఒప్పందాన్ని పునఃపరిశీలించేందుకు సిద్ధమని, తెలంగాణ నీటి అవసరాలకు సహకరించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని మహారాష్ర్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారని ప్రెస్‌నోట్‌లో తెలిపారు.
తమ్మిడిహట్టి బరాజ్ ఎత్తును పెంచాలన్న తెలంగాణ అభ్యర్థనను మరోసారి పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే, తుది నిర్ణయానికి వచ్చే ముందు పలు అంశాలపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నదని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని తెలంగాణ సర్కార్ వెల్లడించింది. సాంకేతిక, పర్యావరణ, పరిపాలనాపరమైన అంశాలను పరిశీలించాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టంచేశారని పత్రికా ప్రకటనలో పేర్కొన్నది. అవసరమైతే ప్రత్యామ్నాయాలను కూడా అధ్యయనం చేయాలని ఫడ్నవీస్ చెప్పినట్టు తెలిపింది. ప్రెస్‌నోట్‌లో పేర్కొన్న ప్రధాన అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.
తొలుత 2016లో తమ్మిడిహట్టి బరాజ్ ఎత్తును 148 మీటర్లుగా నిర్ణయిస్తూ ఒప్పందం కుదిరిందని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో గుర్తుచేశారు. అయితే, ఈ ఎత్తుతో బరాజ్ నిర్మిస్తే తెలంగాణ తాగు, సాగునీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీరవని, ప్రస్తుత విద్యుత్తు అవసరాలు, ఇంధన వ్యయం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులను పరిగణనలోకి తీసుకోవాలని, ప్రాజెక్టు నిర్వహణ వ్యయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో తమ్మిడిహట్టి బరాజ్‌ను 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడమే తెలంగాణకు అత్యంత ప్రయోజనకరమైన ప్రత్యామ్నాయమని వివరించారు.
అధికారంలోకి వస్తే తమ్మిడిహట్టి బరాజ్‌ను నిర్మించి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి నీటిని తరలించి తీరుతామని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తమ వాగ్దానాన్ని పలుసార్లు పునరుద్ఘాటించారు. అయితే తాము వాగ్దానం చేసినట్టు తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీటిని తరలించడం సాధ్యం కాదని ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ హయాంలోనే ప్రభుత్వానికి తెలుసు. 116 కిలోమీటర్ల గ్రావిటీ కాలువను 73 కిలోమీటర్లు మాత్రమే తవ్వి ఎందుకు వదిలేసినట్టు? కాలువ మార్గంలో సింగరేణి సంస్థ గుర్తించిన బొగ్గు గనులు ఉండడం వల్ల కాలువ తవ్వకం ఆగిపోయింది.
ఈ బొగ్గు గనులను తప్పించి కాలువను ఎల్లంపల్లి వరకు ఎత్తయిన కాంటూర్‌లో తవ్వాల్సి ఉంటుంది. ఆ మార్గంలో 73వ కిలోమీటర్ వద్ద 29 మీటర్ల లిఫ్ట్, 92వ కిలోమీటర్ వద్ద 19 మీటర్ల లిఫ్ట్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఈ మేరకు ఆనాడే ఇంజినీర్లు ఒక స్కీమాటిక్ మ్యాప్ కూడా తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించారు. దాని మీద 2014 వరకు ఎలాంటి నిర్ణయమూ జరగ లేదు. 73 కిలోమీటర్లు తవ్విన కాలువ ముందుకు పోనే లేదు.
మరోవైపు తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర తో ఏడేండ్ల్లలో ఎలాంటి ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోలేకపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో తమ్మిడిహట్టి వద్ద బ రాజ్ నిర్మాణానికి ఏడాదిపాటు అన్ని స్థా యుల్లో తీవ్రంగా కృషి చేసినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వాలు (కాంగ్రెస్, బీజేపీ) 148 మీటర్ల కంటే ఒక్క ఇంచు కూడా ఎక్కువ ఎత్తు అనుమతించబోమని స్పష్టం చేశాయి.
ఇక మహారాష్ట్రతో చర్చల పేరిట కాలయాపన చేయడం కంటే 148 మీటర్ల ఎత్తు వద్ద బరాజ్ నిర్మాణానికి సిద్ధపడటం మేలని కేసీఆర్ ప్రభుత్వం భావించింది. అదే సమయంలో కేంద్ర జల సంఘం కూడా తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు అవసరాలకు తగినంత నికర జలాల లభ్యత లేదని వరుసగా నెల రోజుల వ్యవధిలో మూడు లేఖలు రాసింది. బరాజ్ వద్ద నీటిని తరలించే పరిమాణాన్ని పునఃపరిశీలించుకోవాలని సలహా ఇచ్చింది.
బరాజ్‌ను 148 మీటర్ల ఎత్తున నిర్మిస్తే 44 టీఎంసీలకు మించి నీటిని తరలించడం సాధ్యం కాదని ప్రాజెక్టు సిమ్యులేషన్ స్టడీస్ తేల్చిచెప్పాయి. కాబట్టి ప్రాజెక్టును రీ-ఇంజినీరింగ్ చేసుకోవలసిన అగత్యం ఏర్పడింది. రీ ఇంజినీరింగ్ తర్వాత ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రెండు భాగాలుగా మారింది. 148 మీటర్ల ఎత్తున తమ్మిడిహట్టి బరాజ్ నిర్మించి 20 టీఎంసీల వినియోగంతో ఆదిలాబాద్ తూర్పు జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్ట్, మిగతా జిల్లాల అవసరాలకు కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. ఇందులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ద్వారా 240 టీఎంసీల గోదావరి నికర జలాలను వినియోగించుకోవడానికి కేంద్ర జల సంఘం కూడా అనుమతించింది. 148 మీటర్ల ఎత్తు వద్ద తమ్మిడిహట్టి, 100 మీటర్ల ఎత్తు వద్ద మేడిగడ్డ బరాజ్‌ల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో 2016లో ఒప్పందం కుదిరింది.
అయితే తమ్మిడిహట్టి వద్ద ఉన్న సాంకేతిక సమస్యలు, చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంపై పడే ప్రభావాలు, 6.5 కిలోమీటర్ల పొడవుతో, 102 గేట్లతో, కేవలం 1.85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 40 డిగ్రీల సంక్లిష్టమైన స్క్యూ బరాజ్ డిజైన్, రూ.2,500 కోట్ల నిర్మాణ ఖర్చులు, తదితర కారణాల వల్ల తమ్మిడిహట్టి బరాజ్‌కు మరొక ప్రత్యామ్నాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం అన్వేషించింది. అదే బీఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్ట్. వార్ధా నదిపై సుమారు 3 టీఎంసీల నిల్వతో, 1.75 కిలోమీటర్ పొడవుతో, 29 గేట్లతో, 152 మీటర్ల పాండ్ లెవెల్‌తో బరాజ్ నిర్మాణం సహా మొత్తం రు.4,500 కోట్లతో బీఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టుకు డీపీఆర్ తయారుచేసి, కేంద్రానికి పంపింది. కేంద్ర జల సంఘం నుంచి అనుమతులు కూడా జారీ కావడం ప్రారంభమైంది. అయితే రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో వార్ధా బరాజ్ ప్రతిపాదన పక్కకు తొలగిపోయి మళ్లీ తమ్మిడిహట్టి బరాజ్ తెరపైకి వచ్చింది.
మూడేండ్లు కాలయాపన చేసి ఇప్పుడు మహారాష్ట్రతో చర్చల ప్రహసనానికి తెరలేపింది రాష్ట్ర ప్రభుత్వం. పూర్తయిన అధ్యయనాలు మళ్లీ చేస్తారట. తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణం వల్ల సంభవించే ముంపు విస్తీర్ణం, చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంపై పడే ప్రభావాల అధ్యయనాలు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చాలాసార్లు జరిగాయి.
ఆ అధ్యయనాలు అన్నీ కూడా మహారాష్ట్ర ప్రయోజనాలకు ప్రతికూలంగా ఉన్నాయనే కదా గతంలో 152 మీటర్ల ఎత్తు వద్ద బరాజ్ నిర్మాణానికి ఒప్పుకోలేదు! 4 మీటర్లు ఎత్తు తగ్గించమని పట్టుబట్టారు. ఇటీవలే ఒక సర్వే సంస్థతో ప్రభుత్వం తయారు చేయించిన ‘తమ్మిడిహట్టి-సుందిళ్ల ప్రాజెక్ట్’ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టులో కూడా వివిధ ఎత్తుల వద్ద ముంపు అధ్యయనాల వివరాలు మహారాష్ర్ట ప్రభుత్వానికి అందించారు.
అందు లో 152 మీటర్ల వద్ద నదిలో మహారాష్ట్రలో ముంపు 3,952 ఎకరాలు, చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎకో సెన్సిటివ్ జోన్లో ప్రభావిత భూమి 1,345 ఎకరాలు, ముంపుకు గురయ్యే రెవెన్యూ భూమి 2,324 ఎకరాలు, మొత్తం ప్రభావిత భూమి విస్తీర్ణం 7,621 ఎకరాలు. 148 మీటర్ల వద్ద నదిలో మహారాష్ట్రలో ముంపు 2,090 ఎకరాలు, చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎకో సెన్సిటివ్ జోన్లో ప్రభావిత భూమి 728 ఎకరాలు, ముంపునకు గుర య్యే రెవెన్యూ భూమి 180 ఎకరాలు, మొత్తంప్రభావిత భూమి విస్తీర్ణం 2,998 ఎకరాలు. 152 మీటర్ల ఎత్తు వద్ద మహారాష్ట్రలో 7,621 ఎకరాలు బరాజ్ ప్రభావిత ప్రాంతంగా ఉన్నప్పుడు అక్కడి ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తు వద్ద బరాజ్ నిర్మాణానికి అంగీకరిస్తుందని ఆశించడం నేతి బీరకాయలో నెయ్యిని ఆశించడం లాంటిదే.
రెండు రాష్ర్టాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వారు 152 మీటర్ల ఎత్తు వద్ద బరాజ్ నిర్మాణానికి అంగీకరించలేదు. ఇప్పుడు అక్కడ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా అంగీకరిస్తారు? ఎన్నో ఆశలతో తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణంపై జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం ఆఖరుకు ఒక మొక్కుబడి రొటీన్ సమావేశంగా, నిర్దిష్టమైన నిర్ణయాలేవీ లేకుండానే ముగిసింది. కేంద్ర జల సంఘం వద్ద ప్రస్తుతం ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటి రిపోర్ట్ ఉన్నది కానీ, డీపీఆర్ లేదు. రెండు రాష్ర్టాల మధ్య చర్చల్లో సాంకేతిక అంశాలు.. ముఖ్యంగా బరాజ్ ఎత్తు నిర్ధారణ అయితే తప్ప డీపీఆర్ తయారు చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఇదంతా మరో రెండేండ్లపాటు సమావేశాలు, అధ్యయనాల పేరుతో కొయ్యగుర్రం వ్యవహారంగా ఉండబోతున్నదా? లేక బరాజ్ నిర్మాణానికి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసే దిశగా ముందుకు సాగుతుందా? అనేది కాలమే తేలుస్తుంది.
(వ్యాసకర్త: విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజినీర్, సాగునీటి శాఖ)
శ్రీధర్‌రావు దేశ్‌పాండే
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

