Free Bus Journey | ‘సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి..’ అనే నానుడి ఇక నుంచి ‘ఉచిత బస్సు కష్టాలు ఉచిత బస్సువి..’ అని వినాల్సి వస్తుందేమో. కర్ణాటకలో ఇప్పటికే ఈ పథకం అమల్లోకి వచ్చాక అక్కడ ఉత్పన్నమైన సమస్యలు ఇకముందు ఇక్కడా చవిచూడక తప్పదు. ఈ సౌకర్యం వచ్చాక కర్ణాటకలో ఇంటి పని మనుషుల, వ్యవసాయ, భవన నిర్మాణ రంగంలో మహిళా కార్మికుల కొరత తలెత్తినట్టు అక్కడ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దేవాలయాలు కిక్కిరిసిపోవడంతో ఉచిత అన్నదాన కార్యక్రమాలు బందయ్యాయి. చిన్నచిన్న గొడవలకే భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోవడం వంటి సామాజిక సమస్యలు తలెత్తాయి. ఆ ఉచిత బస్సు కల్పించినంత మాత్రానా ఖర్చులకు డబ్బులుండొద్దా? అనే అనుమానాలేమీ వద్దు. ఇదే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు రెండున్నర వేలు కూడా చెల్లిస్తారు. మహిళలకే అన్నిస్తే మేమేం పాపం చేశాం, వారికిచ్చే రాయితీలు తమకు కూడా ఇవ్వాలని కర్ణాటకలో మాజీ ఎమ్మెల్యే నాగరాజు అనే పెద్దమనిషి ఉద్యమం లేవదేశారు. మహాలక్ష్మి తరహాలో పురుషులకు కూడా నారాయణ పేరుతో ఉచిత బస్సు, పింఛన్ ఇవ్వాలని బస్సుల్లో టికెట్ తీసుకోకుండా ఆందోళనలు చేస్తున్నారు.
మరక మంచిదే !
మరక కూడా ఒక్కందుకు మంచిదే అంటారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ప్రమాణ స్వీకారానికి హైదరాబాద్ వచ్చిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారు అతికష్టం మీద కాలినడకన ఎల్బీ స్టేడియం వేదిక వద్దకు చేరుకోవాల్సి వచ్చింది. ఇది ప్రసార మాధ్యమాల్లో రావడంతో, అక్కడ కర్ణాటకలో ఇది ఒక్కందుకు తమ మంచికే జరిగిందని టెక్కీలు సంతోషించినట్టు సమాచారం. బెంగళూర్‌లో నిత్యం తాము ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యపై అరిచి గీపెట్టినా తమ ప్రభుత్వం చెవికెక్కడం లేదు. కనీసం వారికి హైదరాబాద్‌లో ఎదురైన సమస్యతోనైనా తమ పరిస్థితి అర్థం చేసుకుంటారని కుషీ అయితుండ్రు.
మిస్డ్ కాల్ ఇస్తే వస్తడా?
ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే, మాట మార్చడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ సిద్ధహస్తులు. ఎన్నికల ప్రచార సభలో ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేనే సీఎం అవుతా’నని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ‘ఒకవేళ కాకున్నా, సీఎంగా ఎవరున్నా ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే, హెలికాప్టర్ వేసుకొని క్షణాల్లో ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తాడ’న్నారు. కాంగ్రెస్ సర్కార్ అయితే వచ్చింది కానీ, కోమటిరెడ్డి సీఎం కాలేకపోయారు. మంత్రివర్గంలో స్థానం అయితే దొరికింది కానీ, పాత పగ మనసులో పెట్టుకొని సీఎం రేవంత్‌రెడ్డి తన మాట వింటాడో లేదో అన్న భయం పట్టుకున్నట్టున్నది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే తనకు సీఎం కావాలన్న ఆలోచన కానీ, రేవంత్‌రెడ్డితో విభేదాలు గానీ ఎప్పుడూ లేవని గుర్తు చేశారు. ఇంతకు మిస్డ్ కాల్ ఇస్తే సీఎం వస్తాడో… రాడో మాత్రం చెప్పలేక పోయారు.
బేగానా షాదీమే అబ్దుల్లా దీవానా
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి పొరుగు రాష్ట్ర సీఎం జగన్‌కు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ తదితరులందరికీ ఆహ్వానం అందింది, కానీ వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలకు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. ఈ ఇద్దరికి మాత్రమే అందలేదు. ఇది మరీ అన్యాయం, తాను కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందని ఆమె అంటున్నారు కదా? కేఏ పాల్ ఏమో తాను రాహుల్‌గాంధీకి ఫోన్ చేసి రేవంత్‌రెడ్డికి సీఎం పదవి ఇవ్వాలని చెప్పాకే పోస్టు ఖరారైందని అన్నారు కదా? అవును, వారు అలా అన్నారనే పిలువలేదు. వాస్తవానికి మొదట పిలుద్దామనే అనుకున్నామని ఆహ్వాన కమిటీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
– వెల్జాల